రోహిల్లా కథ ‘లోవిషయం’  | Sayipatham - antarvedam 5 | Sakshi
Sakshi News home page

రోహిల్లా కథ ‘లోవిషయం’ 

Published Sun, Jun 10 2018 1:42 AM | Last Updated on Sun, Jun 10 2018 1:42 AM

Sayipatham - antarvedam 5 - Sakshi

మహనీయులకి సంబంధించిన ఏ కథ విన్నా, ఆ కథని ఓ నవలలానో, ఆధునిక కథలానో కేవలం కాలక్షేపం కోసం చదివేసి అవతల పడెయ్యకూడదు. మనం చెప్పుకోబోయే కథలన్నీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే కథలు కాబట్టి, ఎవరి ఆత్మల్లో వారికి మాత్రమే కనిపించే భగవంతునికి సంబంధించిన కథలు ఈ కథలన్నమాట. ఊరికే పై కథని వినేసి ‘కథని వినేశా’ అనుకుంటే అది ఓ రమణీయమైన భవనాన్ని వెలుపలి నుంచి అలా చూసి, అక్కడి నుంచి కదిలిపోయిన దాంతో సమానమే. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఎందరో భక్తులు దైవ కథలని కేవలం పై దృష్టితోనే వినడం, చదువుకోవడం చేస్తుంటారు. ఆ కథలో దాగిన అంతరార్థాన్ని గానీ కొద్దిగా పరిశీలించి, గ్రహించినట్లయితే ఇక ఆ కథని కథగా ఏనాడూ భావించం. ఈ దృష్టితో బాబా సచ్చరిత్రలో కనిపించే రోహిల్లా కథని చదువుకుందాం! 

రోహిల్లా కథ
రోహిల్లా అనే పహిల్వాన్‌ ఉంటూండేవాడు. అతను ఆ నోట ఈ నోట సాయి గుణ గణాలను విని, ఆయన్ని ఒక్కసారి దర్శించాలని షిరిడీకొచ్చాడు.సాయిని దర్శించి కొన్ని రోజులపాటు షిరిడీలోనే ఉండిపోయాడు. సాయి కూడా ఇతణ్ని బాగా ఆదరిస్తూ ఉండేవాడు. రోహిల్లా కూడా సాయిని దాదాపు భగవంతునిగానే భావించేవాడు.ఇతనికి ఓ చిత్రమైన లక్షణముండేది. మహమ్మదీయుడూ అల్లాహ్‌ భక్తుడైన రోహిల్లా అకస్మాత్తుగా పెద్దగొంతుతో ‘అల్లాహ్‌ హో అక్బర్‌’ అని చెవులు పగిలిపోయేంత శబ్దంతో అరుస్తుండేవాడు. పగలైతే పెద్దగా ఎవరికీ పట్టదుగానీ, రాత్రివేళ షిరిడీ మొత్తం ప్రశాంతంగా ఉండే వేళ,అందరూ శ్రమించి శ్రమించి ఇంటికొచ్చి పరుండే వేళ ‘అల్లాహ్‌ హో అక్బర్‌’ అని అరుస్తూ ఉండేవాడు. ఆ అరుపుకి గుండెలు పగిలిపోతాయా? అనిపించేది చుట్టూ ఉన్నవారికి.
ఒకట్రెండు సార్లు అతనికి తాము పడుతున్న ఇబ్బందిని గురించి సామూహికంగా వెళ్లి చెబ్దామని షిరిడీ ప్రజలు భావించారు. కానీ, మెడ నుంచి పాదాల వరకూ కఫనీ వేసుకుని, దృఢంగా ఉండి, అతని పెద్ద గొంతుక పగిలిపోతుందా? అనే స్థాయిలో మాట్లాడే అతణ్ని సమీపించలేక వెనక్కి తిరిగొచ్చేశారు. అతను ఎవరితోనైనా వివాదపడే సందర్భాన్ని చూస్తే కూడా, భయం వేస్తుండేది.

ఎవరైనా, తనని అభ్యంతరపెడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా విపరీతమైన అహంకారంతో ఉండేవాడు రోహిల్లా. అయితే అదంతా బయట మాత్రమే. సాయి దగ్గర మాత్రం పిల్లాడిలా ఉండేవాడు. 
ఒక రాత్రివేళ ఖురాన్‌లోని కల్మాలని పెద్దగొంతుతో అరుపులా వినిపించేలా చదువుతూండేవాడు. షిరిడీ ప్రజలంతా ఈ అర్ధరాత్రి నిద్రాభంగం కారణంగా మర్నాడు పనుల్ని చేసుకోలేకపోతూండేవాళ్లు. ఒకసారి షిరిడీ ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది. మనకీ, అతనికీ సంరక్షకుడు సాయి భగవానుడే కాబట్టి, ఆయనకే మన బాధని చెప్పుకుని ఆయన ద్వారానే సమస్యని పరిష్కరించుకోవడం బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అందరూ సాయి వద్దకి కలిసికట్టుగా వెళ్లి విషయాన్ని వివరించి రక్షించవలసిందని కోరారు.షిరిడీవాసులంతా చెప్పింది విన్న సాయి ఆశ్చర్యపడలేదు. అయ్యో! అనలేదు. తప్పక మీ సమస్యని తీరుస్తానని హామీ ఇవ్వలేదు. పైపెచ్చు ‘రోహిల్లా నాకు మంచి భక్తుడు. నాకెంతో ఇష్టుడు కూడా. అతనిదో చిత్రమైన జీవితగాథ. అతనికో భార్య ఉంది. అమెని నిరంతరం ప్రేమిస్తూ ఉండేవాడు రోహిల్లా. అయినప్పుటికీ అమె విసుగ్గా, కోపంగా, చిరాగ్గా ఉంటూ నిరంతరం సూటిపోటి మాటలతో అతణ్ని మానసికంగా హింసిస్తుండేది. కొంతకాలం పాటు రోహిల్లా ఆమెని ‘శరీరంలో ప్రవేశించిన వ్యాధి’లా భరించాడు. కానీ ఇక కొంతకాలానికి అతనికి ఆమెతో కలిసి ఉండటం భరింపశక్యం కానిదైంది. దాంతో ఆమెని తరిమేశాడు రోహిల్లా.

ఆ దుర్మార్గురాలికి సిగ్గూ, అభిమానం, బిడియం.. వంటివేమీ లేవు సరికదా సంస్కారానికీ, సంప్రదాయానికీ ఎంతో దూరంగా ఉంటూ.. తనని బలవంతాన తరిమేసినా ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లోకి దూసుకొస్తుండేది. ఆమె వచ్చి ఉన్న ఆ గంటో, రెండుగంటల కాలమో కూడా రోహిల్లాకి పరమ నరకంలా అనిపిస్తుండేది. ఈమె రాకని ఎలా నివారించాలా? ఎలా బుద్ధి చెప్పాలా? అనుకుంటూ  ఒకసారి ఎందుకో ఆమె చేసే పనులకి తీవ్రకోపం వచ్చి పెద్దగొంతుతో ఆమెని నిందించడం మొదలెట్టాడు. ఆ పెద్దగొంతుకీ, అరుపులకీ భయపడి ఆమె రోహిల్లా వద్దకి రావడం మానేసింది. ఎప్పుడు రోహిల్లా అరుపులు మానితే అప్పుడు అక్కడికి ప్రత్యక్షమౌతుండేది. ఇప్పుడిలా అరుపులు, కేకలు పెద్దగొంతుతో ఖురాన్‌లోని ధర్మవాక్యాలైన కల్మాలనీ రోహిల్లా చదవడం మొదలెట్టేసరికి రావడం మానేసింది. ఈయన అరుపుల్ని విని పారిపోవడం చేస్తోంది.ఒక్కమాటలో చెప్పాలంటే రోహిల్లా నా దగ్గరకి వచ్చాక నాకూ శాంతంగా ఉంది. రాత్రిపూట పరమ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. రోహిల్లాని తరిమేస్తే, అతని భార్య నా వద్దకొచ్చి నన్నూ బాధపెడుతుంది. ఇంత ఉపకారి అయిన రోహిల్లానీ, అతని అరుపుల్నీ ఆనందంగా భరించండి. కొన్నాళ్లకి మీకూ నాలా అలవాటైపోతుంది. ఆ గయ్యాళి భార్య మీతో, అతనితో, నాతో కూడా వివాదపడదు’ అన్నాడు బాబా.బాబానే ఇలా మాట్లాడేసరికి గ్రామస్థులంతా నివ్వెరబోయారు. మారు మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోయారు.

అసలు విషయం ఇదీ...
రోహిల్లా... బాబా షిరిడీకి వచ్చేనాటికే వచ్చి ఉన్నవాడు కాడు. పోనీ షిరిడీ గ్రామవాసి అస్సలు కాడు. అక్కడక్కడి జనమంతా సాయిని గురించి చెప్తూ చెప్తూ ఉంటే సాయి సమక్షానికొచ్చాడు. దర్శనంచేసుకుని వెళ్లిపోదామనుకున్నవాడు కాస్తా ఆయన దగ్గరే ఉండిపోయాడు కూడా.రోహిల్లా మొదటిసారిగా సాయి వద్దకి వచ్చి, దర్శించగానే అతనికి కలిగిన అనుభూతి అతణ్ని షిరిడీ నుంచి పోనీయకుండా ఆపేసింది. అంతేకాదు. సాయి క్షేత్రపంక్తుల్లో ఉండే యధార్థమైన అనుభూతిని రోహిల్లా పొందగలిగాడు కూడా. దాంతో షిరిడీలో, అదీ సాయి సమక్షంలోనే ఉండి పోవాలనే దృఢనిశ్చయానికి వచ్చేశాడు. అంతే! ఉండిపోసాగాడు.నిజానికి రోహిల్లాకి భార్యలేదు. ఆమె గయ్యాళీ కాదు. ఆ మాటకొస్తే, అసలు రోహిల్లాకి వివాహమే కాలేదు. ఈ విషయం సాయికీ తెలుసు.ఇదేమిటి? మరి సాయిబాబానే రోహిల్లా భార్య గురించి గ్రామస్థులకి అంత ఉపన్యాసాన్ని ఉపదేశ  రూపంగా ఎందుకిచ్చాడనేగా మన సంశయం..?సాయిమాటల్లో అంతరార్థం ఉండి తీరుతుంది. రోహిల్లాకున్న భార్య మరెవరో కాదు ‘దుర్బుద్ధి’. ప్రతివ్యక్తీ దుఃఖిస్తూ ఉండాలనీ, అందరూ దుఃఖిస్తూ మనల్ని ఆశ్రయిస్తుంటే వాళ్లని మనం ఓదార్చాలనుకునే ఆ తీరు బుద్ధి దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధి నిరంతరం రోహిల్లానే కాదు, మనల్ని కూడా పీడిస్తూనే ఉంటుంది. మన పిల్లవాడు పరీక్షలో ఉత్తమ విజేత అయినందుకు కలిగిన ఆనందం, పక్కింటి పిల్లవాడికి కూడా దాదాపు మనవాడితో సమానంగా వచ్చిన ఉత్తీర్ణతాశాతం కారణంగా పల్చబడిపోతుంది. ఇదే రోహిల్లా భార్య అంటే.

ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ... ఇవన్నీ రోహిల్లా భార్య లక్షణాలే. దురదృష్టవశాత్తూ మనం సంస్కృతంలో కనిపించే కొన్ని కొన్ని పదాలకి అర్థాలన్నీ సమానమని భావిస్తూ ఉంటాం. ఈర్ష్య అంటే అసూయ అనేది అర్థం కాదు. ఈ రెండూ సమానమూ కాదు.ఇతరుల ఉన్నతినీ క్రమక్రమాభివృద్ధినీ సహించలేకపోవడం ఈర్ష్య. ఇతరులకున్న గొప్పగుణాల్లో వంకల్ని వెదికివెదికి దోషాల్ని ఆరోపించడం అసూయ.‘ఫలానావాళ్లు, ఎక్కడికెళ్లినా దంపతిగానే (భార్యాభర్తలిద్దరూ కలిసి మాత్రమే) వెళ్తారు’ అని ఎవరైనా చెప్తే ‘ఎంతదృష్టం!’ అనుకోకుండా ‘ఆయనకి ఆమె మీద అనుమానం! అందుకే ఒంటరిగా ఆమెని పోనియ్యడు. ఎప్పుడూ తోకలా వెళ్తూనే ఉంటాడు’ అనడం అసూయ.ఇదుగో ఈ తీరు ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం వంటి అన్ని దుర్లక్షణాల సమూహమే రోహిల్లా భార్య స్వరూపం. అందుకే, అలాంటి ఆలోచన రోహిల్లాకి రాబోతోందనగానే, పెద్దగొంతుతో ఆ తీరు ఆలోచనలని తరిమికొట్టగల శక్తి ఉన్న కల్మాలని ఖురాన్‌ తీసి పెద్దగా చదువుతుంటాడన్నమాట! అంటే ఖురాన్‌ గాని సరైన తీరులో అర్థం చేసుకుని ఉన్నవాడయినట్లయితే, కల్మాని ఆ సందర్భానికి సరిపోయేలా పఠించగలమన్నమాట! ఆ శక్తి రోహిల్లాకి ఉందని అర్థం కూడా.

కథని వినడం వేరు, చదవడం వేరు. దానిలో దాగిన తత్త్వార్థాన్ని తెలుసుకోవడం వేరు. తత్త్వార్థం తెలియనప్పుడు దైవాన్ని ఎంతసేపు, ఎంతకాలం, ఎన్నిమార్లు ఆరాధించినా అది కాలక్షేపం కిందికే వస్తుంది. ఉదాహరణకి వందరూపాయల కాగితం మనకి శీఘ్రప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది నిజం. ఈ కాగితానికింతటి శక్తి ఉందని గ్రహించి ఆ వంద రూపాయల నోటుని పెద్ద విగ్రహంగా చేసి పూజలు పురస్కారాలు చేస్తున్నామా? ఆ నోటుని సంపాదించగల తీరుతెన్ను ఎలాగని మాత్రమే ఆలోచిస్తున్నాం. శ్రమిస్తున్నాం. సాధించుకోగలుగుతున్నాం. దైవవిషయం కూడా అంతే. ఎంత ఎత్తుగా విగ్రహాన్ని స్థాపించామనేది లెక్క కాదు. ఆ విగ్రహం యేడుందో, ఆయనని గురించిన తత్త్వం ఎవరికెంత బోధపడిందనేది గ్రహించుకోవడం, వ్యాప్తి చేయడం ముఖ్యం.

బాబా దగ్గరికొచ్చే అందరు భక్తులూ భక్తులు కాదని ఆయనకీ తెలుసు. చూడ్డానికొచ్చేవారూ, నమ్మకం కుదిరితే మరోమారు వద్దామనుకునేవారూ, ఎలాగూ వచ్చాం కాబట్టి చూసేసి పోదాంలే అనుకునే వారూ, ఇంత ద్రవ్యం వస్తుంటే చక్కని సౌధాల్లో ఉండకుండా ఈ మసీదు గోడ ఏమిటని అనుకునే వారూ, ఎందరో ఉన్నారనీ ఉంటారనీ ఆయనకి తెలుసు. కేవలం ఇనుముని మాత్రమే అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో అలా.. ఎవరు ప్రశాంత హృదయులై ఉంటారో, దుర్బుద్ధి లేకుండా ఉంటారో, వాళ్లు మాత్రమే సూదుల్లా అవుతూ బాబా అనే అయస్కాంతానికి ఆకర్షింపబడి, ఇక ఆయనతోనే తన జీవితమనుకుంటూ ఉండిపోతారు. అలాంటి బలమైన సూదిలాంటివాడు ‘హేమాడ్‌ పంత్‌’. మరో సూది రోహిల్లా.ఈ సూదికీ, అయస్కాంతానికీ మధ్య ఏది ఉన్నా ఆకర్షణ శక్తి పనిచేయదు. ఆ అడ్డుగా ఉండే దుర్బుద్ధికి సంకేతమైన రోహిల్లా భార్య వంటి దాన్ని తీసెయ్యండంటూ సాయి ఉపదేశించాడు షిరిడీ ప్రజలకనేది రోహిల్లా కథలోని దివ్యోపదేశ సారాంశం.

దుర్బుద్ధివల్ల నష్టం ఎవరికి?
ముగింపులో ఒక్క మాటనుకుందాం. బుద్ధి అనేది ఎప్పుడుందో, ఒక్కోసారి దుర్బుద్ధి అనేది కూడా ఉండి తీరుతుంది. నీళ్లున్నప్పుడు ఏ దుమ్మో, ధూళో.. పడ్డప్పుడు ఆ నీళ్లు అపరిశుభ్రం కావడం సర్వసాధారణం. అలాగే, బుద్ధి కూడా వ్యక్తి స్వభావాన్ని బట్టి ఒక్కోసారి దుర్బుద్ధిగా కావడం, లేదా ఎవరో ఒకరి ప్రభావం తీవ్రాతి తీవ్రంగా మన బుద్ధి మీద పనిచేసిన సందర్భంలో దుర్బుద్ధిగలవాళ్లుగా మారడమనేది అసహజం, అసాధారణమైన అంశం కానే కాదు.ఒక్క అంశాన్ని చూసి ముగిద్దాం! భారతంలో ధర్మరాజుదే రాజ్యం నిజానికి. కారణం ధర్మరాజు తండ్రి పాండురాజునే రాజ్యం అనువంశికంగా సంక్రమించింది కాబట్టి. ధృతరాష్ట్రుడు పెద్దవాడే అయినప్పటికీ పుట్టుకతో వచ్చిన గుడ్డితనమనేది రాజుగా పట్టాభిషేకానికి అర్హతని కలిగించలేదు కాబట్టి. పైగా ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిపోయింది కూడా. ఇంతవరకూ సద్బుద్ధే కథని నడిపింది.

దుర్బుద్ధి ప్రవేశించింది (రోహిల్లా భార్య) దుర్యోధనునిలో. అధర్మంగా రాజ్యాన్ని చేజిక్కించుకోవలసిందేనని. దాని కోసం తండ్రి మెడల్ని వంచి జూదానికొప్పించాడు. ఇక్కడ కూడా రోహిల్లా భార్య ప్రవేశించింది. అధర్మంగా జూదాన్ని ఆడాక ద్రౌపది వస్త్రాపహరణ మెందుకు? దానివల్ల రాజ్యం వస్తుందా? వాళ్లందరినీ ఇంకా అవమానపరచాలి (రోహిల్లా భార్య మళ్లీ ప్రవేశించింది).12 సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తూ చివరి అజ్ఞాతవాసంలో గాని పాండవుల జాడ తెలిస్తే మళ్లీ 12+1 చేయాల్సిందేననే తీర్మానం మీద మళ్లీ జూదం. పాండవులు ఆ శిక్షని కూడా పూర్తి చేసుకుని 13 ఏళ్ల పిమ్మట విజయవంతంగా తిరిగొస్తే... రాజ్యం ఇచ్చి తీరాలి కదా మాట ప్రకారం(మళ్లీ రోహిల్లా భార్య ప్రవేశం). అయినా రాజ్యాన్నియ్యం అని మొండికేస్తే భగవంతుడు కూడా ఇది తప్పని వారిస్తే కూడా వినని స్థాయికెళ్లి వంశనాశనాన్ని చేసుకున్నారు కౌరవులు.దుర్బుద్ధికి సంకేతమైన రోహిల్లా భార్యవల్ల, ఆమె ఎవరిలో ప్రవేశిస్తే వాళ్లే నాశనమౌతారు తప్ప మరెవరూ నష్టపోరు, ఇదీ సాయి మాట్లలోని సారాంశం. కాబట్టి సద్బుద్ధి కలవాళ్లై జీవించండి, అని చెప్పడం ఆయన బోధనలోని దివ్యోపదేశం. ఇక సాయినాథుని అవతరణ గురించి త్రివేణి సంగమ స్నానాన్ని ఎలా దాసగణు అనే భక్తునికి చేయించాడో ఆ విశేషాన్ని చూద్దాం.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement