సాయి అతీంద్రియ శక్తి | Sai patham antarvedam 9 | Sakshi
Sakshi News home page

సాయి అతీంద్రియ శక్తి

Published Sun, Jul 15 2018 12:36 AM | Last Updated on Sun, Jul 15 2018 12:36 AM

Sai patham antarvedam 9 - Sakshi

సాయిలీలలు ఆశ్చర్యకరంగానూ నమ్మలేని విధంగానూ ఉంటాయి. దాసగణు అనే భక్తుడు సాయిని అనుమతి కోరాడు – గంగలో స్నానం చేసి రావాలని. అది కూడా ప్రయాగలోనే అని. ఎప్పటిలాగానే సాయి చిరునవ్వు నవ్వి ‘గణూ! గంగాస్నానానికి ప్రయాగ దాకా వెళ్లాలా? ఈ మన ద్వారకమయే ప్రయాగ, ఇదే ద్వారక, ఇదే పండరిపురం కూడా’ అనడంతో దాసగణు సాయి పాదాల మీద ఆనందంగా శిరస్సు వాల్చి నమస్కరించాడో లేదో, సాయి పాదాల బొటన వేళ్లలో కుడి బొటన వేలు నుండి గంగా, ఎడమ బొటన వేలు నుండి యమునా ధారాపాతంగా ప్రవహించసాగాయి. అందరూ వింతగా చూస్తూ ఆ రెండు నదుల జలాన్నీ తీర్థంగా తీసుకున్నారు. ఇలా జరగడం సాధ్యమా? సాధ్యమే అయితే ఎలా? అనేది మన సందేహం.

ఇది ఎలా సాధ్యం?
సాధారణంగా మన లక్షణం ఎలా ఉంటుందంటే.. మనం చేయగలిగింది ఎంతో, ఏదో అలాగే అందరూ చేయగలుగుతారనీ, అలా కాకుండా గనుక ఎవరైనా చేస్తే.. అది ఎంత మాత్రం నిజం కాదనీ, అసలు నిజమయ్యే వీలే లేదనీ అనుకుంటుంటాం. ఇంకాస్త పైకి ఆలోచిస్తే.. ఇలాంటివి జరిగాయని చెప్పడం అభూతకల్పనలేనని వాదిస్తూ, అలాంటి వాటిని ప్రచారం కానీయకుండా చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే ఇదే యుగంలో మన కళ్ల ముందే జరిగిన కొన్ని వాస్తవాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలూ చెప్పినవాటినీ చూపించినవాటినీ మనం ఈ సందర్భంలో గమనిద్దాం!భోపాల్‌లో అలాగే బీహార్‌లో కూడా పెద్ద భూకంపం వస్తే ఆ వచ్చిన కాలంలో పడిన భవంతుల మట్టి పెళ్లల కింద 72 గంటల పాటు  ఒక వృద్ధుడు (68 ఏళ్లు) ఉండిపోయాడు. ఎవరికీ కనపడకుండా కావాలని దాక్కోవడం కాదు. తన మీద మట్టిపెళ్లలు పడి ఆ సమయంలో అరిచినా వినిపించనంతగా అయిపోయింది పరిస్థితి. నీళ్లూ తిండీ గాలీ మరి ఎలా లభించాయో తెలియదు. తర్వాత తవ్వుతుంటే కొన ఊపిరితో ఉంటే ఆయనని పైకి తీస్తే బతికాడు. దీన్ని నమ్మడం సగటు మనిషికి సాధ్యమా? మరి అతణ్ణి ఆ పెళ్లలని తీస్తూ, పైకి రప్పించడాన్ని ప్రసారమాధ్యమాలే చూపించాక కాదని అనలేముగా! మరి ఇదేమిటి?ఏడు సంవత్సరాల బాలుడు. పుట్టిందగ్గర్నుండే కనిపించిన ప్రతి వస్తువు మీదా చేతితో లయకి సరిపడే తీరులో కొడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడు. సరిగ్గా 7వ సంవత్సరం వచ్చిందో లేదో సొంతంగా 5 మద్దెలని ఒకదాని పక్కన ఒకదానిని ఉంచి లయబద్ధంగా ఆ శాఖలో ప్రవీణులైన వారి ముందు వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

దీన్ని కాదనగలమా?ఒక రైలు వేగంగా పరిగెడుతుంటే నిండు నెలలు నిండిన గర్భిణి శౌచాలయంలోనికి వెళ్లిందో లేదో, ఆ శిశువు, వ్యక్తులంతా కాలకృత్యాలు తీర్చుకునే ఆ గదిలో ఉండే నేలబారుకన్నం నుండి కిందికి పడిపోయింది. వెంటనే బండిని ఆపితే అది ఆ వేగానికి దాదాపు 1 కి.మీ. దూరంలో ఆగింది. వ్యక్తులు వెనక్కి పరుగెత్తారు. నిమిషాల క్రితం పుట్టిన శిశువు రైలు పట్టాల మధ్యనున్న నల్లకంకరరాళ్ల మీద ఎత్తు నుంచి పడడం, ఈ వ్యక్తులు ఆ శిశువుకోసం వెదకడం, కొంత సమయం గడిచిన తర్వాత కూడా ఆ శిశువు బతికే ఉండడం ఇది నమ్మగల నిజమేనా? మరి చూపించారుగా మాధ్యమాల్లో..గుండె నుండి పలుగు (గునపం లేదా గడ్డపారు) హృదయం నుండి వీపుని చీల్చుకుని ఇవతలికి వస్తే బతికి ఉండడం నిజం కాదా?కొన్ని కుక్కలు పిల్లి పిల్లలకి పాలు ఇవ్వడం, కొన్ని పదుల సంఖ్యలో పాముల్ని ఒక గదిలో పెట్టుకుని వాటి మధ్య పడుకుంటే అవి ఇటూ అటూ తిరుగుతూ అతణ్ని పట్టించుకోనట్లుగానూ, అతణ్ని ఓ రాయో, రప్పో, కొయ్య కర్రో అన్నట్లుగా భావిస్తూ అతణ్ని ఏ మాత్రం కరవకపోవడాన్ని చూస్తున్నాం కదా! ఇది ఆశ్చర్యం కాదా? ఏ మార్గం లేని కాలంలో, ఏ వంతెనా నిర్మించబడని కాలంలో ఏ ఊరికి ఏది తోవయో తెలుసుకునే వీలు ఏ మాత్రమూ ఉండని కాలంలో, చలీ వేడిమీ వర్షాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండే కాలంలో, చేతిలో ఏ ఆహారానికి సంబంధించిన ముందు ఏర్పాట్లు లేకుండా, ఎక్కడ ఉండాలో ఆ వివరాలు తెలియకుండా ముందుగా అనుకోకుండా తానొక్కరే ఇటు రామేశ్వరం నుండి అటు హిమాలయ పర్వతం వరకూ (ఆ సేతు శీతాచలం) ఆదిశంకరులవారు తన 19వ ఏట, అది కూడా కాలినడకన వెళ్లొచ్చారంటే అది కళ్లకి కనిపించిన సత్యం కదా! అది అబ్బురపరిచే విషయం కాదూ? కొండ చిలువలు, పాములు, పులులు, సింహాలు, తోడేళ్లు విచ్చలవిడిగా తిరిగే తిరుమల అడవుల్లో గోగర్భమనే పేరున్న గుహలో రాత్రీ పగలూ అనే భేదమే లేకుండా తపస్సు మాత్రమే చేస్తూ సిద్ధిని పొందిన స్వాములవారిని మనం దాదాపు 200 సంవత్సరాల క్రితమే చూసి ఉండటం విస్మయపరిచే విషయం కాదా?ఈ తీరుగా ఎన్నెన్నో జరుగుతున్నా వాటిని ఆ సమయంలో చూసి ‘అబ్బో! ఆశ్చర్యం’ అనుకోవడం, మళ్లీ కొంతకాలం కాగానే మర్చిపోవడం. మళ్లీ మనదైన ధోరణిలో ఇవన్నీ నిజం కాదంటూనో, నమ్మవద్దంటూనో నోరేసుకుని పడటం సరైన పనేనా? పైవన్నీ కూడా దైవం ఏర్పాటు చేసిన లీలలు. 

అందరికీ అన్ని శక్తులూ ఉండవు, రావు కూడా. అలాగే అందరి మీదా దైవం తన శక్తిని ప్రసరింపజేయడు. అనుగ్రహాన్ని చూపించడు. ఇనుమనే లోహం అన్నింటి ఆకర్షణకీ లోను కాదు. కేవలం అయస్కాంతమనే దానికే లోబడుతుంది. శిశువు కూడా తనని కన్నతల్లి మాత్రమే – ఇతడు తండ్రి, ఇతడు అన్న.. అంటూ చెప్పినప్పుడు మాత్రమే అంగీకరిస్తాడు తప్ప ఆ తల్లి తనకి అలా పరిచయం చేయనప్పుడు ఒప్పుకోలేడు. చుట్టాల్లో ఎవర్నో చూపించి ‘ఫలానా’ అని చెప్తే ‘ఔనా? నిజమేనని నమ్మమంటావా?’ అన్నట్లు తల్లివైపే చూస్తాడు. ఆమె అంగీకారానికి లోబడే నమ్మడం, నమ్మకపోవడం చేస్తాడు.
అంటే ఏమన్నమాట? సాధారణ జీవితాన్ని మాత్రమే గడిపే మనం మనదైన సగటు ఆలోచనల్లో ఉంటూ, అలా ఉన్నప్పుడూ అలాగే జరిగినప్పుడూ మాత్రమే ఆ సంఘటనలనీ లేదా ఆ సందర్భాలనీ నమ్ముతున్నామన్నమాట. అది సరికానే కాదని నిరూపించే ఘట్టాలే పైవన్నీ.

సాయి కూడా అంతే!
ఒక మసీదు గోడకి ఆనుకుని కూచోవడం, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు ఎప్పుడూ ఆ ప్రదేశంలోనే ఉంటూ ఉండటం, లేదా ఆ పాడుబడిన మసీదులో తలదాచుకోవడం... ఇక తిండి విషయానికొస్తే భిక్షాటన ద్వారా వచ్చే రొట్టెలని తెచ్చుకోవడం, వాటిని మూతలు లేని పాత్రలోనే ఉంచడం, అటు నుండి కుక్కలు ఇటు నుండి పిల్లులూ ఇతర ప్రాణులు వచ్చి సగం కొరికినా, ఎత్తుకుపోయినా ఆ ఉన్నవాటినో మిగిలినవాటినో తింటూ జీవించడం... తానెప్పుడూ వ్యాధిగ్రస్తుడైనట్టుగా ఎక్కడా కనిపించకపోవడం... ఇవన్నీ కళ్లముందు కనిపించిన నిజాలేగా! కాదనలేం కదా!ఇప్పుడు ఇది ఎలా సాధ్యమయిందో చూద్దాం!శరీరంలో ఉండే కళ్లూ, చెవులూ, ముక్కూ, కాళ్లూ చేతులూ.. ఇలా అన్ని అవయవాల్నీ చూడగలుగుతున్నాం. అయితే శరీరంలో దాగిన మనసూ బుద్ధీ అనే వాటిని మాత్రం మనం చూడలేం. మనసు అనేది ఓ కోతిలాగా చంచలంగా ఉంటూ చెడుపనిని సైతం చేయవలసిందిగా ప్రేరేపిస్తుంటుంది. ఉదాహరణకి.. ఎవరైనా కొంత సొమ్మును ఎక్కడైనా పడవేసుకుంటే.. దాన్ని చూసిన కన్ను మనసుకి ఆ సమాచారాన్ని చేరవేస్తే.. ‘అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడు జాగ్రత్తగా! లేని పక్షంలో జేబులో పెట్టెయ్‌! ఎవరడిగినా అది నాదే అని చెప్పు!’ అని ప్రేరేపిస్తుంది మనసు. చేసేవరకూ ప్రోత్సహిస్తుంది కూడా. అయితే తల్లిదండ్రుల సంస్కారం, మనల్ని పెంచిన, మనం పెరిగిన వాతావరణమనేదానికి అనుగుణంగా ‘బుద్ధి’ అనేది ఉంటుంది కాబట్టి, ఆ బుద్ధి ఇలా అంటుంది... ‘అది తప్పు, మనమే అలా పోగొట్టుకున్న పక్షంలో దొరికితే బాగుండుననుకుంటాం కదా! అలా ఆ సొమ్ము దొరికిన వ్యక్తి మనకిస్తే, ఎంతో ఆనందపడి ఆ వ్యక్తికి కృతజ్ఞులమయ్యుంటాం కదా! అదే మరో తీరులో జరిగి ఆ సొమ్ము మన వద్ద పట్టుబడి మనం దొంగగా నిరూపింపబడితే పరువుపోతుంది. మన మీద దొంగ అనే ముద్రపడుతుంది కదా!?’ అని.

ఇదుగో! ఈ మనసుని ఆ బుద్ధికి లోబడేలా చేసినట్లయితే వ్యక్తి సరైన తీరులో జీవితాన్ని సాగిస్తాడు. కీర్తి ప్రతిష్టల్ని గడిస్తాడు. ఆ మనసే బుద్ధి ద్వారా ఈ శరీరాన్ని బాగా వ్యాయామం చేయవలసిందని శాసిస్తే ఆ శరీరం బాగా వ్యాయామాన్ని చేసి శరీరబలాన్ని సాధించి, వ్యక్తిని ఓ ‘పహిల్వాన్‌’ అని అందరూ అనేలా చేస్తుంది.అదే మరి మనసూ బుద్ధీ కలిసి తపస్సుని ప్రారంభించి ఏకాగ్రతతో దైవధ్యానం మీదే దృష్టిని పెడితే.. శరీరవ్యాయామం ద్వారా ఇంద్రియశక్తిని పొందగలిగితే.. (కన్నూ కాలూ చేయీ.. ఇలా అన్ని ఇంద్రియాలూ బలపడడం మంచి శక్తిని కలిగి ఉండడం) ఈ మనసూ బుద్ధీ కలిసి వాటికి సంబంధించిన మరో వ్యాయామం ద్వారా ఇంద్రియాలని అదుపు చేసి తమ అధీనంలో ఉంచుకోగల శక్తిని అంటే.. అతీంద్రియశక్తిని సాధింపజేస్తాయి వ్యక్తికి. అంటే కొద్దిగా వివరించుకోవాలి. త్వక్‌ (శరీరం) అనేది మొదటి ఇంద్రియం. ఇది ఎన్నో అవయవాల సమూహం. చలికీ వేడికీ కొంతవరకూ తట్టుకోగల ధర్మం కలిగినది మాత్రమే. అతీంద్రియ శక్తి అంటే.. చలీ వేడీ అనే వాటి ప్రభావానికి అతీతంగా ఉండటమని అర్థం. కుంభమేళాలో నాగాసాధువులు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. గుంపులు గుంపులుగా వస్తూ ఎముకలు కొరికే చలిలో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న శరీరంతో పరుగులు పెడుతూ గడ్డకట్టించే నీటిలో చక్కగా స్నానాన్ని సంతోషంగా ముగించి వెళ్లిపోతారు. ఎక్కడుంటారో ఎప్పుడు తింటారో, తినేందుకు వాళ్లకి ఏం దొరుకుతుందో ఊహాతీతం. అలాగే రెండవ ఇంద్రియమైన కన్ను, తాను చూడగలిగినంత దూరాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటే, అతీంద్రియ శక్తిని సాధించిన వ్యక్తికుండే కన్ను గడిచిన సందర్భాన్నీ, వస్తువుని చూడడం కాకుండా, వ్యక్తుల్ని భౌతికంగా చూడడం కాకుండా, వాళ్లలో దాగిన విశేషాల్ని కనుక్కోగలుగుతుంది. ఇది నిజం కాబట్టి ఎందరో వ్యక్తులుంటే సాయి కొందర్ని మాత్రమే తన సమక్షానికి రావలసిందిగా నిరంతరం సేవలో ఉండవలసిందిగా కోరాడు. కోరతాడు. అలాంటి వారిలో ఒకడే దాసగణు.

మనకి జ్ఞానాన్ని బుద్ధికి చేరవేసే శక్తి ఉన్న శరీర భాగాలని (ఇంద్రియాలు) జ్ఞానేంద్రియాలు అంటాం. వాటిలో మొదటిది త్వక్‌ (శరీరం). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు పైన అనుకున్నట్టు ఏ వాతావరణానికైనా దుఃఖించదు. అదే సాయి మసీదు గోడకానుకుని మనకి తెలియజేసిన సత్యం. రెండవ జ్ఞానేంద్రియం కన్ను. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలని చూడగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఆ రోజున అన్నా సాహేబు బయలుదేరి వెళ్తుంటే.. ఈ రైలు ఆ స్టేషనులో ఆగదంటూ సూచించి మరీ రాగలిగాడు. మూడవది చెవి. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా వాటిని వినగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి, ఆనాడు అన్నా సాహేబూ బాలాసాహేబూ ‘కర్మలూ వాటి ఫలితాలూ’ అనేదాని గురించి వాదప్రతివాదాలని తనకి వినిపించనంత దూరంలో చేసుకున్నా ‘ఎవరు గెలిచారు వాదంలో?’ అనగలిగాడు. నాలుగవది జిహ్వ (నాలుక). ఇది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఆ నోటితో ఏం మాట్లాడితే అది జరుగుతుంది. ఇది నిజం కాబట్టే దాసగణుతో మాట్లాడుతూ ‘నువ్వు రాదలుచుకోకపోయినా ఎందుకు రావో, ఇక్కడే సేవ చేస్తూ ఎలా ఉండవో చూస్తా’ అని అనగలిగాడు. ఐదవ ఇంద్రియం ఘ్రాణం(ముక్కు). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎవరికెంత పూర్వజన్మసంస్కారవాసన ఉందో ఈ విషయాన్ని గ్రహించగలగడం సాధ్యమౌతుంది. ఇది నిజం కాబట్టే సాయి తన వద్ద ఎవరెవరు ఉండవలసినవాళ్లో ఉండగలిగేవాళ్లో తెలుసుకుని, పూర్వజన్మసంస్కారపరులైన అలాంటివారిని మాత్రమే తన స్థానానికి పిలుచుకున్నాడు. వచ్చేలా చేసుకోగలిగాడు.ఈ అతీంద్రియశక్తి జ్ఞానేంద్రియాల విషయంలో పై తీరుగా ఫలిస్తే, అదే అతీంద్రియశక్తి కర్మేంద్రియాలైన మాట, కాలు, చేయి మొదలైన వాటిలో కూడా ఫలించి మాట ద్వారా వశం చేసుకోగలగడం, కాలు ద్వారా గంగా యమునల్ని ప్రవహింపజేయగలగడం.. ఇలా బాబా చేసిన మరిన్ని లీలలని తెలుసుకుందాం! ఎందుకు తెలుసుకోవాలిట? మన జీవితంలో కూడా తీవ్రాతి తీవ్రమైన అసాధ్యమైన సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఇలా తన లీల ద్వారా మనల్ని బయటపడేయగలడు కాబట్టి! 
(సశేషం)
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement