యామీ బ్యూటీ | Yami Beauty | Sakshi
Sakshi News home page

యామీ బ్యూటీ

Published Sun, Oct 4 2015 12:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

యామీ బ్యూటీ - Sakshi

యామీ బ్యూటీ


 యమీ గౌతమ్... ‘విక్కీ డోనర్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల ప్రశంసలు కొట్టేసింది. ‘గౌరవం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలుకరించింది. ఇటీవలే ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’తో కలసివచ్చి సందడి చేసింది. నిజానికి నటి కంటే ముందు యమీ ఒక మంచి మోడల్. తన స్టయిల్‌తో, లుక్స్‌తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ అందం వెనుక ఉన్న సీక్రెట్స్ చెప్పమంటే ఇలా చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన మేకప్ మెళకువల్ని, తను అనుసరించే సౌందర్య చిట్కాలనీ ఈ విధంగా వివరించింది...
 
 నాకు ఇంతవరకూ చాలామంది బ్యూటీ టిప్స్ చెప్పారు. కానీ మా అన్నయ్య చెప్పిన రెండు టిప్స్ అన్నింటి లోకీ బెస్ట్. అవేంటంటే... మంచినీళ్లు బాగా తాగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఈ రెండూ మనలోని కళను రెట్టింపు చేస్తాయట. వయసును త్వరగా మీద పడనివ్వవట. ఇది ముమ్మాటికీ నిజమని సౌందర్య నిపుణులు కూడా చెప్పారు. అందుకే ఆ టిప్స్‌ని నేను తప్పక ఫాలో అవుతాను.
 
 అందంగా ఉండాలి కదా అని అతిగా మేకప్ వేసుకోవడం చేస్తుంటారు చాలామంది. అది చాలా తప్పు. ఒక్కసారి మన ముఖం మేకప్‌కి అలవాటు పడిపోయిందంటే... సహజత్వం పూర్తిగా పోతుంది. దాన్ని తిరిగి తీసుకురావడం మనవల్ల కాదు. కాబట్టి అవసరమైనప్పుడే మేకప్ వేసుకోవాలి. అవసరం లేనప్పుడు దాని జోలికి కూడా పోకూడదు.ఠి కాస్ట్‌లీ మేకప్ సామగ్రి వాడితే అందం రెట్టింపవుతుందనే భ్రమ కొందరిలో ఉంటుంది. అది ఏమాత్రం నిజం కాదు. చవకరకం వాడితే చర్మం, జుత్తు పాడవుతాయని ఖరీదైనవి వాడతాం తప్ప, వాటి వల్ల లేని అందం రాదు.
 
 కొందరు నూలు చీర కట్టినా అందంగా ఉంటారు. దానికి కారణం... కట్టిన విధానం. ఆర్టిఫీషియెల్ జ్యూయెలరీ వేసుకున్నా రిచ్‌గా కనిపిస్తారు. దానికి కారణం... వాళ్ల సెలెక్షన్. మనకి ఏం నప్పు తాయి, ఏవి ఎలా ధరిస్తే మన అందం ఇనుమడిస్తుంది అన్నది తెలుసుకుంటే మనకి తిరుగే ఉండదు.
 
 అన్ని వేళల్లోనూ ఒకే తరహా మేకప్ తగదు. కాలాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మన మేకప్ ఉండాలి. వేసవి కాలంలో దుస్తులతో పాటు లిప్‌స్టిక్, మష్కారా వంటివి కూడా లేత రంగులే ఎంచుకోవాలి. లేదంటే చెమట కారణంగా మేకప్ పాడయ్యి వికారంగా కనిపిస్తాం. చలికాలంలో ముదురు రంగులు వేసు కున్నా ఫర్వాలేదు. ఇక వర్షాకాలంలో, ముఖ్యంగా వానలో తడిసే అవకాశం ఉన్నప్పుడు వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి.
 
 ఠి బిజీగా ఉండేవాళ్లు రాత్రి ఇంటికి వచ్చి, బట్టలు మార్చుకుని పడుకుండి పోతుంటారు. అది కరెక్ట్ కాదు. పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తీసేసి, ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత మంచి కంపెనీ ప్రొడక్ట్స్ అయినా కూడా, మేకప్ సామగ్రిలో కెమికల్స్ ఉంటాయి. రాత్రంతా అలా ఉంచేసుకుంటే అవి చర్మాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మేకప్ తీసేసే పడుకోవాలి.
 
  వీలైనంత వరకూ అందానికి మెరు గులు దిద్దుకోవడానికి ఇంట్లో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వాడటమే మంచిది. బొప్పాయి, టొమాటో, అరటిపండు, పసుపు, తేనె, పెరుగు... ఇవన్నీ చర్మ కాంతిని, కళను పెంచేవే.
 
  ఎంత బిజీగా ఉన్నా నేను రోజూ ఇరవై నిమిషాల పాటు జాగింగ్, రోజు విడిచి రోజు తొంభై నిమిషాల పాటు యోగా చేస్తాను. నేనే కాదు... ప్రతి ఒక్కరూ రోజూ వాకింగో, జాగింగో, యోగానో... ఏది వీలైతే అది చేయాలి. ఎందుకంటే ఒక్కసారి శరీరాకృతి పాడయ్యిందంటే, దాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం అంత తేలిక కాదు.
 
 నేను ఉదయాన్నే పరగడుపున తాజా దానిమ్మరసం తాగుతాను. తర్వాత ఓ శాండ్‌విచ్, ఎగ్ వైట్, బనానా షేక్, కొన్ని బాదం పప్పులు తీసుకుంటాను. మధ్యాహ్నం చపాతీ, చికెన్, వెజిటబుల్ కర్రీ, పండ్లు... రాత్రికి బ్రౌన్ బ్రెడ్, గ్రిల్డ్ ఫిష్, పెరుగు, కీరా సలాడ్ తింటాను. తప్పనిసరి అయితే తప్ప ఈ క్రమాన్ని తప్పను. అందరూ ఇలా  క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లను ఫాలో అయితే ఆరోగ్యమూ బాగుంటుంది. అందమూ పెరుగుతుంది.
 
 ఠి శరీరం అందంగా ఉండేందుకు ఎలా ప్రయత్నాలు చేస్తామో, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కూడా అంతే ప్రయత్నించాలి. ఎందుకంటే మనసు బాగుంటే ముఖమూ బాగుం టుంది. కాబట్టి క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయటం మంచిది. వాటి వల్ల ఒకలాంటి ప్రశాంతత ఏర్పడుతుంది. అది ముఖంలో కాంతిలా ప్రతిఫలిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement