విడ్డూరం: వింతలు.. విశేషాలు | world wonders | Sakshi
Sakshi News home page

విడ్డూరం: వింతలు.. విశేషాలు

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

world wonders

తెలివి తెల్లారినట్టే ఉంది!
 జపాన్‌కి చెందిన కేసుకి జినుషీ అనే ఫొటోగ్రాఫర్, గాళ్‌ఫ్రెండ్ లేదని బాధపడే కుర్రాళ్లకు ఆ బెంగను తీరుస్తానంటూ ఓ ప్రకటన చేశాడు. క్యూ కట్టిన కుర్రాళ్లకు అతడు చూపిన పరిష్కారం ఏమిటో తెలుసా! కుడి చేతి మీది వెంట్రుకలన్నీ షేవ్ చేసేశాడు. మాయిశ్చరయిజర్ రాసి నునుపుగా చేశాడు. గోళ్లకు నెయిల్ పాలిష్ వేశాడు. తినమంటూ ఓ బిస్కట్‌ను ఆ చేతిలో పెట్టి, తింటుంటే ఫొటో తీశాడు. దాన్ని చూపించి... ‘చూడండి, మీ గాళ్‌ఫ్రెండ్ మీకు తినిపిస్తున్నట్టే’ లేదూ, ఈ చేత్తో మీకు నచ్చినవి చేసి మీరే ఫొటోలు తీసుకోండి, మీ గాళ్‌ఫ్రెండే చేసినట్టు ఫీలవండి’ అని సలహా కూడా ఇచ్చాడు. ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి యువకులు ఎగబడుతున్నారు. ఇదేం ఆనందమో ఏమో!
 
 నమ్మకమే అతడి ఆదాయం!
 గతంలో అమెరికాకు చెందిన ఓ డాక్టర్ చేతి గీతల్ని మారుస్తున్నాడని చదివాం. కానీ చైనాకు చెందిన మియాన్ ఏకంగా ముఖాల్నే మార్చేస్తున్నాడు. కనుబొమలు లావుగా ఉంటే ఆర్థికంగా కలసిరాదని నమ్ముతారు కాబట్టి వాటిని సన్నగా చేస్తున్నాడు. పలుచగా ఉంటే అదృష్టం అంతంత మాత్రమే అంటారు కాబట్టి అవి లేనివారికి మొలిపించేస్తున్నాడు. ముక్కు సూటిగా ఉంటే అదృష్టం కాబట్టి ముక్కును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చెక్కేస్తున్నాడు. బండ పెదవులు అదృష్టాన్ని దూరం చేస్తాయి కాబట్టి సర్జరీతో చిన్నవిగా చేసేస్తున్నాడు. పుట్టుమచ్చలు పెట్టేస్తున్నాడు. ఉన్న మచ్చలు తీసేస్తున్నాడు. ఇలా ఈ ప్లాస్టిక్ సర్జన్‌గారు ముఖాలని ఇష్టం వచ్చినట్టు మార్చి పారేస్తున్నాడు. అందుకోసం భారీగానే వసూలు చేస్తున్నాడు. ఇచ్చేవాళ్లుంటే తీసుకోవడానికేంలెండి!
 
 లాభం కావాలంటే... డైపర్ వేయాలి!
 లాభాలను పెంచుకోవడానికి ఏవేవో ప్లాన్లు వేస్తుంటారు కంపెనీ యజమానులు. ఉద్యోగులతో ఓవర్ టైమ్ చేయిస్తారు. టైమింగ్స్ మార్చేస్తుంటారు. లీవులు క్యాన్సిల్ చేస్తారు. లంచ్, టిఫిన్ సమయాల్లో కోత విధిస్తారు. ఇవన్నీ చాలామంది చేసేవే. కానీ కొరియాలోని ఓ కంపెనీ మాత్రం విచిత్రమైన పని చేసింది.
 హోండురాస్ ప్రాంతంలో ఉన్న యూంగ్‌షిన్ ఎలక్ట్రికల్ కంపెనీలో దాదాపు మూడువేల ఐదు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
 
 వారందరినీ ఆఫీసులకు డైపర్లు వేసుకు రావాలని ఈ మధ్య హుకుం జారీ చేసింది యాజమాన్యం. దాంతో అందరూ షాక్ తిని, ఇదేం రూలంటూ నిలదీశారు. బాత్రూములకంటూ అటూ ఇటూ తిరుగుతుంటే టైమ్ వేస్టవుతోంది, ఆ టైమును కూడా మిగుల్చుకుంటే ఉత్పత్తి పెరుగుతుంది అంటూ విచిత్రమైన లాజిక్ చెప్పింది. ఉద్యోగులకు తిక్క రేగి లేబర్ మినిస్టర్‌కి కంప్లయింట్ చేశారు. ప్రస్తుతం ఎంక్వయిరీ జరుగుతోంది. ఎంత లాభాలు ఆర్జించాలంటే మాత్రం ఇలా హక్కుల్ని కాలరాయడమేంటంటూ పలువురు తిడుతున్నారు. తిట్టకేం చేస్తారు... ఇలాంటి తింగరి రూల్స్ పెడితే!
 
 ఒళ్లు చీరేసే పండుగ
 పండ గను ఎలా చేసుకుంటారు? కొత్త బట్టలు వేసుకుంటారు. పిండి వంటలు చేసుకు తింటారు. విందులు వినోదాల్లో మునిగి తేలుతారు. కానీ, ఇండోనేసియా వారు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు. వింతగా ఉన్నా ఇది నిజం.
 
 ఇండోనేసియాలో మొరెల్లా, మమలా అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు ఊళ్ల వారికీ ఎంతో ముఖ్యమైన పండుగ... పుకుల్ సపు. రంజాన్ నెల చివరి రోజున చేసుకుంటారు దీన్ని. ఆ రోజున స్నానాలు చేసి, ఊళ్లోవాళ్లంతా ఓ విశాల ప్రదేశానికి చేరుకుంటారు. యువకులంతా ఇద్దరిద్దరిగా విడిపోయి, వెదురు పుల్లలతో ఒకరినొకరు కొట్టుకోవడం మొదలెడతారు.  ఊరి పెద్దలు వరుసగా కూచుని... ఎవరికీ పెద్ద పెద్ద గాయాలు కాకూడదని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందరూ నీరసించిపోయే వరకూ అలా కొట్టుకుంటూనే ఉంటారు. తర్వాత పెద్దలు వారి శరీరాలకి నూనెను పూస్తారు. ఆ నూనె యాలను మాన్పడమే కాక, విరిగిన ఎముకలను కూడా అతికిస్తుందని అంటారు వారు.
 
 ఎన్నో యేళ్లుగా అక్కడ ఈ ఆచారం కొనసాగుతుంది. ఇలా చేస్తే ఊరి అరిష్టాలన్నీ తొలగిపోతాయని, అందరూ సుఖశాంతులతో ఉంటారని వారి నమ్మకమట. ఎంత నమ్మకమున్నా ఇలా ఒళ్లు చీరుకోవడమేంటో... తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవడంలా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement