విందు | Sravana masam special Feast | Sakshi
Sakshi News home page

విందు

Published Sun, Sep 16 2018 12:58 AM | Last Updated on Sun, Sep 16 2018 12:58 AM

Sravana masam special Feast - Sakshi

శ్రావణమాసం వచ్చింది. పెళ్ళిళ్ళు మొదలయ్యాయి. క్రిందటి ఏడాది  శ్రావణంలోనే పెద్దకూతురు అభిసారికకి పెళ్ళి చేశాడు వసంతరాయుడు. రాయుడికి వ్యవసాయంతో పాటు, ఓ పెద్ద ఫాన్సీ దుకాణం, టెంటు హౌస్, వడ్డీ వ్యాపారం కూడా ఉన్నాయి. పైగా పుట్టి పెరిగిన ఊరు కావడంతో .. అతనంటే తెలియని వారు లేరనే చెప్పాలి. డబ్బూ పలుకుబడి ఉన్న వసంతరాయుడి మాటకి  చెల్లుబాటు ఎక్కువే. ఎప్పుడూ చేతిలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఆడేవి.  బంధువులకీ, స్నేహితులకీ కొదవే లేదు. చుట్టుపక్కల  పది గ్రామాలకి పరిచయం అతని పేరు. పెద్దకూతురు అభిసారిక పెళ్ళికి ఆకాశం అంత ‘పందిరీ’ భూదేవంత ‘పీటా’ వేసి, చేసినట్టే చేశాడు. ఫ్యాన్సీ దుకాణానికి అలవాటుగా వచ్చే వారందరూ అతిథులైపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనాలు. వచ్చినవాళ్ల కార్లు, బళ్లు పెట్టుకోడానికి చోటు చాలక రోడ్డు వారన.. ఊరి పొలిమేర దాటింది లైను. ఇంటి ముందు ఉన్న కాలువగట్టు అంతా లైటింగు ఎరేంజ్‌ చేసారు. రోడ్డు అంతా దేదీప్యమానంగా పట్టపగలుని తలపించింది. ఇంటి ప్రక్కనే కొబ్బరితోటలో.. షామియానాలు వేసి, ఫౌంటెన్లు, ఆధునిక డెకరేషన్లతో ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, మ్యూజికల్‌ ప్రోగ్రాములతో, ఎన్ని హంగులు చెయ్యాలో అన్ని హంగులు చేసి అంగరంగ వైభవంగా జరిపించాడు మొట్టమొదటి పెళ్ళని.  వంట వాళ్లను విజయవాడ నుంచి రప్పించాడు.

తిన్న వాళ్ళకు తిన్నంత అన్నట్లు, వెళ్ళీ వెళ్ళగానే అతిథులకు కప్పుల్లో పోసి .. సూప్స్‌ అందించారు. ఆ పక్కనే, చాట్లు.. పానీపూరీ, భేల్‌పూరీ, మురీ, జిలేబీలు, కాకినాడ కాజాలు, బ్రెడ్‌ హల్వా, బూరెలు , పొయ్యిలు పెట్టి అప్పటికప్పుడు తయారుచేసి వడ్డిస్తున్నారు. మరో పక్క పలావు, ఫ్రైడ్‌ రైసులు, కూరలు, గడ్డ పెరుగు. చివరిగా ఐస్‌క్రీములు, రసగుల్లాలు. ఆ విందు ఘుమఘుమలు మరచిపోక ముందే .  ఏడాది తిరిగేసరికి .. రెండో కూతురు మధులతకు కూడా పెళ్లి చేసెయ్యాలని అనుకున్నాడు రాయుడు. మధులత డిగ్రీ చదివింది ‘‘ఇంకా పైకి, ఏమ్మే చదువుతాను నాన్నా. నా ఫ్రెండ్స్‌ లాగా ఆంధ్రా యూనివర్సిటీ, వైజాగ్‌ వెళ్లి చదువుకుంటాను’’ అడిగింది గోముగా.. అలా అడిగితే  తండ్రి  కాదనడని.  ‘‘ఎంత చదివించినా.. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే కదమ్మా! మంచి సంబంధం ఎదురొస్తే కాదంటామా! అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు బెంగుళూరులో.. నీకు ఈడూ జోడూ బాగుంది. దానంతట అదే వచ్చిన సంబంధాన్ని వదులుకుంటామా’’ బుజ్జగించాడు.

ఇది ఇలా  ఉండగా రెండు వీధుల అవతల ఉన్న వసంతరాయుడి... చిన్నాన్న కొడుకు, సమీప బంధువు అయిన  రామనారాయణరావు కూడా తన కూతురు ప్రజ్వలకి  పెళ్ళి తలపెట్టాడు ఆ ఏడాదే.   రామనారాయణరావు మొన్నీ మధ్యే .. అన్నగారైన రాయుడి మీద పోటీ చేసి సర్పంచిగా గెలిచాడు. కాస్త చదువుకున్న వాడు, మృదుస్వభావి  కావడంతో... ఊరిలో మంచి పేరే ఉంది.. డబ్బూ పరపతి ఉన్న రాయుడి అహంభావం... అతని చదువు ముందు ఓడిపోయింది. నారాయణరావే గనుక అడ్డురాకపోతే.. ఏకగ్రీవంగా గెలిచేవాడు వసంతరాయుడు. ఆయన పరపతి అలాంటిది.ఊరిలో మరో వర్గం వాళ్లు.. చదువుకున్న వాడని రామనారాయణను పోటీకి నిలబెట్టిన.. రోజు నుంచే అన్నదమ్ముల మధ్య చీలిక ఏర్పడింది. బంధుత్వం బీటలు వారింది. వసంతరాయుడు ఆ ఓటమిని జీర్ణించుకోలేక ‘దొంగ ఓట్లు వేయించుకుని గెలిచాడు రామనారాయణ’ అంటూ అనవసరపు ప్రచారం కూడా చేశాడు. ఒకప్పుడు బాగానే కలిసి ఉన్న వాళ్లకి  రాజకీయాల కారణంగా మనస్పర్థలు  ఏర్పడ్డాయి.

కనిపిస్తే తప్పుకు వెళ్ళిపోవడమే.. తప్ప ఇదివరకటి ఆప్యాయతలు లేవు. అలా అని వైరమూ లేదు. అంతా స్తబ్దత.   సరిగ్గా తన కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నప్పుడే.. నారాయణరావూ తన కూతురికి పెళ్లి పెట్టుకోవడం  బొత్తిగా నచ్చలేదు.   అందుకే లోపాయకారీగా నారాయణరావు కూతురి పెళ్లి కన్నా.. రెండు రోజుల ముందు ముçహూర్తానికి, తన కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టించుకున్నాడు. నారాయణరావు  ఇంటి  పెళ్లికి వెళ్లకపోతే, తన ఇంటి పెళ్లి పనుల వల్ల వెళ్లలేకపోయాడని ఊళ్లో వాళ్లు అనుకుంటారు.నారాయణరావు తనకి ఎందులోనూ పోటీ కాదని తెలిసినా.. ఏదో న్యూనత. ఇప్పుడు రాజకీయంగా  పలుకుబడి పెంచుకుంటూ, ఎదుగుతున్నాడు. తన ఇంట చివరి పెళ్లి వేడుక కాబట్టి,  అందరికీ గుర్తుండి పోయేలా ఖర్చు విషయంలో.. రాజీ పడ కూడదనుకున్నాడు.ఈసారి దగ్గరలో ఉన్న సిటీలో..  కళ్యాణమండపం మాట్లాడాడు. కనీసం నాలుగువేలమందికి అయినా సరిపడేలా.. రోజుకి అద్దే రెండు లక్షలు. ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ‘రాత్రి పూట.. చీకట్లో అంత దూరం ఏం వస్తాం రాయుడు’ అంటారని, దగ్గర వాళ్లకి కార్లు ఎరేంజ్‌ చేసాడు. ఓపెన్‌ ప్లేస్‌.. అంతా షామియానాలు, వాటి క్రిందే, వంటలూ.

కళ్యాణవేదిక అంతా జలతారు పరదాలు, మెరుపు దారాలు, గాజు పూసలతో అలంకరణ, వాటిపై  నిముషానికి ఓ రంగు మారే.. రంగుబల్బుల ఫోకస్‌.  మెరుపు దారాలూ. గాజు పూసలూ క్షణక్షణానికి రంగులు మారి,  మిలమిల మెరుస్తూ.. మాయాజగత్తులోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ వింత అందాన్ని వచ్చినవాళ్లు తమ సెల్‌ ఫోన్లలో బంధిస్తున్నారు. ద్వారం దగ్గర నిలబడి, వచ్చేవాళ్లకి వసంతరాయుడు స్వాగతం పలుకుతున్నాడు. వచ్చే జనాల్ని చూసి గర్వంతో ఉప్పొంగుతూ,  మీసం మేలేస్తున్నాడు.   ద్వారానికి దగ్గరలోనే పెద్ద డయాస్‌ మీద, ‘అత్తిలి’ వాళ్ళ డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేసాడు. మైకుల్లో డ్రమ్స్‌ వాయిద్యాలు.. సినిమా పాటలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోతోంది. ఎదుటివాళ్ల మాటలు వినిపించనంతగా రణగొణధ్వనులు. అంతా ఇరవై.. ఇరవై అయిదేళ్ల వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలు. వయసులో ఉన్నారేమో! ఉరకలెత్తే ఉత్సాహం. మిలమిలా మెరిసిపోయే డ్రెస్సులు. వాళ్ల ఊరిలో మాట ఏమోగాని.. బయటకి వచ్చేసరికి అమ్మాయిలకి అతి ఉత్సాహం వచ్చేసింది. సినిమా ప్రోగ్రాముని తలపించేలా.. అబ్బాయిలతో కలిసి పాటలు పడుతూ.. డాన్సు చేస్తూ, అదర గొడుతున్నారు. పల్లెటూరి జనాలు ఉత్సాహంగా  కళ్లప్పగించి చూస్తున్నారు. ఎంతైనా రాయుడిగారి వైభోగమే.. వైభోగం అనుకుంటూ.

కొంతమంది.. వెళ్లగానే పండ్లరసాల కౌంటరు దగ్గర క్యూ కట్టారు. పిల్లలు చాట్ల కౌంటరు దగ్గరకు చేరిపోతే, తల్లులూ వాళ్లని అనుసరించారు. శనివారం కావడంతో కొంతమంది టిఫెన్ల వైపు నడిచారు. పెసరట్ల దగ్గర ఎంతకీ ఖాళీ అవడం లేదు. వేడి వేడి పెసరట్లు అంటే ఎవరికి ఇష్టముండదు.  ఒకేసారి  ఎనిమిది అట్లు కాలుస్తున్నా, అక్కడే ఎక్కువమంది గుమిగూడారు. దానిలోకి ఉప్మా అందరికీ అందడం లేదు. నాకు, నాకంటూ ప్లేట్లు ముందుకు చాచే వారికోసం.. పూరీలు వేసిన వెంటనే తీసెయ్యాల్సి వస్తోంది. ప్లేటులో పడిన పదార్ధాలు.. ఉఫ్, ఉఫ్‌ అంటూ ఊదుకుంటూ ఆదరాబాదరాగా  ముగించేస్తున్నారు. ఏ పదార్ధం అయినా పొయ్యి మీద నుంచి దించిన తరువాత కొద్దిసేపు ఆగి తినాలి. కాస్త చల్లారితేనే  తినడానికి వీలుఅవుతుంది. అయితే అక్కడ అంత టైము లేదు. ఇడ్లీలు.. రుచి లేని పిండి ముద్దలు..  చెత్తడబ్బాల్లోకి చేరిపోతున్నాయి. అరటికాయ బజ్జీలతో పాటు వడ్డించిన .. పొట్టి సిమ్లా మిర్చి చురుకు.. నాలిక్కి తగల్లేదు. ఏ పదార్థం తిన్నా ‘నూనెలు’ అవసరాన్ని మించిపోయి ఉన్నాయి. గట్టిగా నొక్కితే ఓడిపోతున్నాయి,  డైటింగు చేసే వారి గుండెలు గుబగుబలాడేలా. కాస్త దూరంలో అన్నం, కూరలూ, పచ్చళ్లూ, పొడులూ.. పులుసులూ, అప్పడాలూ, వడియాలూ ఒక్కటేమిటి? తినగలిగే పదార్థాలు ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు. దేశంలో ఆకలికేకలు ఎన్నో వినిపిస్తున్నా.. విందుల్లో మిగిలిన వంటకాలు ‘లేని వాళ్లకు’ పంచుతున్నాం అన్నా.

ఇక్కడ అందుకు భిన్నంగా.. గ్రౌండులో తిండి ‘పందేరం’ జరుగుతోందా అన్నట్లు ..  అన్నీ వేయించుకుని.. నచ్చితే తిని,  లేకపోతే వదిలేస్తున్నారు. ఎక్కడ చూసినా  సగం కంచాల్లో వదిలేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఆహారాన్ని వృథాగా పారేయ్యకూడదు అన్న విషయం తెలిసినా తప్పడం లేదు. కడుపు పట్టనన్ని తినలేరుగా.  ఏది వెయ్యించుకుంటున్నారో! ఎందుకు వెయ్యించుకుంటున్నారో తెలీదు. అవతల వాళ్లే వడ్డించేస్తున్నారు.. వేయించేసుకుంటున్నారు. వీలుకాకపోతే  వేస్టుడబ్బా ఉండనే ఉంది. వచ్చేవాళ్లు వస్తుంటే, వెళ్లేవాళ్లు వెళుతున్నారు. ఎంగిలి కంచాలూ, తాగి పడేసిన గ్లాసులూ, కప్పులతో.. కాస్సేపటికే అక్కడంతా చిత్తడి చిత్తడిగా తయారయ్యింది. రామనారాయణరావు భార్యతో కలిసివచ్చాడు. భోజనం ముగించి  రాయుడిని ఉద్దేశించి ‘‘వస్తాను అన్నయ్యా!  ఇంకా చెయ్యాల్సిన  పెళ్లి పనులు చాలా ఉండిపోయాయి. మర్చిపోకుండా.. ఎల్లుండి  మా ఇంటికీ  రావాలి’’ వెళుతూ మరోసారి ఆహ్వానించాడు అన్నయ్యని. ఎవరి మాట ఎలా ఉన్నా సర్పంచి .. రామనారాయణరావు, అదే తమ్ముడు  రామనారాయణరావు వచ్చి, భోజనం చేసి,  తన వైభవాన్ని చూసినందుకు చాలా సంతోషపడ్డాడు రాయుడు. ‘అలాగే లేరా. రాక ఎక్కడికి పోతాను. అప్పటికి మా ఇంట్లో పనులు తెమలక పోతాయా!’ అన్నాడు దర్పంగా నవ్వుతూ. వచ్చిపోయే జనాల్ని ఓరకంట గమనిస్తూ .. వచ్చే వాళ్ళకి అభివాదాలు చేస్తూ. ముహూర్తం అర్ధరాత్రి వేళ కాబట్టి, భోజనాలు చేసి వెళ్ళిపోయేవారే, ఎక్కువ. పెళ్ళిమండపం మేడపై ఉంది. కింద హోరుతో ఏమాత్రం ఇబ్బంది లేని ఏసీ గది.

రామనారాయణరావు ఇంట పెళ్లిబాజాలు మ్రోగాయి. గ్రామంలో జనాలు తరలి వచ్చారు సర్పంచి గారింట్లో పెళ్లికి.  స్నేహితులన్నవాళ్లు కొంతమంది హాజరయ్యారు. పెంకుటింటి ముందు వాకిట్లో ఉన్న ‘పెళ్లి అరుగు’ మీదే పెళ్లి. ఆ ఇంట్లో ఎన్ని పెళ్లిళ్లు జరిగినా ఆ పెళ్లి అరుగు మీదే చేస్తారు. పల్లెటూళ్లలో ప్రతిఇంటి పెరట్లో తులసికోట ఎలా ఉంటుందో .. వీధి గుమ్మంలో పెళ్లి అరుగూ అలాగే ఉంటుంది.    ఇంటి చుట్టూ కొబ్బరాకుల చలువ పందిళ్లు. పచ్చటి కొబ్బరాకుల సందుల గుండా వీచే గాలి.. ఓ కొత్త  పరిమళాన్ని చుట్టుప్రక్కల అంతా వ్యాపించి, మనసును చల్లగా సేద తీరుస్తుంది. ఆ పందిరిలో  ఓ ప్రక్కగా కుర్చీలు, బల్లలు వేసి, అరిటాకుల్లో భోజనాలు వడ్డించారు. పెళ్లి బాజాలు వింటూ భోజనాలు కానిస్తున్నారు వచ్చినవాళ్లు .. కొసరి కొసరి వడ్డి్డస్తున్నారు కుర్రాళ్లు.    భోజనాలు చేసి పాన్‌ నములుతూ వస్తున్నారు శంకరం అతని స్నేహితుడు జానకిరామయ్య.

వారి చేతుల్లో రిటర్న్‌ గిఫ్ట్‌లు కూడా ఉన్నాయి. మగవాళ్లకి జేబురుమాళ్లు, ఆడవాళ్లకి స్టీలు ప్లేట్లు. ఏం వంటకాలురా! బాబూ! చాలా భేషుగ్గా ఉన్నాయి. పల్లెటూళ్ళలో ఉన్నా మనం అరిటాకు భోజనాలు మర్చిపోయాం. మన నారాయణ మాత్రం భాగా గుర్తు పెట్టుకున్నాడు.. కొబ్బరిబూరెలూ, పులిహోర .. ఆ రుచే వేరు. ఆ పనసపొట్టు కూర అయితే .. మళ్ళీ అడిగి వేయించుకున్నా. కందా బచ్చలి... ఆనపకాయ మజ్జిగ చారు.. ఏదీ వదిలి పెట్టబుద్ధి కాలేదంటే నమ్ము. ఆఖరికి చారు కూడా ఎంతో రుచిగా ఉంది. అందుకే ‘అరగడం కోసం  చివరికి పాన్‌ వేసుకున్నా’ తను పాన్‌ కూడా తింటున్నందుకు ముక్తాయింపు ఇస్తూ. అవును నాకూ అలానే ఉంది’ చెప్పాడు జానకిరామయ్య  తనూ భుక్తాయాసంగా. రాయుడు.. తన పరివారాన్ని వెంట బెట్టుకుని వచ్చాడు.. రాకపోతే ‘ఏం. రాయుడూ.. మీ తమ్ముడి ఇంట్లో పెళ్ళికి వచ్చినట్లు లేదే’ అంటూ ఊరిలో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని.

వీధి మొదట నిలిచి అందరినీ ఆహ్వానిస్తున్న రామనారాయణ.. రాయుడికి ఎదురొచ్చి ‘రా అన్నయ్యా! వదిన కూడా వచ్చి ఉంటే బాగుండేది’ అన్నాడు వెంట ఉన్న వారిని చూస్తూ, వారిలో వదిన లేకపోవడంతో.  ‘ఇంటి నిండా చుట్టాలు. తను రాలేనన్నది’ తను రావడమే ఎక్కువ అన్నట్టు.. నవ్వుతూ. కడుపు నిండా తిన్న సంతోషంలో .. పరిసరాలను  గమనించని శంకరం ‘ఆ రోజు మా రాయుడి ఇంటిలో ఏం తిన్నామో!  ఏమిటో? అంతా తొడతొక్కిడి భోజనాలు. నిలబడి ఆదరాబాదరాగా తినేశాం. కొన్ని ఉడికితే  .. కొన్ని ఉడకలేదు. ఈ రోజు భోజనం మాత్రం అలా కాదు. వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి’ మెచ్చుకున్నాడు.   ‘అవును. నిజమే’ జానకిరామయ్య కూడా అంతే సంతోషంగా అన్నాడు. వెనుకగా వస్తున్న రాయుడు ఆ మాటలకి ‘ఖంగు’ తిన్నాడు. ఆ మాట అన్నది ఎవరో కాదు. స్వయానా తన మేనత్త కొడుకు శంకరం. తెల్లవారి లేస్తే, తనింటిలోనే ఉంటాడు. అలాంటి వాడికి కూడా తన విందు వెగటు అనిపించింది. ఆరోజు కొన్ని వందల మంది తిన్నారని సంబరçపడుతుంటే, శంకరం ‘తొడతొక్కిడి’ భోజనం అన్నాడు.

ప్రక్కన ఉన్న వాడిదీ అదే అభిప్రాయం.  అయినవాడే ‘అంతమాట’ అనేస్తే.. ఎవరితో చెప్పుకోవాలి.  పెళ్ళి మర్నాడు ఊళ్లో.. రచ్చబండ దగ్గర తన విందు గురించే చర్చ జరిగిందట. కొంతమంది మెచ్చుకుంటే, మరికొంతమంది ‘అదే’ మాట అన్నారట. మెచ్చుకోలు కన్నా విమర్శ ‘కొద్దిదే’ అయినా, అదే ఎక్కువ బాధించింది రాయుడిని. రామనారాయణ అన్నగారు వచ్చినందుకు హడావుడి పడ్డాడు. స్వయంగా తనే వడ్డించాడు. అన్నయ్యకు బూరెలకి రంధ్రం పెట్టి అందులో.. వేడి నెయ్యి వేసి అందించాడు. ఆ ఆప్యాయతకు కరిగిపోయాడు రాయుడు. ఎంతైనా తమ్ముడు తమ్ముడే. ‘పదవి వచ్చిన తరువాత వీడికి గర్వం పెరిగిందనుకున్నాడు. కానీ ఏం మారలేదు’ అనుకుంటూ భోజనం ముగించాడు. అందరి ముఖాల్లోనూ మంచి భోజనం చేసిన సంతృప్తి కొట్టొచ్చినట్లు కనబడటం రాయుడు గమనించాక, మనోగతంలో తన విందు వైభవం.. మరోసారి కదలాడింది. చిన్న కుటుంబమే.. చింతలు లేని కుటుంబంలా.. చిన్న విందే జనాలకి పసందుగా ఉందన్న మాట. అరిటాకు భోజనం రుచే అయినా.. బఫే సిస్టమ్‌.. నిలబడి తినే భోజనాల్లో ఆకులు ఇవ్వలేరు. 

లైవ్‌ భోజనాలు.. మోడ్రన్‌ కల్చర్‌. తమ పల్లెటూరిలో కూడా ఆ సంప్రదాయం తీసుకొచ్చానని అనుకున్నా .. అది అందరికీ సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తమ విందులో పారేసిన పదార్థాల విలువ ‘వెలకట్ట’లేనిది. ఫంక్షన్‌ హాలులో వేసిన షామియానాల బిల్లు కన్నా, వాటర్‌ బాటిల్స్‌ బిల్లు తడిసి మోపెడు అయ్యింది. విందుకు ముందు వంట పాత్రలు నిండుగా ఉంటే .. విందు తరువాత డస్ట్‌ బిన్లు నిండుగా ఉన్నాయి. లైటింగు, డ్రోన్‌ కెమెరాలు, వంటవాళ్ళ ఖర్చూ, లేబర్‌ చార్జీలు అన్నీ కలిపి.. లక్షల్లో ఖర్చు. నిజానికి చాలా రోజుల తర్వాత తనూ మంచి భోజనమే చేశాడు. వాము వేసుకునే ఖాళీ ఉంటే  ‘మరో గారే తింటాను’ అన్నట్లు .. సుష్టుగా తిన్నాడు. అన్నదాతా సుఖీభవ అనుకునేలా తమ్ముడిని చెయ్యెత్తి దీవించాడు. సుఖప్రదంగా పెట్టిన భోజనం ఎవ్వరికైనా సంతోషాన్నే ఇస్తుంది.

- పి.ఎల్‌.ఎన్‌. మంగారత్నం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement