ఇదేమిటి? సాయినాథునికున్న పంచవాయువుల ఆధిపత్యాన్ని గురించి వివరించుకుంటూ అపానమనే వాయువు మీద ఆధిపత్యం వరకూ ఉదాహరణపూర్వకంగా తెలియజేసుకున్నాం. ఆ వెంటనే వచ్చేది వ్యానవాయువు కదా! మరి ఉదానవాయువు గురించి చెప్పుకోవడమేమిటి? అనిపిస్తుంది మనకి. నిజమే! వ్యానవాయువు (సర్వ శరీరగః) శరీరం నిండుగా ప్రవహిస్తూ ఎక్కడ ఏ వాయువు తనకుండాల్సిన పరిమాణం కంటే తక్కువగా ఉంటుందో అక్కడ ఆ లోటుని పూరించే వాయువు కాబట్టి దాని ప్రయాణదూరం పరిమాణం మరింత కాబట్టి దాన్ని చివర్లో వివరించుకోవడం కోసం ఈ ఉదానవాయువుని గురించి చెప్పుకుంటున్నామన్నమాట!
సాయి నాకు నచ్చడు!
ఉదానః కంఠదేశస్థం అని శాస్త్రం. కంఠంలో నిలిచి ఉంటూ నిరంతరం వ్యక్తి మాట్లాడదలిచిన ప్రతి అక్షరానికీ శక్తిని సమకూర్చేది ఉదానవాయువని అనుకున్నాం. అదుగో ఆ ఉదానవాయువుని అదుపు చేయగల శక్తి సాయినాథునికి స్పష్టంగా ఉంది కాబట్టే ఏది అంటే అది జరిగిపోవడం, ఏది వద్దంటే అది జరక్కపోవడం, వద్దని తాను చెప్పిన పనిని మొండిగా చేయదలిస్తే అది విఘ్నాలపాలై పూర్తికాకపోవడం... వంటివన్నీ జరిగాయంటే సాయినాథుని శక్తి ఉదానవాయువు మీద ఆధిపత్య యుక్తీ సామాన్యం కాదని అనుకోవలసిందేగా. ఉదాహరణలని చూద్దాం! ఎంతగా ప్రకాశాన్నిచ్చే దీపమైనప్పటికీ దాని కింద మాత్రం నీడ ఉండక తప్పదు. అలాగే సాయినాథుడు ఎందరికో ఎంతో గొప్పవాడూ దైవాంశసంభూతుడూ మళ్లీ మాట్లాడితే దైవసమానుడూ అయినప్పటికీ కొందరి దృష్టిలో మాత్రం మరో తీరుగానే అనిపించేవాడు.ఇలాంటి సందర్భాల్లో ఆయన గురించి మరోలా అనుకున్నా, ఎవరో అనుకున్నవి విన్నా కళ్లు పోతాయనుకుంటూ లెంపలు వేసుకుని మౌనంగా ఉండిపోకూడదు. ఏమనుకున్నారో తెలుసుకోవాలి. దానికి ప్రతిస్పందనగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే ఒక స్థిరత్వం ఒక విషయాన్ని గూర్చీ ఒక మహనీయుని గూర్చీ తెలిసి వస్తుంది.
షిర్డీకి సమీపంలోనే కొందరుండేవాళ్లు. వాళ్లందరూ ఒక వ్యక్తి చెప్పిన మాటలకే లోబడి ఉండేవాళ్లు. దానికి కారణం ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడనే వాళ్లకున్న ఒక విశ్వాసం మాత్రమే. ఓ రోజున ఈ అందరూ ఒకచోట కూర్చుని ఓ చోట చర్చ ప్రారంభించారు. ‘మేం నిర్గుణోపాసకులం. అంటే దైవానికి ఓ రూపం ఉంటుందని అసలు భావించని వాళ్లం. దైవం అంటే ఒక అతీతశక్తి మాత్రమే. అంతేకాదు. ఫలానివాడు దైవం అనుకుంటూ అతడ్ని పూజించేవాళ్లని కూడా మేం గౌరవించం. దానికి కారణం భగవంతుడే చెప్పుకున్నాడుగా.. తనకి తానుగా ‘రూపం లేనివాడిని’ అని. ఆయనంతట ఆయనే తనకి రూపం లేదని స్పష్టంగా చెప్పేస్తే ఏ రూపమూ లేని ఆయన్ని రూపం ఉన్నవాడుగా భావిస్తూ, ఆ రూపానికి ప్రతిబింబం ‘ఫలానివాడు’ అనుకుంటూ ఒకాయన్ని (సాయి) దైవంగా కొలవడమంటే ఎంత అవివేకం! అని ఒకడన్నాడు.షిర్డీ గురించి ఎందరో ఎన్నెన్నో కథలని చెప్పేస్తూ వింత వింత ఆనుభవాలని వివరిస్తూ సాయినాథుడ్ని గురించిన ప్రచారాన్ని విశేషంగా చేసేస్తున్నారు. నిజనిర్థారణ కోసం మేం సాయినాథుని వద్దకెళ్లగానే ఆయన భక్తుల్ని దక్షిణ అడుగుతూ కనిపించాడు ఓ మారు. వెంటనే వచ్చేసాం. సాధువూ, సన్యాసీ, సర్వసంగపరిత్యాగీ అయిన వ్యక్తికి మనమేదైనా ఇయ్యాలి తప్ప... ఆయనకాయనే అడగడమేమిటి? మేం ఇయ్యలేదు. సాధువై ధనాన్ని అడిగి తీసుకోవడం ఎంతహేయం? నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే అసలు సాధువనేవాడు– (యధేచ్ఛాలాభ సంతృష్టః) ఏం లభిస్తే దానితో సంతృప్తి చెందాల్సినవాడు కావాలి.ఏదీ దొరకనివాడు దైవం తనని ఆ రోజున ఏదీ తినద్దన్నాడనే సంపూర్ణ విశ్వాసంతో జీవించాలి గానీ, తానే దక్షిణనీయవలసిందనడం ఎంతహేయం? అని మరొకడన్నాడు.
అయినా ‘కామఠవిధానం’ అని లోకంలో ఒక మాట ఉంది. కమఠం అంటే తాబేలు. తాబేలు సముద్రపు ఒడ్డుకొచ్చి కెరటాల్లో కొట్టుకుపోడానికి వీల్లేని ప్రదేశంలోనూ, ఏ మాత్రమూ కూడా పక్షులకారణంగా ఏ ప్రమాదం జరిగే వీల్లేకుండానూ తన పిల్లల్ని అంటే గ్రుడ్లని ఒడ్డున ఇసుకని తవ్వి ఆ గోతిలో మెల్లగా మెల్లగా విడుస్తూ చిన్నపాటి దెబ్బకైనా పగిలిపోయే తీరుగా ఉన్న గుడ్లని ఒకటి పిమ్మట మరొకటి చొప్పున పైనుంచి జారవిడుస్తూ (కంటూ) మొత్తం అండాలని ఒకే గోతిలో పడేలా విడిచి మళ్లీ సముద్రంలోనికి వెళ్లిపోతుంది. అంత విశాలమైన సముద్రంలోకి వెళ్లిపోయిన కారణంగానూ పైగా ఈదుకుంటూ పోయే కారణంగానూ, సముద్రతరంగాలు తనని మరింత దూరంగానూ, ఎటువైపుకో తీసుకుపోయే కారణంగానూ, ఎక్కడ ఏ వైపున ఏ ఒడ్డున తన గుడ్లని ఇసుకతో కప్పెట్టేసిన కారణంగానూ గుడ్లని గుర్తించలేదు.అప్పుడది తన గుడ్లని ఒక్కసారిగా మనసులో తలుచుకుంటుంది. అంతే ఆ గుడ్లన్నీ కూడా పొదగబడినట్లుగా ఎప్పుడూ తన తల్లి తలుచుకుంటున్నప్పుడల్లా ఉంటే అప్పుడల్లా క్రమంగా ఎదుగుతూ ఒక్కసారిగా తమ పైనున్న ఇసుకని తొలిగించుకుంటూ పిల్లలుగా మారిపోయి అంతలోనే సముద్రంలోనికి వెళ్లిపోతాయి. దాన్నే ‘కామఠం’ అంటారు. అంటే తాబేలు తన గుడ్లని పిల్లలుగా చేసుకునే విధానమని దీని భావమన్నమాట. ఈ మాటనే సరిగా పలకడం రాకనో కాలక్రమంగా మరోలా మారిపోవడం వల్లనో ఆవిడకి కామఠం మరీ ఎక్కువ– అనే తీరుగా ‘కామఠం’గా మారిపోయింది. సరే!
