
బాలీవుడ్ నటి రవీనా టాండన్
టీవీ చాట్ షోలలో యాంకర్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే... అతిథులు సమాధానాలతో సందడి చేస్తుంటారు.
టీవీక్షణం
టీవీ చాట్ షోలలో యాంకర్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే... అతిథులు సమాధానాలతో సందడి చేస్తుంటారు. మొత్తంగా ఎపిసోడ్ పూర్తయ్యే వరకూ కబుర్లు వరదలై పొంగుతుంటాయి. సోనీ పల్ చానెల్లో ప్రతి శని, ఆదివారాల్లో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ నిర్వహిస్తోన్న ‘సింప్లీ బాతే విత్ రవీనా’ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అయితే మిగతా షోలకి లేని ఓ ప్లస్ పాయింట్ దీనికుంది. అదేంటంటే... అతిథులతో రవీనా కొట్ట్టే బాతాఖానీ వల్ల మహిళలకు బోలెడు ఉపయోగం!
ప్రతి ఎపిసోడ్‌కీ మహిళలకు పనికొచ్చే ఒక టాపిక్‌ను ఎంచుకుంటుంది రవీనా. గృహాలంకరణ, ఆరోగ్యం, ఫ్యాషన్ డిజైనింగ్, కుకరీ... ఇలా రకరకాల అంశాలు! తాను ఎంచుకున్న అంశాన్ని బట్టి, అందులో నిపుణులైన అతిథులను ఎంచుకుంటుంది. వారిని పిలిచి ఓ పక్క ఇంటర్వ్యూ చేస్తూనే, మరోపక్క ఆ విషయం పట్ల మహిళలకు పూర్తి అవగాహన వచ్చే విధంగా అన్ని కోణాలనూ స్పృశిస్తుంది.
నిపుణులతో వివరింపజేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా... ఇంత ఎంత వైవిధ్యభరితమైన, ఉపయోగకరమైన కార్యక్రమమో! ఏదో సరదాగా వినోదాన్ని పంచి వదిలేయకుండా విజ్ఞానాన్ని కూడా పెంచేలా ఈ షోని తీర్చిదిద్దినందుకు చానెల్ వారిని, దాన్ని ఆసక్తికరంగా నడిపిస్తున్నందుకు రవీనాని మెచ్చుకుని తీరాల్సిందే!