మగ బాస్‌  | seen is ours tittle is yours | Sakshi
Sakshi News home page

మగ బాస్‌ 

Published Sun, Jun 24 2018 12:02 AM | Last Updated on Sun, Jul 1 2018 12:22 AM

seen is ours tittle is  yours - Sakshi

తెలుగు రొమాంటిక్‌ కామెడీ సినిమాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల జాబితాలో ఉండే ఓ సూపర్‌హిట్‌ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

ఆఫీస్‌లో కొత్తమ్మాయి చేరింది. హారిక. అందరూ పరిచయం చేసుకున్నారు. అభిరామ్‌ రాగానే హారిక అతనితో మాట కలుపుతూ పరిచయం చేసుకోబోయింది. అభిరామ్‌ కోపంగా చూశాడు. తాను కొత్తగా జాయిన్‌ అయిన అసిస్టెంట్‌ మేనేజర్‌ని అని చెప్పుకుంది. అభిరామ్‌ ఆ ఆఫీస్‌లో మేనేజర్‌. ఆ పదవి విషయం అలా ఉంచితే, నిజానికి అతనిదే ఆ సంస్థ. రావడమే ఆమెతో మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేని వాడిలా తన క్యాబిన్‌కు వెళ్లిపోయాడు. అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఒకమ్మాయి తన ఆఫీసులో పనిచేయడం అభికి ఇష్టం లేదు. ఈ విషయమ్మీద ఇంట్లో తన బాబాయ్‌తో గొడవ పడ్డాడు కూడా. ఆ పదవికి అనే కాదు, తన ఆఫీసులో ఏ పనీ అమ్మాయిలు చెయ్యడం అతనికి నచ్చదు. ఆఫీసు నుంచి బయటికెళ్లినా అమ్మాయిలను చూస్తే విసుక్కుంటాడు. వాళ్లతో మాట్లాడాలంటేనే చిరాకు. అదొక వింత జబ్బు అని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకుంటున్నా బాస్‌ అన్న కారణంతో సుబ్బారావు తన పెళ్లికి అభిని పిలవడానికి వచ్చాడు – ‘‘మీ ఆశీర్వాదం కావాలి సార్‌!’’ అన్నాడు.

‘‘పుట్టినరోజా?’’‘‘రేపు నా పెళ్లి సార్‌!’’‘‘పెళ్లా.. ఎందుకు?’’ అరిచినట్టు అడిగాడు అభి. ‘‘ఎవరైనా పెళ్లంటే ఎప్పుడు అని అడుగుతారు. మీరేంటి సార్‌ ఎందుకు అని అడుగుతున్నారు?’’ ‘‘అందుకే అడుగుతున్నాను. ఎందుకు?’’‘‘భోజనానికి కష్టమైపోతోంది సార్‌!’’‘‘కుక్‌ని పెట్టుకో..’’ ‘‘ఇల్లు చూస్కోవడానికి కూడా ఎవ్వరు లేరు సార్‌..’’‘‘కుక్కని పెంచుకో..’’‘‘ఇప్పటికిప్పుడు కట్నమిచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్‌?’’‘‘సెటైరా?’’‘‘మీతో సెటైరేస్తే రిటైరైపోతానని తెలుసు సార్‌’’ ‘‘ఎన్నైనా చెప్పు సుబ్బారావు.. నువ్వు పెళ్లి చేస్కోవడం నాకిష్టం లేదయ్యా!’’ అభి మాట్లాడుతూ పోతున్నాడు. అతనికి పెళ్లెందుకు ఇష్టం లేదంటే మళ్లీ కారణం ఒక్కటే, అమ్మాయిలంటే అతనికి కోపం. అతనికి ఆ కోపం రోజురోజుకీ ఎక్కువైపోతూనే ఉంది. హారిక అంటే ప్రత్యేకంగా కోపం లేకపోయినా ఆమెపై కూడా విసుక్కుంటున్నాడు, ఒక్కోరోజు ఒక్కో కారణంతో. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు హారిక తన పెళ్లి కుదిరిందంటూ ఆఫీస్‌లో అందరికీ స్వీట్లు పంచుతోంది. ‘‘బాస్‌కి ఈ విషయం చెప్పారా?’’ హారికను అడిగింది ఒక కలీగ్‌. ‘‘ఆయనకా? పెళ్లిళ్లు కుదరడం, ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ గెలవడం.. ఇలాంటి శుభవార్తలు అలాంటి వాళ్లకు చెప్పకూడదు..’’ ‘‘చెప్తే ఏడుస్తాడు.’’‘‘అహా! వాడు ఏడ్చే టైప్‌ కాదు.. ఏడిపించే టైపు..’’ హారిక గట్టిగా నవ్వుతూ ఈ మాటన్నప్పుడు అక్కడికి వచ్చాడు అభి. ‘‘నా గురించి అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావు?’’ హారిక మౌనంగా నిలబడింది. అభి మాట్లాడుతూ పోతున్నాడు – ‘‘ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్‌షాపా.. నీకు నెలకు ముప్ఫై వేలు జీతం. రోజుకి వెయ్యి రూపాయలు. ఇలా రోజూ గంటసేపు స్వీట్లు పంచిపెడుతూ, ఇంకో గంట దాని టేస్టుగురించి మాట్లాడుతూ టైమ్‌ వేస్ట్‌ చేస్తే.. నీ జీతం నీకు వచ్చేస్తుంది. కానీ మాకు బోలెడంత లాస్‌ వస్తుంది. ఆ లాస్‌తో పాటు మా మీద జోకులు, సెటైర్లు... అసలు నిన్ను కాదులే.. నీలాంటివాళ్లను వెతికి మరీ తీసుకొచ్చాడే, అందుకు మా బాబాయ్‌ని అనాలి. ఇన్నాళ్లూ నీకు పని రాదనుకున్నాను. కానీ ఇప్పుడర్థమైంది.. అసలు నువ్వు పనికిరావు’’.ఆఫీస్‌లో అందరిముందూ డస్ట్‌బిన్‌తో హారికను పోల్చాడు అభి. హారిక అక్కడే, ఆ అందరిముందే ఏడ్చేసింది. ఆ తర్వాత పదో నిమిషం.. ‘‘నా రిసిగ్నేషన్‌ లెటర్‌ సార్‌’’ అంటూ చైర్మన్‌ క్యాబిన్‌లో నిలబడింది. ‘‘ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లమ్‌?’’ ‘‘మీ అబ్బాయి సార్‌! మొదట్లో ఆయన నన్ను తిడుతుంటే నా పని నచ్చలేదేమో అనుకున్నా సార్‌. కానీ నేనే నచ్చలేదు. నెలకోసారి జీతమిస్తున్నారు కదాని, గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదు సార్‌..’’‘‘వాడి ప్రవర్తన నచ్చక రిజైన్‌ చేస్తున్నానని చెప్పావు. కానీ వాడెందుకలా బిహేవ్‌ చేస్తున్నాడో చెప్పలేదు.’’ ‘‘నాకు తెలీదు సార్‌!’’ ‘‘నాకు తెలుసు. నీకు వాడు రెణ్నెల్ల నుంచి మాత్రమే తెలుసమ్మా! కానీ నాకు వాడు రెండేళ్ల వయసప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదమ్మా! వాడు వేరు. వాడి కోపం ప్రళయం. వాడి ప్రేమ సముద్రం. వాడి జాలి వర్షం..’’ అభిరామ్‌ గతాన్ని చెబుతూ వచ్చాడు బాబాయ్‌. 

అభిరామ్‌ గతాన్నంతా తెలుసుకున్నాక హారిక ఒక్క మాట మాట్లాడకుండా అభిరామ్‌ బాబాయ్‌నే చూస్తూ కూర్చుంది. ఆమె కళ్లలో నీళ్లు. ‘‘నేను నీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నువ్వు వాడ్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు. అసహ్యించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను.’’ చివరగా ఈ మాట చెప్పి ముగించాడు బాబాయ్‌. చైర్మన్‌ క్యాబిన్‌లోంచి హారిక బయటకు రావడం కోసం ఎదురుచూస్తున్నాడు అభి. కచ్చితంగా ఆమెను ఉద్యోగం నుంచి తప్పించి ఉంటారన్న నమ్మకంతో సుబ్బారావుతో కబుర్లు చెబుతూ ఎదురుచూస్తున్నాడు. హారిక వచ్చింది. ‘‘నాకు ప్రమోషన్‌ ఇచ్చారు’’ అంటూ అభి చేతిలో ఒక లెటర్‌ పెట్టింది. ‘‘ప్రమోషనా? బాబాయ్‌ నిన్ను సస్పెండ్‌ చెయ్యలేదా?’’ అమాయకంగా అడిగాడు అభి.‘‘మేనేజర్‌గా ప్రమోట్‌ చేశారు.’’‘‘మేనేజర్‌గానా? మరి నేను?’’‘‘మిమ్మల్ని సస్పెండ్‌ చేశారు.’’ ‘‘నన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?’’ ‘‘ఎక్కువ షాకవ్వద్దు. ఆ లెటర్‌ చదువుకోండి’’ అంది హారిక. తాను సస్పెండ్‌ అయినట్టు ఆ లెటర్‌ చదువుకొని ఎగిరిపడ్డాడు అభిరామ్‌. ఇంట్లో బాబాయ్‌తో గొడవపడితే హారిక వదిలేసిన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్ట్‌ ఒక్కటే మిగిలింది అతనికి. బాబాయ్‌తో హారిక ఏం మాట్లాడిందో తెలియని, హారికకు తన గతం తెలిసిందని తెలియని అభిరామ్, ఇప్పుడామె కింద పనిచెయ్యాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement