ఎందరో మన హిందూధర్మం ప్రకారం కాశీ నగరానికి కేవలం శరీరాన్ని చాలించెయ్యాలనే అభిప్రాయంతో వెళ్లడాన్ని గమనిస్తూ ఉంటాం. దానికి కారణం ‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’ అని కనిపించే ప్రసిద్ధ ఋషివాక్యం మాత్రమే. అయితే ఈ సందర్భంలో ఆ వాక్యానికి కొంత వివరణ ఇచ్చుకోవలసి ఉంది.‘కాశ్యామ్+తు– కాశీనగరంలో మాత్రమే ముక్తిః – ముక్తి లభించడమనేదిమరణాత్ తు– మరణించడం వల్ల మాత్రమే లభిస్తుంది’ అని ఈ ఋషి వాక్యానికి అర్థం. మరి ఇదే నిజమైన ప్రమాణవాక్యమైతే కాశీనగరంలో ఎప్పటి నుండో ఉంటూ మరణించే ఎందరికో మోక్షమనేది అయాచితంగానూ, అదృష్టకారణంగానూ లభించేసినట్లే కదా! అనిపిస్తుంది మనకు. దానర్థం అది కాదు. అందుకే వ్యాఖ్యానాన్ని చదివీ లేదా వినీ అర్థం చేసుకోవాలని పెద్దలంటుంటారు. కాశీలో ముక్తి లభించాలంటే దానికి ఓ పద్ధతిని చెప్పారు ఋషులు.యదృచ్ఛాలాభ సంతుష్టః – అని. మనకిక్కడ ఇంట్లో ఏ తీరు సౌకర్యాలున్నాయో అలాంటి అన్ని సౌకర్యాలూ అక్కడ కూడా లభించేలా చేసుకుని కాశీలో ఉంటూ మరణానికి ఎదురు చూసినా, ఒకవేళ మరణించినా కూడా ముక్తిరాదట.
యదృచ్ఛాలాభ సంతుష్టః – ఏది దొరికితే ఎప్పుడు దొరికితే– ఎలా దొరికితే– ఎంత దొరికితే– దాంతో సంతోషపడుతూ ఈ శరీరమనేదాన్ని – అవయవాలన్నింటినీ దాచుకునేందుకు పుట్టుకతో వచ్చిన ఓ సంచిగా భావిస్తూ – లెక్క చెయ్యకుండా దాని కోరికలకి ప్రాధాన్యాన్నీయకుండా జీవించే/జీవించగలిగే తనంతో ఉంటే, దాన్ని (మరణ)కాశీనివాసం అంటారు. అలా తనంత తానుగా ఎవరి శరీరం ఆ వ్యక్తిని విడిచి వెళ్లిపోతుందో.. అదుగో అలాంటి మరణం కాశీలో జరిగిన పక్షంలో ముక్తి లభిస్తుందని దానర్థం. అలా కాక ఇంటిలో ఉన్న సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ.. రుచికరమైన భోజనాలని చేస్తూ.. ప్రతి పనికీ దాసీజనాన్ని ఏర్పాటు చేసుకుని కాశీలో ఉన్నా, ఏదో కారణంగా మరణించినా అది కేవలం స్థలం మార్పు కిందికొస్తుంది తప్ప ‘కాశీవాసం’ అనే మాటకి సంబంధించిన ఏర్పాటు కిందికి రాదు. అలా మరణిస్తే కూడా ముక్తి రానేరాదు. అయితే కాశీలో ఉన్న పుణ్యఫలం మాత్రమే లభిస్తుందనేది యదార్థం. అది కూడా విశ్వనాథునిసేవ చేసుకున్న పక్షంలో మాత్రమే.
చావు ఎన్ని తీరులు?
‘శరీరత్యాగం చేసి ముక్తిని పొందిన భక్తులు’ అనే ఈ శీర్షిక మరింత అర్థం కావాలంటేనూ, సాయి దగ్గరికొచ్చిన వాళ్లు కొన ఊపిరితో ఉన్నా సాయి మహత్యం కారణంగా బతికి బట్ట కట్టాలి కానీ అలా దిక్కు లేని వాళ్లలా చనిపోవడమా? అనే తీరు దుర్విమర్శకి సమాధానం తెలియాలంటేనూ ‘చావు’ అనేది ఎన్ని విధాలుగా ఉంటుందని లెక్కించారో వాటిలో ఏ తీరు ఈ ‘శరీర త్యాగం’ అనేది దేని కిందికి వస్తుందో తెలియాల్సిందే వివరంగా.
1. చచ్చిపోయాడు – ఇది మొదటి మాట. శరీరంలో ఉండే ఏ అవయవమో లేక అవయవాల సమూహమో తన పనుల్ని తాము చెయ్యలేని కారణంగా చచ్చుపడిపోతే (నిష్క్రియాపరత్వం అంటారు సంస్కృతంలో) ఆ తీరుగా చచ్చుబడిపోవడం వల్ల ఈ లోకం నుండి పోతే అతడ్ని చచ్చు బడిపోయాడు కాబట్టి చచ్చిపోయారంటారు. ఇది ముక్తికి ఏ మాత్రమూ అవకాశమీయని మరణం.
2. చనిపోయాడు – ‘చని’ అనే మాటకి ‘వెళ్లిపోవడం కారణంగా’ అని అర్థం. శరీరాన్ని చైతన్యవంతంగా ఉండేలా చేయగల వాయువు పేరు ‘ప్రాణం’ దాన్నే ప్రాణవాయువని పిలుస్తాం. అలాంటి ప్రాణవాయువు’ చని – శరీరం నుండి వెళ్లిపోవడం కారణంగా పోవడం – ఈ వ్యక్తి చైతన్యం ఈ లోకం నుండి బయటికి పోవడమేదుందో’ అది చనిపోవడం అవుతుంది. కాబట్టి ఈ లోఅర్థం తెలిసిన పెద్దలు ‘చని పోయాడు’ అనే అనేవారు గాని ‘చనిపోయాడు’ అని ఒక్కమాటలో అంటూ ఉండేవారు కాదు. కాలక్రమంలో ఉచ్చారణ విధానం మారినా ఉచ్చరించవలసిన తీరు మాత్రం ‘చచ్చి పోయాడు’ ‘చని పోయాడు’ అనేదే. అయితే ఈ తీరు చావు కూడా ముక్తికి ఏ మాత్రపు అవకాశాన్నీ ఇవ్వనే ఇవ్వలేదు.
3. పంచత్వం పొందాడు – పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశమనే పేరిట పంచభూతాలున్నాయి బ్రహ్మాండంలో.. ఈ పిండాండం (శరీరం)లో కూడా మజ్జమాంసమనే పేరిట పృథ్విభూతం, జలశాతం పేరిట అప్ భూతం, ఎంత వేడి పదార్థాన్ని తిన్నా ఎంత చల్లటి పదార్థాన్ని గాని నీటిని గాని తాగినా అటూ ఇటూ పెరుగు తరుగులు లేకుండా ఒకే తీరుగా ఉండే తేజోభూతం, పంచప్రధాన వాయువులూ అలాగే పంచ అప్రధానవాయువులతో అంటే మొత్తం దశవిధ వాయువులతో ఉండే వాయుభూతం, కనిపించకుండా ఉంటూ అనుక్షణం తన ప్రకారమే నడిచేలా మనని చేస్తూ ఉండే మనసు అనే ఆకాశభూతం ఉన్నాయి. ఈ పిండాండంలోని పంచభూతాలు ఆ బ్రహ్మాండంలోని పంచభూతాల్లోనూ కలిసి పోవడమేదుందో దాన్ని పంచత్వం పొందడం’ అంటారు. ఇది ఒక విధంగా ఆరోగ్యవంతుని మరణంగా గుర్తింపబడుతుంది. అయితే ఈ తీరు మరణం కూడా ముక్తికి ఏ మాత్రపు అవకాశాన్ని ఇవ్వలేదు.
4. నిర్యాణం– నిర్+యానమ్ అని పదవిభాగం. నిర్గతం యానం యేన తత్ నిర్యాణమ్. ఈ ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం కోసం ప్రస్తుతప్రదేశాన్ని ఖాళీ చెయ్యడాన్ని నిర్+యానమ్ (వ్యాకరణసూత్రం ప్రకారం నిర్యాణమ్) అవుతుంది. భాగవతంలో ప్రారంభంలో ‘శ్రీకృష్ణ నిర్యాణఘట్టః’ అని కనిపిస్తుంది. అంటే ‘వైకుంఠానికి వెళ్లేందుకోసం ఈ భూలోకం నుండి బయలుదేరడం’ అని అర్థమన్నమాట. ఈ పదాన్ని భగవంతుని స్థాయి వారికి మాత్రమే వాడాలి. భగవంతునికి ముక్తిని గురించి చెప్పే పదాల్లో చాలా బరువు అర్థం కలదన్నమాట. దీన్ని సాయికి వాడటం దోషం కాబోదు.
5. కీర్తిశేషుడు– సాధారణంగా ఏ వ్యక్తి అయినా మరణించాక అతని గురించిన మాటలు కొంతకాలం అయ్యేసరికి కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కాక ఆయనని గురించి నిరంతరం చెప్పుకునే రీతిలో ఎవరైనా తమ జీవితాన్ని గడిపి, ఈ లోకం నుండి వెళ్లిపోయినట్లయితే అలాంటి వారిని కీర్తి– తమ కీర్తినీ ప్రతిష్ఠనీ, శేషులు– ఈ లోకంలో మనందరికీ మార్గదర్శకత్వం కోసం మిగిల్చి వెళ్లినవారు’ అని అనాలన్నారు. సాయి స్థాయి ఇలాంటిది కాదు. ఎంతెంతో ఉన్నతమైనది. ఇక కీర్తిశేషులయిన వారు తమదైన పాండిత్య–సంగీత– నృత్య–అభినయ.. ఇలా అభికళల్లో దేనిలోనైనా విశేషకీర్తిని సంపాదించి దాన్ని లోకానికి విడిచి వెళ్లినవారు అవుతారు కాబట్టి ఈ అనుకున్న కళల ద్వారా వారికి ముక్తి లభించితీరాలనే నియమమేమీ లేదు. కాబట్టి ఈ కీర్తి శేష విధానానికీ ముక్తిని పొందడానికీ సంబంధం లేదు.
6. పరమపద ప్రాప్తి– ఈ లోకంలో ఓ స్థానాన్ని సంపాదించడమనేది ‘భూపదప్రాప్తి’ కిందికొస్తుంది. ఈ స్థానం కంటే గొప్పదనే అర్థంలో ఆ లోకాన్ని ‘పరమ–పదం’ అన్నారు. అలాంటి పరమపదాన్ని – ‘ప్రాప్తి–పొందడం’ అనేది ఏదుందో దాన్ని పరమపదప్రాప్తి అన్నారు. ఓ త్యాగరాజు ఓ అన్నమయ్య.. ఇలాంటి వారంతా మరో ధ్యాస ధ్యానం లేకుండా ఈ లోకానికి వచ్చికూడా ఆ లోకం గూర్చిన ధ్యాసతోనే ఉంటూ ఆ పరమపదాన్నే పొందాలనే ధ్యేయంతో జీవితాన్ని గడిపారు కాబట్టి ‘పరమపద ప్రాప్తి’ అనే పదం వారికి చెందినది తప్పక అవుతుంది. అంతటి పరమపదాన్ని పొందడమనేది ముక్తికి సాక్ష్యం కాబట్టి ఆ స్థాయి మహానుభావులకి వాడాల్సిన పదం ‘పరమపదప్రాప్తి’ అని.
7, శరీరత్యాగం – ఈ వివరణల క్రమంలో వచ్చే పదమే ‘శరీరత్యాగ’మనేది. ఈ శరీరాన్ని ఓ బరువైన పదార్థంగానూ, ముక్తిని పొందడానికి అభ్యంతరాన్ని కలిగించే పదార్థంగానూ (నిరంతరం కష్టాలనీ సుఖాలనీ కామ క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనీ కలిగిస్తూ దృష్టిని భగవంతుని మీద కేంద్రీకరించకుండా ఉండేలా చేస్తూ మధ్యమధ్యలో అనారోగ్యం మొదలైన వాటితో) మనసుని బాధపెడుతూ ఉండే ఓ వస్తువుగానూ భావించే లక్షణమున్నవాళ్లు యోగులు. వాళ్లు ఈ శరీరాన్ని ఎప్పుడు త్యజించి (విడిచేసి) ఎప్పుడెప్పుడు ఆ పైలోకానికి వెళ్లిపోదామా అనే ఒకే ఒక్క ఆలోచనతో కనిపించేవాళ్లు చేయగలిగిన పని ‘శరీరత్యాగం’ శరీరాన్ని త్యజించడమే కదా: అనే దృష్టితో ఆత్మహత్యని చేసుకోవడం, శరీరాన్ని దాడికి గురి చేసుకోవడం.. వంటివన్నీ ‘శరీరత్యాగం’ కిందికి రావు. ఈ శరీరమే, తనని ధరించిన వ్యక్తి తనకి చేస్తున్న తక్కువదనానికీ, అవమానాలకీ తట్టుకోలేక, ఎప్పుడెప్పుడు విడిచేద్దామా? అనుకుంటూ ఈ శరీరం వెళ్లిపోడానికి సిద్ధమై కనిస్తూ ఉంటుందో, అలా వ్యక్తిని విడిచేసి వెళ్లిపోతుందో దాన్ని ‘శరీరత్యాగం’ అంటారు.
ఎవరైనా ఒక వ్యక్తికి సహాయకునిగా మరో వ్యక్తి అనుసరిస్తూ వెళ్తూ ఉంటే ప్రతిక్షణ మూ ఆ వ్యక్తి ఈ సహాయకుడ్ని నిందిస్తూ చీత్కారం చేస్తూ అవమానిస్తూ ఉంటే ఎలా ఆ సహాయకుడు ఈ శరీరాన్ని ధరించిన వ్యక్తి నిరంతరం ఆ శరీరపు పాలననీ, పోషణనీ చూడకుండా ఉంటే ఆ శరీరం ఎలా ఈ వ్యక్తిని త్యజిస్తుందో, అప్పుడే శరీరధారి ఎలా ఆనందపడతాడో దాన్ని ‘శరీరత్యాగం’ అని పిలుస్తారు.భాగవతంలో ‘రంతిదేవుడు’ ఇలా చేశాడు. 48 రోజుల నిరాహార దీక్షతో భగవద్ధ్యానాన్నే చేస్తూ గడుపుతూ చివరి రోజున ఆహారాన్ని తీసుకోబోతుంటే.. యాచకుడు కావాలనికోరితే, సగం అన్నాన్ని ఇచ్చి మళ్లీ తినబోతూ ఉంటే, మళ్లీ ఇంద్రుడే మారు రూపంలో యాచనకి రాగా ఆ మిగిలింది కూడా ఇచ్చేస్తే, ఆ మిగిలిన మంచి నీటినే తాగబోతూ ఉంటే మళ్లీ ఒకరొచ్చి అడగ్గానే నేను స్వీకరించబోయే పదార్థం మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందన్నప్పుడు ఈ శరీరమెందుకు? అంటూ శరీరత్యాగాన్ని చేసి ముక్తిని పొంది ముక్తుడయ్యాడు.అలాగే శ్రీమద్రామాయణంలో శరభంగుడనే మహర్షి కూడా రామదర్శనం కోసమే శరీరాన్ని నిలిపి ఉంచుకుని రాముడ్ని దర్శించి తానప్పటివరకూ చేసిన తపశ్శక్తిని స్వయంగా రామునికి ధారపోసి ఆయన సమక్షంలోనే శరీరత్యాగాన్ని చేసి ముక్తుడయ్యాడు.సాయిని గూర్చిన కథ అని ప్రారంభించి ఎటెటో వెళ్లిపోతున్నామనుకోకూడదు. సాయి సమక్షంలో ముక్తులైన ఆ మహనీయులు కూడా ఇలా శరీరత్యాగాన్ని చేసిన స్థాయి కలవాళ్లే అని తెలుసుకోవడం కోసం నిరూపించడం కోసం ఇంతా చెప్పాల్సి వచ్చింది. సరే! ఇంతకీ అలా ముక్తులైన ఇద్దర్ని గురించి తెలుసుకుందాం!
బాలారామ్ (మాన్‌కర్)
భార్య పోయిన బాలారామ్(మాన్‌కర్) సాయికి పరోక్షంగా భక్తునిగా ఉండేవాడు. ఎలాగైనా షిర్డీలోనే సాయి సన్నిధిలో ఉంటూ శరీరత్యాగాన్ని చేయాలనే గట్టి పట్టుదలతో సాయి దర్శనానికి వెళ్లాడు. సాయి బాలారామ్‌ని బాగా పరిశీలించి 12 రూపాయలనిస్తూ – ఇక్కడ ఉండద్దు. ‘మచ్ఛింద్రగడ్’ అనే ప్రదేశానికి పోయి రోజూ మూడు మార్లు ధ్యానాన్ని చేసుకో! ఫో!’ అన్నాడు. బాలారాంకి అక్కడికి వెళ్లడమనేది సుతరామూ ఇష్టం లేకున్నా ఆ గురువాక్యాన్ని ధిక్కరించడం ఇష్టంలేకా, తను షిర్డీలోనే సాయి సన్నిధిలోనే శరీరాన్ని విడవాలి ఉన్నప్పుడు విరోధించడం సరికాదనీ ‘మచ్ఛింద్రగఢ్’కి వెళ్లాడు అక్కడి విశాలప్రకృతీ పరిశుభ్రమైన నీరూ గాలీ.. అంతా భౌతికంగా నచ్చింది బాలారాంకి. దాంతో కావాలసినంత సేపు ధ్యానాన్ని చేసుకోగలుగుతూ పరమానందపడసాగాడు. ఓ రోజు ధ్యానంలో సాయి స్వయంగా దర్శనమిచ్చి ‘బాలారామ్! నిన్నెందుకు ఇక్కడికి పంపానో తెలిసిందా? ధ్యానమనే మొదటి మెట్టుని ఎక్కలేనిదే నీ శరీరత్యాగమనే స్థితికి ఎగబాకలేవు. షిర్డీలో నన్ను నువ్వు చూసిన దృష్టికీ, నేడు నీలో కనిపిస్తున్న అంతర్ దృష్టికీ చక్కని భేదం ఉంది. ఆ భేదం కూడా పరిణత స్థితిలో ఉంది. దైవం సర్వత్రా ఉంటాడనే స్థిరనిశ్చయం నీకు ఒకప్పుడు లేదు కాబట్టే అయిష్టంగా మచ్ఛింద్రగఢ్‌కి వెళ్లావు. ఇప్పుడు నీకు అర్థమవుతోంది. ‘దైవం సర్వత్ర అన్నింటా అన్ని కాలాల్లో ఉంటాడు– ఉన్నాడు’ అని. సాయి చెప్పి అంతర్ధానమయినట్లు అనిపించింది. ఇది పరోక్షానుభవం.
కొంతకాలానికి బాలారాం తన ప్రదేశానికంటూ బయల్దేరగానే ఎవరో ఒక పల్లెటూరి వ్యక్తి లంగోటీతోనూ కంబళి కప్పుకునీ ఇతని వద్దకొచ్చి – ఇదిగో నీ ఊరికి టికెట్టు. నేను ప్రయాణం విరమించుకున్నాను. నువ్వు టికెట్టుని ఈ జన సమ్మర్దంలో తీసుకోలేకపోతున్నావుగా! అంటూ గబగబా దాన్ని అందిచ్చి వెళ్లిపోయాడు. ఎంతవెతికినా అతను కనిపించలేదు. ఇది అపరోక్షానుభవం.దాంతో షిర్డీకి పోయి తీరాలనే బలమైన ఆశ కలిగిన బాలారాం షిర్డీలోనే ఉంటూ సాయికి సేవ చేస్తూ... ఆయన మాటలని తు.చ. తప్పకుండా చేశాడు. సాయి అతని నిర్వా్యజసేవని మెచ్చుకునేవాడు.అపరిమిత భక్తికి ఆనందపడుతూ ఉండేవాడు. అనన్యభక్తి (సాయి తప్ప మరో లోకం దైవం లేదు)తో సేవ చేస్తూ ముక్తిని పొందిన భక్తునిగా లెక్కింపబడ్డాడు.
తాత్యా సాహెబ్ నూల్కర్
ఏ మాత్రమూ యోగులూ, ధ్యానపరులూ, సన్యాసులూ, ఫకీరులూ... అంటే విశ్వాసం లేని తాత్యా సాహెబ్ నూల్కర్ అనే న్యాయాధిపతి పండరిపురంలో ఉద్యోగరీత్యా ఉంటూ ఉండేవాడు. అక్కడే కింద ఉద్యోగిగా పని చేసే నానా(సాహెబ్) ఈయనకి సాయిలీలలని నిరంతరం చెప్తూ షిర్డీకి వెళ్లాలనే సంకల్పం కలిగేలా చేసాడు తాత్యాకి. ఇంకా పట్టుదల పోని తాత్యా – షిర్డీలో తనకొక బ్రాహ్మణ వంటవాడు కావాలనీ, నాగపూరు కమలా ఫలాలు సాయికి బహూకరించదలిచిన కారణంగా అవి కూడా దొరికితేనే షిర్డీ వస్తానన్నాడు.ఆశ్చర్యం! వంటవాడూ నూరు కమలా ఫలాలు రెండ్రోజుల్లోనే దొరికాయి. వెంటనే షిర్డీకి వెళ్లి సాయిని దర్శించబోతే.. సాయి తాత్యాని చూస్తూనే కోపాన్ని ప్రదర్శించాడు న్యాయాధిపతి అని తెలిసినా కూడా. తాత్యా మాత్రం ఏ మాత్రమూ తొందరపడకుండా ప్రతినిత్యమూ దర్శానానికే వెళ్తూ క్రమక్రమంగా సాయిపట్ల చెప్పలేని భక్తి కలవాడయిపోయాడు. ఎందరో భక్తులు వచ్చి వెళ్తున్నా అయస్కాంతాన్ని గట్టిగా పట్టుకుని విడదీయరాని విధంగా అతుక్కుపోయిన భక్తితో తాత్యా నిరంతరం సాయి సేవలోనే ఉండిపోసాగాడు.యోగులూ, ఫకీరులూ.. ఇలా ఎవరినీ నమ్మని తాత్యా అలా సాయి సేవలోనే జీవితం మొత్తాన్ని గడుపుతూ తనదైన ఉద్యోగస్థలాన్ని గానీ పవిత్ర పండరీపుర క్షేత్రాన్ని గానీ దర్శించకుండా ఆ ఆలోచన కూడా లేకుండా సాయి సన్నిధిలోనే శరీరత్యాగం చేసి ముక్తుడయ్యాడు. సాయి తాత్యా శవాన్ని చూస్తూ భోరున ఏడుస్తూ... ‘తాత్యా! నా కంటే ముందే వెళ్లిపోయావా?’ అని అందరితోనూ చెప్పుకుని విలపించాడు. వీళ్లు శరీరత్యాగం చేసి ముక్తులైనవాళ్లు అంటే. పైవారం – బాబాకి నిస్వార్థ సేవ చేసి ఆ ధాన్యంతో తరించిన భక్తులు.
– సశేషం
సాయి సన్నిధిలో శరీరత్యాగం చేసిన ముభక్తులు
Published Sun, Apr 14 2019 4:16 AM | Last Updated on Sun, Apr 14 2019 4:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment