వెంకన్న ఆలయం వాస్తుకు అతీతమా?
స్వయం వ్యక్త క్షేత్రమైన తిరుమలకు వాస్తు వర్తించదా? భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారమే తిరుమలేశుని ఆలయం నిర్మాణం సాగిందా? పరస్పర విరుద్ధమెన ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంవ్యక్త శిలామూర్తిగా తిరుమల క్షేత్రంలో వెలిశారు. తిరుమల ఆలయానికి ఎనభై యోజనాల వరకు వాస్తును పరిగణనలోకి తీసుకోకూడదని వైఖానస ఆగమ పండితులు చెబుతున్నారు. అయితే, తిరుమలేశుని ఆలయ నిర్మాణం పూర్తిగా వాస్తు నిబంధనలకు లోబడే సాగిందని వాస్తు నిపుణులు చెబుతుండటం గమనార్హం.
క్రీ.శ.1వ శతాబ్దంలో తమిళభాషలో రాసిన ‘తులక్కాపియం’లో తమిళదేశానికి ఎల్లలుగా నిర్ణయిస్తూ దక్షిణాన కన్యాకుమారి, ఉత్తర దిశలో వేంకటాచల పర్వతాలు, అందులోని ‘తెన్‌కుమారి వడ వేంగడం’ అని శేషాచల పర్వతాల్లోని జలపాతాలు, జంతుజాలాలతో కూడిన దట్టమైన అడవిని వర్ణించి, ఇక్కడే పొడవైన మహావిష్ణువు స్వయంవ్యక్తంగా కొలువై వున్నాడని పేర్కొంది. అప్పట్లో ధృవబేరంగా పిలిచే మూలమూర్తిని నాలుగు వైపులా దర్శించేలా పైకప్పుతో మాత్రమే నిర్మించబడిందని ఆ గ్రంథం పేర్కొంది.
ఆలయంలో మొదటగా నిర్మించింది ఆనంద నిలయ ప్రాకారమే. తర్వాత గర్భాలయం, అంతరాళం వరకు నిర్మించారు. ఇప్పుడున్న వైకుంఠ ద్వారం అప్పట్లో మహాప్రదక్షిణగా నిర్మించబడింది. 12.9 అడుగుల లోపలి కొలతతో చతురస్రాకారంలో గర్భాలయం, 13.5 అడుగుల కొలతతో శయన మండపం, 12కి 10 అడుగుల కొలతతో రాములవారిమేడ, 27 అడుగుల చతురస్రాకారంలో స్నపన మండపం, ఆరడుగుల వెడల్పుతో బంగారు వాకిలి నిర్మించారు.
మొదట్లో గరుడాళ్వార్ సన్నిధి వెనుక వైపునే ధ్వజస్తంభం, బలిపీఠం ఉండేవి.
1150 తర్వాత ఆనంద నిలయాన్ని ఆధునీకరించారు. ఆనంద నిలయం బరువును తట్టుకునేందుకు వీలుగా గర్భాలయ రాతిగోడలను వెడల్పు చేశారు. తర్వాత ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారు. పక్కనే ఉత్తరదిశలో వైఖానస ఆగమోక్తంగా విష్వక్సేనుడిని ప్రతిష్టించారు.
తర్వాత ఆగ్నేయంలో వర దరాజస్వామి, ఉత్తరదశలో పశ్చిమ ముఖంలో నృసింహస్వామిని ప్రతిష్టించారు. ఉత్తరాన స్వామి ఆభరాణాలు, పట్టువస్త్రాలు భద్ర పరిచే సబేరా అర ఏర్పాటు చేశారు.
12శతాబ్దంలో నిర్మించిన లోపలి ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం లేదా సంపంగి ప్రదక్షిణం అంటారు. ఇది తూర్పు, పడమరకు 250 అడుగులు, ఉత్తర- దక్షిణం వరకు 160 అడుగులతో నిర్మించారు.
క్రీ.శ.13వ శతాబ్దంలో వెలుపల మహా ప్రాకారం నిర్మించారు. తూర్పు, పడమరగా 414 అడుగుల పొడవు, ఉత్తర, దక్షిణాలుగా 263 అడుగుల వెడల్పుతో నాలుగు అడుగుల మందం, 30 అడుగుల ఎత్తులో ఇది కట్టారు. ఆలయ అవసరాల కోసం ఆయా కాలాల్లో రంగనాయక మండపం, అద్దాల మండపం, తిరుమల రాయ మండపం, సంపంగి ప్రాకారంలో నాలుగు వైపులా నాలుగు రాతి స్తంభాలతో మండపాలు, దక్షిణ దిశలో యాగశాల, కల్యాణ మండపం.. మరెన్నో నిర్మాణమైనాయి.
వెంకన్న ఆలయం వాస్తుకు అతీతం..
తిరుమల శేషాచల కొండలపై కొలువైన ఆలయం సముద్ర మట్టానికి 2800 అడుగుల మొదలు 3600 అడుగుల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆలయ విస్తీర్ణం 2.20 ఎకరాలు. మూడు ప్రాకార ప్రదక్షిణలు, రెండు గోపురాలతో నిర్మించారు. ప్రాకారాలు దీర్ఘ చతురస్రాకారంలోనే ఉన్నాయి.
ఆలయానికి ఒక్క ఈశాన్యం మినహా మిగిలిన మూడు వైపులా శేషాచల పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఈశాన్యం దిశలో మైదాన ప్రాంతంతోపాటు పల్లపు ప్రాంతం ఉంది.
ఆగ్నేయంలో పోటు/ వంటశాల ఉంది. దీనికి ముడి సరుకులు నిల్వ చేసే స్టోర్ నైరుతి నుంచి వాయవ్యం వరకు విస్తరించింది ఉంది. ఆలయానికి పడమర దిశలో బరువు ఉంది. దీనికి తోడు నైరుతి దిశలో బరువైన, ఎత్తై నారాయణగిరి పర్వత శ్రేణులు విస్తరించటం ఆలయ వాస్త్తుకు మరింత బలాన్ని చేకూర్చిందని పండితుల వాదన.
ప్రకృతిసిద్ధ్దంగా ఉద్భవించిన పుష్కరిణి
తిరుమలలో ప్రకృతిసిద్ధంగా స్వామి పుష్కరిణి ఈశాన్యంలోనే ఉద్భవించింది. వాస్తురీత్యా ఈశాన్య దిశలో నీటి ప్రవాహం ఉండటం వల్ల ఆ ప్రాంతం, ఆ దేవాలయం పేరు ప్రతిష్టల్ని గడిస్తాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం తిరుమల స్వామి పుణ్యతీర్థంలోకి ముక్కోటి తీర్థాలు కలుస్తాయి. దేవతలు కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రసిద్ధి. పూర్వం కుమారస్వామి కూడా పుష్కరిణి గట్టుపై తపస్సుచేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ పుణ్యతీర్థం స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధి పొందింది.
ఆలయానికి సుదూర ఈశాన్యంలో మైదాన ప్రాంతంలో గోగర్భం తీర్థం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు ఆది వరాహస్వామిని దర్శించడానికి ఇక్కడ యజ్ఞయాగాదులు చేశారట! నేటికీ రాతి బండలపై చెక్కిన పాండవుల రూపాలు కనిపిస్తాయి. పూర్వం నుంచే ఇక్కడ నిరంతరం నీరు నిల్వ ఉంటూ కింద తూర్పు భాగానికి ప్రవహిస్తోంది. అక్కడ టీటీడీ 1963లో ప్రత్యేకంగా గోగర్భం జలాశయం పేరుతో భారీ డ్యాము నిర్మించారు.
అందుకే తిరుపతి లడ్డుకు అంత పవిత్రత, అంత రుచి
ఇళ్లల్లోనే కాదు, ఆలయాల్లో కూడా ఆగ్నేయంలోనే వంటశాల/ పోటు ఉండేలా పండితులు జాగ్రత్త పడుతుంటారు. తిరుమల ఆలయంలో స్వామికి ఆగ్నేయ దిశలో పోటు ఉంది. శ్రీనివాసుని తల్లి వకుళమాత కొలువైన ఈ పోటులోనే పూర్వం నుంచీ స్వామి నైవేద్యానికి అన్ని రకాల ప్రసాదాల్ని తయారు చేస్తున్నారు.
వాస్తు రీత్యా ఇంటి నిర్మాణంలో చుట్టు నాలుగువైపులా ఖాళీస్థలం వదులుతారు. ఆలయాల నిర్మాణంలోనూ మాడ వీధుల కోసం ఖాళీ స్థలం వదులుతారు. నాలుగు మాడ వీధుల్లో ఆధ్యాత్మిక, భక్తి, ధార్మిక, ఉత్సవ ఊరేగింపులు నిరంతరం సాగినపుడే ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది.
