సోప్‌ను కడిగేస్తున్నాయి | Television Serial is Called Soap in English | Sakshi
Sakshi News home page

సోప్‌ను కడిగేస్తున్నాయి

Published Mon, Apr 15 2019 2:02 AM | Last Updated on Mon, Apr 15 2019 2:02 AM

Television Serial is Called Soap in English - Sakshi

టెలివిజన్‌ సీరియల్‌ను ఇంగ్లిష్‌లో సోప్‌ అంటారు.దానిక్కారణం వేరే కానీ.. మన సీరియల్స్‌లో అంతా సోపే!సోప్‌ రాయడం.. సోప్‌ మీద కాలుపెట్టి జారేలా చేయడం..అన్నీ సోప్‌ కుట్రలే! కిచెన్‌ నుంచి డైనింగ్‌ టేబుల్‌ దాకా.. హాల్‌ నుంచి డ్రాయింగ్‌ రూమ్‌ దాకా అన్నీ కుతంత్రాలే!అయితే ఈ ధోరణి మారిపోతోంది. మహిళలను బలంగా.. సొంత వ్యక్తిత్వం గల శక్తులుగా.. వెబ్‌ సిరీస్‌లో చూపిస్తున్నారు.ఈ కొత్త తరహా స్వతంత్ర మహిళలు పాత సోప్‌ను ఉతికిపారేస్తున్నారు.పాత సీరియల్‌లో క్యారెక్టర్లను కడిగిపారేస్తున్నారు.

కిచెన్‌ పాలిటిక్స్‌.. జనాలను ఎంటర్‌టైన్‌ చేసినంతగా ఇంకేవీ చేయడం లేదు. యెస్‌.. కావాలంటే ‘సాస్‌ బహూ’ సీరియల్స్‌ టీఆర్‌పీ రేటింగ్‌ చూడండి. ఒక్క మనదేశంలోనే కాదు ఆసియా నుంచి అమెరికా దాకా.. ఎన్‌ఆర్‌ఐ ఫ్యామిలీస్‌ అన్నీ వీటికి పిచ్చి ఫాలోవర్సే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పాకిస్తాన్‌లో కూడా మన సాస్‌ బహూ ఎపిసోడ్స్‌ను వేలంవెర్రిగా చూస్తారట. ఇండియా, పాకిస్తాన్‌ సంచలన వార్తల కన్నా వీటికే వ్యూయర్‌ షిప్‌ ఎక్కువట. మహిళ శక్తిని త్యాగంగా మలిచి ఆమెను ఓ పరాధీనగా పోట్రైట్‌ చేయడం... బ్లాక్‌ అండ్‌ వైట్‌ జమానా ట్రెండ్‌. ఇరవై ఏళ్ల కిందట తెరమీదకు వచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌కి అది పులిసిపోయిన దోసె పిండి. అందుకే వంటింటి రాజకీయాలను ధారావాహికలకు కామన్‌ కాన్సెప్ట్‌గా మార్చేశాయి. మహిళను విలన్‌గా ఇంట్రడ్యూస్‌ చేశాయి.

తరువాయి భాగం
పే...ద్ద ఉమ్మడి కుటుంబం. ఫ్యాక్టరీలు, కాంట్రాక్ట్‌లతో మగవాళ్లు బిజీ. కాలేజీలు, స్కూళ్లతో ఆ ఇంట్లోని యూత్, చిల్డ్రన్‌ ఎంగేజ్డ్‌. మిగిలింది ఆడవాళ్లే కదా. ఏడు వారాల నగలేసుకొని, మెరిసిపోయే పట్టు చీరలు కట్టుకొని, పాపిట్లో సింధూరం దిద్దుకొని, కడ్వా చౌత్‌ వ్రతం పట్టి  జల్లెడలో చంద్రుడిని చూడ్డం.. అత్తతో కోడలు, వదినతో ఆడబిడ్డ, తోటికోడళ్లు.. చిరునవ్వులు చిందిస్తూనే కుట్రలు కుతంత్రాలు పన్నడం, ఆలింగనం చేసుకుంటూనే అంతులేని పగను పెంచుకోవడం, ప్రతీకారాలతో కాలక్షేపం చేయడం..  ఉత్కంఠను రేకెత్తిస్తూ కనీసం రెండు మూడు జనరేషన్ల దాకా నిరవధికంగా ప్రసారం చేస్తున్నాయీ కథలను టీవీలు. దాదాపు ‘క్యోంకీ సాస్‌ భీ కభీ బహూ థీ’ నుంచి మొదలు.. పవిత్ర రిష్తా, నాగిన్‌ ఎట్‌సెట్రా వరకు ఇవే నేపథ్యాలు.

ఆడవాళ్లను విలన్స్‌గా చూపించడానికి ఒక సీరియల్‌ను మించి ఇంకో సీరియల్, ఒక చానల్‌ను మించి మరో చానల్‌ పోటీ పడ్తున్నాయి. వాటిల్లో నటించిన కోడళ్లకు బయట ఎంత పాపులారిటీయో! సినిమా హీరోయిన్లకు మించిన ఫాన్‌ ఫాలోయింగ్‌. ఆ క్రేజ్‌ స్మృతి ఇరానీలాంటి వాళ్లను ఎంపీలుగానూ చేసిపెట్టింది. తెలుసు కదా.. స్మృతీ ఇరానీ.. ప్రైవేట్‌ చానళ్ల తొలి తరం పెద్దింటి ఆదర్శ కోడలు. తులసీ. క్యోంకీ సాస్‌ భీ కభీ బహూ థీలో నటించారు. తర్వాత మిగిలిన సీరియళ్లలో కోడళ్లుగా, విలన్స్‌గా వచ్చిన పాత్రధారులంతా ఎన్నో రియాల్టీ షోస్‌లో గెస్ట్స్‌గా కూడా అప్పియర్‌ అయ్యారు. అంతేకాదు బిగ్‌ బాస్‌ వంటి వాటిల్లో కంటెస్టెంట్స్‌గానూ పాల్గొన్నారు. 

చెక్‌.. బ్రేక్‌!
ఈ ఒరవడి, వేగం ఇంకా ఉండేదే... టు బీ కంటిన్యూడ్‌గా! అయితే వెబ్‌ చానల్స్‌ వీటికి చెక్‌ పెట్టాయి. స్ట్రెన్త్‌ అండ్‌ ఇండిపెండెంట్‌ ఉమన్‌ క్యారెక్టర్స్‌ సెంట్రిక్‌  సీరీస్‌తో సాస్‌బహూ టైపు విలనీ సీరియల్స్‌ను బ్రేక్‌ చేశాయి. ఈ పొటెన్షియల్‌  ఫీమేల్‌ పాత్రల స్టోరీస్‌ను ఫస్ట్‌ ప్లే చేసింది యూ ట్యూబ్‌ చానల్సే అయినా.. నట్టింట్లోకి తెచ్చింది మాత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ వంటివే. ఉదాహరణ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అయిన సేక్రెడ్‌ గేమ్స్‌! ‘రా’ ఎంప్లాయ్‌గా రాధికా ఆప్టే నుంచి మొదలు ట్రాన్స్‌జెండర్‌ (ఫీమేల్‌)గా నటించి కుబ్రా సేథ్‌ దాకా అందులోని మహిళా పాత్రలన్నీ బోల్డ్‌ అండ్‌ డైనమికే. రా ఏజెంట్‌గా మిగిలిన పురుష ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. అసైన్‌మెంట్స్, ట్రీట్మెంట్‌ విషయంలో స్త్రీగా వివక్షను ఎదుర్కొంటూంటుంది.. చిన్నచూపుకీ గురవుతుంది రాధికా ఆప్టే పాత్ర అంజలి. అయినా తనకు అప్పగించిన బాధ్యత విషయంలో ఏ మాత్రం తేడా రానివ్వదు.

అంత సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌తో తీర్చిదిద్దారు అంజలీ క్యారెక్టర్‌ను. ట్రాన్స్‌జెండర్‌ ‘కుకూ’ రోల్‌ అంతే. ధీరత్వం, మానవత్వం పోతపోసిన భూమిక. నెట్‌ఫ్లిక్స్‌లోనివే సోనీ, ఫైర్‌బ్రాండ్, డెల్హీ క్రైమ్‌ సీరీస్‌. రియాల్టీ ఏమాత్రం మిస్‌ అవకుండా... స్త్రీని సబలగా చూపించిన కథలు. పురుషాధిపత్యం మెండుగా ఉన్న పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఐపీఎస్‌ ర్యాంక్‌లో ఉన్న మహిళలకు ఎదురయ్యే సమస్యల్ని, హైరార్కీని ‘సోనీ’లో చూపించిన తీరు సింప్లీ సూపర్బే కాదు.. స్ఫూర్తిదాయకం కూడా. వ్యక్తిత్వాన్ని కించపర్చుకోకుండా, ఎవరైనా కించపర్చే పనిచేస్తుంటే చాకచక్యంగా తప్పికొడుతూ తమని తాము నిలబెట్టుకుంటూ.. సిన్సియర్‌గా టాస్క్స్‌ను పూర్తి చేయడం మహిళలకే చెల్లు అని చూపించే ‘సోనీ’ ఇప్పటి ఆడపిల్లలకు ప్రేరణ. డెల్హీ క్రైమ్‌ కూడా అలాంటిదే. నిర్భయ ఘటన ఇన్వెస్టిగేషన్‌కు తెరరూపం. దక్షిణ ఢిల్లీ డీసీపీ ఛాయా శర్మ ఈ కేసును శోధించి, నేరస్థులను పట్టుకున్న తీరుని సిరీస్‌గా తీశారు.

ఇప్పటి వరకు మేల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్స్‌ కథనాలే వచ్చాయి.. హీరోయిజం స్ప్రెడ్‌ చేస్తూ.. దానికి అమ్మాయిలు ఫిదా అయినట్టు చూపిస్తూ! అలాంటి నేపథ్యంలో  డెల్హీ క్రైమ్‌ కచ్చితంగా కొత్త ట్రెండే. ఈ తరానికి ఫెయిరీ టేల్స్‌ కాదు.. సాహస గాథలు కావాలి. తమను తాము రక్షించుకునే నేర్పును బోధించే కథలు రావాలి. స్వతంత్రంగా నిలబడే ధైర్యాన్నిచ్చే.. స్థయిర్యాన్ని పంచే సీరీస్‌ను చూపించాలి. అలాంటిదే ఫైర్‌బ్రాండ్‌. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన లైంగిక దాడి చేదు జ్ఞాపకం పెళ్లయ్యాక కూడా వేధిస్తుంటే .. దాన్నుంచి బయటపడే మార్గాన్ని తనే అన్వేషించుకొని.. సమస్యను పరిష్కరించుకుంటుంది... ఆత్మహత్య అన్న ఆలోచన చేయకుండా.. అందులోని కథానాయిక. ఎంత ఎదురు గాలి వీచినా వణికిపోకూడదు.. నిలబడాలి. ధైర్యాన్నిచ్చే ఈ జాబితాలోకి అమేజాన్‌ ప్రైమ్‌లోని ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌  ప్లీజ్‌’, ‘మేడిన్‌ హెవెన్‌’ కూడా వస్తాయి.

బాడీ షేమింగ్‌ నుంచి సెక్సువల్‌ అస్సాల్ట్, సింగిల్‌ మదర్, కెరీర్‌ ఓరియెంటెడ్‌ ఉమన్, కట్నం అడిగిన అబ్బాయితో పెళ్లిని నిరాకరించిన తెగువ, విడాకులు తీసుకున్నా లైఫ్‌ ఆగిపోదనే  స్పృహ, భర్త చనిపోయిన నడివయసు వితంతువుకూ తిరిగి వైవాహిక జీవితాన్ని ఆరంభించే హక్కు ఉందన్న ఎరుక, సంపాదన ఉండగానే సాధికారత రాదు... నిర్ణయాధికారం ఉంటేనే సాధికారత అనే చైతన్యాన్నిచ్చే సీరీస్‌ ఆ రెండూ! అలా కుకూ నుంచి తారా (మేడిన్‌ హెవెన్‌ సీరీస్‌ హీరోయిన్‌) దాకా డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ రోల్స్‌తో స్టీరియో టైప్‌ను చిత్తు చేస్తున్నాయి. చీర చెంగును బొడ్లో దోపుకొని.. పొద్దున్నుంచి పొద్దుపోయే దాకా... వంచిన నడుం ఎత్తకుండా పనిచేసే హార్డ్‌వర్క్‌ అవుట్‌ డేట్‌ అయింది.

భార్య ల్యాప్‌టాప్‌తో దోస్తీ చేస్తుంటే భర్త వంటింట్లో కొర్రల కిచిడీతో కుస్తీ పడుతున్న యంగ్‌ అండ్‌ స్మార్ట్‌ జనరేషన్‌ టైమ్‌ ఇది. ఇంటిపని, బయట పని లాంటి మల్టీ టాస్కింగ్‌ను అమ్మాయిలు పుట్టుకతోనే రెండుచేతులతో పట్టుకొని రాలేదు. ఆ రెస్పాన్స్‌బులిటీ అబ్బాయిలకు ఇస్తే.. అంతే చక్కగా చేస్తారు. కాబట్టి... కాలం చెల్లిన కిచెన్‌ పాలిటిక్స్‌ థీమ్స్‌కి గుడ్‌బై చెప్పి ఈక్వాలిటీ స్ప్రెడ్‌ చేసే ప్లాట్స్‌ క్లాప్‌ కొట్టాలని ఆశిద్దాం. సెల్ఫ్‌పిటీ, డిపెండెన్సీ, విలనీ సీన్స్‌ను స్క్రీన్‌ ప్లే నుంచి తొలగిస్తారని ఆశపడదాం. డెల్హీ క్రైమ్‌లోని  ‘‘ప్రతి డిపార్ట్‌మెంట్‌లో వీలైనంత మంది లేడీ స్టాఫ్‌ ఉండాలి’’ అనే డైలాగ్‌ ఆ ఆశను బలపరుస్తోంది. 
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement