
సంతాన, సౌభాగ్య ప్రదాత.. సిద్ధివినాయకుడు
ముంబైతోపాటు దేశవ్యాప్తంగా శ్రీ సిద్ధివినాయకుని గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తికాదు.
ముంబైతోపాటు దేశవ్యాప్తంగా శ్రీ సిద్ధివినాయకుని గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తికాదు. రెండు శతాబ్దాలకు పైగా పురాతనమైన ఈ ఆలయం గత మూడు, నాలుగు దశాబ్దాలలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. అరేబియా సముద్రం అంచున ఏడు ద్వీపాలు కలిసిపోయి ముంబై ఏర్పడగా మాహీం ద్వీపంపై ప్రభాదేవి పరిసరాల్లో ఈ శ్రీ సిద్ధి వినాయకుని ఆలయం ఉంది. ‘నవసాచా, నవసాల పావునారా’ (భక్తితో కోరిన కోరికలు తీర్చే దైవంగా) శ్రీ సిద్ధివినాయకుడు ప్రసిద్ధి. కోరిన కోరికలు తీర్చే దైవంగా పేరున్న ఈ స్వామి ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఆలయం మూసివేసే వరకు భక్తుల రాకపోకలతో సందడిగా ఉంటుంది. అంతేకాదు, దేశంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటిగా శ్రీ సిద్ధి వినాయకాలయం విరాజిల్లుతోంది.
ఆలయ చరిత్ర...
ప్రభాదేవి పరిసరాల్లో ఉన్న ఈ సిద్ధి వినాయకుని ఆలయాన్ని 1801 నవంబర్ 19 న ఇటుకలతో నిర్మించారు. ఆలయంలోని శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం 2.6 అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో ఉంది. నాలుగు చేతులతో ఉన్న ఈ విగ్రహాన్ని ఒకే నల్లరాతితో చెక్కారు. ఒక చేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో జపమాల, ఇంకో చేతిలో కుడుములతో ఉన్న పాత్ర ఉన్నాయి. కుడి, ఎడమలకు శ్రీ సిద్ధి, బుద్ధి దేవతల విగ్రహాలున్నాయి. సిద్ధివినాయకుని తొండం కుడివైపు ఉండడం విశేషం. ఈ సిద్ధి వినాయకుడు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు.
హనుమాన్ ఆలయం..
1951 ప్రాంతంలో సయానీ రోడ్డు వెడల్పు చేసే సమయంలో మండపం ఉండే ప్రాంతంలో హనుమంతుని విగ్రహం బయటపడింది. దీంతో అక్కడ ఓ చిన్న గుడిని నిర్మించారు.
ప్రస్తుత ఆలయ స్వరూపం..
ముంబై నడి ఒడ్డున ప్రభాదేవి పరిసరాలలో శ్రీ సిద్ధివినాయకుని ఆలయం గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన అయిదంతస్తుల్లో నిర్మాణం చేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయాన్ని మరోసారి జీర్ణోద్ధారణ చేశారు. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థుల చేతుల మీదుగా ఆలయ కలశ ప్రతిష్ఠాపన జరిగింది. ప్రస్తుతం అష్ణకోణాల్లో ఉన్న గర్భగుడి, 3.65 మీటర్ల ఎత్తుతో ఉన్న మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ ప్రవేశ ద్వారాలపై గల శిల్పకళ మంత్రముగ్ధులను చేసేలా ఉంటుంది. సుమారు ఒక మీటరు ఎత్తులో ఉండే కమలంపై ఆసీనులైన వినాయకుని విగ్రహం ఉంది.
బంగారం తాపడంతో నాలుగు స్తంభాలతో తయారు చేసిన చిన్న మండపం కింద శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం ఉంచారు. శ్రీ సిద్ధి, బుద్ధి దేవతలతోపాటు ఒకవైపు శివలింగం, మరోవైపు గణేషుని ప్రతిమలున్నాయి. మంటపం పైన శివపార్వతుల విగ్రహాలనుంచారు. మొత్తం 37 గోపురాలపై బంగారు కలశాలను ప్రతిష్ఠాపన చేశారు. ఇక్కడి నుంచి నేరుగా భారీ క్యూలలో దర్శనం చేసుకోలేని భక్తులు శ్రీ సిద్ధి వినాయకుని ముఖదర్శనం చేసుకునేందుకు వీలు కల్పించారు. పక్కనే హనుమాన్ ఆలయం ఉంది. ఇతర అయిదు అంతస్తులలో ఆలయం ట్రస్టీ కార్యాలయం, మహానైవేద్య, పూజా, వంటగృహం, గ్రంథాలయం, అర్చకుల విశ్రాంతి గదులున్నాయి. విద్య, విఙ్ఞానానికి సంబంధించిన సుమారు 8000కుపైగా గ్రంథాలతో మందిరంలో గ్రంథాలయాన్ని, డిజిటల్ టెక్నాలజీ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీలను కూడా ప్రారంభించారు.
అనేక స్వచ్ఛంద సేవలు...
శ్రీ సిద్ధివినాయకుని ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణం, బ్లడ్ బ్యాంకు, వరద బాధితులకు, కరువు ప్రాంతాలవారికి, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వైద్యసేవలు అందిస్తున్నారు.
ఎలా చేరుకోవాలి...
ముంబైకి దేశవిదేశాల నుంచి రోడ్డు, రైలు, విమానాల ద్వారా చేరుకోవచ్చు. ముంబై నడిబొడ్డున దాదర్ రైల్వేస్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయకుని ఆలయాన్ని చేరుకునేందుకు ముంబై నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి లోకల్ రైళ్లు, బెస్టు (సిటీ) బస్సులూ ఉన్నాయి.
ప్రత్యేక దినాలు...
శ్రీ సిద్ధివినాయకుని ఆలయంలో ప్రధానంగా ప్రతి మంగళవారంతో పాటు ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి, అదే విధంగా అంగారక సంకష్టి చతుర్థి మొదలగు పర్వదినాలలో ప్రత్యేకపూజలు జరుపుతారు.
– గుండారి శ్రీనివాస్, సాక్షి, ముంబై