గతంలో ఇరుకైన నాలుగు మాడ వీధుల్లోని ప్రైవేట్ ఇళ్లు, దుకాణాలను తొలగించి ఉత్సవాల నిర్వహణ కోసం నాలుగు మాడ వీధులను మాస్టర్‌ప్లాన్ పేరుతో టీటీడీ విస్తరించింది. ప్రస్తుతం సుమారు 2.20 లక్షల మంది నాలుగు మాడ వీధుల్లో హాయిగా కూర్చుని ఉత్సవాలను తిలకించే అవకాశం కలిగింది.
విమానార్చన కల్పమే ప్రామాణికం
స్వయం వ్యక్త స్వరూప శిలామూర్తి అయిన శ్రీవేంకటేశ్వరస్వామి కాల దేశ వర్తమానాలకు అతీతుడు. ఆ స్వామికి వాస్తు వర్తించదు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, పంచభూతాలు, దేవతా గణాలు.. అన్నీ స్వామికి లోబడినవిగా ఉంటాయి. విష్ణువు దేవతా సార్వభౌముడుగా వర్ణించబడతారు.
స్వామి ప్రపత్తి, వైభవం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వైకుంఠంలో ఉండే వైభవంతోనే కలియుగవైకుంఠం తిరుమలక్షేత్రంలోనూ వెలుగొందుతానని స్వామివారే సెలవిచ్చినట్లు వేంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది.
విఖనస మహర్షి ప్రథమ శిష్యుడు మరీచి మహర్షి విరచిత ‘విమానార్చన కల్పం’ ఆధారంగానే తిరుమల ఆలయాన్ని నిర్మించారు. ఆలయ వాస్తు, శిల్పశాస్త్రాల్లో మార్పు చేర్పులకు ఆ గ్రంథమే ప్రామాణికం
గర్భాలయ ధృవబింబాన్ని ఒక ఆయం లేదా యూనిట్‌గా తీసుకుని, దాని ప్రకారం ప్రాకారాలు, విమానం, మహాద్వార గోపురం, మాడ వీధులు, రాజవీధులు నిర్మిస్తారు. ధ్వజస్తంభం ఎత్తు, బలిపీఠం, రాజగోపురం ఎత్తు, విమానం లక్షణాలు కూడా మూలబింబం ఆధారంగానే నిర్ణయించబడతాయి.
ఆలయ వాస్తు, శిల్పశాస్త్రం మహర్షులు ప్రసాదించారు. వైఖానస ఆగమోక్తంగా నిర్మించిందే తిరుమల ఆలయం. ఆ స్వామికొలువైన ఈ క్షేత్రం ఉత్కృష్ట స్థానానికి చేరింది.
స్వామి చుట్టూ ఎంతోమంది దేవతాగణాలు అరూపంగా ఉంటారు. స్వయంవ్యక్త శిలామూర్తి ప్రతిష్టా సమయంలో ఎన్నో ఉపచారాలతో ఆవాహన చేసి ఉంటారు.
సకల దేవతలు, నవావరణాలు, అష్టదిక్పాలకులు, శక్తి స్వరూపాలు, సప్తద్వారాలుగా ఆలయాన్ని అంటిపెట్టుకుని, భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుంటారు.
{బహ్మోత్సవానికి నాందిగా ధ్వజపటాన్ని ఊరేగించే సమయంలో, ఉత్సవ వర్ల ఊరేగింపులో ఆలయ ప్రధాన అర్చకుడు వైఖానస ఆగమం ప్రకారం అష్టదిక్పాలకులను ఆయా సూక్తాలతో అర్చించి ఉపచారాలు సమర్పించి బలి ఇస్తారు.
ఉత్సవ ఊరేగింపుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత మాడ వీధుల్లోనే ప్రదక్షిణ పరిధులు నిర్ణయిస్తారు.
ఆలయం లోకకల్యాణం కోసం నిర్మించబడుతుంది. భక్తిలోపం, ద్రవ్యలోపం, సమయం లోపం, అకాలపూజలు... వంటి లోపాలు లేకుండా మరింత శ్రద్ధగా ఆగమ బద్ధంగా పూజాకైంకర్యాలు సాగిస్తే ప్రాంతం, రాష్ట్రం, దేశం ఎదుర్కొనే సమస్యలన్నీ తీరిపోతాయి.