జ్ఞాపకాలే మిగిలాయి! | short stories in funday | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాలే మిగిలాయి!

Published Sat, Nov 7 2015 11:21 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

జ్ఞాపకాలే మిగిలాయి! - Sakshi

జ్ఞాపకాలే మిగిలాయి!

మార్చి 26, 2006... టోక్యో (జపాన్)...
 తడబడుతోన్న పాదాలను అదుపు చేసుకుంటూ మెల్లగా లోనికి ప్రవేశించాడు బిల్ హాకర్. లోలోపల ఏదో భయంగా ఉంది. ఎంతగా అణచుకుందామన్నా దుఃఖం పొంగుకొస్తోంది. ఓ క్షణం ఆగి, ఖర్చీఫ్‌తో కళ్లు ఒత్తుకున్నాడు.
 
 ‘‘బాధపడకండి అంకుల్... మీరు భయపడినట్టు ఏమీ జరగదు’’... అన్నాడు పక్కనున్న యువకుడు. తల పంకించి ముందుకు నడిచాడు బిల్.
 ‘‘కూర్చోండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ఇద్దరూ కూర్చున్నారు.
 ‘‘మా అమ్మాయి లిండ్సీ రెండు రోజు ల్నుంచి కనబడటం లేదట సర్. ఎక్కడికి వెళ్లిందో తెలియదట. నాకు భయంగా ఉంది’’... బిల్ గొంతు వణికింది.
 
 ‘‘అట అంటున్నారు. తను మీతో ఉండదా?’’
 ‘‘లేదు సర్. మేం బ్రిటన్ నుంచి వచ్చాం. లిండ్సీ రెండేళ్లుగా ఇక్కడి నోవా ఇంగ్లిష్ కాన్వర్సేషన్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తోంది. మరో ఇద్దరు టీచర్లతో కలిసి స్కూలు వాళ్లు ఇచ్చిన ఓ అపార్ట్‌మెంట్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం బయటకు వెళ్లి తిరిగి రాలేదట.’’
 ఇన్‌స్పెక్టర్ నవ్వాడు. ‘‘వయసులో ఉన్న అమ్మాయి. ఏ బాయ్‌ఫ్రెండ్‌తోనో డేట్‌కి వెళ్లి ఉంటుంది. వచ్చేస్తుందిలెండి.’’
 
 ‘‘మర్యాదగా మాట్లాడండి సర్’’ అరిచినట్టే అన్నాడా యువకుడు. ‘‘వయసులో ఉన్న అమ్మాయైతే, ఎలా పడితే అలా తిరిగేస్తుందా?’’
 ఇన్‌స్పెక్టర్ ముఖం సీరియస్‌గా అయ్యింది. ‘‘మీరెవరు?’’ అన్నాడు.
 
 ‘‘జాక్... లిండ్సీకి కాబోయే భర్తని.’’
 ‘‘సారీ మిస్టర్ జాక్’’.. తొదరపాటుకు సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘లిండ్సీ ప్రతి చిన్న విషయమూ మాకు చెప్పే చేస్తుంది సర్. మరి మాకు గానీ రూమ్మేట్స్‌కి గానీ చెప్పకుండా, స్కూల్లోనూ ఇన్‌ఫామ్ చేయకుండా రెండు రోజుల పాటు ఎక్కడికి వెళ్తుంది? తనకేదైనా అయ్యిందేమోనని కంగారుగా ఉంది’’... బిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
 
 ‘‘కంగారు పడకండి. నేను ఎంక్వయిరీ చేస్తాను. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లండి.’’ సరేనని తాము ఉంటోన్న హోటల్ వివరాలు ఇచ్చి బయలుదేరారు ఇద్దరూ.
     
 ‘‘ఏంటి ఇన్‌స్పెక్టర్... ఎందుకు అర్జెంట్‌గా రమ్మన్నారు? ఈ ఫ్లాట్ ఎవరిది?’’... లోపలికి అడుగు పెడుతూనే ఆతృతగా అడిగాడు బిల్. ఇన్‌స్పెక్టర్ జవాబు ఇవ్వలేదు. ‘‘నాతో రండి’’ అంటూ బాల్కనీ వైపు నడిచాడు. బిల్, జాక్ అతణ్ని అనుసరించారు.
 
 బాల్కనీ అంతా మురికి మురికిగా ఉంది. మొక్కలు లేని పూల కుండీలు, విరిగిన వస్తువులు.. ఏవేవో పడివున్నాయి.  
 
 ‘‘మిస్టర్ బిల్... మీ అమ్మాయి జాడ తెలిసింది. తను ఇక్కడే ఉంది.’’
 అయోమయంగా చూశాడు బిల్. అతని చేయి పట్టుకున్నాడు ఇన్‌స్పెక్టర్. బాల్కనీలో ఓ మూలగా ఉన్న బాత్‌టబ్ దగ్గరకు తీసుకెళ్లాడు. దానివైపు చూస్తూనే కుప్పకూలిపోయాడు బిల్.
 బాత్ టబ్ నిండా ఇసుక ఉంది. ఆ ఇసుకలో కూరుకుపోయి ఉంది లిండ్సీ. ముఖం, ఒక చేయి మాత్రమే కనిపిస్తు న్నాయి. దేహం అప్పటికే కుళ్లిపోవడం మొదలైందన్నట్టుగా దుర్వాసన వస్తోంది.
 
 ‘‘లిండ్సీ... నా చిట్టితల్లీ... ఎంత ఘోరం జరిగింది? ఎవరు ఇంత పని చేసింది?’’ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు బిల్. అతణ్ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఏడ్చి ఏడ్చి కాసేపటికి నెమ్మదిం చాడు. ‘‘ఇన్‌స్పెక్టర్... నా బిడ్డ ఎవరికేం అన్యాయం చేసింది? ఎవరు చేశారీ ఘాతుకం? వాళ్లని వదిలిపెట్టొద్దు’’... అన్నాడు స్థిరంగా.
 
 ‘‘డోన్ట్ వరీ మిస్టర్ బిల్. వాడు దొరికి నట్టే దొరికి పారిపోయాడు. కానీ ఎంత కాలం పారిపోతాడు?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ పిడికిలి బిగిస్తూ.
 
 ‘‘ఎవరు సర్ వాడు?’’... దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు జాక్. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ చెప్పిన విషయాలు విని వాళ్ల మనసుల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి.
     
 ‘‘హాయ్ లిండ్సీ? ఎలా ఉన్నారు?’’
 లోకల్ ట్రైన్‌లో కూర్చుని పుస్తకం చదువుకుంటోన్న లిండ్సీ... ఎవరో అపరిచిత వ్యక్తి తనను పలుకరించేసరికి తలెత్తి చూసింది. ‘‘నేను మీకు తెలుసా?’’ అంది అతణ్ని పరికించి చూస్తూ.    
  తల పంకించాడా యువకుడు. ‘‘బాగా తెలుసు.
 
 మీరు నోవా స్కూల్లో ఇంగ్లిష్ టీచర్. మరో ఇద్దరు టీచర్లతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకి స్కూల్‌కి వెళ్తారు. మధ్యాహ్నం క్యాఫ్టీరియాలో లంచ్ చేస్తారు. సాయంత్రం నాలుగింటికి స్కూల్ నుంచి బయలుదేరుతారు. లోకల్ ట్రైన్‌లో ఇంటికి చేరుకుంటారు.’’
 ఆశ్చర్యంగా చూసింది లిండ్సీ.
 
 ‘‘అంతే కాదు. మీ అపార్ట్‌మెంట్‌కి కాస్త దూరంలో ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్లో రోజూ చాకొలెట్ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాతే ఇంటికెళ్తారు. ఆ ఐస్‌క్రీమ్ అంటే మీకు పిచ్చి. అది తిని బతికేయగలరు మీరు.’’
 
 పకపకా నవ్వింది లిండ్సీ. ‘‘ఓ మై గాడ్. నా గురించి ఇంత తెలుసా? కొంపదీసి మీరు నా సైకో లవరా? నన్ను ఫాలో అవుతున్నారా ఏంటి?’’
 ఈసారి అతను నవ్వాడు. ‘‘అదేం లేదులెండి. నేను మీ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నాను. నేను పనిచేసే కంపెనీ ఏమో, మీ స్కూల్‌కి దగ్గర్లో ఉంది. పైగా మనిద్దరి పని వేళలూ ఒకటే. సో, మీరు నాకు తరచూ తారసపడతారు. అలా ఈ విషయాలు తెలిశాయి’’ అన్నాడు భుజాలు ఎగరేస్తూ. ‘‘ఇంతకూ నా పేరు చెప్పలేదు కదూ... తత్సుయా ఇషియాషీ.’’
 
 అతను మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేసింది లిండ్సీ. హావభావాలు, ఆహార్యం అన్నీ మర్యాదగా, వినయంగా ఉన్నాయి. దాంతో మాటల్లో పడింది. రైలు దిగి అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లేవరకూ మాట్లా డుకుంటూనే ఉన్నారు. ఆమె అపార్ట్‌మెంట్ సమీపిస్తుండగా అతను అన్నాడు.
 ‘‘నాకో చిన్న సాయం చేయగలరా? నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే ఇంగ్లిష్ సరిగ్గా రాదు. నాక్కూడా ఇంగ్లిష్ నేర్పిస్తారా? కావాలంటే ఫీజు ఇచ్చేస్తాను.’’
 
 ‘‘భలేవారే. తప్పక నేర్పుతాను. కాక పోతే దానికి మా స్కూలువారి అనుమతి కావాలి. వాళ్లనడిగి చెప్తాను’’ అని లోపలికి వెళ్లిపోయింది లిండ్సీ. అతను తన ఇంటివైపు నడక సాగించాడు.
 
 తర్వాతి రోజు మళ్లీ లోకల్ ట్రైన్‌లో కలిశాడు ఇషియాషీ. రైలు దిగాక ఐస్‌క్రీమ్ తిన్నారు. తర్వాత అతణ్ని తన ఇంటికి ఆహ్వానించింది లిండ్సీ. అప్పుడే తాను గీసిన లిండ్సీ బొమ్మని ఆమె ఫ్లాట్‌లో గోడకు అతికించాడు ఇషియాషీ. దానిపై తన పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ రాశాడు. స్కూలువారు అనుమతించారని, మర్నాటి నుంచే క్లాసులు మొదలుపెడతానని లిండ్సీ చెప్పడంతో పొంగిపోయాడు.
 
 మర్నాడు ఓ రెస్టారెంటులో ఇంగ్లిష్ పాఠం బోధించింది లిండ్సీ. తర్వాత ఇళ్లకు బయలుదేరారు. ‘నేను మీ ఇంటికొచ్చాను కదా, మీరూ మా ఇంటికి రండి’ అన్నాడు ఇషియాషీ. ముందు కాదన్నా, బలవంతం చేయడంతో వెళ్లింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. అతడు క్యాజువల్‌గా ఆమెని పిలవ లేదు.
 
 అసలు ఆమెను అతడు కలవడం వెనుకే పెద్ద ప్లాన్ ఉంది. అది తెలియని లిండ్సీ అమాయకంగా వెళ్లింది. ఆ అవ కాశం కోసమే చూస్తోన్న ఇషియాషీ నిజ స్వరూపాన్ని చూపించాడు. అత్యాచారం చేయబోయాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన లిండ్సీ తిరగబడింది. దాంతో దొంగదెబ్బ తీసి ఆమెను తీవ్రంగా గాయ పర్చాడు. కోరిక తీర్చుకుని చంపేశాడు.  బాత్రూమ్‌లో ఉన్న పాత బాత్‌టబ్‌ని బాల్కనీలోకి మార్చి ఇసుకతో నింపాడు. అందులో లిండ్సీని పూడ్చిపెట్టాడు.
 
 మనిషిని సమాధి చేయగలిగాడు కానీ, సాక్ష్యాలను చేయలేకపోయాడు. కంప్లయింట్ రాగానే పోలీసులు లిండ్సీ ఫ్లాట్‌కి వెళ్లారు. అక్కడ లిండ్సీ గదిలోని బొమ్మ మీద ఇషియాషీ వివరాలు కనిపిం చాయి. దాంతో అతని ఫ్లాట్‌కి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో మాటు వేశారు. రాత్రి అయ్యాక ఇంట్లో లైటు వెలిగినట్టు అనిపించింది. బయట తాళం పెట్టి, కిటికీ ద్వారా లోపలికెళ్లి దాక్కున్నాడని అర్థమై పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ అతను చిక్కలేదు. తప్పించుకున్నాడు. ఇల్లంతా సోదా చేస్తే బాల్కనీలోని తొట్టిలో లిండ్సీ మృతదేహం కనిపించింది.
     
 ‘‘ఇలాంటి రాక్షసులు ఉంటారనే నా కూతురికి కరాటే కూడా నేర్పించాను సర్. అయినా ఇలా జరిగింది. తన మనసు చాలా మంచిది. అంత మంచిదానికి ఎవరు చెడు చేస్తారులే అన్న ధైర్యంతో ఇంత దూరం పంపించాను. కానీ మంచి కంటే చెడుకి బలం ఎక్కువ అని మరోసారి నిరూపణ అయ్యింది.’’
 
 మనసు చివుక్కుమంది ఇన్‌స్పెక్టర్‌కి. ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాడు... ఎలాగైనా ఆ తండ్రికి న్యాయం చేయాలి, లిండ్సీ ఆత్మకి శాంతి కలిగించాలి అని. చివరికి అనుకున్నది సాధించాడు. ఇషియాషీని పట్టుకున్నాడు. కోర్టులో నిలబెట్టి జీవిత ఖైదు వేయించాడు.
 తీర్పు వెలువడిన రోజు లిండ్సీ సమాధి దగ్గరకు వెళ్లాడు బిల్.
 
  ‘‘క్షమించు తల్లీ. కన్నవాడిగా నిన్ను కాపాడుకోలేక పోయాను. నిన్ను కడతేర్చినవాడికి కనీసం మరణశిక్ష కూడా వేయించలేకపోయాను. తండ్రిగా నేను ఓడిపోయాను. నన్ను క్షమించు’’ అంటూ విలపించాడు. అతడి అశ్రుధారలు లిండ్సీ సమాధిని తడిపే శాయి. బహుశా ఆ క్షణం... స్వర్గంలో ఉన్న లిండ్సీ కళ్లు కూడా తడిసే ఉంటాయి!    
 - సమీర నేలపూడి      
 
 పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపం మార్చేసుకున్నాడు ఇషియాషీ. దాంతో అతని పోస్టర్లు నగరమంతా అంటించినా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. చివరికి ఓ డిటెక్టివ్ సాయంతో మూడేళ్లకు పట్టుకో గలిగారు పోలీసులు. ప్రస్తుతం జపాన్ లోని ఓ జైల్లో జీవితై ఖెదును అనుభ విస్తున్నాడు ఇషియాషీ. తనను క్షమించ మంటూ లిండ్సీ తండ్రికి ఓ లేఖ రాశాడు. ‘అన్‌టిల్ ఐ వజ్ అరెస్టెడ్’ అనే పుస్తకం రాసి, దానిపై వచ్చే రాయల్టీ అంతా లిండ్సీ కుటుంబానికి చెందేలా చేశాడు. కానీ ఆ రాయల్టీని, అతని క్షమాపణని కూడా లిండ్సీ కుటుంబం తిరస్కరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement