Journals
-
సాయి అతీంద్రియ శక్తి
సాయిలీలలు ఆశ్చర్యకరంగానూ నమ్మలేని విధంగానూ ఉంటాయి. దాసగణు అనే భక్తుడు సాయిని అనుమతి కోరాడు – గంగలో స్నానం చేసి రావాలని. అది కూడా ప్రయాగలోనే అని. ఎప్పటిలాగానే సాయి చిరునవ్వు నవ్వి ‘గణూ! గంగాస్నానానికి ప్రయాగ దాకా వెళ్లాలా? ఈ మన ద్వారకమయే ప్రయాగ, ఇదే ద్వారక, ఇదే పండరిపురం కూడా’ అనడంతో దాసగణు సాయి పాదాల మీద ఆనందంగా శిరస్సు వాల్చి నమస్కరించాడో లేదో, సాయి పాదాల బొటన వేళ్లలో కుడి బొటన వేలు నుండి గంగా, ఎడమ బొటన వేలు నుండి యమునా ధారాపాతంగా ప్రవహించసాగాయి. అందరూ వింతగా చూస్తూ ఆ రెండు నదుల జలాన్నీ తీర్థంగా తీసుకున్నారు. ఇలా జరగడం సాధ్యమా? సాధ్యమే అయితే ఎలా? అనేది మన సందేహం. ఇది ఎలా సాధ్యం? సాధారణంగా మన లక్షణం ఎలా ఉంటుందంటే.. మనం చేయగలిగింది ఎంతో, ఏదో అలాగే అందరూ చేయగలుగుతారనీ, అలా కాకుండా గనుక ఎవరైనా చేస్తే.. అది ఎంత మాత్రం నిజం కాదనీ, అసలు నిజమయ్యే వీలే లేదనీ అనుకుంటుంటాం. ఇంకాస్త పైకి ఆలోచిస్తే.. ఇలాంటివి జరిగాయని చెప్పడం అభూతకల్పనలేనని వాదిస్తూ, అలాంటి వాటిని ప్రచారం కానీయకుండా చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే ఇదే యుగంలో మన కళ్ల ముందే జరిగిన కొన్ని వాస్తవాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలూ చెప్పినవాటినీ చూపించినవాటినీ మనం ఈ సందర్భంలో గమనిద్దాం!భోపాల్‌లో అలాగే బీహార్‌లో కూడా పెద్ద భూకంపం వస్తే ఆ వచ్చిన కాలంలో పడిన భవంతుల మట్టి పెళ్లల కింద 72 గంటల పాటు ఒక వృద్ధుడు (68 ఏళ్లు) ఉండిపోయాడు. ఎవరికీ కనపడకుండా కావాలని దాక్కోవడం కాదు. తన మీద మట్టిపెళ్లలు పడి ఆ సమయంలో అరిచినా వినిపించనంతగా అయిపోయింది పరిస్థితి. నీళ్లూ తిండీ గాలీ మరి ఎలా లభించాయో తెలియదు. తర్వాత తవ్వుతుంటే కొన ఊపిరితో ఉంటే ఆయనని పైకి తీస్తే బతికాడు. దీన్ని నమ్మడం సగటు మనిషికి సాధ్యమా? మరి అతణ్ణి ఆ పెళ్లలని తీస్తూ, పైకి రప్పించడాన్ని ప్రసారమాధ్యమాలే చూపించాక కాదని అనలేముగా! మరి ఇదేమిటి?ఏడు సంవత్సరాల బాలుడు. పుట్టిందగ్గర్నుండే కనిపించిన ప్రతి వస్తువు మీదా చేతితో లయకి సరిపడే తీరులో కొడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడు. సరిగ్గా 7వ సంవత్సరం వచ్చిందో లేదో సొంతంగా 5 మద్దెలని ఒకదాని పక్కన ఒకదానిని ఉంచి లయబద్ధంగా ఆ శాఖలో ప్రవీణులైన వారి ముందు వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీన్ని కాదనగలమా?ఒక రైలు వేగంగా పరిగెడుతుంటే నిండు నెలలు నిండిన గర్భిణి శౌచాలయంలోనికి వెళ్లిందో లేదో, ఆ శిశువు, వ్యక్తులంతా కాలకృత్యాలు తీర్చుకునే ఆ గదిలో ఉండే నేలబారుకన్నం నుండి కిందికి పడిపోయింది. వెంటనే బండిని ఆపితే అది ఆ వేగానికి దాదాపు 1 కి.మీ. దూరంలో ఆగింది. వ్యక్తులు వెనక్కి పరుగెత్తారు. నిమిషాల క్రితం పుట్టిన శిశువు రైలు పట్టాల మధ్యనున్న నల్లకంకరరాళ్ల మీద ఎత్తు నుంచి పడడం, ఈ వ్యక్తులు ఆ శిశువుకోసం వెదకడం, కొంత సమయం గడిచిన తర్వాత కూడా ఆ శిశువు బతికే ఉండడం ఇది నమ్మగల నిజమేనా? మరి చూపించారుగా మాధ్యమాల్లో..గుండె నుండి పలుగు (గునపం లేదా గడ్డపారు) హృదయం నుండి వీపుని చీల్చుకుని ఇవతలికి వస్తే బతికి ఉండడం నిజం కాదా?కొన్ని కుక్కలు పిల్లి పిల్లలకి పాలు ఇవ్వడం, కొన్ని పదుల సంఖ్యలో పాముల్ని ఒక గదిలో పెట్టుకుని వాటి మధ్య పడుకుంటే అవి ఇటూ అటూ తిరుగుతూ అతణ్ని పట్టించుకోనట్లుగానూ, అతణ్ని ఓ రాయో, రప్పో, కొయ్య కర్రో అన్నట్లుగా భావిస్తూ అతణ్ని ఏ మాత్రం కరవకపోవడాన్ని చూస్తున్నాం కదా! ఇది ఆశ్చర్యం కాదా? ఏ మార్గం లేని కాలంలో, ఏ వంతెనా నిర్మించబడని కాలంలో ఏ ఊరికి ఏది తోవయో తెలుసుకునే వీలు ఏ మాత్రమూ ఉండని కాలంలో, చలీ వేడిమీ వర్షాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండే కాలంలో, చేతిలో ఏ ఆహారానికి సంబంధించిన ముందు ఏర్పాట్లు లేకుండా, ఎక్కడ ఉండాలో ఆ వివరాలు తెలియకుండా ముందుగా అనుకోకుండా తానొక్కరే ఇటు రామేశ్వరం నుండి అటు హిమాలయ పర్వతం వరకూ (ఆ సేతు శీతాచలం) ఆదిశంకరులవారు తన 19వ ఏట, అది కూడా కాలినడకన వెళ్లొచ్చారంటే అది కళ్లకి కనిపించిన సత్యం కదా! అది అబ్బురపరిచే విషయం కాదూ? కొండ చిలువలు, పాములు, పులులు, సింహాలు, తోడేళ్లు విచ్చలవిడిగా తిరిగే తిరుమల అడవుల్లో గోగర్భమనే పేరున్న గుహలో రాత్రీ పగలూ అనే భేదమే లేకుండా తపస్సు మాత్రమే చేస్తూ సిద్ధిని పొందిన స్వాములవారిని మనం దాదాపు 200 సంవత్సరాల క్రితమే చూసి ఉండటం విస్మయపరిచే విషయం కాదా?ఈ తీరుగా ఎన్నెన్నో జరుగుతున్నా వాటిని ఆ సమయంలో చూసి ‘అబ్బో! ఆశ్చర్యం’ అనుకోవడం, మళ్లీ కొంతకాలం కాగానే మర్చిపోవడం. మళ్లీ మనదైన ధోరణిలో ఇవన్నీ నిజం కాదంటూనో, నమ్మవద్దంటూనో నోరేసుకుని పడటం సరైన పనేనా? పైవన్నీ కూడా దైవం ఏర్పాటు చేసిన లీలలు. అందరికీ అన్ని శక్తులూ ఉండవు, రావు కూడా. అలాగే అందరి మీదా దైవం తన శక్తిని ప్రసరింపజేయడు. అనుగ్రహాన్ని చూపించడు. ఇనుమనే లోహం అన్నింటి ఆకర్షణకీ లోను కాదు. కేవలం అయస్కాంతమనే దానికే లోబడుతుంది. శిశువు కూడా తనని కన్నతల్లి మాత్రమే – ఇతడు తండ్రి, ఇతడు అన్న.. అంటూ చెప్పినప్పుడు మాత్రమే అంగీకరిస్తాడు తప్ప ఆ తల్లి తనకి అలా పరిచయం చేయనప్పుడు ఒప్పుకోలేడు. చుట్టాల్లో ఎవర్నో చూపించి ‘ఫలానా’ అని చెప్తే ‘ఔనా? నిజమేనని నమ్మమంటావా?’ అన్నట్లు తల్లివైపే చూస్తాడు. ఆమె అంగీకారానికి లోబడే నమ్మడం, నమ్మకపోవడం చేస్తాడు. అంటే ఏమన్నమాట? సాధారణ జీవితాన్ని మాత్రమే గడిపే మనం మనదైన సగటు ఆలోచనల్లో ఉంటూ, అలా ఉన్నప్పుడూ అలాగే జరిగినప్పుడూ మాత్రమే ఆ సంఘటనలనీ లేదా ఆ సందర్భాలనీ నమ్ముతున్నామన్నమాట. అది సరికానే కాదని నిరూపించే ఘట్టాలే పైవన్నీ. సాయి కూడా అంతే! ఒక మసీదు గోడకి ఆనుకుని కూచోవడం, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు ఎప్పుడూ ఆ ప్రదేశంలోనే ఉంటూ ఉండటం, లేదా ఆ పాడుబడిన మసీదులో తలదాచుకోవడం... ఇక తిండి విషయానికొస్తే భిక్షాటన ద్వారా వచ్చే రొట్టెలని తెచ్చుకోవడం, వాటిని మూతలు లేని పాత్రలోనే ఉంచడం, అటు నుండి కుక్కలు ఇటు నుండి పిల్లులూ ఇతర ప్రాణులు వచ్చి సగం కొరికినా, ఎత్తుకుపోయినా ఆ ఉన్నవాటినో మిగిలినవాటినో తింటూ జీవించడం... తానెప్పుడూ వ్యాధిగ్రస్తుడైనట్టుగా ఎక్కడా కనిపించకపోవడం... ఇవన్నీ కళ్లముందు కనిపించిన నిజాలేగా! కాదనలేం కదా!ఇప్పుడు ఇది ఎలా సాధ్యమయిందో చూద్దాం!శరీరంలో ఉండే కళ్లూ, చెవులూ, ముక్కూ, కాళ్లూ చేతులూ.. ఇలా అన్ని అవయవాల్నీ చూడగలుగుతున్నాం. అయితే శరీరంలో దాగిన మనసూ బుద్ధీ అనే వాటిని మాత్రం మనం చూడలేం. మనసు అనేది ఓ కోతిలాగా చంచలంగా ఉంటూ చెడుపనిని సైతం చేయవలసిందిగా ప్రేరేపిస్తుంటుంది. ఉదాహరణకి.. ఎవరైనా కొంత సొమ్మును ఎక్కడైనా పడవేసుకుంటే.. దాన్ని చూసిన కన్ను మనసుకి ఆ సమాచారాన్ని చేరవేస్తే.. ‘అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడు జాగ్రత్తగా! లేని పక్షంలో జేబులో పెట్టెయ్! ఎవరడిగినా అది నాదే అని చెప్పు!’ అని ప్రేరేపిస్తుంది మనసు. చేసేవరకూ ప్రోత్సహిస్తుంది కూడా. అయితే తల్లిదండ్రుల సంస్కారం, మనల్ని పెంచిన, మనం పెరిగిన వాతావరణమనేదానికి అనుగుణంగా ‘బుద్ధి’ అనేది ఉంటుంది కాబట్టి, ఆ బుద్ధి ఇలా అంటుంది... ‘అది తప్పు, మనమే అలా పోగొట్టుకున్న పక్షంలో దొరికితే బాగుండుననుకుంటాం కదా! అలా ఆ సొమ్ము దొరికిన వ్యక్తి మనకిస్తే, ఎంతో ఆనందపడి ఆ వ్యక్తికి కృతజ్ఞులమయ్యుంటాం కదా! అదే మరో తీరులో జరిగి ఆ సొమ్ము మన వద్ద పట్టుబడి మనం దొంగగా నిరూపింపబడితే పరువుపోతుంది. మన మీద దొంగ అనే ముద్రపడుతుంది కదా!?’ అని. ఇదుగో! ఈ మనసుని ఆ బుద్ధికి లోబడేలా చేసినట్లయితే వ్యక్తి సరైన తీరులో జీవితాన్ని సాగిస్తాడు. కీర్తి ప్రతిష్టల్ని గడిస్తాడు. ఆ మనసే బుద్ధి ద్వారా ఈ శరీరాన్ని బాగా వ్యాయామం చేయవలసిందని శాసిస్తే ఆ శరీరం బాగా వ్యాయామాన్ని చేసి శరీరబలాన్ని సాధించి, వ్యక్తిని ఓ ‘పహిల్వాన్’ అని అందరూ అనేలా చేస్తుంది.అదే మరి మనసూ బుద్ధీ కలిసి తపస్సుని ప్రారంభించి ఏకాగ్రతతో దైవధ్యానం మీదే దృష్టిని పెడితే.. శరీరవ్యాయామం ద్వారా ఇంద్రియశక్తిని పొందగలిగితే.. (కన్నూ కాలూ చేయీ.. ఇలా అన్ని ఇంద్రియాలూ బలపడడం మంచి శక్తిని కలిగి ఉండడం) ఈ మనసూ బుద్ధీ కలిసి వాటికి సంబంధించిన మరో వ్యాయామం ద్వారా ఇంద్రియాలని అదుపు చేసి తమ అధీనంలో ఉంచుకోగల శక్తిని అంటే.. అతీంద్రియశక్తిని సాధింపజేస్తాయి వ్యక్తికి. అంటే కొద్దిగా వివరించుకోవాలి. త్వక్ (శరీరం) అనేది మొదటి ఇంద్రియం. ఇది ఎన్నో అవయవాల సమూహం. చలికీ వేడికీ కొంతవరకూ తట్టుకోగల ధర్మం కలిగినది మాత్రమే. అతీంద్రియ శక్తి అంటే.. చలీ వేడీ అనే వాటి ప్రభావానికి అతీతంగా ఉండటమని అర్థం. కుంభమేళాలో నాగాసాధువులు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. గుంపులు గుంపులుగా వస్తూ ఎముకలు కొరికే చలిలో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న శరీరంతో పరుగులు పెడుతూ గడ్డకట్టించే నీటిలో చక్కగా స్నానాన్ని సంతోషంగా ముగించి వెళ్లిపోతారు. ఎక్కడుంటారో ఎప్పుడు తింటారో, తినేందుకు వాళ్లకి ఏం దొరుకుతుందో ఊహాతీతం. అలాగే రెండవ ఇంద్రియమైన కన్ను, తాను చూడగలిగినంత దూరాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటే, అతీంద్రియ శక్తిని సాధించిన వ్యక్తికుండే కన్ను గడిచిన సందర్భాన్నీ, వస్తువుని చూడడం కాకుండా, వ్యక్తుల్ని భౌతికంగా చూడడం కాకుండా, వాళ్లలో దాగిన విశేషాల్ని కనుక్కోగలుగుతుంది. ఇది నిజం కాబట్టి ఎందరో వ్యక్తులుంటే సాయి కొందర్ని మాత్రమే తన సమక్షానికి రావలసిందిగా నిరంతరం సేవలో ఉండవలసిందిగా కోరాడు. కోరతాడు. అలాంటి వారిలో ఒకడే దాసగణు. మనకి జ్ఞానాన్ని బుద్ధికి చేరవేసే శక్తి ఉన్న శరీర భాగాలని (ఇంద్రియాలు) జ్ఞానేంద్రియాలు అంటాం. వాటిలో మొదటిది త్వక్ (శరీరం). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు పైన అనుకున్నట్టు ఏ వాతావరణానికైనా దుఃఖించదు. అదే సాయి మసీదు గోడకానుకుని మనకి తెలియజేసిన సత్యం. రెండవ జ్ఞానేంద్రియం కన్ను. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలని చూడగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఆ రోజున అన్నా సాహేబు బయలుదేరి వెళ్తుంటే.. ఈ రైలు ఆ స్టేషనులో ఆగదంటూ సూచించి మరీ రాగలిగాడు. మూడవది చెవి. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా వాటిని వినగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి, ఆనాడు అన్నా సాహేబూ బాలాసాహేబూ ‘కర్మలూ వాటి ఫలితాలూ’ అనేదాని గురించి వాదప్రతివాదాలని తనకి వినిపించనంత దూరంలో చేసుకున్నా ‘ఎవరు గెలిచారు వాదంలో?’ అనగలిగాడు. నాలుగవది జిహ్వ (నాలుక). ఇది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఆ నోటితో ఏం మాట్లాడితే అది జరుగుతుంది. ఇది నిజం కాబట్టే దాసగణుతో మాట్లాడుతూ ‘నువ్వు రాదలుచుకోకపోయినా ఎందుకు రావో, ఇక్కడే సేవ చేస్తూ ఎలా ఉండవో చూస్తా’ అని అనగలిగాడు. ఐదవ ఇంద్రియం ఘ్రాణం(ముక్కు). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎవరికెంత పూర్వజన్మసంస్కారవాసన ఉందో ఈ విషయాన్ని గ్రహించగలగడం సాధ్యమౌతుంది. ఇది నిజం కాబట్టే సాయి తన వద్ద ఎవరెవరు ఉండవలసినవాళ్లో ఉండగలిగేవాళ్లో తెలుసుకుని, పూర్వజన్మసంస్కారపరులైన అలాంటివారిని మాత్రమే తన స్థానానికి పిలుచుకున్నాడు. వచ్చేలా చేసుకోగలిగాడు.ఈ అతీంద్రియశక్తి జ్ఞానేంద్రియాల విషయంలో పై తీరుగా ఫలిస్తే, అదే అతీంద్రియశక్తి కర్మేంద్రియాలైన మాట, కాలు, చేయి మొదలైన వాటిలో కూడా ఫలించి మాట ద్వారా వశం చేసుకోగలగడం, కాలు ద్వారా గంగా యమునల్ని ప్రవహింపజేయగలగడం.. ఇలా బాబా చేసిన మరిన్ని లీలలని తెలుసుకుందాం! ఎందుకు తెలుసుకోవాలిట? మన జీవితంలో కూడా తీవ్రాతి తీవ్రమైన అసాధ్యమైన సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఇలా తన లీల ద్వారా మనల్ని బయటపడేయగలడు కాబట్టి! (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
పరిశోధనల ‘పల్స్’.. పట్టేశారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒక ఆలోచన... ఒక వ్యాపారాన్ని పుట్టించింది. అందులో వచ్చిన కష్టాలు... మరో రెండు వ్యాపారాల్ని సృష్టించాయి. సంస్థను రూ.1,300 కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకెళ్లి... 4,800 మందికి ఉపాధినిస్తున్నాయి. అదే ఒమిక్స్ ఇంటర్నేషనల్. శాస్త్ర, సాంకేతిక పత్రాల్ని ఆన్లైన్లో ప్రచురించే ఈ సంస్థకు... హైదరాబాదే ప్రధాన కేంద్రం. దీని సారథి డాక్టర్ గేదెల శ్రీనుబాబు.. ఫ్రమ్ శ్రీకాకుళం. పీహెచ్డీ చేయాలన్నా... పరిశోధన పత్రాలు రాయాలన్నా అంత తేలికకాదు. ఎంతో చదివి... ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మరి చదవటానికి మెటీరియల్ ఎలా..? ఇదిగో... ఈ ఒక్క ఆలోచనే ‘ఒమిక్స్ ఇంటర్నేషనల్’కు పునాది. శ్రీకాకుళానికి చెందిన శ్రీనుబాబు... 2006లో సియోల్‌లో తనకు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చినపుడు... హ్యూమన్ ప్రొటీయం ఆర్గనైజేషన్ (హూపో) సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు. వారికీ విషయం అర్థమైంది. ప్రచురితమైన మెటీరియల్‌ను అందరికీ అందుబాటులో (ఓపెన్ యాక్సెస్) ఉంచడానికి వారు అనుమతించారు. అది... ఓపెన్ యాక్సెస్ జర్నల్ను పుట్టించింది. ఈ జర్నల్‌లో పరిశోధన పత్రాలను ప్రచురించటానికి డబ్లు్యహెచ్‌ఓ, ఎన్ఐహెచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తప్పనిసరి చేయటంతో... ఫీజు రూపంలో కొంత ఆదాయమూ మొదలైంది. ఇంతలోనే ఓపెన్ యాక్సెస్‌కు తోడుగా... ప్రొటీన్ల అంశంపై ప్రొటీయం జర్నల్ తెచ్చారు. తాను చదివిన స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థుల సాయంతో వివిధ అంశాలపై శాస్త్రీయ జర్నల్స్‌ను ఆన్లైన్లో ప్రచురించటం మొదలెట్టారు. అంతా ఈ వెబ్‌ను ఆశ్రయించటంతో... ర్యాంకింగ్‌తో పాటు పబ్లిష్ చేసేవారూ పెరిగారు. అలా... ఒమిక్స్ ఎదుగుదల మొదలైంది. ఇదే రంగంలోని పల్సస్ కూడా ఒమిక్స్తో జతకట్టింది. ప్రస్తుతం పల్సస్‌కు సీఈఓగానూ శ్రీనుబాబు వ్యవహరిస్తున్నారు. ఒక కష్టం... మరో వ్యాపారం ఇపుడు ఆన్లైన్లో ఒమిక్స్ జర్నల్స్‌కు దాదాపు 5 కోట్ల మంది పాఠకులున్నారు. కాకపోతే ఈ జర్నల్స్‌ను ఏటా ఆయా రంగాల్లో ప్రముఖులు సమీక్షించాలి. దీనికి ఎడిటోరియల్ బోర్డు సమావేశమవ్వాలి. వివిధ దేశాల్లోని నిపుణుల్ని దీనికోసం ఒకచోటికి చేర్చటం చాలా కష్టంగా ఉండేది. వారి విమాన ఖర్చులు... హోటల్ వసతి... ఆర్థికంగా భారమయ్యేవి. మరెలా..? బాగా ఆలోచించిన శ్రీనుబాబు... ఆ ప్రముఖులు వచ్చేచోట వారికి సంబంధించిన రంగాలపై సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు. వీటికి నిర్ణీత ఫీజు చెల్లించి హాజరయ్యేందుకు యూజర్లు విపరీతమైన ఆసక్తి చూపించేవారు. దీంతో ‘సదస్సుల నిర్వహణ’ అనేది కొత్త వ్యాపారంగా మారింది. 2010లో తొలి సదస్సు జరగ్గా... తరవాత సీఎంఈ, సీపీడీ అక్రిడేషన్లు కూడా రావటంతో ఇపుడు ఏటా 3,000కు పైగా సదస్సులను నిర్వహిస్తోంది ఒమిక్స్. తమ విదేశీ ఆదాయంలో ఈ సదస్సుల వాటాయే ఎక్కువని, దీన్లో మార్జిన్లు 10–15 శాతం మధ్య ఉంటాయని శ్రీనుబాబు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘మా జిల్లాలో కిడ్నీ బాధితులెక్కువైన ఉద్ధానంలో వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుగులో కరపత్రం ఇస్తే తప్ప అర్థం కావటం లేదు. ఇది చూశాక పరిశోధన పత్రాల్ని వివిధ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం తెలిసింది. రష్యన్, చైనీస్, జర్మన్‌తో మొదలెట్టాం. ఆదాయం పెరిగింది. దేశీయంగా తెలుగు, తమిళం, హిందీల్లో అనువాదానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు శ్రీనుబాబు. హిందీకి సంబంధించి యూపీ సర్కారుతో ఒప్పందం కుదరగా... కేంద్రం సైతం ఓకే చేసి విశాఖలో ఏర్పాటు చేస్తున్న కేంద్రానికి రూ.20 కోట్ల ప్రోత్సాహకాలిచ్చింది. ‘‘మా దగ్గర వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 2.5 కోట్ల పేజీల సమాచారం ఉంది. వీటి అనువాదం వల్ల 10వేల ఉద్యోగాలొస్తాయి’’ అన్నారాయన. మూడేళ్లలో ఐపీఓకు! ప్రస్తుతం ఒమిక్స్లో 4,800 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ సెజ్‌లో ఏర్పాటుచేసిన కార్యాలయంలో 3,700 మంది పనిచేస్తుండగా, చెన్నైలో 400, గుర్గావ్లో 300 మంది పనిచేస్తున్నారు. విశాఖలో 25వేల చదరపుటడుగుల్లో ఏర్పాటు చేస్తున్న కార్యాలయంలో 1,000 ఉద్యోగాలు రానున్నట్లు చెప్పారాయన. ‘‘వార్షికంగా విదేశాల్లో రూ.900 కోట్లు, దేశీయంగా రూ.400 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్నాం. మరో మూడేళ్ల తరవాత 2021లో ఐపీఓకు వెళ్లే ఆలోచన ఉంది. అప్పటికి 10వేల ఉద్యోగుల స్థాయికి చేరుకుంటాం’’ అని వివరించారు. శ్రీను ఫ్రమ్ శ్రీకాకుళం.. శ్రీనుబాబు కథ తెలుసుకుంటే ఆశ్చర్యమనిపించకమానదు. శ్రీకాకుళంలోని బూర్జ మండలంలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి... అక్కడే హైస్కూలు చదువు పూర్తిచేశారు. ఇంటర్ పాలకొండలో చదివాక... టాపర్‌గా ఆంధ్రాయూనివర్సిటీలో బీఫార్మ్‌లో అడుగుపెట్టారు. అక్కడే ఎంటెక్ బయో టెక్నాలజీ చేసి... ‘అప్లికేషన్ ఆఫ్ మేథమెటికల్ మోడల్స్ టు డిటెక్ట్ డయాబెటిక్ ఎర్లీ’ అనే అంశంపై పీహెచ్డీ చేశారు. అంటే ప్రొటీన్ల విశ్లేషణతో మధుమేహ ముప్పును ముందే తెలుసుకోవటం అన్నమాట. దీనికి సియోల్‌లోని హ్యూమన్ ప్రొటీయం ఆర్గనైజేషన్ ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డునిచ్చింది. అదే మేథమెటికల్ మోడల్స్‌ను వర్తింపజేస్తూ ప్రొస్టేట్ క్యాన్సర్‌పై పరిశోధనకు స్టాన్ఫోర్డ్ నుంచి పిలుపొచ్చింది. ఈ పరిశోధనలకు తగిన మెటీరియల్ కోసం తరచూ హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఐఐసీటీకి తిరిగేవాడినని, ఈ కష్టాలే ఓపెన్ యాక్సెస్ జర్నల్‌కు.. ఒమిక్స్ ఇంటర్నేషనల్‌కు పునాది వేశాయని చెబుతారు శ్రీనుబాబు. -
ఆయన మనకు గురువులాంటోడు...!
ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత ఒకరిని తెగ పొగిడారట. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత ఒకరు స్వయంగా టీడీపీ నేతకు చెప్పారట. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీలో సీనియర్. గతంలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఏ విషయమైనా ఆపకుండా గంటపాటు మాట్లాడగలరు. ఎవరిపైన ఏ విమర్శనైనా జంకు, గొంకు లేకుండా చేస్తారు. ఇటీవల ఆ నేత సొంత జిల్లాకు చెందిన ఓ నాయకురాలిపై విమర్శల వర్షం కురిపించారు. మరుసటి రోజు ఆ వార్త పత్రికల్లో ప్రచురితమైంది. పత్రికలు చదువుతూ తనకు సన్నిహితులైన మంత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ టీడీపీ నేత మనందరికి గురువు లాంటి వారు, ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది, మనందరం టీడీపీలో ఉన్నపుడు వివిధ అంశాలపై మాట్లాడాలంటే ఆయన సూచనలు, సలహాలు తీసుకునే వాళ్లం అని కితాబిచ్చారట. ఈ విషయాన్ని సీఎంతో పాటు పిచ్చాపాటి ఇష్టాగోష్టిలో పాల్గొన్న మంత్రి ఒకరు టీడీపీ నేత చెవిలో వేశారట. దీంతో ఆ నేత మనల్ని పొరుగు రాష్ట్రం సీఎం కూడా మెచ్చుకున్నారు అని ఉబ్బితబ్బిబ్బు అయి పోతున్నారట. -
సరైన కాలేజీ, బ్రాంచ్తోనే ఉజ్వల భవిత
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ, బిట్‌శాట్, ఎంసెట్ ఇలా పలు ఎంట్రన్స్ టెస్ట్‌లు రాశారు. ‘కెరీర్ కలలను సాకారం చేసే కాలేజీ.. భవిష్యత్‌కి భరోసా ఇచ్చే బ్రాంచ్’ ఎలా ఎంచుకోవాలో తెలియక విద్యార్థుల్లో అయోమయం. ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందున్న అతి పెద్ద పరీక్ష ఇదే. ఈ సందిగ్ధతకు తెరదించి కాలేజీ, బ్రాంచ్ ఎంపికపై విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడే అంశాలపై ప్రత్యేక కథనం. మౌలిక వసతులు కాలేజీ ఎంపికలో మౌలిక వసతులదే కీలక పాత్ర. అధునాతనమైన తరగతి గదులు, ల్యాబ్ సౌకర్యాలు, సెమినార్ హాల్స్, లాంగ్వేజ్ సెంటర్స్, లైబ్రరీలు ఇంజనీరింగ్ విద్యలో కీలక పాత్ర పోషిస్తాయి. పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ఉన్న ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. విద్యార్థికి అకడెమిక్ విద్యతో పాటు పరిశోధనలూ కీలకమే. లైబ్రెరీలో ఉన్న బుక్స్, జర్నల్స్, అవసరమైన మేరకు ఇంటర్నెట్ సదుపాయాలు విద్యార్థుల జ్ఞానార్జనలో దోహదపడ తాయి. ఈ వసతులన్నీ ఉన్న కాలేజీలో చేరితే కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ మెరుగుపరచుకోవచ్చు. పోటీని తట్టుకుని కెరీర్లో మెరవాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే. కాబట్టి కాలేజీ ఎంపికలో తప్పనిసరిగా మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకోవాలి. ఫ్యాకల్టీ చాలా కాలేజీలు మౌలిక వసతుల కల్పనకు పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఫ్యాకల్టీపై మాత్రం దృష్టి సారించటం లేదు. కేవలం భౌతికమైన మౌలిక వసతులు మాత్రమే ఎలాంటి ఫలితాలను తీసుకురాలేవు. నిపుణులైన అధ్యాపక బృందానికి మెరుగైన వసతులు తోడయితే అద్భుత ఫలితాలొస్తాయి. విద్యార్థికి సబ్జెక్టుపై ఫ్యాకల్టీ కలిగించే ఆసక్తి, ప్రేరణలు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. ఈ అంశాలు వారిని మరింత ప్రతిభావంతులుగా తయారు చేస్తాయి. కాలేజీ ఎంపికలో ఫ్యాకల్టీ అంశం కీలకమైంది. ఉదా: మౌలిక వసతులు మనిషి దేహం అయితే అందులో ఉండే రక్తమాంసాలే ఫ్యాకల్టీ. అక్రెడిటేషన్ దేశంలోని విద్యా ప్రమాణాలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసీటీఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఎ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)లు పర్యవేక్షిస్తాయి. విద్యార్థులు కాలేజ్ ఎంపికకు ఎఐసీటీఈ, ఎన్బీఏ, న్యాక్‌లు ఆయా కాలేజీలకు ఇచ్చిన అక్రెడిటేషన్‌ను తప్పని సరిగా పరిశీలించాలి. అక్రెడిటేషన్‌లో భాగంగా ఈ సంస్థల బృందాలు కాలేజీలలోని మౌలిక వసతులు, బోధన, ల్యాబ్, లైబ్రరీ సదుపాయాలతో పాటు ప్లే గ్రౌండ్, ఉత్తీర్ణత శాతం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తాయి.అన్ని అంశాలు సంతృప్తికరంగా ఉంటే 5 ఏళ్ల వరకు గుర్తింపు ఇస్తున్నాయి. సరైన వసతులు లేన ట్లయితే 2 నుంచి 3 ఏళ్లకే అక్రెడిటేషన్ పరిమితమౌతుంది. క్రమశిక్షణ చదువుతో క్రమశిక్షణ వస్తుంది. చాలా కాలేజీలు క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరాలంటే భయపడుతున్నారు. ఇది సరైన భావన కాదు. క్రమశిక్షణతో కూడిన జీవితం విద్యార్థిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సరైన క్రమశిక్షణ లేక చాలాసార్లు విద్యార్థులు గొప్ప అవకాశాలను కూడా జారవిడుస్తారు. అందుకే కాలేజీ ఎంపికలో క్రమశిక్షణను పరిగణలోకి తీసుకోవాలి. ప్లేస్‌మెంట్స్ ప్లేస్‌మెంట్స్ అన్ని అంశాల్లో అతి ముఖ్యమైంది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయో గమనించాలి. ప్లేస్‌మెంట్స్ ఆధారంగానే ఆయా కాలేజీల స్థాయి తెలుస్తుంది. కొన్ని కాలేజీలు ప్లేస్‌మెంట్స్ విషయంలో తప్పుడు లెక్కలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్, బ్రోచర్లలోని సమాచారాన్ని నమ్మక వాస్తవాలను తెలుసుకోవాలి. పరీక్షలు-ఫలితాలు అకడెమిక్లలో పరీక్షలు చాలా ప్రాధాన్యమైనవి. పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా ఫ్యాకల్టీ, కాలేజీ పనితీరును అంచనా వేయొచ్చు. విశ్వవిద్యాలయ పరీక్షల్లో కాలేజీ సాధించిన ఫలితాలను కూడా అక్రెడిటేషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థులు కాలే జీ ఎంపికలో ఫలితాల ట్రాక్ రికార్డ్‌ను కూడా పరిశీలించాలి. పరిశ్రమల సహకారం విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లు ఎన్ని చర్యలు తీసుకున్నా విద్యార్థుల్లో తగిన స్థాయిలో ప్రాక్టికల్ పరిజ్ఞానం మెరుగుపడటం లేదు. కాలేజీలు పరిశ్రమల సహకారంతో విద్యార్థులకు కంపెనీలు కోరుకునే స్కిల్స్ నేర్పించాలి. పరిశ్రమలకు తీసుకువెళ్లి ప్రాక్టిక ల్ పద్ధతుల్లో అవగాహన కలిగించాలి. ఎంపిక సమయంలో ఆయా కాలేజీలు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయో తెలుసుకోండి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ పరిశోధన ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. పరిశోధన ద్వారా భిన్నంగా ఆలోచించడం అలవడుతుంది. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో వచ్చే నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని తట్టుకొని విజయం సాధించేందుకు పరిశోధన అత్యవసరం. కాలేజీ ఎంపికలో ఈ అంశమూ కీలకమే. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు పీజీ కోర్సులున్న కాలేజీల్లో చేరిన విద్యార్థులకు అక్కడ ఉన్న స్పెషలైజేషన్ కోర్సుల పైన అవగాహన ఏర్పడుతుంది. పీజీ స్థాయి ఫ్యాకల్టీ డిగ్రీ సబ్జెక్టులను మరింత సమర్థంగా బోధిస్తారు. కాబట్టి కాలేజీ ఎంపికలో పీజీ కోర్సులున్న కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలి. కో కరిక్యులర్ అండ్ ఎక్స్‌స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఈ మధ్య కాలంలో అన్ని కంపెనీలు వీటి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, టీం స్పిరిట్, ఆర్గనైజేషన్, డెసిషన్ మేకింగ్ నైపుణ్యాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సమయ భావనలు ఈ యాక్టివిటీస్ ద్వారా అలవడతాయి. భిన్న సంస్కృతులున్న ఈ గ్లోబల్ ప్రపంచంలో పనిచేసేందుకు ఈ స్కిల్స్ అత్యవసరం. వీటి కోసం కాలేజీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో తెలుసుకోవాలి. కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కాలేజీలో అనువైన వాతావరణం కల్పించటంలో పరిపాలన విభాగానిదే ముఖ్య భూమిక. మెరుగైన మౌలిక వసతు లు కల్పనతో పాటు నిపుణులైన ఫ్యాకల్టీని నియమించటం. ల్యాబ్ కోసం మంచి పరికరాలు సేకరించటం, కాలేజీలో తగిన ప్రమాణాలను పాటించటం ఈ విభాగం ప్రధాన బాధ్యత. కాలేజీ ఎంపికలో పరిపాలన విభాగం, వారు కాలేజీ అభివృద్ధికి చేస్తున్న పనులు గురించి తెలుసుకోవాలి. బ్రాంచ్ ఎంచుకోండి ఇలా ఆసక్తి బ్రాంచ్ ఎంపికలో ఆసక్తే ప్రధానాశం. చాలా సందర్భాల్లో విద్యార్థులు ఒక బ్రాంచ్ పట్ల విపరీత ఆసక్తిని పెంచుకుంటారు. సంబంధిత బ్రాంచ్ సబ్జెక్టులు కష్టంగా ఉన్నా ఆ బ్రాంచ్ చదవటానికే ఇష్టపడతారు. ఆసక్తే విద్యార్థుల తీసుకునే నిర్ణయాలు, చర్యల్లో ప్రతి ఫలిస్తుంది. ఇలా గుర్తించు విద్యార్థి తన బలాలు-బలహీనతలను దృష్టిలో ఉంచుకుని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇంకో విధానంలో బ్రాంచ్‌లు వాటిలో ఉన్న కోర్ సబ్జెక్టులను ఒక పేపర్‌పై రాసుకోవాలి. వాటిని చ దువుతూ మీ మనసు ఏ బ్రాంచ్ దగ్గర ఉందో తెలుసుకోవచ్చు. ఇలా సహజ సిద్ధంగా ఏ బ్రాంచ్‌లో మీకు ఇష్టం ఉందో గుర్తించవచ్చు. ఆటిట్యూడ్ విద్యార్థులు ముందు తమ దృక్పథం ఏంటో తెలుసుకోవాలి. ప్రజలతో కలసి పని చేయటానికి ఇష్టపడే విద్యార్థులు జనం సమస్యలతో సంబంధం ఉన్న బ్రాంచ్‌లను ఎంచుకోవాలి. గాడ్జెట్లు అంటే ఇష్టపడే వారు సంబంధిత బ్రాంచ్‌లో చేరాలి. పరిధి ప్రతి బ్రాంచ్‌కి తనదైన ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అవసరం. బ్రాంచ్ ఎంపికలో ఈ విషయాలు సమగ్రంగా ఆలోచించాలి. విద్యార్థులు తమ అలవాట్లు, జీవన శైలికి సరిపోయే బ్రాంచ్ని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో 30-35 సంవత్సరాలు అదే వృత్తిలో ఉండాలి కాబట్టి. ఉద్యోగ అవకాశాలు ఏ బ్రాంచ్ చదివినా అవకాశాలకు ఎలాంటి కొదవ లేదు. సంబంధిత సబ్జెక్టుల్లో పట్టు ఉండాలి. గ్లోబల్ ఎకానమీ, మార్కెట్ డిమాండ్ ఆధారంగా కొన్ని బ్రాంచ్‌లలో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థిలో ప్రతిభ లేకపోతే ఎంత డిమాండ్ ఉన్న బ్రాంచైనా ఉద్యోగాన్ని అందివ్వలేదు. సబ్జెక్టులు-పరిజ్ఞానం ప్రాథమిక సబ్జెక్టులైన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో పట్టు ఉండాలి. విద్యార్థులు ఫిజిక్స్‌లో బలహీనంగా ఉంటే ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్‌లలో ఇబ్బంది పడతారు. కెమిస్ట్రీలో బలహీనంగా ఉండే వారు కెమికల్, బయోటెక్నాలజీలలో రాణించలేరు. సీఎస్ఈ బ్రాంచ్‌లో చేరాలనకునే విద్యార్థులకు మ్యాథ్స్ విశ్లేషణా పరిజ్ఞానం తప్పక ఉండాలి. వృత్తి ఎంపిక విద్యార్థులు ముందు తమకు తగిన ఉద్యోగం ఏంటనేది గుర్తించాలి. దానికి అనుగుణంగా బ్రాంచ్ ఎంచుకోవాలి. కోర్ రంగంలో స్థిరపడాలనుకుంటే సివిల్, మెకానికల్, కెమికల్, మెటలర్జీలను ఎంపిక చేసుకోవాలి. ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారు సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఐటీ బ్రాంచ్‌లను ఎంచుకోవాలి. కొత్త బ్రాంచ్‌లు కొత్త బ్రాంచ్‌లైన బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్, సిరామిక్, టెక్స్టైల్ ఇంజనీరింగ్‌లను ఎంచుకునే ముందు విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయా రంగాల్లో అవకాశాలు పరిమితం. అంతగా ఆసక్తి ఉంటే రెగ్యులర్ బ్రాంచ్‌లలో బీటెక్ చేసి తర్వాత ఎంటెక్‌లో ఈ సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయొచ్చు. ప్రశ్నలతో బ్రాంచ్ ఎంపిక బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు ఈ ప్రశ్నలు వేసుకుంటే వారికి మరింత స్పష్టత వస్తుంది. ఏ బ్రాంచ్ దగ్గర ఈ ప్రశ్నలకు మీ దగ్గర నుంచి ఎక్కువ సార్లు ‘ఎస్’ అనే సమాధానం వస్తుందో ఆ బ్రాంచ్ని ఎంచుకోవాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 1. కంప్యూటర్ అంటే ఇష్టమా? (గేమ్స్, ఫేస్బుక్, ఇంటర్నెట్ కోసం కాదు) 2. కంప్యూటర్లో కొత్తగా ఏదైనా చేయాలని ఉందా? 3. కంప్యూటర్‌తో ప్రయోగాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారా? 4. మ్యాథ్స్, లాజికల్ స్కిల్స్‌లో బలంగా ఉన్నారా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీఎస్ఈకి పెద్ద తేడా లేదు కేవలం 10 శాతం సిలబస్ వేరుగా ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 1. ఎప్పుడైనా స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసి రిపేర్ చేశారా? 2. ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు తెలుసుకోవాలని ఉందా? 3. ఎలక్ట్రికల్ మోటార్, టర్బైన్, జనరేటర్లపై ఆసక్తి ఉందా? 4. సెన్సార్, ట్రాన్సిస్టర్ వంటి పరికరాలపై ఆసక్తి ఉందా? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1. ఎలక్ట్రానిక్ పరికరాల గురించి తెలుసుకోవాలని ఉందా? 2. కంప్యూటర్ సీపీయూలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? 3. మైక్రోప్రొసెసర్స్, కమ్యూనికేషన్స్ అంటే ఆసక్తి ఉందా? మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ 1. కార్, బైక్ డిజైన్ల పట్ల ఆసక్తి ఉందా? 2. టీచర్స్ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అడుగుతున్నావా (ఎలా పని చేస్తాయి)? 3. కొత్త మెకానిజం తయారు చేయాలని ఉందా? 4. సామాన్యుడికి మీ ఇంజినీరింగ్ స్కిల్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నారా? సివిల్ ఇంజనీరింగ్ 1. భవన నిర్మాణాలపై ఆసక్తి ఉందా? 2. సామాజిక సమస్యలు పరిష్కరించాలనే ఆసక్తి ఉందా? 3. ఏదైనా బిల్డింగ్ చూసిన తర్వాత దీన్ని ఇలా ఎందుకు కట్టారు అనే భావన కలిగిందా? -
మ్యూజిక్ కు జస్టిన్ బీబెర్ గుడ్ బై?
మ్యూజిక్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను అని టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబెర్ వెల్లడించాడు. త్వరలో జర్నల్స్ అనే కొత్త ఆల్బమ్ విడుదల తర్వాత మ్యూజిక్ రంగం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని తెలిపారు. 'కొత్త ఆల్బమ్ పూర్తయిన తర్వాత రిటైర్ కావాలనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా స్థిరపడాలనుకుంటున్నాను. మ్యూజిక్ రంగంలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది' అని ఓ రేడియో కార్యక్రమంలో బీబెర్ వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో తలబిరుసుతనం ఉంది అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి బీబెర్ చురకలంటించారు. కాని తాను అలాంటి వ్యక్తిని కాదు అని తెలిపారు.