
అసలేం జరిగింది..
పట్టుకోండి చూద్దాం
పొద్దుటి పూట ఆ వార్త దావనాలంలా వ్యాపించింది....
‘రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు’
‘ఎందుకు చేసుకున్నాడు?’ అనే ప్రశ్నకు ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని...
‘పిల్లలిద్దరూ ఫారిన్‌లో సెటిలయ్యారు. భార్య చనిపోయింది. ఈ ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’
‘రామారావు ముక్కోపి. తనకు తాను హాని చేసుకుంటాడు. ఎవరితోనైనా గొడవ పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడేమో!’
‘పరులకు మేలు చేయాలనే స్పృహ రామారావులో ఎక్కువ. తన ఆస్తినంతా అనాథ శరణాలయాలకు రాస్తానని పిల్లలకు చెప్పడంతో వాళ్లు మండిపడ్డారు. పిల్లలకు రామారావుకి పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకున్నారు’
‘రామారావుకి డ్రింక్ తీసుకునే అలవాటు ఉంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు. బాగా తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు’
‘నిన్న రాత్రి ఆయనతో చాలాసేపు మాట్లాడాను. గొంతులో ఎక్కడా బాధ కనిపించలేదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఏమైందో ఏమో... నాకైతే షాకింగ్‌గా ఉంది’
‘ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు రామారావు... ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే నాలుగు మంచి మాటలు చెప్పి వారిని ఉత్తేజితులను చేస్తాడు. అలాంటి మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది’
రామారావు ఎందుకు ఆత్మహత్య చేసుకొని ఉంటాడు?
ఒంటరితనమా?
పిల్లలతో తగాదా?
మద్యమా?
రామారావు కిటికీ నుంచి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
ఇన్‌స్పెక్టర్ నరసింహ సంఘటన స్థలికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్లను కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు.
‘‘ఈ ఇంట్లో ఎందరు ఉంటారు?’’
‘‘రామారావుగారితో పాటు రాజు అనే పనిమనిషి ఉంటాడు’’
‘‘రాజు ఎక్కడ?’’
‘‘కొద్ది రోజుల క్రితమే... చెప్పాపెట్టకుండా పని మానేశాడు’’
‘‘రాజు ఎలాంటి వాడు?’’
‘‘రామారావుకి నమ్మినబంటులా ఉండేవాడు. వాడు ఉన్నప్పుడు ఈ ఇల్లు కాస్త సందడిగా ఉండేది’’
ఇన్‌స్పెక్టర్ నరసింహ బిల్డింగ్ అంతా కలియతిరిగి చూస్తున్నాడు....
ఆ బిల్డింగ్‌లో బాల్కానీలు లేవనే విషయం అర్థమైంది.
‘అందుకే కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడు’ అనుకున్నాడు మనసులో.
బిల్డింగ్‌లో ఉన్న కిటికీలను పరిశీలిస్తూ ఒక రౌండ్ వేశాడు.
రామారావు శవాన్ని, చుట్టూ పరిసరాలను మరోసారి పరిశీలించాడు.
అప్పుడు...
‘రామారావుది ఆత్మహత్య కాదు. హత్య’ అని ప్రకటించాడు.
కారణమేమిటో కూడా చెప్పాడు.
అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో, షాక్‌తో నోరెళ్లబెట్టారు!
ఇప్పుడు చెప్పండి...
రామారావుది ఆత్మహత్య కాదని... హత్యేనని ఇన్‌స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు?
Ans:
ఇన్‌స్పెక్టర్ నరసింహ బిల్డింగ్‌లోని పెద్ద కిటికీతో సహా అన్ని కిటికీలను పరిశీలించాడు... అయితే ఏ కిటికీ కూడా తెరుచుకొని లేదు. అన్ని కిటికీలు మూసే ఉన్నాయి. ఒకవేళ పెద్ద కిటికీ నుంచి రామారావు దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటే... ఆ కిటికీ తలుపు తెరుచుకొని ఉండేది కదా!