శాటి‘లైట్’ గురూ!
ఒకప్పుడు సినిమా మొదలుపెట్టినప్పుడే శాటిలైట్ ఇంత వస్తుందని లెక్క చూసుకుని, దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ని డిసైడ్ చేసుకునేవాళ్లు. 2000 నుంచి 2010 వరకూ శాటిలైట్ రైట్స్ నిర్మాతల పాలిట ఓ వరం. ఆ పదేళ్లల్లో విడుదలైన సినిమాల్లో దాదాపు అన్నీ శాటిలైట్ రైట్స్ రూపంలో బాగానే డబ్బులు దక్కించుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితి మారింది. 2010 నుంచి చానల్ అధినేతలు ఏ సినిమా పడితే ఆ సినిమా కొనడం మానేశారనే చెప్పాలి.
అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌లోనూ టెలికాస్ట్ చేయడానికి కావల్సినంత సాఫ్ట్‌వేర్ ఉండటంతో ఎగబడి సినిమాలు కొనాల్సిన అవసరం లేకుండాపోయింది. దాంతో ‘ఆ నలుగురు స్టార్ హీరో’ల సినిమాలు మినహా విడుదలకు ముందే శాటిలైట్ అమ్ముడుపోతున్న సినిమాలు లేకపోవడం విశేషం. విడుదలైన తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్మడం అంటే నిర్మాతకు కష్టమే. సినిమా బాగుంటే ఓకే.. లేకపోతే శాటిలైట్ రేట్ కూరగాయల బేరం చందంగా అయిపోతుంది. ఇటీవల విడుదలైన ఓ భారీ సినిమాను ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా విడుదలకు ముందు ఐదు కోట్లకు కొనాలని అనుకున్నవాళ్లే..
విడుదల తర్వాత రిజల్ట్ తేడాగా ఉండటంతో అమాంతం రేటు తగ్గించేయడం విశేషం. రూ.2 కోట్లే ఇవ్వడానికి ఆ చానల్ సిద్ధపడిందట. అలాగే, ఆ హీరో నటించిన ముందు సినిమా రిజల్ట్‌ని బట్టి తదుపరి చిత్రం శాటిలైట్ రైట్స్ నిర్ణయమవుతోంది. కారణాలేవైనప్పటికీ శాటి‘లైట్’ అయిపోతోంది. సో.. శాటిలైట్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలనుకున్నవాళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిదని కొందరు సినీ ప్రముఖులు సెలవిస్తున్నారు. ఒకవేళ తీయాలనుకున్నా బంపర్ హిట్‌ని టార్గెట్ చేయాలి. అలా చేస్తే... తారాజువ్వలా పెకైగురుతారు. లేకపోతే తుస్సుమన్న బాంబులా మిగిలిపోవాల్సిందే.