అలాంటి కామఠ పుత్రులం కాబట్టి మమ్మల్ని ఆ దైవమే నిరాకారరూపంగా ఉంటూ తలుచుకోవాలి గానీ.. మేమేమిటి? ఆ సాయిని దర్శించడమేమిటి? మీరు మాత్రం వేదాంతతత్వం తెలిస్తే వెళ్లనే వెళ్లరు అంటూ ఆ వ్యక్తులంతా గోష్ఠి చేసుకుంటూ ఉండేవాళ్లు. వ్యక్తి పూజ సరికాదంటూ తీవ్రంగా వాదాలు చేస్తూండే ఈ అందరికీ ఓ నాయకుడు లాంటి వ్యక్తి ఉండేవాడని అనుకున్నాం కదా! ఇలా ఉన్న కాలంలో ఓసారి సాయిభక్తులంతా షిర్డీకి వెళ్తూ ‘నువ్వు కూడా రాకూడదూ! స్నేహితుడివి కదా!?’ అన్నారు.దానికి ఆ వ్యక్తి బదులు పలుకుతూ ‘నాకు సాయి నచ్చడని ముందే చెప్పానుగా! అయినా స్నేహధర్మాన్ని ఇష్టపడతాను కాబట్టి వస్తాను. ఆయన్ని చూసినా నమస్కరించను. పాదాల మీద పడను. దక్షిణగా నా వద్ద సొమ్మున్నా ఇయ్యను. అడిగితే మరోలా చూస్తాను. మరి మీ మనోభావాలు దెబ్బతింటాయేమో ఆలోచించుకుని నన్ను రమ్మనండి’ అన్నాడు. వాళ్లంతా ఆ విషయాలన్నీ మాకనవసరం. మా భక్తి విశ్వాసాలు నువ్వెంతగా వారించినా, తీర్మానించినా చెడవు. వెడదాం అన్నారు. సరేనంటూ ఆ వ్యక్తి కూడా బయలుదేరాడు షిర్డీకి వాళ్లతో.
షిర్డీ చేరారో లేదో ఈ భక్తులందరికీ సాయిని దర్శించాలనే ఆత్రుత మరింత పెరిగి నేరుగా మసీదుకెళ్లారు. ఆ మెట్లని ఎక్కుతూ ఉండగానే ఈ వ్యక్తితో సహా వచ్చిన భక్తులందర్నీ కొద్ది దూరం నుండి చూస్తూనే బాబా ‘అరెరే! వచ్చేశారే మీరు! మంచిది! రండి.. రండి!!’ అన్నాడు ఎదురుచూపుతో ఉన్న బంధువు వద్దకి ఆప్తబంధువు రాగానే పలికిన తీరులో.అందరు సాయి భక్తులూ ఒకరి పిమ్మట ఒకరు సాయి పాదాల మీద పడి నమస్కరించి పైకి లేచి ఆయన ముఖంలోనికి ఆర్థ్రంగా చూస్తూ వెళ్తూంటే, నమస్కరించను– దక్షిణని అడిగినా ఇయ్యనంటూ పూర్తి వ్యతిరేకభావంతో వచ్చిన ఆ వ్యక్తి మరింత భక్తితో సాయి పాదాల మీద తలని పెట్టాడు. శరీరం నిండుగా కంపనం వస్తూ ఉండగా సజలనయనాలతో ఆయన ముఖంలోనికి ముఖాన్ని పెట్టి చూస్తూ లేవనే లేదు. సాయి స్వయంగా అతని భుజాలని పట్టి పైకి లేపితే లేచి మరోమారు నమస్కరిస్తూ పాదాలమీద పడిపోయాడు. అతనితో వచ్చిన మిగిలిన అందరు దర్శనం ముగించుకుని వస్తూంటే మిత్రులు అడిగారు – ‘ఏమయింది నీకు?’ అని.సజలనయనాలతో హృదయపూర్వకమైన కంఠస్వరంతో ఆ వ్యక్తి చెప్పాడు. బాబా మాట్లాడిన ఆ గొంతు అచ్చం మా నాన్నదే. మా నాన్నంటే నాకు ఈ ప్రపంచంలో చెప్పలేనంత గౌరవం, భక్తీ, విశ్వాసం. ఆయన్ని పోగొట్టుకున్న దగ్గర్నుండి ప్రపంచమంతా శూన్యంగానే అనిపించసాగింది. ఏదో జీవిస్తున్నాను గానీ ఎప్పుడూ ఆ స్మృతిలోనే ఉంటూ ఉన్నాను. ఆ భావమేనేమో నాకు దైవం దైవవిశ్వాసం ఉన్న జనం ఇలా ఇందరి మీద ఓ విరక్తిని కలిగించడానికి కారణం.
ఈ రోజున మీ అందరితో కలిసి వచ్చాక– అరెరే! వచ్చేసారే మీరు! రండి... రండి!!’ అనే ఆ మాటలు మా తండ్రే ఆయనలో చేరి నన్నూ, నాతో ఉన్న మిత్రులైన మిమ్మల్ని కలిపి ఉద్దేశించి పలికిన మాటల్లా అనిపించాయి. బాబా పలికిన ఆ వాక్యాన్ని మీరు ఒక్కమారు మాత్రమే విని ఉంటారేమో గానీ నేను మాత్రం ఆ వాక్యాలని, మా తండ్రి బాబాలో దాగి పలికిన వాక్యాలని, ఎన్నోమార్లు తిరిగి తిరిగి అనిపించుకుని విన్నానో నాకే తెలియదంటూ ఆనందబాష్పాలని పెట్టుకున్నాడు. గుర్తుంచుకోవాలి. ఉదానమనే వాయువు కంఠంలో ఉంటుందని అనుకున్నాం. ‘వాయో రగ్నీః’ వాయువు ఎప్పుడూ తనలో అగ్నిని కలిగి ఉంటుంది. ఆ అగ్ని తనలో దాగి ఉన్న కారణంగానే మాట్లాడదలిచిన వ్యక్తి కంఠం నుండి ధ్వని (నాదం) బయటికి వచ్చి మాటగా అవుతుంది. ఆ వచ్చే ధ్వనినే ఎంత గాలిని పూరించి ఏ అక్షరాన్ని పలకాలో, ఏ అక్షరానికి ఎంత గాలిని తగ్గించి తేల్చి పలకాలో... ఇలా నియమించుకుని పలికినప్పుడు మాటలో స్పష్టత వచ్చి ఎదుటివ్యక్తి మన మాటకి ఆకర్షితుడవుతాడు. అలా ఆకర్షించే తీరులో మాట్లాడగలిగేలా చేయగలిగినవి హనువులు(దౌడలు) అలాంటి హనువులున్నవాడు కాబట్టే ఆంజనేయుడ్ని ‘హనుమాన్’ (ప్రశస్తే హనూ యస్య సః) అన్నారు. ఆయనకిష్టమైన పేర్లు కల స్తోత్రంలో (హనుమానంజనాసూనుః... దశగ్రీవస్య దర్పహా) మొదట పేరు హనుమాన్ అనీ ఆ మీదట అంజనీ పుత్రుడనీ అర్థం గల నామాలు కనిపిస్తాయి. వాయువు నుండి అగ్ని వచ్చినప్పుడే ధ్వని బయటికొస్తుంది. ఆ అగ్ని లేనప్పుడు కంఠం నుండి కేవలం వాయువే రావడం మనకి అనుభవంలో ఉన్న విషయాలే. ‘గొంతుపోయింది’ అనే మాటని కూడా కేవలం వాయువునే కంఠం నుంచి విడుస్తూ చెప్తాం. ఈ వాయువునే మరింత నాదబద్ధంగా చేయడం వల్లనే అది సంగీతంగా రూపొందింది. సరే!
ఇంతకీ సాయినాథుడేం చేసాడట? ఏ ఉదానవాయువనేది తన కంఠంలో ఉందో ఆ కంఠంలోని ధ్వని ఈ వచ్చిన వ్యక్తికి సంబంధించిన తండ్రి కంఠధ్వనిలా వినిపించేలానూ, ఆయనే తనలో అంతర్లీనుడై ఉన్నట్టుగానూ అనిపించేశాడు. ఇదేదో మాయ గారడీ వంచన తనని నమ్మింపజేసుకోవడానికి చేసిన చేష్టా అనుకోకూడదు. ఏ వ్యక్తికి ఎప్పుడు సంస్కారం ఫలిస్తుందో ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేరు.పరమనాస్తికధోరణితో ఉన్న వివేకానందుడు రామకృష్ణ పరమహంసని చూస్తూనే ఈ వెర్రిబాగులవాడూ ముక్కు నుంచి ద్రవం(చీమిడి) కార్చుకుంటున్నవాడూ మాట్లాడితే ఒకే అక్షరాన్ని రెండుమూడుమార్లు పలుకుతూ నత్తితో ఉన్న నోటివాడూ నాకు దైవాన్ని చూపిస్తానంటున్నాడా? పైగా నువ్వెప్పుడైనా దైవాన్ని చూశావా? అని అడిగితే నిన్ను చూస్తూన్నంత స్పష్టంగా చూసానని కూడా అంటున్నాడా? పోనీ ఆ ముఖంలో ఏ విధమైన వంచన అసత్యధోరణీ లేకుండా స్పష్టతతో పాటు సత్యశీలత కనిపిస్తోందా? అనుకుంటూ అర్థవిశ్వాసంతో (సగం నమ్మకం) ఆయన్ని చూస్తూ అక్కడే ఉండిపోయాడు మరి కొంతసేపు.ఆయన తన దగ్గరకి రమ్మని వివేకానందుడు రాగానే తన పాదాన్ని వివేకానందుని శిరసు మీద పెట్టాడో అప్పుడు వివేకానందునికి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయి క్షణకాలం అనంతరం రామకృష్ణుని గొప్పదనం అర్థమైంది. అంతే! ఇక ఆ పిమ్మట వివేకానందునికి మరో దైవమే కనపడలేదు. అంత ఆనందాన్ని అనుభవించిన వివేకానందునితో రామకృష్ణపరమహంస అన్నమాటలు ‘సంస్కారం ఫలించే రోజు రావాలి వివేకా!’ అని.
సరిగ్గా అలాగే జరిగింది ఈ నాస్తికధోరణి కల వ్యక్తికి. మిగిలిన మిత్రులందరి కంటే నిజంగా గొప్పవాడెవరంటే ఈ వ్యక్తే. సాయిదర్శనం అయిపోయింది కదా! అని అందరూ వెళ్లిపోయారు కానీ ఈ వ్యక్తి అలాగే ఓ క్షణం నిలబడిన సందర్భంలో ‘కాకా మహాజని’ వచ్చాడు. ఆయనతో కలిసి బాబా వద్దకి వెళ్లగానే ‘కాకా! నాకు ఓ 17 రూపాయల దక్షిణనియ్యి’ అని అడిగాడు. ఈ వ్యక్తి తనని కూడా అడుగుతాడేమో ఇద్దామనే దృష్టితో ఉన్నాడు కానీ సాయి అడగనే లేదు. తీరా తనంత తానే దక్షిణగా అంతని గానీ అంతకు మించిన ద్రవ్యాన్ని గానీ ఇస్తేనో? అనే ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయి వద్దని తిరస్కరిస్తేనో? ఈ కలిగిన ఆనందానుభూతి మొత్తం పల్చబడిపోవచ్చుననుకుంటూ మెట్లుదిగి కాకా మహాజనితో బసకి వచ్చేశాడు ఆ వ్యక్తి. మళ్లీ మధ్యాహ్నపువేళ– షిర్డీకి వచ్చిన భక్తులందరికీ ఉండే నియమం– బాబా అనుజ్ఞని కోరి తిరిగి ప్రయాణం కావడమనే దాని ప్రకారం మళ్లీ కాకామహాజనితో కలిసి సాయి వద్దకెళ్లాడు ఆనందంతో ఈ వ్యక్తి. ఆయన ఈ వ్యక్తిని చూస్తూ వెంటనే తన దృష్టిని కాకామహాజనిపైకి ప్రసరింపజేసి – కాకా! మరికొంత దక్షిణనివ్వు! అని అడిగాడు. దాన్ని ఓ మహా ప్రసాదంగా భావించిన కాకా మహాజని మళ్లీ దక్షిణ నిచ్చాడు సాయికి. వెంటనే ఈ వ్యక్తి కాకా మహాజనికి మరింత దగ్గరగా జరిగి అతనికి మాత్రమే వినిపించేలా! స్వామీ! ఇంతకు ముందూ ఇప్పుడూ కూడా అంటే 2 సార్లు సాయి నిన్ను మాత్రమే దక్షిణ నడిగాడు కదా! నేనిస్తే అది ఆయనకి అంగీకారం కాదా? నేనియ్యకూడదా? మరి నా మనసు ఇయ్యాలని అనుకుంటూ ఉవ్విళ్లూరుతోంది’ అన్నాడు రహస్యంగా. అంతలో సాయే కలిపించుకుంటూ ‘కాకా! ఏమిటి అంటున్నాడు అతను? ఏమిటి చెబుతున్నాడు?’ అన్నాడు. మళ్లీ ఆ కంఠస్వరాన్ని వింటూనే చలించిపోయాడు ఈ వ్యక్తి. కాకా చెప్పాడు సాయితో... ‘నీకు దక్షిణనీయాలనుకుంటూ తపించిపోతున్నాడు ఈ వ్యక్తి’ అని.
సాయి చిరునవ్వు నవ్వుతూ ఈ వ్యక్తి ముఖంలోనికే చూస్తూ... నీకసలు సాయి దర్శనమే ఇష్టంలేదు. సాధువులూ సన్యాసులూ ఎవరేమిస్తామన్నా తీసుకోకూడని దృక్పథంలో మాత్రమే ఉండాలనుకునే మనస్తత్వం వాడివి కూడా. పైగా నేను నిన్ను అడిగి తీసుకోవడం కూడానా? అందుకే నిన్నడగలేదు’ అంటూ ముఖాన్ని కాకా మీదికి తిప్పబోతూ మళ్లీ ఆగి ఈ వ్యక్తి వైపుకే తలని తిప్పి’ అంతగా నీకియ్యాలని గనుక అనిపిస్తే ఇవ్వు’ అన్నాడు. సాధు సన్యాసులు దక్షిణని తీసుకుంటే తప్పుగానూ, అడిగి తీసుకున్న పక్షంలో మరింత తప్పుగానూ భావించే ఈ వ్యక్తి సాయిని అడిగించుకుని ప్రాధేయపడి మరీ దక్షిణని ఇస్తున్నాడా? అనుకుంటూ కాకా మహాజని మరింత ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ వ్యక్తి సాయి అడిగాడో లేదో ఆ జేబు ఈ జేబు వెదుకుతూ సొమ్ముని తీయబోతుంటే సాయి ‘అంత తొందరెందుకయ్యా? కొంపలేం మునిగిపోవడం లేదు. నువ్వియ్యదలిచావు. నేను తీసుకోదలిచాను కదా! ప్రశాంతంగా కూర్చో! ఆ మీదటనే ఇయ్యి!’ అన్నాడు. సాయి పలుకుతున్న ప్రతి పలుకూ తనని బంధించేస్తోంది. తప్పు చేశానని తనని హెచ్చరిస్తోంది. ఈ దశలో సాయి – ‘నీలో ఉన్న తైలవర్తకుడ్ని తొలగించు!’ అన్నాడు. పాపపు ఆలోచనలున్న వ్యక్తిని ‘తైలవర్తకుడు’ అనే పేరుతో పిలిచేవాడు సాయి. ఆ లోఅర్థం అర్థమైన ఈ వ్యక్తి సాయిముఖంలోనికే చూస్తుంటే సాయి స్వ–పరభేదదృష్టీ దానివ్లల కోల్పోయే మనశ్శాంతి ఆ కారణంగా కలిగే మానసిక అశాంతీ గురించి వివరిస్తూ చక్కని బోధ చేశాడు ఆ వ్యక్తికి. సాయి ఏది మాట్లాడుతున్నా అది ఓ పాయసం లాగా ద్రవంలాగా నేరుగా లోనికి వెళ్లిపోతూ ఉంటే తప్ప ఎక్కడా అర్థం కాని మాటా విషయం లేనే లేదనిపించింది ఆ వ్యక్తికి.ఉపదేశం ముగిసాక ఈ వ్యక్తి షిర్డీ విడిచి వెళ్లడానికి అనుజ్ఞని కోరకముందే ‘వెళ్లు వెళ్లు తొందరగా వెళ్లు’ అన్నాడు. అప్పటికే ఉరుములు ప్రారంభమయ్యాయి ప్రకృతిలో. మెరుపులు మెరుస్తున్నాయి. అందుకే వర్షం వచ్చేలోగా వెళ్లవలసిందిగా సాయి సూచిస్తున్నాడనుకుంటూ ఈ వ్యక్తి నావప్రయాణాన్ని భయం భయంగా చేశాడు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే నావప్రయాణం ముగిసి రైలెక్కాడో లేదో కుంభవృష్టి కురిసింది.
తన ప్రదేశమైన బాంబాయిలోని ఇంట్లోకి వెళ్లాడో లేదో ఒక పక్షి వేగంగా తలుపు తెరవగానే ఎగిరిపోయింది. మరో రెండు పక్షులు మరణించి కనిపించాయి. ఎంత తప్పు చేశాను! పక్షులున్నాయనే మాటని మరిచి తలుపులు మూసి బయలుదేరాను. కనీసం ఓ కిటికీని తెరిచినా ఈ నేరానికి పాత్రుడ్ని అయ్యుండేవాడ్ని కానే కాకపోయుండేవాడ్ని. తప్పు జరుగుతుందేమో, తప్పు చేస్తున్నానేమో అనే ధ్యాసతోనే ఉండాలనే బుద్ధిని సాయి తనకిచ్చాడనుకుంటూ ఇంటిలోనికి వెళ్లాడు. ఆ మూడో పక్షి కూడా మరణించకుండా రక్షించడానికే వర్షంలో తడవకుండా పోడానికీ సాయి తనని ‘వెంటనే వెళ్లు’ అన్నాడని అర్థం చేసుకున్నాడు.తన తండ్రి సాయి రూపంలో ఉన్నాడనీ, ఆయన మాటలో తండ్రి జీవించే ఉన్నాడనీ ఈ వ్యక్తి తన జీవితమంతా భావిస్తూ ప్రశాంతంగా ఉండిపోయాడు. సాయి ఉదానవాయు శక్తిని మరో ఉదాహరణం ద్వారా కూడా తెలుసుకుందాం!
– సశేషం
∙డా. మైలవరపు శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment