ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు
12న ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
పార్టీ క్యాడర్‌లో జోష్, ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రణాళిక
హాజరు కానున్న కేసీఆర్, ముఖ్య నేతలు
లక్ష మందికి పైగా జనం వస్తారని అంచనా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిన పార్టీ యంత్రాంగంలో జోష్ నింపేందుకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతు న్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఇటీవలి కాలంలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు లను అప్పగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన ఆయన తరువాత తెలంగాణ భవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇదే ఊపులో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమావే శంలో కరీంనగర్ వేదికగా భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ ఈనెల 12న కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు.
పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా...
నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభ కృష్ణా జలాల అంశంపైనే కాగా, కరీంనగర్ సభను మాత్రం ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధమనే వాయిస్‌ను జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నికల సభలను కరీంనగర్ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కలిసొచ్చిన ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానాన్ని ఇందుకు మరోసారి వేదికగా ఎంచుకున్నారు. ఈ సభకు సంబంధించి సన్నాహక సమావేశం శుక్రవారం జరగ్గా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ యంత్రాంగంలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్ నా యకులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించగా, ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని కేటీ ఆర్ వ్యాఖ్యానించారు. కాగా కరీంనగర్‌లో బీఆర్ ఎస్ కార్పొరేటర్ల అరెస్టులు, నాయకులపై కేసులు నమోదు అంశంపైన కూడా శుక్రవారం నాటి సమా వేశంలో చర్చ జరిగింది.
పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారికి భరోసా ఇవ్వడం పైనా...
బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే రాజకీయాలు వేగంగా మారుతున్నా యి. బీఆర్‌ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి నప్పటికీ, కొందరు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్‌క ర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్) ఇప్పటికే వేరే పార్టీల్లోకి జంప్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిట్టింగ్‌లు భయపడు తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వగా, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిసి చెప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు కరీంనగర్‌లో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని నిర్ణయించారు.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి గంగుల
కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కూడా శుక్రవారం గ్రౌండ్స్‌కు వెళ్లి పరిశీలించారు. ఏయే నియోజకవర్గాల నుంచి ఎంత మంది జనం వస్తారో లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్ష మందికి పైగా జనాలు ఎస్‌ఆర్‌ఆర్ గ్రౌండ్స్‌కు తరలివస్తారని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభను విజయవంతం చేసి బీఆర్‌ఎస్ సత్తాను మరోసారి చాటుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment