‘నా భార్య చివరికోరిక ఈ ఇంట్లో గడపాలని...తన బ్రతుకు వెంటిలేటర్ మీద మృత్యువుకు కూతవేటు దూరంలో వుంది. ఇవి దేశదేశాల్లో వున్న నా ఆస్తులు. వీటన్నింటినీ నీ పేరుతో మార్చేస్తున్నా. ఈ ఒక్క ఇంటిని నాకు...ఇచ్చేయ్....లే...దా ..కనీసం నాకు నా భార్యకు మేమిద్దరమూ కన్ను మూసేవరకూ తల దాచుకోవడానికి ఆ...శ్ర....య...మి...వ్వు...’ ఏడుస్తున్నాడు చంద్రశేఖర్.
తన భార్యను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాడు చంద్రశేఖర్. మౌనంగా చూడ్డం...నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు. ఈ డబ్బు...హోదా...వ్యాపారసామ్రాజ్యం ఆమెను మాట్లాడించలేకపోతున్నాయి. ఆమె మనసును తేలిక పర్చలేకపోతున్నాయి.
దానిక్కారణం తనే....బాధగా కళ్ళు మూసుకున్నాడు.
కన్నీటి వెంటిలేటర్ మీద వుంది ఇందుమతి. కళ్ళ ముందు రెండు దృశ్యాలు ఒకే కాన్వాసు మీద తన బ్రతుకు చిత్రాన్ని రెండు బొమ్మలుగా చూపిస్తున్నట్టుంది. ఒకటి తెలుపు నలుపుల రసరమ్యమైన ప్రకృతి చిత్రమైతే, మరో దృశ్యభాగం వర్ణమయమే...కానీ వివర్ణమయమై ఉన్నట్టు ప్రకృతి గీసిన చిత్రంలా కాక, సాంకేతిక మాయాజాలంతో మాయచేసి గీసిన గాయంలా అనిపించింది.
ఇందుమతి మనసు స్వగతాన్ని, గతాన్ని ఆహ్వానించింది.
∙∙
పచ్చని పంటచేల పైట కప్పుకున్న పడతిలా వుందా ఊరు...ఊరి మధ్యలో పేడతో అలికి, మనసుతో ముగ్గులు వేసి...ప్రేమతో రంగులు అద్ది అనుబంధాలతో వెల్ల వేసి, తీర్చిదిద్దిన పర్ణకుటీరంలా ఉందా ఇల్లు....పాతకాలం నాటి ఆ ఇల్లు అమూల్యమైన తాళపత్రాల్లోని నిధిలా వుంది.పెరట్లో జామచెట్టు మీద వున్న జామకాయలు చిలుక కొరికిన తమ బుగ్గలను చూసుకుని కిందికి నేలమీదికి దుమికి ఆరగించమని తమ యజమానికి చెబుతున్నాయి.
చిలుక కొరికిన జామపళ్ళను తినడమంటే ఇందుమతికి ఎంతిష్టమో! నేరేడు పళ్ళు ఏరుకుని మరీ తింటుంది. సన్నజాజులు తానే స్వయంగా కోసి మాలకట్టి తన జడలో తురుముకున్నప్పుడు తన ఇంటి సన్నజాజుల వాసన...తన మదిలో ఎన్నెన్ని అనుభూతులను మిగిల్చాయో ఇందుమతికి మాత్రమే తెలుసు.
∙∙
భర్తది చిన్న వ్యాపారం...రోజూ మోపెడ్ మీద దగ్గర్లో వున్న పట్టణానికి వెళ్లి రాత్రి వరకు తిరిగివస్తాడు. ఒక్కోసారి తన కోసం మధ్యాహ్నమే వస్తాడు. ఒక్కోసారి కాదు అలాంటి చాలాసార్లు వచ్చాడు. వచ్చేప్పుడు కరూర్ సెంటర్‌లో చేసే వేడివేడి ఉల్లిపాయ పకోడీ భార్య కోసం తీసుకురావడం మర్చిపోడు. ఆ పకోడీ ఎక్కడ చల్లారుతుందోనని స్పీడ్ గా మోపెడ్ నడిపి రెండుమూడు సార్లు దెబ్బలు తగిలించుకున్నాడు.
రాత్రి కాగానే భర్త కోసం ఎదురుచూస్తుంది. ఏదో ఒకటి కొనుక్కొస్తాడు...వేడివేడి అన్నం చారు లేదా రసం, వడియాలు, గడ్డపెరుగు సిద్ధంగా ఉంటుంది. నేలమీద కూచోని పెద్ద పళ్లెంలో భర్త అన్నం కలుపుతాడు. ఆవకాయ పచ్చడితో ఒక వాయి కలిపి తనకు తన కొడుక్కి కూతురికి ముద్దలు కలిపి నోట్లో పెడుతాడు.
రాత్రిపూట తాను తన భర్త జామచెట్టు కింద కూచోని కిందపడ్డ జామకాయలో, నేరుడు పళ్ళో ఏరుకుంటూ తన కొంగుతో తుడిచి తింటూ కబుర్లు చెప్పుకోవడం ఆ ఇంట్లో నిత్యకృత్యం.
హాలులో పెద్ద జంపఖానా. తాను ఆ చివర, భర్త ఇటు చివర మధ్యలో కొడుకు కూతురు, పొద్దున్నే బాయిలర్‌లో నీళ్లు వేడి చేసుకోవడం, కట్టెల పొయ్యిమీద పొగగొట్టంతో కుస్తీపడుతూ ఉంటే భర్త వచ్చి తన కళ్ళను ఊది మంటను పోగొట్టడం.
పెరట్లో కాసిన కూరగాయలతో నవనవలాడే వంకాయ వేపుడు.
వేసవికాలం ఆరుబయట వెన్నెల్లో, వర్షాకాలం వర్షపుజల్లును కిటికీలో నుంచి చూస్తూ. చలికాలం మంచు వర్షాన్ని ఆస్వాదిస్తూ...రుతువులు ఏవైనా అనుభూతులను మాత్రం పదిల పర్చుకుంటూ...ఈ ప్రయాణంలో తమ వెంట వున్నవ్యక్తి చలమయ్య. పేరుకు ఆ ఇంట్లో పనివాడైనా తమ ఇంటివాడు. తమ ఆప్తుడు అనుకున్నారు. ఎప్పుడూ ఇందుమతికి సోదరుడిలా, వాళ్ళ పిల్లలకు మేనమామలా ఉండేవాడు. ఆ ప్రాంగణంలోనే ఒక చిన్నగదిలో చలమయ్య అతని భార్య ముగ్గురుపిల్లలు...గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆత్మాభిమానమే అతని ఆస్తి. భార్య పొలం పనులకు వెళ్తే పిల్లలు కూడా పూలమాలలు కట్టడం, గుడిని శుభ్రం చేయడం లాంటి పనులు చేసేవాళ్ళు. అందరూ కష్టపడాలని తత్త్వం. చేసిన పనికి ఎప్పుడూ జీతం తీసుకోలేదు. తాను ఉండడానికి ఇచ్చిన గదికి అద్దె లేకపోవడమే తనకు జీతంతో సమానమనేవాడు.
∙∙
కాలం తనపని తాను చేసుకుపోతూ ముందుకు వెళ్తోంది. ఇందుమతి భర్త చంద్రశేఖర్ క్రమక్రమంగా ఎదిగాడు. అంతస్తులో పెరిగాడు. అతని తెలివి, శ్రమ, నిజాయితీ వ్యాపార ప్రపంచంలో అతడిని ప్రముఖుడిని చేశాయి. కార్పొరేట్ వరల్డ్ అతనికి రెడ్ కార్పెట్ పరిచింది. హోదా ఆస్తి అంతస్తు...అన్నీ ఇచ్చింది.
పల్లెనొదిలి పట్టణానికి, పట్టణాన్ని వదిలి మహానగరానికి, రాష్ట్రరాజధానికి....అతని ప్రస్థానంలో అన్నీ ఉన్నత శిఖరాలే. ఉదయం వెళ్లి ఎంతరాత్రి అయినా ఇంటికి వచ్చే భర్త ఇప్పుడూ వస్తున్నాడు...కాకపోతే ఎక్కడికి వెళ్లినా రాత్రికల్లా ఫ్లైట్ లో...
మోపెడ్ స్థానంలో రేంజ్ రోవర్ జాగ్వార్ బీయండబ్లు్య కార్లు వచ్చి చేరాయి. మోపెడ్ స్టోర్ రూమ్ లోకి చేరింది. అతని స్థాయి...ప్రతీ రాష్ట్రంలో ఇళ్లస్థలాలు..విదేశాల్లో ఇళ్ళు. ఉదయం సిడ్నీలో ఉంటే మరుసటి రోజు ఇంగ్లాండ్‌లో. వారంలో ఏ రెండు మూడు దేశాలో తిరుగుతాడు....
ఇది ఇందుమతి బ్రతుకు కాన్వాసు మీద మరో వర్ణచిత్రం
∙∙
అలాంటి స్థితిలో తమ ఇల్లు ఒక చిన్న ఇసుకరేణువులా అనిపించింది. తన దగ్గర నమ్మకంగా వున్న చలమయ్యకు ఆ ఇంటిని కానుకగా ఇవ్వాలనుకున్నారు ఇందుమతి దంపతులు. ఆ విషయాన్నీ చెప్పి అతని కళ్ళలో ఆనందాన్ని చూడాలనుకున్నారు. కానీ వాళ్ళు విస్తుపోయేలా ఆ ఇంటిని కానుకగా స్వీకరించలేను అన్నాడు చలమయ్య.
ఇందుమతి చంద్రశేఖర్ దంపతులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. చివరికి ఒక్క షరతు మీద ఒప్పుకున్నాడు. ఆ ఇంటిని తనకు అమ్మాలన్నాడు. తన తాహతుకు దగ్గరగా ఉంటే కొనుక్కుంటానన్నాడు. అతని ఆత్మాభిమానం చూసిన ఇందుమతికి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఆ ఇంటి విలువ నిర్ణయించే బాధ్యత చలమయ్యకే అప్పగించింది ఇందుమతి.
చలమయ్య రాత్రి అంత భార్య పిల్లలతో చర్చించాడు. ఇన్నాళ్లు దాచుకున్న డబ్బు, తన పిల్లలు చిట్టి చేతుల్తో సంపాదించిన డబ్బు, తన భార్య పొలం పనులకు వెళ్లి సంపాదించిన డబ్బు...కలిపి పోగేస్తే ముప్పయిఆరువేల ఆరువందల యాభై రూపాయలు తేలింది. తన దగ్గర అంతే డబ్బు ఉందని అంతకు మించి లేదని ఆ ధరలో ఇల్లు కొంటానని, ఇంటి విలువను అపార్థం చేసుకోవద్దని చెప్పాడు చలమయ్య. ఆ డబ్బుతో ఆ ఇంటిని చలమయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు ఇందుమతి దంపతులు.
ఇది జరిగిన ముప్పై ఏళ్లలో ఎన్నో మార్పులు. చంద్రశేఖర్ ఎదుగుతూనే వున్నాడు. పారిస్‌లో కోట్ల విలువచేసే ఇంటిని కొనుగోలు చేసాడు. లెక్కలేనన్ని కార్లు ...ఆస్తులు....కానీ ఇందుమతిలో అసంతృప్తి. రోజురోజుకూ ఇందుమతి చిక్కిపోతుంది. పిల్లలు ప్రయోజకులు అయ్యారు. వ్యాపారాలు పిల్లలకు అప్పగించి సిడ్నీలోనో, మరో దేశంలోనో స్థిరపడాలనుకున్నాడు చంద్రశేఖర్. కానీ ఈ మధ్యకాలంలో భార్యలో చాలా మార్పును గమనించాడు.
అతను వృత్తిరీత్యా బిజినెస్‌మేన్.. కానీ భార్య అంటే ప్రాణం...అందుకే కారణం అడిగాడు.అప్పుడు నోరు విప్పింది ఇందుమతి. తన మనసు గొంతు విప్పి చెప్పింది. కన్నీటి స్వరపేటికను సవరించుకుని.
∙∙
మన ఉనికి కోసం, బ్రతుకు పోరాటంలో మనం చాలా దూరం ప్రయాణించాం.ఒక్కో అనుభూతిని వదులుకుంటూ పైకి ఎదిగాం. పదుల గదులు వున్నాయి. ప్రతీగదిలో ఖరీదైన ఏసీలున్నాయి. అయినా ఊపిరాడ్డం లేదు. గాలి సరిపోవడం లేదు. మన ఊళ్ళో, మన చిన్ని ఇంట్లో ఆరు బయట వెన్నెల్లో స్వచ్ఛమైన చెట్ల గాలి ఎంతో బావుంది.
నేల మీద మనం పడుకున్నప్పుడు వున్న సెక్యూర్డ్ ఫీలింగ్ నలుగురు పడుకునే ఈ ఖరీదైన బెడ్ మీద మీరో మూల నేనో మూల అన్నట్టుంది. ఎక్కడున్నా రాత్రయితే చాలు...మీరు తెచ్చే వేడివేడి ఉల్లిపాయ పకోడీ రుచి, వేడి అన్నంలో రసం వడియాలతో అన్నం తిన్న రుచి...నలుగురు వంటవాళ్లు వండిన నలభైరకాలైన రుచులలో కనిపించడం లేదండి..ఈ కోట్ల విలువ చేసే ప్యాలెస్‌లో నిద్ర పట్టడం లేదండి...
మీకోసం ఇంటి ముందు వరండాలో నిల్చున్నప్పుడు వున్న ఫీలింగ్.. మీకోసం ఎదురుచూసే సెక్యూరిటీ...మీరు రాగానే తెరుచుకునే ఆటోమేటిక్ డోర్స్.. అన్నింటినీ దాటుకుని నా గదిలోకి వచ్చి ఖరీదైన నెక్లస్ ఇచ్చినప్పుడు నాలో స్పందనలు కలుగడం లేదు...ఎందుకో మనం ఈ చివరి రోజులు మనకు ఇష్టమైన మన ఇంట్లో గడపాలనిపిస్తుంది. పెళ్ళైన రోజు నుంచి మిమల్ని ఏమీ అడగలేదు..ఈ కోరిక...ఆమె గొంతులో వణుకు....’
అతనికి అర్థమైంది..మనసు ఆర్ద్రమైంది.
బిజినెస్ పనుల వల్ల భార్య కోరికను నిర్లక్ష్యం చేసాడు. ఈ లోగా ఇందుమతి పరిస్థితి సీరియస్‌గా మారింది. మాట పడిపోయింది. చంద్రశేఖర్ కదిలిపోయాడు. తన భార్య కోర్కె తీర్చడానికి సిద్దమయ్యాడు. భార్య కోరికను తీర్చడం కష్టం కాదనుకున్నాడు. అది ఒకప్పుడు తను అమ్మిన తన ఇల్లు...పీఏను పిలిచాడు. ఆగమేఘాల మీద ఇండియా పంపించాడు...ఇరవై లక్షల రూపాయల క్యాష్...చలమయ్య కూడా ఊహించని అమౌంట్...అతను కొన్న ఖరీదుకు కొన్నిపదుల రెట్లుఎక్కువ....
సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత పీఏ దగ్గరి నుంచి ఫోన్...షాక్ కు గురి చేసే ఫోన్..
‘సారీ సర్ అతను అమ్మనంటున్నాడు’
‘వాట్?!’ చంద్రశేఖర్ ఊహించని సమాధానం
‘అతను అమ్మనంటున్నాడు సర్’ మరోసారి వినయంగా చెప్పాడు.
‘చూశావా ఇందుమతి...డబ్బుకోసం ఎంత నాటకమో....’ అంటూ పీఏ వైపు తిరిగి చెప్పాడు...నలభై లక్షలు ఆఫర్ చేయండి. రేపీపాటికి రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఇందుమతి గమనిస్తూనే వుంది....కానీ బదులు చెప్పలేదు.
మరో గంటలో పీఏ నుంచి ఫోన్....‘అయినా అమ్మనంటున్నాడు సర్’
చంద్రశేఖర్ అహం దెబ్బ తిన్నది.
‘యాభై అరవై..కోటి ..కోటి రూపాయలు ఇస్తామని చెప్పండి...వాడి జీవితంలో అంత డబ్బు చూడలేదు..వెంటనే కాళ్ళ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు’ చెప్పాడు తన అహాన్ని చూపిస్తూ.. ఇందుమతి వైపు చూస్తూ. అయినా ఇందుమతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వుంది.
‘ఇప్పటి వరకూ డబ్బు మాత్రమే సమస్య అనుకున్నాను...ఇది నా ప్రిస్టేజ్ ఇష్యూ ...లోకల్ పోలీస్‌లకు లైన్ కలపండి. నేను చెప్పానని చెప్పండి...వాళ్ళే డీల్ ఫినిష్ చేస్తారు’ చెప్పాడు.
ఆ రాత్రంతా నిద్రపోలేదు. అతని కళ్ళు ఎర్రగా మారాయి.
మొదటిసారి తనే పీఏకు ఫోన్ చేసాడు ఆతృతను అణుచుకోలేక....‘ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాను సర్...సీఐ స్టేషన్‌కు పిలిచి భయపెట్టినా ఇల్లు అమ్మను అంటున్నాడు. సీఐ చేతులెత్తేశాడు సర్. సివిల్ విషయాల్లో ఎక్కువదూరం వెళ్తే ప్రమాదం అంటున్నాడు’ పీఏ చెప్పాడు.
అప్పటికే విచక్షణ రేఖ దాటాడు...‘సో మనకు లాస్ట్ ఆప్షన్..ఫస్ట్ టైం నేను రాంగ్ రూట్‌లో వెళ్తున్నాను. లోకల్ గుండాలను కాంటాక్ట్ చెయ్...బెదిరిస్తారో...ఏం చేస్తారో...ఆ ఇల్లు మన పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి’ చెప్పాడు చంద్రశేఖర్. ఇందుమతి ఎప్పటిలానే మౌనంగా వుంది. ఆమె కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లు కారుస్తున్నాయి.
∙∙
కొన్ని గంటల్లోనే పీఏ నుంచి ఫోన్ కాల్...‘అయామ్ వెరీ సారీ సర్...అతడి ఇంట్లోని సామాన్లు బయటేసినా ఇంటిల్లిపాదినీ కొట్టినా ఇల్లు అమ్మననే అంటున్నాడు...ఇంటిల్లిపాది అదే మాట మీదున్నారు’
చంద్రశేఖర్ ప్రపంచం ఒక్కసారిగా తల్లక్రిందులు అయ్యింది. అతనిలోని అహం పగిలి ముక్కలైంది. మంచంమీద నిష్త్రాణంగా వున్న భార్య వంక చూసాడు.
డాక్టర్స్ వస్తున్నారు.. వెళ్తున్నారు... ప్రపంచంలో అన్ని దేశాల్లో వున్న డాక్టర్లు ఇందుమతి ఆరోగ్యస్థితిని గమనించారు. అది మనిషి కనిపెట్టిన సైన్స్‌కు, శరీరశాస్త్రానికి సంబంధించిన జబ్బు కాదు...కనిపించని మనసుకు, కనిపెట్టలేకపోయిన ఎమోషన్స్‌కు సంబంధించిన అనుబంధపు అనారోగ్యం కాబోలు...అందుకే అందరూ పెదవి విరుస్తున్నారు. చేతులెత్తేస్తున్నారు.
భార్య వంక చూశాడు...తాను కోరిన ఒకేఒక చివరికోరిక తీర్చని భర్తను నిందిస్తున్నట్టుగా లేదు...‘మీరు మాత్రం ఏం చేయగలరు?’ అని కన్నీటి నిట్టూర్పు విడుస్తున్నట్టు వుంది.
‘చేయగలడు ...చేయాలి ...చేస్తాను..’ చంద్రశేఖర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. తన ఆస్తులకు సంబంధించిన అన్ని పేపర్స్ తీసుకున్నాడు. ప్రత్యేక విమానంలో ఇండియా బయల్దేరాడు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తన ఊరికి వెళ్ళాడు.
స్ట్రెచర్ మీద వున్న భార్యను సహాయకులు కిందికి దించారు. చంద్రశేఖర్ కిందికి దిగాడు.
ఇందుమతి కళ్ళు విచ్చుకున్నాయి...దాదాపు ముప్పయేళ్ల తర్వాత తన ఊరు తన ఇల్లు తాను పీల్చిన గాలి....
చంద్రశేఖర్ అలానే చూస్తూ వుండిపోయాడు. ఊరు చాలా మారింది. మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. షాపింగ్ మాల్స్ వచ్చాయి. గుర్తుపట్టనంత మారింది. కానీ తాను అమ్మిన ఇళ్లు అలానే వుంది. పాడవకుండా చేసిన మరమ్మత్తులు తప్ప.
భార్య ఇష్టంగా నాటిన సన్నజాజుల చెట్టు, జామచెట్టు నేరేడు చెట్టు...అదే నేల,అవే గదులు...అదే ఇంటి తాలూకూ జ్ఞాపకాల పరిమళం...తనూ ఇందుమతి సాయంకాలాల్లో కూచునే రాతిచెప్టా....అలానే చెక్కు చెదరకుండా వుంది. రోజూ దాన్ని శుభ్రం చేస్తున్నట్లుంది.
చంద్రశేఖర్ చలమయ్య వైపు చూశాడు... వృద్ధాప్యం తాలూకూ ఛాయల కన్నా తాను బాధ పెట్టిన గాయాల బాధలే కనిపించాయి. వళ్ళంతా దెబ్బలు...రక్తమోడుతోన్న దేహం..అతని భార్య పిల్లలు..పిల్లలు పెద్దవాళ్లయ్యారు. తనని ఒక్కమాట అనలేదు..ఇందుమతిని పలకరిస్తున్నారు..ఇందుమతిని చూసి కంట తడి పెడుతున్నారు...
చంద్రశేఖర్ తన బ్రీఫ్ కేసులో వున్న డాక్యుమెంట్స్ చలమయ్య ముందు పెట్టాడు. మోకాళ్ళ మీద కూచున్నాడు..రెండు చేతులు జోడించాడు...
‘నా భార్య చివరికోరిక ఈ ఇంట్లో గడపాలని...తన బ్రతుకు వెంటిలేటర్ మీద మృత్యువుకు కూతవేటు దూరంలో వుంది. ఇవి దేశదేశాల్లో వున్న నా ఆస్తులు. వీటన్నింటినీ నీ పేరుతో మార్చేస్తున్నా. ఈ ఒక్క ఇంటిని నాకు...ఇచ్చేయ్....లే...దా ..కనీసం నాకు నా భార్యకు మేమిద్దరమూ కన్ను మూసేవరకూ తల దాచుకోవడానికి ఆ...శ్ర....య...మి...వ్వు...’ ఏడుస్తున్నాడు చంద్రశేఖర్.
పరుగెత్తుకొచ్చి చంద్రశేఖర్ కాళ్ళ మీద పడ్డాడు చలమయ్య.
‘అయ్యా.. ఇది మీ ఇల్లు. మేము కాపలాదారులం. ఇది నా ఇందమ్మ కట్టుకున్న దేవాలయం. దేవుడిని కొలుచుకునే భక్తులం..ఈ ఇల్లు మీదే...మీకు ఈ ఇల్లు అమ్మేస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే..కానీ నేను కోరిన డబ్బు ఇవ్వాలి...’ గొంతు గాద్గదికం అవుతుండగా చెప్పాడు.
చంద్రశేఖర్ ముఖంలో ప్రపంచాన్ని జయించిన సంతోషం. వేలకోట్లు సంపాదించినా కలుగని ఆనందం చలమయ్య ఇల్లు అమ్ముతానన్న మాట చెప్పినప్పుడు కలిగింది.
‘చెప్పు చలమయ్య, ఎంత..ఎన్ని వేల కోట్లు..ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేస్తా. ఈ క్షణం నా భార్య ఇందుమతి మీద ఒట్టేసి..’ పరుగెత్తుకు వెళ్లి భార్య తల మీద చేయేసి ఉద్వేగంతో కదిలిపోతూ అన్నాడు.
చలమయ్య చెప్పాడు....కళ్లు తుడుచుకుంటూ ఇందుమతి వైపు చూసి. ఆ క్షణం ఇందుమతి కళ్ళు తెరుచుకున్నాయి. ఆ అబ్బుర దృశ్యాన్ని చూడడానికి అన్నట్టు...
‘ఈ ఇల్లు ఖరీదు ముప్పయిఆరువేల ఆరువందల యాభై రూపాయలు’ చెప్పాడు చలమయ్య.
చంద్రశేఖర్ ఆశ్చర్యంగా చూసాడు. అక్కడే వున్న పీఏకు మతిపోయింది.
వేలకోట్లు వదిలి వేల రూపాయలకా?
చలమయ్య ఇందుమతి దగ్గరికి వచ్చి తల మీద చేయేసి...‘అమ్మా నన్ను క్షమించు...’ అని చంద్రశేఖర్ వైపు తిరిగి ‘ఈ ఇంటిని డబ్బుతో విలువ కట్టి కొనలేదు. ఇందమ్మ మనసుతో కొన్నాను. తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఈ ఇళ్లు మీరు ఉచితంగా ఇస్తానని అన్నప్పుడు ఎందుకు వద్దన్నానో తెలుసా బాబూ? అమ్మ మనసు విలువ మా మీద చూపించిన ప్రేమ విలువ ఉచితం కాకూడదు. అందుకే మేము కష్టపడి ఇంటిల్లిపాది కూడబెట్టుకున్న పైసా పైసా కలిపి సంపాదించిన డబ్బును మా అన్నేళ్ల జీతాన్ని జీవితాన్ని ఈ ఇంటికి ఖరీదుగా విలువ కట్టి దేవుడికి ఉడతాభక్తిగా ఇచ్చినట్టు ఇచ్చి ఇల్లు కొన్నాను. అందుకే ఈ ఇంటికి మరమ్మత్తు్తలు తప్ప మార్పులు చేయించలేదు.
ఇందమ్మ నాటిన చెట్టుకాయలు అమ్మలేదు. ప్రసాదంలా మేమే తిన్నాం. పిల్లలకు పంచిపెట్టాం. ఇప్పుడు ఇందమ్మ కోసం..ఈ ఇంటిని అంతే విలువకు అమ్మేస్తున్నాం...కానీ మాదొక కోరిక ...ఒకప్పుడు ఇందమ్మ మేము తలదాచుకోవడానికి ఇచ్చిన గదిలో మేము కన్నుమూసే వరకూ వుండే అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసుకుంటూ ఇంద్రమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాం’ రెండు
చేతులూ జోడించాడు చలమయ్య.
మాటలు మర్చిపోయాడు చంద్రశేఖర్. ఇందుమతి గొంతు పెగులుతోంది. కుడి చేయి మెల్లిగా పైకి లేచింది. చలమయ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకు అద్దుకుంది...దేవుడిచ్చిన అన్నయ్య...మనసు పంచుకున్న అనుబంధానికి అర్థం చెప్పిన అన్నయ్య....
ఇందుమతి కళ్ళు మెరుస్తున్నాయి కన్నీటితో....ఆ ఇంటిని చూస్తూనే వుంది....
ఇపుడు ఆ ఇంటి విలువ....నిలువెత్తు మానవత్వం.
Comments
Please login to add a commentAdd a comment