రష్యాకు జెలెన్‌స్కీ ఆఫర్
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు.
రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు.
బెడ్‌పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్‌తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్‌స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్‌తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్‌లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు.
2022లో ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్‌స్కీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment