సాక్షి, రంగారెడ్డిజిల్లా/ హుడా కాంప్లెక్స్: అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు 60 అసెంబ్లీ సీట్లతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కేటాయించాలని రాజకీయ పార్టీలను బీసీ సింహగర్జన సభ డిమాండ్ చేసింది. బీసీలకు సముచిత స్థానం కల్పించని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించింది. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. బీసీలకు 60 సీట్లు ఇవ్వాలిందేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా అంతే సంఖ్య లో సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది.
ఈట లను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ మనుగడ ఉంటుందని సభలో నేతలు పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ సింహగర్జన సభ జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుర్గయ్యగౌడ్, అమృతరావు, చిన్న శ్రీశైలం యాదవ్, గొడుగు మహేశ్, నవీన్ యాదవ్, కుందారం గణేశ్‌చారి తదితరులు ఇందులో పాల్గొ న్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరయ్యారు.
కులానికో సీటు.. బీసీలకే ఓటు నినాదంతో..
తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ అలా జరగలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. రెడ్లకు 40 టికెట్లు ఇచ్చిందని, జనాభాలో 60శాతం ఉన్న బీïసీలకు మాత్రం 23 టికెట్లే ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. మంత్రివర్గంలోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శించారు.
వచ్చే స్థానిక ఎన్నికల నాటికి బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని ప్రకటిస్తామని.. ‘కులానికో సీటు.. బీసీలకే ఓటు’నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తామని ప్రకటించారు. బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని.. చట్టసభల్లో బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీ మహిళలకు ఉప కోటా ప్రకటించాకే మహిళా బిల్లును ఆమోదింపజేయాలన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలని కోరారు. అగ్రకుల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలను నిలుపుతామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment