సరైన కాలేజీ, బ్రాంచ్‌తోనే ఉజ్వల భవిత | | Sakshi
Sakshi News home page

సరైన కాలేజీ, బ్రాంచ్‌తోనే ఉజ్వల భవిత

Published Wed, Jun 3 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

Branctone bright bhavita

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ, బిట్‌శాట్, ఎంసెట్ ఇలా పలు ఎంట్రన్స్ టెస్ట్‌లు రాశారు. ‘కెరీర్ కలలను సాకారం చేసే కాలేజీ.. భవిష్యత్‌కి భరోసా ఇచ్చే బ్రాంచ్’ ఎలా ఎంచుకోవాలో తెలియక విద్యార్థుల్లో అయోమయం. ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందున్న అతి పెద్ద పరీక్ష ఇదే. ఈ సందిగ్ధతకు తెరదించి కాలేజీ, బ్రాంచ్ ఎంపికపై విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడే అంశాలపై ప్రత్యేక కథనం.
 
 మౌలిక వసతులు
 కాలేజీ ఎంపికలో మౌలిక వసతులదే కీలక పాత్ర. అధునాతనమైన తరగతి గదులు, ల్యాబ్ సౌకర్యాలు, సెమినార్ హాల్స్, లాంగ్వేజ్ సెంటర్స్, లైబ్రరీలు ఇంజనీరింగ్ విద్యలో కీలక పాత్ర పోషిస్తాయి. పూర్తి స్థాయి ఎక్విప్‌మెంట్ ఉన్న ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. విద్యార్థికి అకడెమిక్ విద్యతో పాటు పరిశోధనలూ కీలకమే. లైబ్రెరీలో ఉన్న బుక్స్, జర్నల్స్, అవసరమైన మేరకు ఇంటర్నెట్ సదుపాయాలు విద్యార్థుల జ్ఞానార్జనలో దోహదపడ తాయి. ఈ వసతులన్నీ ఉన్న కాలేజీలో చేరితే కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ మెరుగుపరచుకోవచ్చు. పోటీని తట్టుకుని కెరీర్‌లో మెరవాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే. కాబట్టి కాలేజీ ఎంపికలో తప్పనిసరిగా మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకోవాలి.
 
 ఫ్యాకల్టీ
 చాలా కాలేజీలు మౌలిక వసతుల కల్పనకు పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఫ్యాకల్టీపై మాత్రం దృష్టి సారించటం లేదు. కేవలం భౌతికమైన మౌలిక వసతులు మాత్రమే ఎలాంటి ఫలితాలను తీసుకురాలేవు. నిపుణులైన అధ్యాపక బృందానికి మెరుగైన వసతులు తోడయితే అద్భుత ఫలితాలొస్తాయి. విద్యార్థికి సబ్జెక్టుపై ఫ్యాకల్టీ కలిగించే ఆసక్తి, ప్రేరణలు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. ఈ అంశాలు వారిని మరింత ప్రతిభావంతులుగా తయారు చేస్తాయి. కాలేజీ ఎంపికలో ఫ్యాకల్టీ అంశం కీలకమైంది. ఉదా: మౌలిక వసతులు మనిషి దేహం అయితే అందులో ఉండే రక్తమాంసాలే ఫ్యాకల్టీ.
 
 అక్రెడిటేషన్
 దేశంలోని విద్యా ప్రమాణాలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసీటీఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్‌బీఎ), నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)లు పర్యవేక్షిస్తాయి. విద్యార్థులు కాలేజ్ ఎంపికకు ఎఐసీటీఈ, ఎన్‌బీఏ, న్యాక్‌లు ఆయా కాలేజీలకు ఇచ్చిన అక్రెడిటేషన్‌ను తప్పని సరిగా పరిశీలించాలి. అక్రెడిటేషన్‌లో భాగంగా ఈ సంస్థల బృందాలు కాలేజీలలోని మౌలిక వసతులు, బోధన, ల్యాబ్, లైబ్రరీ సదుపాయాలతో పాటు ప్లే గ్రౌండ్, ఉత్తీర్ణత శాతం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తాయి.అన్ని అంశాలు సంతృప్తికరంగా ఉంటే 5 ఏళ్ల వరకు గుర్తింపు ఇస్తున్నాయి. సరైన వసతులు లేన ట్లయితే 2 నుంచి 3 ఏళ్లకే అక్రెడిటేషన్ పరిమితమౌతుంది.
 
 క్రమశిక్షణ
 చదువుతో క్రమశిక్షణ వస్తుంది. చాలా కాలేజీలు క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరాలంటే భయపడుతున్నారు. ఇది సరైన భావన కాదు. క్రమశిక్షణతో కూడిన జీవితం విద్యార్థిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సరైన క్రమశిక్షణ లేక చాలాసార్లు విద్యార్థులు గొప్ప అవకాశాలను కూడా జారవిడుస్తారు. అందుకే కాలేజీ ఎంపికలో క్రమశిక్షణను పరిగణలోకి తీసుకోవాలి.
 
 ప్లేస్‌మెంట్స్
 ప్లేస్‌మెంట్స్ అన్ని అంశాల్లో అతి ముఖ్యమైంది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయో గమనించాలి. ప్లేస్‌మెంట్స్ ఆధారంగానే ఆయా కాలేజీల స్థాయి తెలుస్తుంది. కొన్ని కాలేజీలు ప్లేస్‌మెంట్స్ విషయంలో తప్పుడు లెక్కలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. కాబట్టి అడ్వర్టైజ్‌మెంట్స్, బ్రోచర్లలోని సమాచారాన్ని నమ్మక వాస్తవాలను తెలుసుకోవాలి.
 
 పరీక్షలు-ఫలితాలు
 అకడెమిక్‌లలో పరీక్షలు చాలా ప్రాధాన్యమైనవి. పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా ఫ్యాకల్టీ, కాలేజీ పనితీరును అంచనా వేయొచ్చు. విశ్వవిద్యాలయ పరీక్షల్లో కాలేజీ సాధించిన ఫలితాలను కూడా అక్రెడిటేషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థులు కాలే జీ ఎంపికలో ఫలితాల ట్రాక్ రికార్డ్‌ను కూడా పరిశీలించాలి.
 
 పరిశ్రమల సహకారం
 విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్ని చర్యలు తీసుకున్నా విద్యార్థుల్లో తగిన స్థాయిలో ప్రాక్టికల్ పరిజ్ఞానం మెరుగుపడటం లేదు. కాలేజీలు పరిశ్రమల సహకారంతో విద్యార్థులకు కంపెనీలు కోరుకునే స్కిల్స్ నేర్పించాలి. పరిశ్రమలకు తీసుకువెళ్లి ప్రాక్టిక ల్ పద్ధతుల్లో అవగాహన కలిగించాలి. ఎంపిక సమయంలో ఆయా కాలేజీలు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయో తెలుసుకోండి.
 
 రీసెర్చ్ ప్రాజెక్ట్స్
 పరిశోధన ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. పరిశోధన ద్వారా భిన్నంగా ఆలోచించడం అలవడుతుంది. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో వచ్చే నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని తట్టుకొని విజయం సాధించేందుకు పరిశోధన అత్యవసరం. కాలేజీ ఎంపికలో ఈ అంశమూ కీలకమే.
 
 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
 పీజీ కోర్సులున్న కాలేజీల్లో చేరిన విద్యార్థులకు అక్కడ ఉన్న స్పెషలైజేషన్ కోర్సుల పైన అవగాహన ఏర్పడుతుంది. పీజీ స్థాయి ఫ్యాకల్టీ డిగ్రీ సబ్జెక్టులను మరింత సమర్థంగా బోధిస్తారు. కాబట్టి కాలేజీ ఎంపికలో పీజీ కోర్సులున్న కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 కో కరిక్యులర్ అండ్ ఎక్స్‌స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
 ఈ మధ్య కాలంలో అన్ని కంపెనీలు వీటి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, టీం స్పిరిట్, ఆర్గనైజేషన్, డెసిషన్ మేకింగ్ నైపుణ్యాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సమయ భావనలు ఈ యాక్టివిటీస్ ద్వారా అలవడతాయి. భిన్న సంస్కృతులున్న ఈ గ్లోబల్ ప్రపంచంలో పనిచేసేందుకు ఈ స్కిల్స్ అత్యవసరం. వీటి కోసం కాలేజీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో తెలుసుకోవాలి.
 
 కాలేజ్ అడ్మినిస్ట్రేషన్
 కాలేజీలో అనువైన వాతావరణం కల్పించటంలో పరిపాలన విభాగానిదే ముఖ్య భూమిక. మెరుగైన మౌలిక వసతు లు కల్పనతో పాటు నిపుణులైన ఫ్యాకల్టీని నియమించటం. ల్యాబ్ కోసం మంచి పరికరాలు సేకరించటం, కాలేజీలో తగిన ప్రమాణాలను పాటించటం ఈ విభాగం ప్రధాన బాధ్యత. కాలేజీ ఎంపికలో పరిపాలన విభాగం, వారు కాలేజీ అభివృద్ధికి చేస్తున్న పనులు గురించి తెలుసుకోవాలి.
 
 బ్రాంచ్ ఎంచుకోండి ఇలా
 
 ఆసక్తి
 బ్రాంచ్ ఎంపికలో ఆసక్తే ప్రధానాశం. చాలా సందర్భాల్లో విద్యార్థులు ఒక బ్రాంచ్ పట్ల విపరీత ఆసక్తిని పెంచుకుంటారు. సంబంధిత బ్రాంచ్ సబ్జెక్టులు కష్టంగా ఉన్నా ఆ బ్రాంచ్ చదవటానికే ఇష్టపడతారు. ఆసక్తే విద్యార్థుల తీసుకునే నిర్ణయాలు, చర్యల్లో ప్రతి ఫలిస్తుంది.
 
 ఇలా గుర్తించు
 విద్యార్థి తన బలాలు-బలహీనతలను దృష్టిలో ఉంచుకుని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇంకో విధానంలో బ్రాంచ్‌లు వాటిలో ఉన్న కోర్ సబ్జెక్టులను ఒక పేపర్‌పై రాసుకోవాలి. వాటిని చ దువుతూ మీ మనసు ఏ బ్రాంచ్ దగ్గర ఉందో తెలుసుకోవచ్చు. ఇలా సహజ సిద్ధంగా ఏ బ్రాంచ్‌లో మీకు ఇష్టం ఉందో గుర్తించవచ్చు.
 
 ఆటిట్యూడ్
 విద్యార్థులు ముందు తమ దృక్పథం ఏంటో
 తెలుసుకోవాలి. ప్రజలతో కలసి పని చేయటానికి ఇష్టపడే విద్యార్థులు జనం సమస్యలతో సంబంధం ఉన్న బ్రాంచ్‌లను ఎంచుకోవాలి. గాడ్జెట్‌లు అంటే ఇష్టపడే వారు సంబంధిత బ్రాంచ్‌లో చేరాలి.
 
 పరిధి
 ప్రతి బ్రాంచ్‌కి తనదైన ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అవసరం. బ్రాంచ్ ఎంపికలో ఈ విషయాలు సమగ్రంగా ఆలోచించాలి. విద్యార్థులు తమ అలవాట్లు, జీవన శైలికి సరిపోయే బ్రాంచ్‌ని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో 30-35 సంవత్సరాలు అదే వృత్తిలో ఉండాలి కాబట్టి.
 
 ఉద్యోగ అవకాశాలు
 ఏ బ్రాంచ్ చదివినా అవకాశాలకు ఎలాంటి కొదవ లేదు. సంబంధిత సబ్జెక్టుల్లో పట్టు ఉండాలి. గ్లోబల్ ఎకానమీ, మార్కెట్ డిమాండ్ ఆధారంగా కొన్ని బ్రాంచ్‌లలో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థిలో ప్రతిభ లేకపోతే ఎంత డిమాండ్ ఉన్న బ్రాంచైనా ఉద్యోగాన్ని అందివ్వలేదు.
 
 సబ్జెక్టులు-పరిజ్ఞానం
 ప్రాథమిక సబ్జెక్టులైన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో పట్టు ఉండాలి. విద్యార్థులు ఫిజిక్స్‌లో బలహీనంగా ఉంటే ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్‌లలో ఇబ్బంది పడతారు. కెమిస్ట్రీలో బలహీనంగా ఉండే వారు కెమికల్, బయోటెక్నాలజీలలో రాణించలేరు. సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేరాలనకునే విద్యార్థులకు మ్యాథ్స్ విశ్లేషణా పరిజ్ఞానం తప్పక ఉండాలి.
 
 వృత్తి ఎంపిక
 విద్యార్థులు ముందు తమకు తగిన ఉద్యోగం ఏంటనేది గుర్తించాలి. దానికి అనుగుణంగా బ్రాంచ్ ఎంచుకోవాలి. కోర్ రంగంలో స్థిరపడాలనుకుంటే సివిల్, మెకానికల్, కెమికల్, మెటలర్జీలను ఎంపిక చేసుకోవాలి. ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారు సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఐటీ బ్రాంచ్‌లను ఎంచుకోవాలి.
 
 కొత్త బ్రాంచ్‌లు
 కొత్త బ్రాంచ్‌లైన బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ప్రొడక్షన్, ఎన్విరాన్‌మెంటల్, సిరామిక్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లను ఎంచుకునే ముందు విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయా రంగాల్లో అవకాశాలు పరిమితం. అంతగా ఆసక్తి ఉంటే రెగ్యులర్ బ్రాంచ్‌లలో బీటెక్ చేసి తర్వాత ఎంటెక్‌లో ఈ సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయొచ్చు.
 
 ప్రశ్నలతో బ్రాంచ్ ఎంపిక
 
 బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు ఈ ప్రశ్నలు వేసుకుంటే వారికి మరింత స్పష్టత వస్తుంది. ఏ బ్రాంచ్ దగ్గర ఈ ప్రశ్నలకు మీ దగ్గర నుంచి ఎక్కువ సార్లు ‘ఎస్’ అనే సమాధానం వస్తుందో ఆ బ్రాంచ్‌ని ఎంచుకోవాలి.
 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
 1.    కంప్యూటర్ అంటే ఇష్టమా? (గేమ్స్, ఫేస్‌బుక్, ఇంటర్నెట్ కోసం కాదు)
 2.    కంప్యూటర్‌లో కొత్తగా ఏదైనా చేయాలని ఉందా?
 3.    కంప్యూటర్‌తో ప్రయోగాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారా?
 4.    మ్యాథ్స్, లాజికల్ స్కిల్స్‌లో బలంగా ఉన్నారా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీఎస్‌ఈకి పెద్ద తేడా లేదు కేవలం 10 శాతం సిలబస్ వేరుగా ఉంటుంది.
 
 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
 1.    ఎప్పుడైనా స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసి రిపేర్ చేశారా?
 2.    ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు తెలుసుకోవాలని ఉందా?
 3.    ఎలక్ట్రికల్ మోటార్, టర్బైన్, జనరేటర్‌లపై ఆసక్తి ఉందా?
 4.    సెన్సార్, ట్రాన్సిస్టర్ వంటి పరికరాలపై ఆసక్తి ఉందా?
 
 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
 1.    ఎలక్ట్రానిక్ పరికరాల గురించి తెలుసుకోవాలని ఉందా?
 2.    కంప్యూటర్ సీపీయూలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా?
 3.    మైక్రోప్రొసెసర్స్, కమ్యూనికేషన్స్ అంటే ఆసక్తి ఉందా?
 
 మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్
 1.    కార్, బైక్ డిజైన్‌ల పట్ల ఆసక్తి ఉందా?
 2.    టీచర్స్‌ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అడుగుతున్నావా (ఎలా పని చేస్తాయి)?
 3.    కొత్త మెకానిజం తయారు చేయాలని ఉందా?
 4.    సామాన్యుడికి మీ ఇంజినీరింగ్ స్కిల్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నారా?
 
 సివిల్ ఇంజనీరింగ్
 1.    భవన నిర్మాణాలపై ఆసక్తి ఉందా?
 2.    సామాజిక సమస్యలు పరిష్కరించాలనే ఆసక్తి ఉందా?
 3.    ఏదైనా బిల్డింగ్ చూసిన తర్వాత దీన్ని ఇలా ఎందుకు కట్టారు అనే భావన కలిగిందా?
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement