సత్యమే ఆయన మతం | World famous dramatist George Bernard Shaw | Sakshi
Sakshi News home page

సత్యమే ఆయన మతం

Published Sun, Feb 24 2019 12:04 AM | Last Updated on Sun, Feb 24 2019 12:04 AM

World famous dramatist George Bernard Shaw - Sakshi

సత్యం అనే గమ్యానికి దారి లేదు. ఎవరికి వారు బాట వేసుకుని సత్యాన్ని చేరుకోవలసిందే. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ మతాచార్యుడు, ఏ విశ్వాసం ఏ సిద్ధాంతం సత్యాన్ని మనకు అందించలేదు. సత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు. సత్యం ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరు సత్యాన్ని కనుగొంటే అది అతని సత్యం అవుతుంది. మనది కాదు. మన సత్యాన్ని అన్వేషించి కనుగొనవలసిందే.

1909, ఏప్రిల్‌ మాసంలో ఓ సాయంత్రం.  మద్రాస్‌లోని అడయార్‌ సముద్రపు ఒడ్డున ఇసుకలో  కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. తన కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎర్నెస్ట్‌ ఉడ్‌తో కలసి ఇసుకలో నడుస్తున్న చాల్స్‌ వెబ్‌స్టర్‌ లెడ్‌బీటర్‌ ఆ పిల్లల గుంపులో ఒక బాలుడిని గమనించాడు. ఆయన దివ్యజ్ఙాన సమాజంలో ప్రముఖుడు. అతీంద్రీయ శక్తులు లేదా మానవాతీత శక్తులు కలిగి ఉండేవాడని ప్రతీతి. ఇంతకీ ఆ పిల్లవాడిని లెడ్‌బీటర్‌ అంత నిశితంగా గమనించడానికి కారణం – అతడు భావి జగద్గురువు –వరల్డ్‌ టీచర్‌– అని ప్రగాఢంగా నమ్మడమే. ఆ జగద్గురువు ఆగమనం కోసమే దివ్యజ్ఞాన సమాజం వేచిచూస్తోంది కూడా.అంతమంది బాలల్లో తను చూసిన ఆ అబ్బాయిని, నిరంతరం ఇతడినే వెన్నంటే ఉంటున్న ఇంకొక అబ్బాయిని గురించి తెలుసుకున్నాడు లెడ్‌బీటర్‌. ఆ ఇద్దరు నారాయణయ్య అనే రిటైర్డ్‌ తహసీల్దార్‌ కుమారులని తెలిసింది.

ఇంతకీ నారాయణయ్య తమ సంస్థలోనే ఉద్యోగి. అడయార్‌లో ఉన్న వారి ఆశ్రమానికి సమీపంలోనే శిథిలావస్థలో ఉన్న ఒక భవనంలో ఉన్నదా కుటుంబం. లెడ్‌బీటర్‌  ఆ బాలుడిని చూడగానే ఇలాంటి దివ్యత్వం ఉన్న బాలుడిని ఎక్కడా చూడలేదు అన్నాడట. పక్కనే ఉన్నాడు, ప్రొఫెసర్‌ ఎర్నెస్ట్‌ ఉడ్‌. ఆయన ఎప్పుడూ చూడలేదు మరి. పైగా ఆ ఇద్దరు పిల్లలు ఆయన దగ్గరకి వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళుతూ ఉండేవారు. మొదట లెడ్‌బీటర్‌ తన అభిప్రాయాన్ని దివ్యజ్ఞాన సమాజంలో మరొక ప్రముఖురాలు, ప్రముఖ భారత స్వాతంత్య్ర సమరయోధురాలు అనిబీసెంట్‌కు చెప్పి నమ్మకం కలిగించాడు. తరువాత నారాయణయ్యను ఒప్పించి, అనిబీసెంట్‌ ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అందులో లెడ్‌బీటర్‌ భావి జగద్గురువును చూసిన పిల్లవాడే జిడ్డు కృష్ణమూర్తి. రెండో పిల్లవాడు కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానంద.  


కానీ లెడ్‌బీటర్‌ మానవాతీతశక్తులు నిజం కాదని కృష్ణమూర్తి జీవితం నిరూపించింది. నీవు జగద్గురువు అని లెడ్‌బీటర్, అనిబీసెంట్‌ తదితరులు ఆయనను పిలుచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆ రోజుల్లోనే కుప్పలుతెప్పలుగా విరాళాలు వచ్చి పడ్డాయి. తీరా జగద్గురువు పీఠం ఎక్కించడానికి కొంచెం ముందు తాను జగద్గురువును కాదు అని నిష్కర్షగా ప్రకటించారు కృష్ణమూర్తి. అసలు గురువు అనే, నేర్పేవాడు అనే వ్యవస్థకే తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఆ పీఠం, ఆ కోట్లాది రూపాయల విరాళాలు అన్నీ త్యజించి, దివ్యజ్ఞాన సమాజం వీడి బయటకు వెళ్లిపోయారాయన.అసలు కృష్ణమూర్తి (మే 12, 1895–ఫిబ్రవరి 17,1986) జీవితమే ఒక అద్భుతం. ఆయనది గొప్ప రూపం. ఇంత అందగాడిని నేను చూడలేదు అన్నాడట, కృష్ణమూర్తిగారిని చూడగానే, ప్రపంచ ప్రఖ్యాత నాటక కర్త జార్జ్‌ బెర్నార్డ్‌ షా.

ఒక హాలీవుడ్‌ సంస్థ అయితే ఆయన కథానాయకునిగా గౌతమ బుద్ధ ఇతివృత్తంతో సినిమా నిర్మించాలని కూడా తలపెట్టింది. అందుకు కృష్ణమూర్తి అంగీకరించలేదు. అలాగే ఆయన ఉపన్యాసాలకు విశ్వవిఖ్యాతి ఉంది. అసాధారణంగా అధ్యయనం చేశారు కాబట్టి ఉపన్యాసం కొంత మార్మికంగా, ఎంతో కవితాత్మకంగా సాగేదని (ఆ ఉపన్యాసాలు చదివినప్పటికి) తెలుస్తుంది. జేకే, కృష్ణజీ, కృష్ణాజీగా విశ్వవిఖ్యాతి చెందిన కృష్ణమూర్తి స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు అష్టమగర్భంలో పుట్టారు. అందుకే కృష్ణుడి పేరు పెట్టారు. మొత్తం పదకొండుమంది సంతానం. ఆయన తమ్ముడు నిత్యానంద. యౌవనంలోనే వక్తగా అసాధారణ ప్రతిభ కనపరిచిన కృష్ణమూర్తి ప్రాథమిక విద్య దశలో సర్వ సాధారణమైన విద్యార్థే. పాఠాలు అప్పచెప్పడంలో, వినడంలో ఎప్పుడూ వెనకపడి ఉండేవాడు. దిక్కులు చూస్తూ ఉండేవాడు.

తరచూ తండ్రి బదిలీ కావడం వల్ల, మలేరియా వల్ల కూడా కృష్ణమూర్తి చదువు బాగా వెనుకపడింది. దీనితో ఉపాధ్యాయులు చండామార్కులవారయ్యేవారు. ఇలాంటి విద్య వల్లనే ఆయన సంప్రదాయ విద్యను తీవ్రంగా ద్వేషించేవాడని చెబుతారు. పైగా పదేళ్లు వచ్చేసరికి తల్లి మరణించింది. బాల్యానికి అదొక వెలితి. తండ్రి పదవీ విరమణ చేసిన తరువాత అడయారులోనే ఉన్న దివ్యజ్ఞాన సమాజంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. శని, ఆదివారాలలో కృష్ణమూర్తిని తన బంగ్లాకు తీసుకురావలసిందని లెడ్‌బీటర్‌ నిత్యానందకు చెప్పేవాడు. అక్కడ మొదట చదువు చెప్పేవారు. తరువాత లెడ్‌బీటర్‌ కృష్ణమూర్తిని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని తల మీద చేయి వేసి, పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పేవారట. అలా అన్వేషించగా అన్వేషించగా ఆయన మహావక్త అవుతాడని తెలిసిందట. తరువాత తాము వేచి చూస్తున్న ‘లార్డ్‌ మైత్రేయ’ కృష్ణమూర్తిలో ఉన్నాడని క్లెయిర్‌వాయింట్‌ ద్వారా తెలిసిందట.

ఆ లార్‌ మైత్రేయే దివ్యజ్ఞాన సమాజం ఎదురు చూస్తున్న జగద్గురువు. ఆయన ఆధునిక ఆధ్యాత్మిక అస్థిత్వమని దివ్యజ్ఞాన సమాజం నమ్మింది. నిజానికి బౌద్ధం నుంచి, కొంత క్రైస్తవం నుంచి ఈ సిద్ధాంతాన్ని మేడమ్‌ బ్లావట్‌స్కీ స్వీకరించింది. ఆమె దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు. ఆమె శిష్యుడు లెడ్‌బీటర్‌. మైత్రేయ బోధిసత్వుడు మానవాళిని దుఃఖాల నుంచి రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మగా, బుద్ధునిగా,క్రీస్తుగా జన్మిస్తాడని దివ్యజ్ఞాన పథకుల నమ్మకం. ఆ మైత్రేయుడు ఈ యుగంలో తన సరైన వాహకంగా కృష్ణమూర్తిని ఎంచుకున్నాడన్నదే ఆ నమ్మకంలో కనిపిస్తుంది.  అనిబీసెంట్‌ పర్యవేక్షణలో లెడ్‌బీటర్‌ సంరక్షణలో పద్నాలుగేళ్ల బాలుడు కృష్ణమూర్తి చదువుకున్నాడు. కానీ పెంపకం అంతా పాశ్చాత్య పద్ధతిలోనే. ఆ సమయంలోనే లెడ్‌బీటర్‌ మీద అనుమానంతో నారాయణయ్య తన పిల్లలను తనకు అప్పగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.

కోర్టు నారాయణయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ అనిబీసెంట్‌ ప్రీవీకౌన్సిల్‌కు వెళ్లారు. అక్కడ మాత్రం పిల్లల ఇష్టం మేరకు అని తీర్పు వచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు బిసెంట్‌ వద్ద ఉండడానికి మొగ్గుచూపారు. తరువాత బీసెంట్‌ ఆ ఇద్దరిని లండన్‌ తీసుకుపోయి అక్కడ ఎమిలీ ల్యూటెన్‌కు అప్పగించింది. ఆమె న్యూఢిల్లీని నిర్మించిన ల్యూటన్‌ సతీమణి. ఫ్రాన్స్‌ పంపి ఫ్రెంచ్‌ చదివించారు. పిల్లలు ఇద్దరు తెలుగు మరచిపోయారు. శిక్షణ పూర్తయిందని భావించిన దివ్యజ్ఞాన సమాజ నాయకత్వం 1923లో హాలెండ్‌లోని ఓమెన్‌ పట్టణంలో జగద్గురువుగా ప్రకటించారు కూడా. ఆయన అధినేతగా ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఇన్‌ ది ఈస్ట్‌ అనే సంస్థను స్థాపించారు.

ఈ సంస్థకే ధనరాశులు విరాళాలుగా వచ్చి పడ్డాయి. 1925లో మొదటిసారి ఆయన అడయార్‌లో ప్రసంగించారు. ఒక ప్రవక్త మాట్లాడినట్టే ఉందని చెబుతారు. కానీ ఆ పదవి పట్ల ఏదో ఇబ్బందిగానే ఉండేవారు. అప్పుడు పండిట్‌ ఎ. మహదేవశాస్త్రి వద్ద వేదంలో కొన్ని భాగాలు నేర్చుకున్నారు. మరొక పరిణామం కూడా చోటు చేసుకుంది. దివ్యజ్ఞాన సమాజం స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు డిసెంబర్‌ 21, 1925న భారత సమాజ పూజ జరిపారు. అందులో కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు. అలాంటి ఒక క్రతువులో ఆయన పాల్గొనడం అదే మొదటిసారి.  ఇలాంటి పరిస్థితులలో తమ్ముడు నిత్యానంద 1925 నవంబర్‌లో కన్నుమూశాడు. అప్పటికి కాలిఫోర్నియాలోని ఓహై స్థిర నివాసం చేసుకున్నారాయన. అక్కడే నిత్య కన్నుమూశాడు. ఇదొక వెలితి.ఆగస్టు 3, 1929న కృష్ణమూర్తి ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఇన్‌ ది ఈస్ట్‌ గురు పీఠాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. తనను ఎక్కడ ఆ పదవిలో పట్టాభిషిక్తుడిని చేశారో, అదే ఓమెన్‌ పట్టణంలో స్టార్‌ వార్షిక సమావేశంలో 3,000 మంది ఎదుట తన నిర్ణయం ప్రకటించారాయన.

విరాళాలను ఎవరివి వారికి తిప్పి పంపేశారు. కృష్ణమూర్తి ఫౌండేషన్‌ను స్థాపించారు. దానితోనే ఓహై కేంద్రంగా ప్రపంచం అంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. గురుపీఠాన్ని వదులుకుంటున్న చేసిన ప్రకటనను డిజల్యూషన్‌ స్పీచ్‌గా చెబుతారు. అందులో, ‘సత్యం అనే గమ్యానికి దారి లేదు. ఎవరికి వారు బాట వేసుకుని సత్యాన్ని చేరుకోవలసిందే. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ మతాచార్యుడు, ఏ విశ్వాసం ఏ సిద్ధాంతం సత్యాన్ని మనకు అందించలేదు. సత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు. సత్యం ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరు సత్యాన్ని కనుగొంటే అది అతని సత్యం అవుతుంది. మనది కాదు. మన సత్యాన్ని అన్వేషించి కనుగొనవలసిందే’. అన్నారాయన. ఇంకా, సత్యం అనేది దారీతెన్నూ లేని దేశం. ఏ దారిన మీరు నడిచినా ఏ మతాన్ని ఏ ఉప మతాన్ని ఆశ్రయించినా మీరు సత్యాన్ని చేరలేరు. అదీ నా దృక్పథం’ అన్నారాయన.

అందుకే ఆర్డర్‌ ఆఫ్‌ది స్టార్‌ను రద్దు చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్పారాయన. జిడ్డు కృష్ణమూర్తి అంతశ్శోధన గురించి చెప్పారు. మనిషి దుఃఖానికి అలాంటి శోధనే దివ్యౌషధమని కూడా ఆయన చెప్పారు. అయితే తాను గురువును కాదన్నాడు. అలాంది ఆయన బోధనలు మాత్రం గురుబోధలు ఎందుకవుతాయి. కావనే ఆయన కూడా ఘంటాపథంగా చెప్పారు.  కానీ ఆయన గురువును కాదని చెబుతున్నా లక్షలాది మంది ఆయన అనుయాయులుగా ఈ ప్రపంచంలో కనిపిస్తారు. అయితే వారితో మాట్లాడినప్పుడు కూడా కృష్ణమూర్తి తాను ఏమీ బోధించడం లేదనీ, వీరెవరూ శిష్యులు కారని, నాకు మిత్రులని చెప్పేవారు. తనను ఎవరూ అనుసరించరాదనే ఆయన చెప్పారు. ఆయనను విశ్వగురువును చేయాలని దివ్యజ్ఞాన సమాజం భావించింది. 
డా. గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement