ఎందరికో ఓ పెద్ద ధర్మసందేహం.. సాయి ఓ మహమ్మదీయుడు కదా! ఆయన నిత్యం జపించే మంత్రం ‘అల్లాహ్ హో మాలిక్!’ అనేదే కదా! అని. అలాగే హిందూ ధర్మంలో ఉండే ఆచారవ్యవహారాలని వేటినీ పాటించే లక్షణం లేనివాడు కదా! పైగా హిందూ ధర్మంలో ఏ పూజాపురస్కారాలూ ముఖ్యమైన పర్వదినాలూ వస్తే ఏ ఉపవాసపద్ధతిని అవశ్యం పాటిస్తారో, ఆ ఉపవాసవిధికి ఆయన పూర్తి వ్యతిరేకి కావడమే కాకుండా, ఇతరుల్ని కూడా ఉపవాసవిధానం సరికాదని బోధించే వ్యక్తి కూడా కదా! హైందవవిధానంలో స్త్రీలు అశుచి(నెలసరి) గా ఉండే మూడురాత్రుల పాటూ ఇంట్లో ఉన్న దైవమందిరం వైపు కూడా కనీసం చూడనే చూడకుండా దైవానికి అడ్డుగా అంటే మనకి ఆయన కనబడకుండా ఓ పరదాని వేసేస్తారు కదా! అలాంటిది ఆయన సంప్రదాయాన్ని కాదంటూ స్త్రీలు నెలకి నెలరోజులూ దర్శనానికి రావచ్చునంటారెందుకని? అలాగే ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తితో మనకుండే బాంధవ్యపు దగ్గర – దూరపు తనాలని బట్టి – ఇన్ని రోజుల పాటు ఆశౌచాన్ని(మైల) పాటించాలనే నియమముంటే దాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడైనా సరే దర్శనానికి దోషం లేనే లేదంటూ ఎలా చెప్తారు? అని ఈ తీరుగా అనేక సందేహాలు వెలిబుచ్చుతుంటారు ఎందరో.
సాయి తన భక్తులందరూ ప్రశాంతంగా కూర్చున్న వేళ సాయికి సమయం ఉందని అనిపించిన వేళ ‘సాయినాథా! ఏదైనా చెప్పవూ?’ అని అడిగితే కొద్దిగా అర్థం చేసుకుందామనే దృష్టితో ఉన్న 15 సంవత్సరాల పిల్లవాని నుండి ఎంతటి వయసు వారికైనా బాగా అర్థమయ్యేలా వేదాంతాన్ని తన ఆత్మసంతృప్తికి మాత్రమే చెప్పుకుంటూ ఉండేవారు. ఏనాడూ ఏ భక్తుడినీ, భక్తురాలినీ విని తీరవలసిందే! అని నిర్బంధిస్తూ ఉండేవారు కానే కాదు. ఇంతకీ ఆయన చేసిన వేదాంతబోధని(మరాఠీ భాషలో ఉన్న ఓవీలనే పేరున్న ఛందోబద్ధగేయాల్లో ఎలా ఉందో) గమనిద్దాం! సాయి చెప్పడం ప్రారంభించాడు ఇలా.
మనిషి – మరణం
భక్తులారా! ప్రతిరోజూ ఉదయం అలా చూస్తూ ఉండగానే సాయంత్రం కొద్దిసేపటికి రాత్రీ అయిపోయి ఒకరోజు గడిచిపోతూ ఉంటుంది. కొన్నాళ్లయ్యాక అప్పుడే సంవత్సరం అయిపోయిందా? చిత్రంగా ఉందే! అనిపిస్తుంది కదా! అలాగే మనిషి జీవితం కూడా సగం నిద్రలో పోతుంది. 12 ఏండ్లు బాల్యంలో గడిచిపోతుంది. వృద్ధాప్యం (+65 ఏళ్లు) సంసారపు ఎత్తుపల్లాల ఆలోచనలతో ముసలితనం రోగాలూ రొప్పులతో వెళ్లిపోతుంది. ఈ మధ్యలో ఉండే కాలంలో యవ్వనమంతా భార్యపట్ల ఆసక్తి వినోదం, విహారం, విలాసం..తో గడిచిపోతుంది. ఇదే విధంగా కుక్కలు, పందులు, పశు పక్ష్యాదులూ కూడా జీవనాన్ని గడిపేస్తున్నాయి కదా! అయితే బతికే కాలంలో హెచ్చుతగ్గులుండచ్చు గాని జీవనవ్యవస్థ ఇదే కదా! మరి నరజన్మకున్న గొప్పదనమేమిటి?\కొలిమిలో మంటని మండించడానికున్న తిత్తులు కూడా గాలిని పీల్చి విడుస్తాయి. వాటిలాగే మనం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తూ ఉంటే మనకీ వాటికీ తేడా ఏముంది? ఏముంటుంది? ప్రతి వ్యక్తీ మరణ భయంతోనే జీవిస్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులు పోయిన సందర్భంలో తానే చితికి నిప్పంటించి ఉండి కూడా తనకి మరణమే లేదన్నట్లుగా ధైర్యంగా ఉంటాడు. అదే నిజమైన మాయ అనే తెర. ఒక్క మాటలో చెప్పాలంటే మరణం లేకుండా ఉండేవరాన్ని కోరి, దైవం ద్వారా ఆ వరాన్ని పొంది కూడా మరణించారుగా కొందరు. (హిరణ్యకశిపుడు రావణుడు..) అంతదాకా ఎందుకు? మార్కండేయుడ్ని చిరంజీవి అంటారు. శివుని కారణంగా మరణాన్ని జయించి చిరంజీవి అయ్యాడు. ఆయన కూడా 14 కల్పాలు దాటాక మరణిస్తున్నాడా లేదా? ఇదంతా ఎందుకు ఈ ఫకీరు చెప్తున్నట్లు? అనుకోవచ్చు మీరు. మరి ఇంత అశాశ్వతం అనిత్యం పైగా మరణధర్మం కలిగిన ఈ శరీరాన్ని ఏ పశువులానో, పక్షిలానో, మృగంలానో విడిచేస్తే నరజన్మ గొప్పదనమేముంది? గమనించండి. అందుకే మహాత్ముల పుణ్యకథలని వింటూ వాళ్లని స్మరిస్తూ – ఏ పుణ్యాత్ముడివల్లనో ఉపదేశించబడిన మంత్రాన్ని మననం చేసుకుంటూ సాధన మార్గంలోనికి వెళ్తే అలా గడిపిన కాలం మాత్రమే సార్థకమవుతుంది. ఇలాంటి భావం ఎవరికైతే కలుగుతుందో అతని జన్మ సఫలమైనట్లే.
మనిషి –తానూ తన కుటుంబం సంతానం అభివృద్ధి ఐశ్వర్యం సంపాదన... ఇదే ధోరణిలో వెళ్తూ తన ఆయుష్యాన్ని వ్యయం చేసేసుకుంటున్నాడు. చేపలు పట్టేవాడు వలని వేసి బలంగా లాగినట్టు కాలమనేది మనిషి ప్రాణాలని లాగేస్తుంది. ఆ మరణసమయంలో మనిషి వలలో పడ్డ చేపకి తనకి గాలి ఆడక ఎగిరెగిరి పడేటట్టు విలవిలా తన్నుకుంటూ మరణిస్తాడు. ఆ సమయంలో ఈ పొలాలు, భూములు, ఇళ్లు, వ్యాపారాలు.. ఏవీ గుర్తుకురావు. చచ్చిపోయాక సాధన చేయడం అసాధ్యం కదా! కాబట్టి బతికుండగానే మంత్రాన్ని మననం చేస్తూ ఆ సాధన క్రమంలో నడిచే ప్రయత్నాన్ని చేయండి. ‘ఈ జన్మకేదో ఇలా అయిపోయాను గానీ, పై జన్మలో పుట్టుకనుండీ సాధన మార్గంలోనే జీవించదలిచాను’ అనుకోవడం వట్టి మూర్ఖత్వం. ఎందుకంటే రాబోయే జన్మలో – నువ్వు నరజన్మ ఎత్తడం కష్టమట. దాన్లో కూడా పురుషునిగా పుట్టడం మరింత దుర్లభమట. (తనతో పాటు భార్యాపుత్రుల్ని పోషించే సమర్థత కలిగి ఉండటం) ఆ పురుషజన్మలో కూడా విప్రునిగా (బ్రాహ్మణునిగా) జన్మనెత్తడం ఇంకా అనూహ్యమైన విషయమట. (పుట్టుకతో అందరూ శూద్రులేనట. ఉపనయన సంస్కారం కారణంగా ద్విజుడు అవుతాడట. ఆ సంస్కారం ఏ వేదవిద్యని అభ్యసించే అర్హతని పొందడానికో అలాంటి వేదవిద్యని పొందడం చేత విప్రుడు అవుతాడట. జన్మనాజాయతే శూద్రః – సంస్కారా ద్ప్విజ ఉచ్యతే– విద్యయా యాతి విప్రత్వమ్) అలాంటి విప్రజన్మలో అతనికే గాని వైదుష్యం (ఇతరుల సందేహాలని ప్రమాణబద్ధంగా తీర్చగలిగిన పాండిత్యశక్తి) ఉంటే ఇక అతని జన్మధన్యమట’ అని. (జంతూనాం నరజన్మ దుర్లఛ–మతః పుంస్త్వం– తతో విప్రతా–తస్మా ద్వైదికమార్గధర్మపరతా– విద్వత్వమస్మాత్పరమ్– అనేది ప్రమాణశ్లోకం).ఎవరు నేను? ఎలా వచ్చాను? దేనికొచ్చాను? ఏమిటి నా లక్ష్యం? ఏం సాధించాలి? అని ఇలా ఆలోచించగల శక్తి, బుద్ధి, పశువులకి, పక్షులకి, మృగాలకి క్రిమి కీటకాలకీ ఉందా? లేదుగదా! అందుకే నరజన్మ నెత్తినవాడే ఆలోచించాలి. గారడీవాడు తాను చేయబోయే ఇంద్రజాలవిద్యలోని ఆనందాన్ని గ్రహించి సంతోషించగలవాళ్ల ముందే ఆ విద్యని ప్రదర్శిస్తాడు తప్ప, దాన్ని ఆనందించలేని వాళ్ల ముందు – కనీసం తాను ఇంద్రజాలికుడ్ని అనే విషయాన్ని కూడా చెప్పడు. అవునా? కాదా? అలాగే భగవంతుడు కూడా ప్రాణులనెన్నిటినో ఎన్ని జాతుల వాటినో సృష్టించి ఆశ్చర్యపడి దిగులు చెంది– తాను సృష్టించిన సూర్య చంద్ర నక్షత్ర గ్రహ విశ్వ అంతరాళ విశేషాలని గ్రహించగలిగిన మానవజాతిని సృష్టించాలనే తపనతో ఈ నరజాతిని సృష్టించాడు. ఇంటిలో తండ్రి తన పిల్లలు దేన్ని తింటే పుష్టిగా పెరుగుతారో గమనించి ఆ తినే పదార్థాలని తెచ్చినట్టుగా భగవంతుడు కూడా నరజాతిని అంత ఇష్టంతో సృష్టించాడు. సృష్టించడమే కాదు. అంత ఇష్టమైన ఈ జాతిలో తానూ ఒకడుగా పుట్టాలని నిర్ణయించుకుని మన మధ్యే తిరుగుతూ – ఆయన్ని గుర్తించగలిగిన వారికి దైవంగా కనిపిస్తున్నాడు.
కొద్ది పెద్ద భాషలో చెప్తాను. కాలిలో ముల్లు గనుక గుచ్చుకుంటే ఏం చేస్తున్నాం? మరో బలమైన ముల్లును తెచ్చి ఈ లోతుగా గుచ్చుకున్న ముల్లుని తీసి, ఈ ముల్లునీ ఆ ముల్లునీ కూడా మరెవరికీ గుచ్చుకోకుండా ఉండేలా దూరంగా పడేస్తున్నాం కదా! జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించాలి. ఆ మీదట ఈ జ్ఞానాలకీ, అజ్ఞానానికీ కూడా అతీతుడైన స్థితికి వెళ్లిపోగలిగాలి. ఇదే ఈ జన్మకి సార్థకత.దీపాన్ని వెలిగిస్తాం. ప్రమిదని తెచ్చి దానిలో నూనెని పోసి వత్తిని వేసి ఆ వత్తి నూనెతో తడిపాక వత్తికి నిప్పుని అంటించి దీపంగా చేసి ఆ ప్రకాశంలో అన్నింటినీ చూడగలుగుతున్నాం. రాగం(బంధువులు మిత్రులు ఆప్తులు శ్రేయోభిలాషులు... అనే ఈ తీరు అనురాగాలు..) అనే నూనె మొత్తం అయిపోవాలి జీవితమనే ప్రమిదలో. ఈ జ్ఞానదీపం వెలుగుతూ ఉంటే అజ్ఞానమనే చీకటి పూర్తిగా తొలగిపోవాలి. నేనూ నాదీ అనే ఆ తీరు అహంకార మమకారాలుగా కనిపించే వత్తి కాలిపోయి బూడిదగా మారిపోవాలి. అప్పుడు నిజమైన జ్ఞానం వ్యక్తికి కలుగుతుంది.సముద్రంలో ఉన్న నీరంతా ఉప్పదనంతో నిండిందే. అది సూర్యకిరణాల ద్వారా పీల్చుకోబడుతూ మేఘంగా రూపు దిద్దుకుంటుంది. ఎంత నీరు పీల్చబడిందో అంత మాత్రమే వర్షించడం లేదు. పైగా ఏ ఉప్పునీటిని పీల్చిందో అలాంటి ఉప్పు నీటినే విడవడం లేదు.
అలాగే మనం గాని సరైన గురువుని ఆశ్రయిస్తే ఆయన మనకి జ్ఞానబోధని చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి – మనం ఊహించలేనంత విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి జ్ఞానాన్ని బోధించే మహానుభావులకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సరైన కాలాల్లో చక్కటి భోజనాల మీద దృష్టీ.. సరైన సౌకర్యాలున్న చోట పడకా–మంచి వస్త్రాలతో తిరగాలనే బుద్ధీ. కీర్తి ప్రతిష్టలని ఎలా పొందాలి? అనే తపనా ఉండనే ఉండవు. తపస్సు చేసుకుంటూ ఉండే వ్యక్తి ఎంత ఆడంబరంగా అట్టహాసంగా మనకి కనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి అంత స్థాయిలో అధముడని లెక్కించి తీరాల్సిందే.
ఎక్కడెక్కడికో వెళ్లి ఆ మహానుభావులిచ్చే ప్రవచనాలూ పురాణకథలూ ద్వారా తెలుసుకోలేని ఎన్నెన్నో విశేషాలని మనం మహాత్ములని సేవిస్తూ వారివారి ఆచరణలని గమనిస్తూ తెలుసుకోగలం. జ్ఞానమనేది నిజానికి నిశ్శబ్దం ఉపదేశమే. వేలకొలదీ ఉన్న నక్షత్రాలు ఇయ్యలేని కాంతిని ఒక్క చంద్రుడూ, అతనికి మించిన కాంతిని సూర్యుడూ ఇయ్యగలుగుతున్నారు. అలాగే పురాణపఠనం ద్వారా పొందలేని అమోఘజ్ఞానాన్ని గురుసేవ ద్వారా పొందవీలుంది.
ఎందరు అమ్మలో!
ఈ ప్రపంచంలో కనిపించే దైవాన్ని ‘తల్లి’ అంది ధర్మగ్రంథం మీ అందరికీ ఒక్కొక్క తల్లి ఉంది. ఆమె మాత్రమే మీ పోషణని గమనిస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆ తల్లి గతించిన వారుంటే అలాంటి వారికి ఆమె కూడా లేనట్లే కదా! అయితే నా అదృష్టం ఎంతదో తెలుసా? ఏ మాత్రపు అభిమానమూ సిగ్గూ లేకుండా భుజానికి ఓ జోలె చేతిలో ఓ డబ్బా పట్టుకుని ‘అమ్మా!’ భాకరీ ఒకటి పెట్టమ్మా! అని ప్రతి ఇంటి ముందూ నిలబడి అడుగుతూ ఎందరు అమ్మల్నో కలిగినవాడ్ని. అమ్మ ఎప్పుడూ తన సంతానం ఆకలి గురించే భయపడుతూ ఉంటుంది కదా! అందుకే ఆ ఇంటి ముందు నా పిలుపు వినబడగానే ఈ ఇంటి ఇల్లాలు పళ్లెంతో భిక్ష తెచ్చి నాకియ్యడానికి సిద్ధంగా ఉంటుంది. ఉంటోంది. ఇన్నాళ్ల పాటు భిక్షాటనకి వెళుతున్నా ఏ అమ్మ కూడా ‘చెయ్యి ఖాళీ లేదు – పైకెళ్లు’ అననే లేదంటే నన్ను సృష్టించిన ‘అల్లాహ్’ కి నేనెంత రుణపడి ఉన్నాను? ఎన్ని కృతజ్ఞతలని సమర్పించవలసి ఉన్నాను. నువ్వు ఫకీరువి కదా! నీ ఒక్కడి వ్యవహారం నువ్వు చూసుకో! ఇన్ని ఇళ్లకెందుకొస్తావని గాని, పైగా ఒక్కో రోజున గరిష్టంగా 12 మార్లు భిక్షాటన కెందుకొస్తావని గాని ఏ తల్లీ అడగలేదు. పిల్లవాడు ఎన్ని మార్లు ‘తిండి’ అని అడిగితే అన్ని మార్లు విసుక్కోకుండా వాడి కడుపు చూస్తూ పెట్టేది తల్లే కదా! అలాంటి తల్లుల్నిచ్చిన ఆ భగవంతుడు నా పట్ల ఎంత దయ చూపుతున్నాడో కదా!
యజ్ఞాలు 5
శాస్త్రం తెలిసిన పెద్దలూ, పండితులూ అయితే వీటిని పంచమహాయజ్ఞాలంటారు. మొదటిది బ్రహ్మయజ్ఞం. మన ప్రాచీనులు మనకి అందించిన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇంకా ఎన్నో ధార్మికగ్రంథాలున్నాయే వాటిని కేవలం పారాయణ చేస్తే చాలు బ్రహ్మయజ్ఞాన్ని చేసినట్లే. గీత అనే గ్రంథం ఉపనిషత్తులు సారాంశం (ఉపనిషత్సు.. అని ఉంటుంది భగవద్గీత ప్రతి అధ్యాయం చివరా) కాబట్టి కనీసం రోజుకొక్క శ్లోకాన్ని చదివినా చాలుగా బ్రహ్మయజ్ఞాన్ని ముగించగలుగుతారుగా! అందుకే నేను శ్యామాకి గీతనీ విష్ణుసహస్రనామాన్నీ ఇచ్చి చదువుతూ ఉండమన్నాను. రోజూ మసీదులో ఎవరో ఒకరు గీత, భాగవతం, ఉపనిషత్తులు.. ఇలా చదువుతూనే ఉంటారు. ఏ భాషవాళ్లు ఆ భాషలో చదవడం తప్పు కాదు. చదవబడేది అదే కాదా? అనేదే ముఖ్యం.ఇక రెండవది దేవ యజ్ఞం. హోమాన్ని చేస్తూ ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చినందుకు ఆనందంతో దేవతలకి ఆహుతులని సమర్పించడం దేవయజ్ఞం. ధునిలో కనిపించేది అదే కదా! ఇక మూడవది పితృయజ్ఞం. బాలా కాకా కడూన, వజేయాంచ్యా కడూద, సాహెబ్ జోగ్ భా ఊ సాహెబ్ దీక్షిత్, బాలా సాహెబ్ భాటే.. ఇలా ఎందరో పితరులకి ఈ యజ్ఞాన్ని చేస్తూనే వస్తున్నారు కదా! హైందవధర్మం ప్రకారం నువ్వులూ నీళ్లతో తర్పణాలని ఇస్తూ వస్తున్నారు కదా అది కూడా మసీదులో! అందుక్కాదూ ఈ మసీదుకి వస్తే చింతలన్నీ తొలగిపోతూ ఉంటాయి!
నాల్గవది భూతయజ్ఞం. ‘భూ’ అంటే జీవించి ఉన్నదని అర్థం. అంటే ప్రాణంతో ఉన్నదని భావం. వచ్చిన భిక్షాన్నాన్ని కుక్కలు, పందులు, ఎలుకలు.. ఎన్ని తినడం లేదు? భిక్షాపాత్రపైన మూతని కూడా ఉంచేది ఇందుక్కాదూ? మన ఇంట్లో మన ఒకళ్లం తినేసి ప్రపంచంలోని అందరి కడుపు నిండిపోయిందనుకోవడం సిగ్గుచేటైన విషయం కాదూ! ఒకప్పటి రోజుల్లో ప్రతి గృహస్థు కూడా తాను తినబోయే ముందు కాకికి ఓ అన్నం ముద్దని వీధి గోడ మీద పెట్టి ఆ మీదటే తింటూ ఉండేవాడు. ఇలాంటి సంప్రదాయాలని బతకనియ్యాలి. ఇదే శాస్త్ర పరిభాషలోనైతే భూతయజ్ఞమవుతుంది.ఐదవది మనుష్యయజ్ఞం. కేవలం తానూ తన కుటుంబం మాత్రమే భోజనాన్ని ఆరగించడం కాకుండా తోటి మనుషులకి అన్నం విషయంలో తిండి దొరక్క ఆర్తితో ఉన్నవాళ్లకి భోజనాన్ని తమతో కలిపి తినేలా చేయడం దీని లక్ష్యం. సత్రాల్లో జరుగుతూ ఉండేది ఇదే. ఈ భోజనాన్ని పెట్టడమనేది నిస్సా్వర్థంగానే జరగాలి తప్ప ‘భోజనానికి ఇంత!’ అనే తీరుగా సొమ్ముని తీసుకుని పెట్టడం సరికాదు. ఒక చేలో ముప్ఫై నలభై పశువులు మేస్తూ ఉంటే.. ఓ చెట్టుకున్న పళ్లని ఓ కొన్ని చిలుకలు ముక్కులతో పొడుస్తూ తింటూ ఉంటేనూ, ఓ బియ్యపు రవ్వలోని చిన్న చిన్న అణువుల్ని చీమలు తినడానికి ప్రయత్నిస్తూ ఉంటేనూ ఆ దృశ్యం ఎంత హృదయరంజకంగా ఉంటుందో అలా మనం తినబోతూ పదిమందిని కలుపుకుని తింటున్నా ఆ దృశ్యం భగవంతుని కంటపడితే ఎంత ఆశీర్వచనం ఆయనది మనమీద ఉంటుందో ఊహించలేం!ఇలా ఐదు యజ్ఞాలనీ మనం సామూహికంగా నిర్వహించిన రోజున భగవంతుని కృప ఎల్లవేళలా మన మీద ఉంటుంది. అన్నింటినీ ఒక్కడే చేయాలని దీనర్థం కాదు. అందరం కలిసి చేయాలనేది దీని ఉద్దేశ్యం అంటూ ఆ రోజు బోధని ముగించాడు సాయి.పైవారం – సాయి మాటకి తిరుగులేదు! కారణం???
– సశేషం
సాయి బోధ సుధ
Published Sun, Apr 28 2019 12:37 AM | Last Updated on Sun, Apr 28 2019 12:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment