
జర్మనీ ముట్టడిలో ఉన్న ప్యారిస్ నగరం దారుణమైన కరువుకోరల్లో చిక్కుకుంది. ఇళ్ళపైకప్పులో పిచ్చుకలు, బొరియల్లోని ఎలుకలు అంతర్ధానమయ్యాయి. ప్రజలు చేతికేది దొరికితే దాన్ని తింటున్నారు. మాన్సియర్ మోరిసాట్, వృత్తిరీత్యా గడియారాల తయారీదారుడు. ప్రస్తుతమతనికి పనేమీ లేదు.ఒక జనవరి నెల ఉదయసంధ్యారుణ కాంతుల్లో, మోరిసాట్ ప్యాంట్ జేబుల్లో చేతులు దూర్చి, ఖాళీ కడుపుతో ఇరువైపులా చెట్లు బారులుతీరిన దారిలో పెద్దపెద్ద అడుగులేస్తూ నడుస్తున్నాడు. అంతలోఅనుకోకుండా అతనికి మాన్సియర్ సావేజ్ ఎదురుపడ్డాడు.యుద్ధం మొదలవ్వక ముందు–మోరిసాట్ ప్రతి ఆదివారం–చేతిలో వెదురుచువ్వ, వీపున టిన్ బాక్స్ మోసుకొంటూ చేపలు పట్టడానికెళ్ళేవాడు. అతను అర్జెంటూయిల్ కొలంబస్ స్టేషన్లో దిగి, ‘ఇలే మరాంటే’ వరకూ కాలినడకన వెళ్ళేవాడు. అతనికెంతో ఇష్టమైన ఆ ప్రదేశాన్ని చేరీ చేరుకోగానే చేపలుపట్టే పనిలో మునిగిపోయేవాడు. మహదానందంగా ఆ కార్యక్రమాన్ని రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగించేవాడు.
మాన్సియర్ సావేజ్ లావుగా, బొద్దుగా, పొట్టిగా వుంటాడు. వారిద్దరిమధ్యా మంచి స్నేహానుబంధాలు నెలకొన్నాయి. కొన్నిసార్లు వొట్టి వదరుబోతుల్లా ముచ్చట్లూ, కబుర్లూ చెప్పుకొనేవాళ్ళు. క్రమంగా ఇద్దరిదీ ఒకే మాటగా వారి స్నేహం వృద్ధి చెందింది. ఒకానొక వసంత కాల సమయాన, ‘‘ఈ వాతావరణం చాలా మనోహరంగా వుంది కదూ?’’ మోరిసాట్ అన్నాడు.‘‘ఇంతకు మించిన హాయి ఇంకెక్కడా దొరకదు’’ చెప్పాడు సావేజ్, ఉరకలేస్తున్న పారవశ్యంతో. ఆకులురాలే కాలంలో–మలిసంధ్య పొద్దులో–పడమటిసూర్యుని సింధూరవర్ణం మేఘాలపై పడినప్పుడు, నదీజలము, అరుణత్వం సంతరించుకొంటుంది. ఆ దృశ్యాన్ని పరికించిన ఆ ఇద్దరు మిత్రుల ముఖాలు నూతనకాంతితో మెరిసిపోతాయి. బాటకిరువైపులా బారులుతీరి వున్న చెట్ల ఆకులు, శీతల స్పర్శకు వొంగి వేలాడుతున్నాయి.‘‘ఆహా! ఎంత సుందరమైనదీ దృశ్యం!’’ అని సావేజ్ అన్నప్పుడు, ‘‘బాటకిరువైపులా కొలువుతీరివున్న వృక్షసముచ్ఛయంకన్నా మిన్నగా వుందికదూ?’’ మోరిసాట్ జవాబిచ్చాడు, కళ్ళు పక్కకు తిప్పకుండా. ‘‘మళ్ళీ మనమెప్పుడు కలుసుకుంటామో?’’ అన్నాడు సావేజ్. మాట్లాడుకొంటూ మాట్లాడుకొంటూ, వాళ్ళు ఒక మద్యశాలలోనికి ప్రవేశించారు. ఒక అబ్సెంతియా(ఒక రకమైన మద్యం)సీసా కొని ఇద్దరూ కలిసి తాగి, మరలా వారి నడకను కొనసాగించారు. ఖాళీకడుపుల్లోకి చేరిన మద్యం దాని ప్రభావం చూపిస్తోంది. ఆ రోజు వాళ్ళిద్దరి ముఖాలపైకి చల్లని గాలి సోకుతోంటే చాలా హాయిగావుంది. తాజా గాలి మత్తును వదలగొట్టింది. సావేజ్ హఠాత్తుగా ఆగి, ‘‘మనమక్కడికెళితే?’’ అన్నాడు.
‘‘ఎక్కడికీ?’’‘‘చేపలు పట్టడానికి.’’‘‘ఎక్కడ పట్టాలి?’’‘‘అదే. పాత చోటుకు. ఫ్రెంచి వాళ్ళ సరిహద్దు ప్రాంతానికి. అవి కొలంబస్‌కు దగ్గర. కల్నల్ డుమౌలిన్ నాకు బాగా తెలుసు. ఔట్‌పోస్ట్ దాటడానికి మనకు సులువుగా అనుమతి దొరుకుతుంది.’’ ఆ మాటలు విన్న మోరిసాట్ ఆశతో వొణుకుతూనే ‘సరే’నన్నాడు. ఎవరెవరి కర్రా, తాళ్ళు తెచ్చుకోవడానికెళ్ళారు. గంట తరువాత వారు కల్నల్‌ను అతని విల్లాలో కలిశారు. కల్నల్ నవ్వుతూ వారు కోరిన విధంగా అనుమతి మంజూరుచేశాడు. వారికిచ్చిన రహస్య సంకేతపదాన్ని మననం చేసుకొంటూ నడకసాగించారు. కొంతసేపటికి వారు ఔట్‌పోస్ట్ దాటిపోయారు. నిర్మానుష్యంగానున్న కొలంబస్ ప్రాంతంగుండా ప్రయాణించి, ద్రాక్ష తోటలకు సరిహదై్దన ‘సీనే’ అనే చోటికి చేరుకొన్నారు. అప్పటికి సమయం పదుకొండు గంటలు.వాళ్ళ కళ్ళముందు కనబడుతున్న అర్జెంటెయిల్ అనే వూరు యుద్ధæభయంతో ఊరు విడిచి జనం పారిపోవడంతో ప్రాణం లేని శవంలా ఉంది. ఎల్తైన ఒర్గెమెంట్, సన్నాయ్స్ పర్వత పాదభాగాన పరచుకొన్న విశాల మైదానాన్ని చిన్నదిగా చేసి చూపుతోంది. కనుచూపుమేర కనిపిస్తున్న ఆ మైదానం ఖాళీగా వుండి, బూడిదరంగుతో, మరుభూమిని తలపిస్తూ ఉంది. ఎదురుగా వున్న కొండలవైపు చూపిస్తూ సావేజ్ ‘‘అదిగో! ఆ కొండమీద కనబడుతున్న వారు కచ్చితముగా ప్రష్యనులే!’’ అంటూ గొణిగాడు.
ప్రష్యన్లను ఇదివరకెప్పుడూ వారు చూసుండలేదు. కానీ... వారు గత కొన్ని నెలలపాటు ప్యారిస్ పొరుగున తిష్టవేసి, దోపిడీలు సాగిస్తూ, సామూహిక హత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసి, భయంతో కూడిన ద్వేషభావం వారిద్దరి మనసుల్లో నిండివుంది. ‘‘ఒకవేళ వాళ్ళను మనం కలుసుకొనే పరిస్థితి వస్తే?’’ మోరిసాట్ అన్నాడు. ‘‘మనం కొన్ని చేపలు వాళ్ళకిస్తే సరిపోతుంది.’’ సావేజ్ బదులిచ్చాడు. ‘‘సరే వెళ్దాం పద. అయితే కొంచెం జాగ్రత్తగా వుండటం మంచిది.’’ అంటూ వారు ఒకపక్క ద్రాక్ష తోటల కిందనుండి పాకుతూ, మరోపక్క తమ కళ్ళకూ, చెవులకూ పనిచెబుతూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. వారికి నదీతీరం అల్లంత దూరంలో కనిపించింది. అక్కడకు చేరుకోవాలంటే చిన్న ఖాళీ మైదానాన్ని దాటాలి. వారు వేగంగా పరుగుతీసి, కన్నుమూసి తెరిచేలోగా ఆ బయలుప్రదేశాన్ని దాటేశారు. నదీతీరపు అంచు చేరుకోగానే రెల్లు పొదలమధ్య కొంచెంసేపు దాక్కున్నారు.ఏవైనా అడుగులసవ్వడి వినబడుతుందేమోనని నేలపైన చెవి ఆనించాడు మోరిసాట్. అట్లాంటి శబ్దాలేవీ వినిపించలేదు. తాము తప్ప ఇతరులెవరూ అక్కడ లేనట్టు నిర్ధారణ చేసుకొని, ధైర్యంగా చేపలు పట్టసాగారు.
సావేజ్ మొదటి ప్రయత్నంలోనే మంచి గడ్జియన్ చేపను పట్టుకున్నాడు. రెండో సారి మోరిసాట్‌కు పడింది. ప్రతి నిమిషానికొకసారి అలా రకరకాల చేపలు పడుతునే వున్నాయి. ఆ విధంగా వారిద్దరూ కలసి చాలా చేపలు పట్టారు. వాటినన్నిటినీ చిక్కగా అల్లిన వలలో జారవిడిచారు. చాలా యేళ్ళ తరువాత అలాంటి ఆట ఆడే అదృష్టానికి నోచుకొన్నందుకు వారి మనసులు హర్షాతిరేకంలో ఓలలాడ సాగాయి. సూర్యుడు తన వాడి, వేడి కిరణాలు వారి వీపులమీద కురిపిస్తున్నాడు. ఆ సమయంలో చేపలు పట్టడం తప్ప ఇతర విషయాలను పట్టించుకొనే స్థితిలో లేరు.అంతలో, వున్నట్టుండి ఒక సన్నని ధ్వని వారి చెవులను తాకింది. క్రమంగా పృథ్వీ గర్భంలోంచి వెలువడుతున్నట్టుగా ఉధృతమైంది ఆ ధ్వని. ఏదో బరువు మోస్తూ దడదడమని వస్తున్న బండి చక్రాల శబ్దం వినబడింది. మోరిసాట్ తల వెనక్కి తిప్పి చూశాడు. ఎడమవైపున, నదీతీరానికి దూరంగా కనబడుతున్న మాంట్ వెలారియన్ కొండ శిఖరం వెనుక నుండి తెల్లని పొగ పైకెగబ్రాకుతోంది. మరుక్షణం, భూమి అదిరిపోయేటట్లు, ఒక పెద్దప్రేలుడు సంభవించింది. వెంటనే మరొక ప్రేలుడు.. ఇంకొక్క ప్రేలుడు.. ఇలా వరుస ప్రేలుళ్ళ కారణంగా వెలువడిన పొగ– ప్రశాంతంగా వున్న వినువీధిలోనికి ప్రయాణిస్తూ కారుమబ్బులను సృష్టిస్తోంది. ఎల్తైన కొండ శిఖరం మీదికెగబ్రాకుతోంది.
‘‘వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు.’’ సావేజ్ అన్నాడు. దాంతో మోరిసాట్‌కు కోపమొచ్చింది.‘‘ఎంత మూర్ఖులు వారు! ఒకరినొకరు చంపుకొంటున్నారు’’మాంట్ వెలారియన్ కొండ ఎడతెరిపిలేని ప్రేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఫిరంగులతో ఇళ్ళు నాశనం చేస్తున్నారు. ఎందరి కలలనో నాశనం చేస్తున్నారు. ఎందరి తీయని ఆశలనో కల్లలు చేస్తున్నారు. ఎందరి సంతోషాలనో చెల్లా చెదరు చేస్తున్నారు. ‘‘ఆ విధంగా వున్నాయి జీవితాలు.’’ సావేజ్ ప్రకటించాడు.‘‘జీవితాలు కాదు. చావులు అను.’’ నవ్వుతూ బదులిచ్చాడు మోరిసాట్. అకస్మాత్తుగా, వారి వెనుకే అడుగుల సవ్వడి కావడంతో ఇద్దరూ వొణికిపోయారు.వెనక్కి తిరిగిచూస్తే.. ఎత్తుగా, గడ్డాలతో, సైనిక దుస్తులు ధరించిన నలుగురు వారి సమీపంలో నిలుచున్నారు. నెత్తిమీద సమతలమైన టోపీలు పెట్టుకొన్నారు. తుపాకీలు గురిపెట్టివున్నారు. దాంతో ఆ ఇద్దరూ తమ చేతుల్లోని కర్ర, తాళ్ళు అప్రయత్నంగా జారవిడిచారు. అవి నదీ ప్రవాహంతో పాటే కొట్టుకుపోయాయి. చూస్తూండగానే, రెండు క్షణాలలో ఆ ఇద్దరూ పడవలోనికి తోయబడ్డారు. ‘ఇలే మరాంటే’కు తీసుకుపోబడ్డారు.
ఆ ఇంటి వెనకాల ఎవ్వరూ వుండరేమోననుకొన్నారు. కానీ ఇరవైమంది జర్మన్ సైనికులున్నారు.మోటుగా నిడివైన రోమాలు గల ఒక పెద్ద సైజ్ పర్సనాలిటీ, పంగల కాళ్ళేసుకొని కుర్చీలో కూర్చొని వున్నాడు. పొడవైన పైపును పీల్చుతూ,నోట్లోని పైపు పీలుస్తూ స్వచ్ఛమైన ఫ్రెంచి భాషలో చక్కగా స్పష్టంగా మాట్లాడాడు..‘‘మంచిది. మీ అదృష్టం బాగుంది. చేపలు బాగా పడ్డాయి కదా?’’ అప్పుడొక సైనికుడు చేపలతో నిండి వున్న సంచిని ఆ ఆఫీసరు పాదాలచెంత వుంచాడు. ఆ ఇద్దరిని పట్టుకొని వచ్చేటప్పుడు, అతడు ఆ సంచిని, తేవడం మరచిపోలేదు. చేపలవంక చూస్తూ, ‘‘ఫరవాలేదు. కానీ నేను మీతో వేరే విషయం మాట్లాడాలి. జాగ్రత్తగా వినండి. వెర్రి మొర్రి వేషాలేయొద్దు. మీరు నా దృష్టిలో గూఢచారులు. నన్నూ, నా కదలికలను పరిశీలించడానికి పంపించబడ్డారు. మామూలుగానైతే నేను మిమ్మల్ని పట్టుకొని చంపాలి. చేపలుపడుతున్నట్లు నటిస్తూ మారువేషంలో వుండి మీ పనిని మీరు చేస్తూ, నా చేతిలో పడ్డారు. జరగబోవు పరిణామాల్ని ఎదుర్కోకతప్పదు. యుద్ధమంటే ఇలానే వుంటుంది. మీరు ఔట్‌పోస్ట్ ద్వారా వచ్చారు. కాబట్టి మీరు వెనక్కెళ్ళేందుకు, మీకివ్వబడిన రహస్య సంకేతపదం నాకు తెలియజేస్తే మిమ్మల్ని వదిలేస్తాను’’ఆ మాటలు విన్న ఆ ఇద్దరు మిత్రుల ముఖాలలో నెత్తురుచుక్క లేదు. ప్రేతకళ వచ్చేసింది. ఇద్దరూ పక్క పక్కనే నిలుచున్నారు. మెల్లగా చేతులు పిసుక్కోవడం ద్వారా కొంచెం భావోద్వేగాలను అణచుకొన్నారు.‘‘మీరు ప్రశాంతంగా మీ మీ ఇళ్ళకెళ్ళొచ్చు. ఈ రహస్యం ఇంతటితో అంతమౌతుంది. మీరు చెప్పకపోతే, కొన్ని క్షణాల్లో చస్తారు. ఆలోచించుకోండి. ఏది కావాలో తేల్చుకోండి.’’వారిద్దరూ నిశ్చలంగా వుండిపోయారు గానీ పెదవి విప్పలేదు. ఆ ప్రష్యను ఏమాత్రం ఉద్రేకపడకుండా శాంతంగానే నదివైపుచేతులు చూపిస్తూ ‘‘ఇక ఐదు నిమిషాలలో మీరు ఆ నది అడుగున సమాధి కాబడతారు.’’
ఆ ఇద్దరి నోటివెంట ఒక్క మాటకూడా బయటికి రాలేదు. ఇక సహనం పోగొట్టుకొన్న ఆ ఆఫీసరు ఏవో ఉత్తర్వులు జారీ చేశాడు. తాను కూర్చున్న కుర్చీకి కొంచెం దూరంగా జరిగాడు. పన్నెండు మంది ముందుకొచ్చి, పొజిషన్ తీసుకొన్నారు.‘‘మీకు ఒకే ఒక నిమిషం టైమిస్తున్నాను. ఒక్క క్షణం కూడా పొడిగించను.’’అప్పుడా ఆఫీసరు ఆ ఇద్దరు ఫ్రెంచి వాళ్ళవద్దకెళ్ళి, మోరిసాట్ భుజమ్మీద చెయ్యివేసి పక్కకు తీసుకెళ్ళాడు. తగ్గుస్వరంతో ‘‘త్వరగా పాస్ వర్డ్ చెప్పు. నీ మిత్రుడేమీ తెలుసుకోలేడు. నిన్ను వదిలేస్తాను. నేనేమీ విననట్టు నటిస్తాను.’’కానీ మోరిసాట్ నోరు విప్పలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తరువాత సావేజ్‌ను కూడా తీసుకెళ్ళి అదే ప్రతిపాదన చేశాడు. కాని అతణ్ణుంచీ జవాబులేదు. మరలా వాళ్ళు పక్కపక్కనే నిలుచుండిపోయారు.ఆఫీసరు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు తుపాకులు పైకెత్తారు.అప్పుడు మోరిసాట్ చూపులు నేలమీద గడ్డిలో పడివున్న చేపల మీదికి మళ్ళాయి. చేపలు గిలగిల కొట్టుకొంటున్నాయి.సూర్యకాంతిలో అవి వెండిలా తళుక్కున మెరిశాయి. మోరిసాట్ హృదయం భారమైంది. ఎంత ప్రయత్నించినా ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళను ఆపుకోలేకపోయాడు.‘‘ఇక సెలవు మాన్సియర్ సావేజ్,’’ తడబడుతూ అన్నాడు.‘‘సెలవు మాన్సియర్ మోరిసాట్, సెలవు‘ బదులిచ్చాడు సావేజ్.ఆపాదమస్తకం వొణుకుతుండగా ఇద్దరూ చేయీ చేయీ కలిపారు. వారి జీవిత అనుభవంతో ప్రోదిచేసుకొన్న సహనం మూలంగా, వారి నరనరాలను నులిమేస్తున్న ప్రాణ భయాన్ని అదుపు చేసుకోగలిగారు. అందుకు వారి మనోశక్తి కూడా తోడ్పడింది. ఆ వెంటనే, ఆఫీసరు ‘ఫైర్’ అంటూ గట్టిగా అరిచాడు.
అంతే... పన్నెండు తుపాకులు... ఒకేసారి గర్జించాయి. మాన్సియర్ సావేజ్ వెంటనే ముందుకు పడిపోయాడు. మాన్సియర్ మోరిసాట్, పొడవైనవాడు కాబట్టి కొంచెంగా అటూ ఇటూ వూగుతూ తన మిత్రుని మీద అడ్డంగా పడిపోయాడు. అతని కళ్ళు ఆకాశంకేసి చూస్తున్నాయి. ఆ జర్మను ఇచ్చిన తాజా ఉత్తర్వులననుసరించి, అతని మనుషులు పెద్ద పెద్ద బండరాళ్ళూ, మోకులూ తీసుకొచ్చారు. తాళ్ళతో ఆ ఇద్దరిమిత్రుల కాళ్ళు కట్టేశారు. తాళ్ళ చివర బండరాళ్ళు గట్టిగా బిగించి కట్టి నదివొడ్డుకు మోసుకు పోయారు.ఇద్దరు సైనికుల్లో ఒకరు మోరిసాట్ తల పట్టుకొంటే, ఇంకో సైనికుడు కాళ్ళు పట్టుకొన్నాడు. సావేజ్‌ను కూడా అదే విధంగానే మరో ఇద్దరు సైనికులు పట్టుకొన్నారు. తరువాత ఆ శవాలను నదిలోకి విసిరేశారు.నదీజలం ఆకాశమంత ఎత్తుకు ఎగిసి పడ్డాయి. కొంచెంసేపటి తరువాత నది నెమ్మదించింది. చిన్న చిన్న అలలు తీరాన్ని తాకి వెళుతున్నాయి. నదినీళ్ళు కొంచెం సేపు ఎర్రని వలయాలుగా అగుపించాయి.ఈ హింసాకాండ జరుగుతున్నంతసేపూ, ప్రశాంతంగా గడిపిన ఆ ఆఫీసరు నవ్వుతూ ‘‘ఇప్పుడు చేపలవంతు’’ అనుకుంటూ, ‘‘విల్ హెల్మ్!’’ అంటూ పిలిచాడు. తెల్లని అప్రాన్ ధరించిన సైనికుడు అతని పిలుపు విని పరుగెత్తుకొంటూ వచ్చాడు. హత్యకు గురైన ఆ ఇద్దరు మిత్రులు పట్టిన చేపలసంచి అతనికిచ్చి..‘‘వెంటనే వీటిని వేయించి తీసుకురా. వీటిని బతికుండగానే వండితే, ఒక అమోఘమైన, రుచికరమైన డిష్ తయారవుతుంది.’’ అని ఆజ్ఞాపించి పైపును తిరిగి అందుకొని పీల్చసాగాడు.
ఫ్రెంచి మూలం: గైడీ మపాసా
అనువాదం: శొంఠి జయప్రకాష్
Comments
Please login to add a commentAdd a comment