ఆజన్మం : సెలైంట్ మోడ్ జీవితం | silent mode life | Sakshi
Sakshi News home page

ఆజన్మం : సెలైంట్ మోడ్ జీవితం సెలైంట్ మోడ్ జీవితం

Published Sun, Oct 27 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

ఆజన్మం :   సెలైంట్ మోడ్ జీవితం

ఆజన్మం : సెలైంట్ మోడ్ జీవితం

 ఆ లెక్కన, ఆ ఆర్కే అమ్మమ్మకూ, రేపు రాబోయే ఈ నాన్నమ్మకూ మధ్యన దాదాపు పది తరాల అంతరం ఉంటుంది!
 పత్రికలవాళ్ల కోసమని ఏర్పాటైన ‘పాస్‌పోర్ట్ మేళా’కు వెళ్లడానికి ధ్రువీకరణ పత్రాలను చివరిసారిగా చెక్ చేసుకున్నాను. టెన్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వన్ ఇయర్ బ్యాంకు స్టేట్‌మెంట్, ఆఫీస్ ఐడీ కార్డు... ఒరిజినల్సు, జిరాక్సులు... ఎంత అలౌకికంగా బతుకును వెళ్లదీద్దామనుకున్నా, ఇహపు వాస్తవికతను విస్మరించలేం! పైగా, చేతిలోకి వస్తున్నప్పుడైనా తీసుకోవాలన్న చిరు చాపల్యం! డబ్బులు, సెలవుల వెసులుబాటు ఉంటే గనక ఐరోపా యాత్ర చేయలేకపోయినా, వితంలో ఎప్పటికైనా కనీసం భూటాన్, శ్రీలంకైనా చూడాలని నా ఆశ!


 దాదాపుగా మిట్ట మధ్యాహ్నం. చౌరస్తాలో మిత్రులతో కలిసి ఆటోకోసం చూస్తున్నా. వేగంగా కదిలిపోతున్న ట్రాఫిక్‌లో, ఖరీదైన వాహనాల మధ్య, రిక్షా తొక్కుతూ ఒక చొక్కాలేని నల్లటి పలుచటి చెమటోడుతున్న శరీరం! పొడవాటి ఇనుపచువ్వలు వేసుకెళ్తున్నాడు. ఆ చిట్టచివరి శక్తి ప్రయోగిస్తే తప్ప పెడల్ కిందికి వెళ్లనంత బరువుగా ఉన్నట్టున్నాయవి! కూడదీసుకుంటూ అతను మూల మలుగుతున్నాడు.
 
 కొంత జరుగుబాటు ఉన్న కుటుంబంలో పుట్టడం కూడా ఒక్కోసారి పశ్చాత్తాపం పుట్టిస్తుంది. నా టక్కు, బూట్లు, చేతిలో ఉన్న ఫైలు ఉత్త అబద్ధాలు! నేను నోరు తెరుచుకుని చూస్తుంటే-‘‘ఏంటీ, వీడి మీద కూడా ఏమైనా రాస్తారా?’’ అన్నాడు పక్కనున్న స్నేహితుడు.
 
 ఆ చెమటను ఎటూ తుడవలేం. కనీసం తను వీడు అనకుండా ఉండాల్సింది! ఇతరత్రా చాలా పద్ధతిగా ఉండే ఆ సహచరుణ్ని నేను ఈ ‘కాలమ్ కోర్టు’కు ఈడ్వలేను; అతడు యధాలాపంగా ఆ మాట అనివుండొచ్చు; కానీ యధాలాపంగా కూడా అనకుండా అడ్డుకోగలిగేదేదో మన శరీరాల్లో నిర్మాణం కావాలని నేను కోరుకుంటాను.
 
 పాస్ట్‌పోర్టు పనికి ఆధార్ కార్డు, టెన్తు సర్టిఫికెట్లు సరిపోయాయి. మళ్లీ ఆఫీస్. మళ్లీ రొటీన్. మళ్లీ సైనాఫ్. ఎప్పుడు మొదలైందో తెలీదు; సన్నటి తలపోటు! దానికి పొగవైద్యం చేద్దామని సాయంత్రం అలా నడుస్తూ ఒక సందులోకి వెళ్లాను. పరిశుభ్రమైన వాతావరణం కాదు. నడిచిపోతుంది!
 అక్కడ ఒక జీన్సు ప్యాంటు యువకుడు దేనికోసమో వెతుకుతున్నట్టుగా అనిపించింది. ముఖంలో ఆందోళన!
 
 కాసేపటికి ఒక పెద్ద మూరెడు కట్టె ఎక్కడో సంపాదించుకొచ్చి, కుండీలోంచి కిందకు దొర్లిపోయిన చెత్తను పెకిలిస్తున్నాడు.
 
 ‘‘ఏం బోయిందే?’’
 ‘‘ఫోనన్నా!’’
 టాయ్‌లెట్‌కు వెళ్లి, ఈలోగా బస్సు వస్తే పరుగెత్తుకుంటూ వచ్చాడట. ఆ హడావిడిలో జేబులోంచి పడిపోయుంటుంది! నా ఫోన్ చేతిలోకి తీసుకుంటూ, ‘‘రింగివ్వక పోయావా?’’ అన్నాను. సెలైంటులో ఉందని చెప్పాడు. అయ్యో! మూడు ఫోన్లు పోయిన  బాధితుడిగా ఆ నొప్పి ఎలా ఉండగలదో నాకు తెలుసు. ఆ చెత్తకుప్పలో లఘుశంక ఖర్మేమిటి తనకు? సరైన పబ్లిక్ టాయ్‌లెట్లు కూడా లేనిది ఇదొక రాజధాని నగరం? ఫోన్ ఎంతకీ దొరకలేదు. పోయిందో, కొట్టేశారో!
 ఉన్నట్టుండి, పొద్దుటి నల్లటి చెమట శరీరం కళ్లముందు కదలాడింది. ఎంతమంది జీవితాలు ఇలా ‘సెలైంట్ మోడ్’లోనే ఉండిపోతున్నాయి!
 
 
 ఎప్పుడో చదివాను: ఆర్కే నారాయణ్ వాళ్ల అమ్మమ్మ ఇంగ్లీషు చదివేవారట! మా తాతకంటే వయసులో పెద్దవారైన ఆర్కే! వాళ్ల అమ్మమ్మ!! ఇంగ్లీషు!!! అలాంటిది, మా అమ్మ తెలుగు కూడా చదవలేదు. అంటే, ‘మా నాన్నమ్మకు ఇంగ్లీషు వచ్చు,’ అని రేపెప్పుడైనా నా మునిమనవడు చెప్పగలగాలంటే, మేము ఇంకెన్ని తరాలు ముందుకు జరగాలి! ఆ లెక్కన, ఆ ఆర్కే అమ్మమ్మకూ, రేపు రాబోయే ఈ నాన్నమ్మకూ మధ్యన దాదాపు పది తరాల అంతరం ఉంటుంది!
 
 పొద్దున పాస్‌పోర్ట్ ఆఫీసుకు వెళ్లేప్పుడు సెలైంటులో పెట్టుకున్న నా ఫోన్‌ను తిరిగి వాల్యూమ్ సెట్టింగ్స్‌లో ఐదింట ‘3’ చేసుకుని, బస్సెక్కాను. మెడలు, జడలు ఊరటనివ్వడం లేదు. నా బాధల్లా, ఆ నల్లరంగు చెమట శరీరపు మనవడైనా భూటాన్ వెళ్లడం గురించి కనీసం ఆలోచిస్తాడా?
 - పూడూరి రాజిరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement