రెండు దేశాల గుండె చప్పుడు | two countries Heartbeat story | Sakshi
Sakshi News home page

రెండు దేశాల గుండె చప్పుడు

Published Sun, Jul 26 2015 1:49 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

రెండు దేశాల గుండె చప్పుడు - Sakshi

రెండు దేశాల గుండె చప్పుడు

 2004, ఏప్రిల్ 9వ తేదీన అక్కినేని నాగార్జున హీరోగా, నా దర్శకత్వంలో ‘నేనున్నాను’ అనే చిత్రం విడుదలైంది. మొదటి వారం ఫ్లాప్ అని, యావరేజ్ అని టాక్ మొదలై నెమ్మదిగా పుంజుకుని, నాలుగో వారానికి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ టైటిల్‌కి హిందీ అనువాదం ‘మై హూ నా’... 2004, ఏప్రిల్ 30న విడుదలైంది. టైటిల్ మాత్రమే పోలిక. సినిమాలు దేనికవే. హిందీలో ‘నేనున్నాను’ అనే టైటిల్‌తో, అక్కడి అగ్ర హీరోతో వచ్చిన చిత్రం ఎలా ఉంటుందో చూద్దామని ఉత్సుకతతో మొదటిరోజే వెళ్లాను. సర్‌ప్రైజ్.

 సాధారణంగా సినిమా చూసేటప్పుడు కాలక్షేపానికి పాప్‌కార్న్ కొనుక్కుని తింటాం. కానీ, సినిమాయే పాప్‌కార్న్ తిన్నంత కాలక్షేపాన్నిస్తే..? అదే ‘మై హూ నా’. పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ పాప్‌కార్న్ మూవీ. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య మైత్రి బలపడాలని రెండు ప్రభుత్వాలూ ఆపరేషన్ మిలాప్ పేరుతో యుద్ధ ఖైదీల్ని విడుదల చేయాలనుకుంటాయి.
 
  అందుకు ఒక భారతీయ హిందూ ఆర్మీ మేజర్ (రాఘవదత్తా) ఒప్పుకోనంటాడు. అతన్ని ఆర్మీ నుంచి సస్పెండ్ చేయడంతో, తన అనుచరులతో కలసి తీవ్రవాదిగా మారి, ఆ ఆపరేషన్‌ని జరగనివ్వకూడదని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో జనరల్ బక్షీ అనే ఆర్మీ చీఫ్‌ని చంపబోతే ఒక కమాండర్ అతని ప్రాణాలు కాపాడి, తాను ప్రాణం కోల్పోతాడు. ఆ కమాండర్ కొడుకే హీరో రామ్. జనరల్ బక్షీ కూతురు సంజనని కాపాడటంతో పాటు తన తండ్రి రెండో భార్యని, ఆమె కొడుకు లక్ష్మణ్‌ని కలుసు కోవడానికి రామ్ డార్జిలింగ్ వెళ్తాడు. అక్కడికి రాఘవన్ గ్యాంగ్ రావడం, రామ్, రాఘవన్‌ని అంతం చేయడం, ఆపరేషన్ మిలాప్ దిగ్విజయంగా జరగడం, అదే సమయానికి అన్నదమ్ములైన రామ లక్ష్మణులు కలుసుకోవడం... ఇదీ కథ.
 
 భారత, పాకిస్తాన్ పౌరుల్ని అన్నదమ్ములుగా భావించి, ఆ దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాన్ని తిరిగి ఒక్కటి చేసే కథలో కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్... అన్నీ కలిసొచ్చేలా తీయడంతో పాటు... భారత్, పాకిస్తాన్ దేశాల్లాంటి రామ లక్ష్మణుల పాత్రలతో కథని, స్క్రీన్‌ప్లేని నడిపించిన చిత్ర దర్శకురాలు ఫరాఖాన్ ప్రతిభకి నిజంగా జోహారులర్పించాలి.
 
 బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మొదటిసారి నిర్మాతగా మారి, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తన భార్య గౌరీఖాన్‌తో కలసి నిర్మించిన సినిమా ఇది. అందుకేనేమో చాలా సేఫ్‌గా, సగటు భారతీయ ప్రేక్షకుడు కోరుకునే వాణిజ్య అంశాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రాన్ని ఎంచుకున్నాడు. కావలసిన భారీతనాన్ని నిర్మాతగా తెర నిండా నింపాడు. పెట్టిన డబ్బుకి తొమ్మిది రెట్లు ఎక్కువ లాభాన్ని గడించాడు.  ఈ టైప్ చిత్రాలకి వసూళ్ల పరంగా మంచి గిరాకీ ఉంటుంది. కానీ, క్రియేటివ్‌గా మెదడుకి, గుండెకి తృప్తినివ్వవు. కనీసం వాటిని స్పృశించవు కూడా. అయినా మంచి కాలక్షేపానికి ఇవి ఆడే థియేటర్లు చిరునామాలు.
 
 ఈ చిత్రం వేసవిలో తెచ్చిన కలెక్షన్లు ఆ నిర్మాతని, దర్శకురాలిని ఎంత కన్‌ఫ్యూజ్ చేశాయో తెలుసుకోవాలంటే, ఆ కాంబినేషన్‌లో తర్వాత వచ్చిన ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలు చూస్తే తెలుస్తుంది. వాళ్లే ఈ చిత్రం ఇందులో ఉన్న మసాలా వల్ల ఆడిందని అనుకున్నట్టు ఉంటాయి ఆ సినిమాలు. కానీ కాదని నా ఫీలింగ్. అంతర్లీనంగా ఈ సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్లు చాలానే ఉన్నాయి. విడిపోయిన కుటుంబం మళ్లీ కలవడం అనేది భారతీయ సినిమాల్లో చాలా పెద్ద కమర్షియల్ ఫార్ములా. అది ఈ సినిమాలో ఉంది. భారత్, పాకిస్తాన్ల మధ్య మైత్రి అయినా, శత్రుత్వం అయినా భారతీయ సినిమాల్లో మరో పెద్ద కమర్షియల్ ఫార్ములా. అదీ ఈ సినిమాలో ఉంది. ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం కోసం హీరో ఏం చేసినా సినిమా సక్సెస్ అవుతుంది. అదీ ఈ సినిమాలో ఉంది. వీటిపైన ఎంత బఫూనరీ అయినా, ఇల్లాజికల్ ఎలిమెంట్లున్నా ప్రేక్షకులు క్షమించేస్తారు. అందుకే అవీ ఈ సినిమాలో ఉన్నాయి.
 
 ఈ చిత్రంతో ఫరాఖాన్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకురాలిగా మారింది. ఈ ప్రక్రియ తెలుగు సినిమాలలో కూడా మార్పుని తెచ్చింది. సుచిత్రా చంద్రబోస్, ప్రభుదేవా, లారెన్స్, ‘అమ్మ’ రాజశేఖర్‌లు నృత్య దర్శకత్వం నుంచి దర్శకులయ్యారు.ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా ఒకటి మాత్రం కచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం. అదేమిటంటే... షారుఖ్ నటించడం అన్నదే ఈ సినిమాకి పెద్ద ప్లస్. వచ్చేవారం కలెక్షన్ల దుమ్ము దులిపిన ‘ధూమ్’ సినిమాతో కలుద్దాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement