పరిశోధనల ‘పల్స్‌’.. పట్టేశారు! | Omecs a online platform for research papers | Sakshi
Sakshi News home page

పరిశోధనల ‘పల్స్‌’.. పట్టేశారు!

Published Wed, Jun 27 2018 11:40 PM | Last Updated on Thu, Jun 28 2018 12:29 AM

Omecs a online platform for research papers  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  ఒక ఆలోచన... ఒక వ్యాపారాన్ని పుట్టించింది. అందులో వచ్చిన కష్టాలు... మరో  రెండు వ్యాపారాల్ని సృష్టించాయి. సంస్థను రూ.1,300 కోట్ల టర్నోవర్‌ స్థాయికి తీసుకెళ్లి... 4,800 మందికి ఉపాధినిస్తున్నాయి. అదే ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌. శాస్త్ర, సాంకేతిక పత్రాల్ని ఆన్‌లైన్‌లో ప్రచురించే ఈ సంస్థకు... హైదరాబాదే ప్రధాన కేంద్రం. దీని సారథి డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు.. ఫ్రమ్‌ శ్రీకాకుళం.

పీహెచ్‌డీ చేయాలన్నా... పరిశోధన పత్రాలు రాయాలన్నా అంత తేలికకాదు. ఎంతో చదివి... ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మరి చదవటానికి మెటీరియల్‌ ఎలా..?   ఇదిగో... ఈ ఒక్క ఆలోచనే ‘ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌’కు పునాది. శ్రీకాకుళానికి చెందిన శ్రీనుబాబు... 2006లో సియోల్‌లో తనకు యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు ఇచ్చినపుడు... హ్యూమన్‌ ప్రొటీయం ఆర్గనైజేషన్‌ (హూపో) సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు. వారికీ విషయం అర్థమైంది.

ప్రచురితమైన మెటీరియల్‌ను అందరికీ అందుబాటులో (ఓపెన్‌ యాక్సెస్‌) ఉంచడానికి వారు అనుమతించారు. అది... ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్‌ను పుట్టించింది. ఈ జర్నల్‌లో పరిశోధన పత్రాలను ప్రచురించటానికి డబ్లు్యహెచ్‌ఓ, ఎన్‌ఐహెచ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు తప్పనిసరి చేయటంతో... ఫీజు రూపంలో కొంత ఆదాయమూ మొదలైంది. ఇంతలోనే ఓపెన్‌ యాక్సెస్‌కు తోడుగా... ప్రొటీన్ల అంశంపై ప్రొటీయం జర్నల్‌ తెచ్చారు.

తాను చదివిన స్టాన్‌ఫోర్డ్‌ పూర్వ విద్యార్థుల సాయంతో వివిధ అంశాలపై శాస్త్రీయ జర్నల్స్‌ను ఆన్‌లైన్లో ప్రచురించటం మొదలెట్టారు. అంతా ఈ వెబ్‌ను ఆశ్రయించటంతో... ర్యాంకింగ్‌తో పాటు పబ్లిష్‌ చేసేవారూ పెరిగారు. అలా... ఒమిక్స్‌ ఎదుగుదల మొదలైంది. ఇదే రంగంలోని పల్సస్‌ కూడా ఒమిక్స్‌తో జతకట్టింది. ప్రస్తుతం పల్సస్‌కు సీఈఓగానూ శ్రీనుబాబు వ్యవహరిస్తున్నారు.

ఒక కష్టం... మరో వ్యాపారం
ఇపుడు ఆన్‌లైన్లో ఒమిక్స్‌ జర్నల్స్‌కు దాదాపు 5 కోట్ల మంది పాఠకులున్నారు. కాకపోతే ఈ జర్నల్స్‌ను ఏటా ఆయా రంగాల్లో ప్రముఖులు సమీక్షించాలి. దీనికి ఎడిటోరియల్‌ బోర్డు సమావేశమవ్వాలి. వివిధ దేశాల్లోని నిపుణుల్ని దీనికోసం ఒకచోటికి చేర్చటం చాలా కష్టంగా ఉండేది. వారి విమాన ఖర్చులు... హోటల్‌ వసతి... ఆర్థికంగా భారమయ్యేవి. మరెలా..?
బాగా ఆలోచించిన శ్రీనుబాబు... ఆ ప్రముఖులు వచ్చేచోట వారికి సంబంధించిన రంగాలపై సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు.

వీటికి నిర్ణీత ఫీజు చెల్లించి హాజరయ్యేందుకు యూజర్లు విపరీతమైన ఆసక్తి చూపించేవారు. దీంతో ‘సదస్సుల నిర్వహణ’ అనేది కొత్త వ్యాపారంగా మారింది. 2010లో తొలి సదస్సు జరగ్గా... తరవాత సీఎంఈ, సీపీడీ అక్రిడేషన్లు కూడా రావటంతో ఇపుడు ఏటా 3,000కు పైగా  సదస్సులను నిర్వహిస్తోంది ఒమిక్స్‌. తమ విదేశీ ఆదాయంలో ఈ సదస్సుల వాటాయే ఎక్కువని, దీన్లో మార్జిన్లు 10–15 శాతం మధ్య ఉంటాయని శ్రీనుబాబు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

‘‘మా జిల్లాలో కిడ్నీ బాధితులెక్కువైన ఉద్ధానంలో వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుగులో కరపత్రం ఇస్తే తప్ప అర్థం కావటం లేదు. ఇది చూశాక పరిశోధన పత్రాల్ని వివిధ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం తెలిసింది. రష్యన్, చైనీస్, జర్మన్‌తో మొదలెట్టాం. ఆదాయం పెరిగింది. దేశీయంగా తెలుగు, తమిళం, హిందీల్లో అనువాదానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు శ్రీనుబాబు.

హిందీకి సంబంధించి యూపీ సర్కారుతో ఒప్పందం కుదరగా... కేంద్రం సైతం ఓకే చేసి విశాఖలో ఏర్పాటు చేస్తున్న కేంద్రానికి రూ.20 కోట్ల ప్రోత్సాహకాలిచ్చింది. ‘‘మా దగ్గర వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి 2.5 కోట్ల పేజీల సమాచారం ఉంది. వీటి అనువాదం వల్ల 10వేల ఉద్యోగాలొస్తాయి’’ అన్నారాయన.

మూడేళ్లలో ఐపీఓకు!
ప్రస్తుతం ఒమిక్స్‌లో 4,800 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ సెజ్‌లో ఏర్పాటుచేసిన కార్యాలయంలో 3,700 మంది పనిచేస్తుండగా, చెన్నైలో 400, గుర్గావ్‌లో 300 మంది పనిచేస్తున్నారు. విశాఖలో 25వేల చదరపుటడుగుల్లో ఏర్పాటు చేస్తున్న కార్యాలయంలో 1,000 ఉద్యోగాలు రానున్నట్లు చెప్పారాయన. ‘‘వార్షికంగా విదేశాల్లో రూ.900 కోట్లు, దేశీయంగా రూ.400 కోట్ల టర్నోవర్‌ నమోదు చేస్తున్నాం. మరో మూడేళ్ల తరవాత 2021లో ఐపీఓకు వెళ్లే ఆలోచన ఉంది. అప్పటికి 10వేల ఉద్యోగుల స్థాయికి చేరుకుంటాం’’ అని వివరించారు.  

శ్రీను ఫ్రమ్‌ శ్రీకాకుళం..
శ్రీనుబాబు కథ తెలుసుకుంటే ఆశ్చర్యమనిపించకమానదు. శ్రీకాకుళంలోని బూర్జ మండలంలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి... అక్కడే హైస్కూలు చదువు పూర్తిచేశారు. ఇంటర్‌ పాలకొండలో చదివాక... టాపర్‌గా ఆంధ్రాయూనివర్సిటీలో బీఫార్మ్‌లో అడుగుపెట్టారు. అక్కడే ఎంటెక్‌ బయో టెక్నాలజీ చేసి... ‘అప్లికేషన్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ మోడల్స్‌ టు డిటెక్ట్‌ డయాబెటిక్‌ ఎర్లీ’ అనే అంశంపై పీహెచ్‌డీ  చేశారు.

అంటే ప్రొటీన్ల విశ్లేషణతో మధుమేహ ముప్పును ముందే తెలుసుకోవటం అన్నమాట. దీనికి సియోల్‌లోని హ్యూమన్‌ ప్రొటీయం ఆర్గనైజేషన్‌ ‘యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డునిచ్చింది. అదే మేథమెటికల్‌ మోడల్స్‌ను వర్తింపజేస్తూ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌పై పరిశోధనకు స్టాన్‌ఫోర్డ్‌ నుంచి పిలుపొచ్చింది. ఈ పరిశోధనలకు తగిన మెటీరియల్‌ కోసం తరచూ హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఐఐసీటీకి తిరిగేవాడినని, ఈ కష్టాలే ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్‌కు.. ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌కు పునాది వేశాయని చెబుతారు శ్రీనుబాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement