దూరాన్ని మీరే కత్తిరించండి!
‘మావారు నన్నసలు పట్టించుకోవడమే లేదు’... చాలామంది భార్యలు చేసే కంప్లయింట్ ఇది. ఒక్కోసారి ఈ ఫిర్యాదు పెద్ద దుమారాన్నే రేపుతుంది. దంపతుల మధ్య చిచ్చు పెడుతుంది. బంధాన్ని తెగతెంపులు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా? ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. మరి దీనికెందుకు ఉండదు?
చాలామంది చేసే తప్పు... మనం చెప్పకుండానే అవతలివాళ్లు మన ఫీలింగ్స్ అర్థం చేసేసుకోవాలని ఆశపడటం. అది కరెక్ట్ కాదు. అందరూ అలా అర్థం చేసుకోలేరు. కాబట్టి మీ మనసులో ఉన్నది మీ భర్తకి చెప్పండి. మీతో కాస్త సమయం గడపమని అడగండి. ఒకవేళ ఆయన అర్థం చేసుకోకపోతే అప్పుడు మరో మార్గాన్ని అనుసరించవచ్చు.
సమయం కేటాయించవేంటి అంటూ ఎప్పుడూ గొడవకు దిగకండి. పాపం నిజంగానే ఆయన పనులతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండొచ్చు. మీతో గడపాలని ఉన్నా గడపలేకపోవచ్చు. మీరు గొడవ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి ఆయన తన పనీ సరిగ్గా చేసుకోలేరు. ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి పరిష్కారాన్ని వెతకండి తప్ప స్పర్థలు పెంచుకోకండి.
ఆయన మీ కోసం టైమ్ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మీరే ఎందుకు టైమ్ తీసుకోకూడదు? అంటే... ఆయన లంచ్ టైమ్ ఏంటో తెలుసుకోండి. మీకు వీలు చిక్కినప్పుడు ఆయనకు ఇష్టమైన భోజనాన్ని సిద్ధం చేసుకుని, లంచ్ టైముకల్లా ఆయన ముందు వాలిపోండి. నచ్చిన భోజనం పెట్టి ఆయనను సంతోష పెట్టినట్టూ ఉంటుంది, ఆయనతో కాసేపు సరదాగా గడిపినట్టూ ఉంటుంది.
కొందరు మగాళ్లు ఇంట్లో కూడా ఆఫీసు పని చేస్తుంటారు. అలాంటప్పుడు విసుక్కోకండి. మీరు చదువుకున్నవారైతే వారి పనిని పంచుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఆయనకు కాస్త సమయం మిగులుతుంది కదా... అది మీకు కేటాయిస్తారు.
ఎప్పుడైనా ఆయన ఇంటికి వచ్చే సమయంలో ఆఫీసు దగ్గరకు వెళ్లిపోండి. సరదాగా ఆయనతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి రండి. వీలైతే దారిలో ఏ ఐస్‌క్రీమో తినండి. మరి కాస్త సమయం గడపవచ్చు.
ఒకవేళ ఆర్థిక సమస్యలు అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా కష్టపడుతున్నారేమో తెలుసుకోండి. అదే కనుక నిజమైతే మీరు కూడా మీకు చేతనైన పని చేసి సంపాదించేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఆ సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. ఆయనకు మరింత దగ్గరవొచ్చు.