మన్మథుడు అనగానే నాగార్జున గుర్తొస్తాడు. అంతవరకూ రొమాంటిక్ హీరోగా మనసులు దోచిన నాగ్, ‘మన్మథుడు’ సినిమాలో అమ్మాయిలంటే పడనివాడిగా కనిపించాడు. ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఓ మన్మథుడు తయారయ్యాడు. అతడే... రవికృష్ణ!
‘మొగలిరేకులు’ ఫాలో అయిన వాళ్లందరికీ ‘దుర్గ’గా పరిచితుడు రవికృష్ణ. సౌమ్యుడిగా, మంచి ప్రేమికుడిగా నటించాడందులో. ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ తమకూ ఉంటే బాగుణ్నని అమ్మాయిలు ఫీలయ్యేంతగా అలరించాడు. కానీ జీ తెలుగులో ప్రసారమయ్యే ‘వరూధినీ పరిణయం’ సీరియల్‌తో తన ఇమేజ్‌ని మార్చి పారేశాడు. ఇందులో అతడు ప్రేమికుడు కాదు. అమ్మాయిల పొడే గిట్టనివాడు. ఆడపిల్ల నీడను కూడా అసహ్యించుకుంటాడు. అలాంటి పాత్రలో రవిని చూసి మొదట లేడీ ఫ్యాన్సంతా షాకయ్యారు. కానీ రొటీన్‌కి భిన్నంగా అతడు ప్రదర్శిస్తోన్న నటన చూసి ఫిదా అయిపోయారు.
చిన్నప్పట్నుంచీ అమ్మాయిల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటాడు హీరో. దాంతో అమ్మాయి అంటేనే సమస్య అని ఫిక్సయిపోతాడు. తల్లిని తప్ప అక్కని, చెల్లెలిని కూడా నమ్మనంతగా ద్వేషం పెంచుకుంటాడు. అలాంటివాడి జీవితంలోకి వరూధిని ప్రవేశిస్తుంది. మరి ఈ మన్మథుడి మనసులో ఆమె చోటు ఎలా సంపాదిస్తుంది, అతడితో తాళి ఎలా కట్టించుకుంటుంది అన్నదే సస్పెన్స్. అది తెలుసుకోవాలంటే... వేచి చూడాల్సిందే!
నాలుగు స్తంభాలాట
సీరియల్‌ని జీడిపాకంతో ఎందుకు పోలుస్తారో కలర్స్ చానెల్లో వచ్చే ‘ఉతరన్’ చూస్తే అర్థమవుతుంది. దాదాపు నాలుగున్నరేళ్లుగా ఈ ధారావాహిక సా...గు...తూ...నే ఉంది. ఇప్పటి కింకా ముగింపు దరిదాపుల్లోకి కూడా రాలేదు.
చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు స్నేహితురాళ్ల కథతో 2008లో మొదలైంది ‘ఉతరన్’. వాళ్లు పెద్దైపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల మధ్య అపార్థాలు తలెత్తాయి. గొడవలు పెరిగాయి. ద్వేషాలు రగిలాయి. వేదనలు మిగిలాయి. ఆ రెండు జంటల మధ్య జరిగిన నాలుగు స్తంభాలాట కొన్నేళ్లకు ముగిసింది. ఆ తర్వాత వాళ్ల పిల్లలు వయసుకొచ్చి కొత్త కథ మొదలెట్టారు. వాళ్ల కూతుళ్లు మీఠీ, ముక్తలు ప్రధాన పాత్రధారులయ్యారు. వీళ్లిద్దరికీ ఇద్దరు హీరోలు జతయ్యారు. మళ్లీ నాలుగు స్తంభాలాట మొదలు!
ఆకాశ్ (మృణాల్‌జైన్)ని పెళ్లాడి మోసపోయిన మీఠీ (టీనా దత్తా), పుట్టింటికి చేరుకుంటుంది. అప్పటికే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన ఆకాశ్ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతణ్ని వదిలించుకోవడం కోసం విష్ణు (అజయ్ చౌదరి)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ అప్పటికే విష్ణు, ముక్త (శ్రీజిత డే) ప్రేమలో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. చూద్దాం... ఈ నాలుగు స్తంభాలాట ఇంకా ఎన్నాళ్లు సా...గు...తుం...దో!
టీవీక్షణం: బుల్లితెర మన్మథుడు
Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement