బాధ నుంచి పుట్టిన ఆలోచనకు బ్రహ్మరథం | thought came out from dsad | Sakshi
Sakshi News home page

బాధ నుంచి పుట్టిన ఆలోచనకు బ్రహ్మరథం

Published Sun, Dec 29 2013 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

బాధ నుంచి పుట్టిన ఆలోచనకు బ్రహ్మరథం

బాధ నుంచి పుట్టిన ఆలోచనకు బ్రహ్మరథం

 విజయం

 జబ్బు పడ్డాక చికిత్స చేయించుకోవడం కంటే, జాగ్రత్తపడడం మేలు! ఈ మంచి మాటను తరచుగా వింటుంటాం కానీ చెవికెక్కించుకోం! మన కుటుంబంలోనే ఒకరు జబ్బు పడ్డాక ఈ మాట విలువేంటో అర్థమవుతుంది. కానీ చేసేదేముంది? జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ముంబయికి చెందిన కంచన్ నైకవాడి కూడా ఇలాగే నష్టపోయారు. తన తండ్రిని కోల్పోయారు. ఐతే నష్టం జరిగిపోయింది కదా అని ఆమె ఊరుకోలేదు. అందుకోసం కంచన్ ఎంచుకున్న మార్గం.. ఆమెను ఓ మానవతావాదిగానే కాదు, గొప్ప వ్యాపారవేత్తగానూ మార్చింది! వంద కోట్లకు పైగా టర్నోవర్ సాధించిన ఇండస్ హెల్త్ ప్లస్ సంస్థ అధినేత కంచన్ నైకవాడి విజయగాథ ఇది. కొత్త ఏడాది ప్రవేశిస్తున్నపుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఒక సందర్భం కూడా ఉంది. 2013 సీఎంవో ఆసియా ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్స్‌లో కంచన్ ఉమన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్!
 అది 1997వ సంవత్సరం. నిండు గర్భిణి అయిన కంచన్ ప్రసవం కోసం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అయిపోయింది. బిడ్డను చూసుకుని మురిసిపోతోంది! కానీ అంతలోనే విషాదకర వార్త ఆమె చెవికి చేరింది! క్యాన్సర్ కారణంగా తండ్రి చనిపోయాడు. నిజానికి కంచన్ తండ్రి ఒక రోజు ముందే చనిపోయారు. ప్రసవం సమయంలో కంచన్ కుంగిపోతుందేమో అని ఎవరూ ఆమెకు చెప్పలేదు. ఆమెను సముదాయించడం ఎవరి తరం కాలేదు. రెండేళ్లు గడిచినా తండ్రి జ్ఞాపకాలు ఆమెను వదిలి వెళ్లలేదు.
 ఏ జబ్బునైనా ముందుగా గుర్తిస్తే దాని నివారణ సాధ్యమేనని తెలుసుకుంది. ఆ దిశగా ఓ ముందడుగు వేయాలనుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె ‘ఇండస్ హెల్త్ ప్లస్’ అనే ముందస్తు ఆరోగ్య పరీక్షల సంస్థను నెలకొల్పింది. నలుగురు వైద్య సిబ్బందిని నియమించుకుంది.
 
 తనేమీ వైద్యురాలు కాకపోయినా.. వైద్య రంగానికి సంబంధించి ఏ అనుభవమూ లేకున్నా కంచన్.. ధైర్యంగా ముందడుగు వేసింది. ఐతే ఏ జబ్బూ లేకుండా పరీక్షలు చేయించుకునేందుకు మొదట్లో జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. డబ్బు విషయంలో ఆమె ఎవరినీ ఒత్తిడి చేయలేదు. పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించి.. అందరూ చెకప్ చేయించుకునేందుకు ముందుకొచ్చేలా చేసింది. బంధువర్గం తర్వాత మిగతా జనాలపై దృష్టిపెట్టింది. తన బృందంతో వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించింది కంచన్. క్రమంగా జనాల్లోనూ అవగాహన పెరిగి.. పరీక్షలకు ముందుకొచ్చారు.
 
 ఈ పదమూడేళ్ల కాలంలో ‘ఇండస్ హెల్త్ ప్లస్’ ఇంతింతై.. అన్నట్లు ఎదిగింది. సిబ్బంది సంఖ్య నాలుగు నుంచి నాలుగొందలకు చేరింది. సంస్థ టర్నోవర్ రూ.100 కోట్లు దాటింది. 50 లక్షలకు పైగా కుటుంబాలు ఇండస్ హెల్త్ ప్లస్‌లో పరీక్షలు చేయించుకున్నాయి. 400కు పైగా కంపెనీలు ఆ సంస్థకు క్లైంట్లుగా ఉన్నాయి. సంస్థ ఎదుగుదలతో పాటే కంచన్‌కు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆమెను అనేక అవార్డులు వరించాయి. 2013 సీఎంవో ఆసియా ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్స్‌లో ‘ఉమన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం కంచన్ సొంతమైంది. ‘‘ఇండస్ హెల్త్ ప్లస్‌ను డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఆరంభించలేదు. జనాలకు వైద్య పరీక్షల ప్రాధాన్యం తెలియాలి, జబ్బుల్ని ముందే నివారించాలి అన్నది నా ఉద్దేశం. నా లక్ష్యం దిశగా సాగే క్రమంలో సంస్థ కూడా ఉన్నత స్థితికి చేరింది. దీని వల్ల స్వామి కార్యం, స్వకార్యం నెరవేరినట్లయింది’’ అంటారు కంచన్.
 
  ప్రకాష్ చిమ్మల
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement