మెరుపు | You Are So Beautiful Youre a miracle | Sakshi
Sakshi News home page

మెరుపు

Published Sun, Feb 24 2019 12:14 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

You Are So Beautiful Youre a miracle - Sakshi

‘‘యూ ఆర్‌ సో బ్యూటీఫుల్‌... మీరొక అద్భుతం’’ఆ క్షణం అలలు సముద్రంలో కాదు నా మనసులో ఎగిసాయి. ఆ ఫొటోని పదేపదే చూశాయి.

రోజులాగే ఆఫీసుకు బయలుదేరాను. అంతా ఎప్పటిలానే ఉంది. కానీ నేను మాత్రం నిన్నటిలా లేను. రోజూ తలదించుకొని, పక్కన ఎవర్నీ పట్టించుకోకుండా గబగబా పరుగులాంటి నడకతో వెళ్లేదాన్ని. కానీ ఈరోజు చుట్టూ చూస్తూ, తలఎత్తుకొని ఉల్లాసంగా ఒకింత గంభీరంగా నడుస్తున్నాను.మార్కెట్‌ వీధిలో నడుస్తున్నాను.రోజూ నా మనసంతా ఈ మార్కెట్‌ గోలలాగే గందరగోళంగా ఉండేది. కానీ ఈరోజలా లేదు. రోజూ గుడి ముందు నుంచే వెళ్తున్నా ఏ రోజూ సరిగ్గా వినబడలేదు. కానీ ఈరోజు పూజారిగారు చదివే మంత్రాలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి.రోజూ మార్కెట్‌ వీధి చివరకు రాగానే నా మనసూ, మెదడు బలహీనమైపోయేవి. నాకు తెలియకుండా వెన్నులో వణుకు పుట్టేది. కానీ ఈరోజు మాత్రం నేను భయపడలేదు. ఈ వీధిచివర ఉండే కొంతమంది అబ్బాయిలు నన్ను రోజూ కామెంట్‌ చేస్తారు. అందుకే నాలో ఆ బెరుకు. ఈరోజు కూడా వాళ్లు నన్ను కామెంట్‌ చేశారు.‘‘అదిగో రా ఆంటీ...’’నన్ను చూసి నవ్వారు. కానీ రోజులా ఈరోజు నిశ్శబ్దంగా వెళ్లిపోలేదు. వెనక్కి తిరిగి ఒక చూపు చూశాను. నా చూపు చాలా పదునుగా ఉంది ఈరోజు. వాళ్లు నవ్వు ఆపేవర

కు చూపుతిప్పలేదు. నన్ను అలాగే చూస్తూ నవ్వు ఆపేశారు వాళ్లు. ఈరోజు నాకు వాళ్లు భయపడ్డారు.వాళ్లు నా చూపులకు భయపడ్డారనే ఆలోచన నాకు చాలా బలాన్ని ఇచ్చింది. నా ఉత్సాహం రెట్టింపు అయింది. ఇక నా అడుగులు ఆగలేదు. నాలోని ఈమార్పు నిజమా? అబద్ధమా!నమ్మలేకపోతున్నాను నన్ను నేను.బస్‌స్టాప్‌ వరకు వచ్చాను. రోజూ ఆమ్మాయిలకు కూడా దూరంగా నిలబడే నేను ఈరోజు వాళ్లతో పాటు కలిసి నిలుచున్నాను. రోజూ విచిత్రంగా, వెలేసినట్లు తాకే చూపులు ఈరోజు నన్ను ఆశ్చర్యంగా తాకాయి.‘ఇక నుండి నేను కూడా మీతో కలిసే నిలబడతాను. నాకేం తక్కువ. నేనో అద్భుతాన్ని’ అని అనుకున్నాను.నేను వాళ్లను కనీసం చూడకపోవడం ఆ అమ్మాయిలకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది.రోజూ వాళ్లు నా డ్రెస్‌ గురించి మాట్లాడుకునే మాటలు, వెటకారపు నవ్వులు... దూరంగా నిలబడ్డ నాకు స్పష్టంగా వినిపించేవి. కానీ ఈరోజు వాళ్ల పక్కనే నిలబడ్డా, వాళ్ల మాటలు నాకస్సలూ వినబడడం లేదు.

బస్‌ వచ్చింది.ఈరోజు బస్‌డ్రైవర్, కండక్టర్‌ కూడా నన్ను ఆశ్చర్యంగా చూశారు.అందరికంటే ముందే డోర్‌ దగ్గరకు వచ్చినా... అందరూ తోసేయ్యడం వల్ల చివరగా బస్సెక్కే నేను... ఈరోజు అందరికంటే ముందే ఎక్కానని, ఏరోజూ బస్‌లో సీటు దొరకని నాకు ఈరోజు నా ఉత్సాహానికి బలాన్ని ఇస్తూ బస్‌లో విండో సీటు దొరికింది.బస్‌ ముందుకు కదిలింది. కానీ నా ఆలోచనలు మాత్రం వెనక్కు కదిలాయి.∙∙ చదువులో ఫస్ట్‌.ఆటల్లో ఫస్ట్‌.అర్ధరాత్రి అయినా ఒంటరిగా నడవడానికి నాకు భయం లేదు. కానీ అదేంటో అందరిలో కలవాలంటే ఒక న్యూనతాభావం. దానికి కారణం నా రంగు, నా ఆహార్యం.నాకెప్పుడూ అందంగా లేకపోవడం ఒక సమస్య అనిపించలేదు.బతకడానికి అందం అవసరమా?కాలేజీలో ఎప్పుడైతే చేరానో అప్పటి నుండి నా రంగు, నా బట్టలు, నా జుట్టు సమస్య అనిపించేవి నాకు.నా చుట్టూ ఉండే అమ్మాయిలు రకరకాల బట్టలు వేసుకుంటారు. నేను కొనుక్కోలేక కాదు... నాకు అవంటే ఇష్టం లేక వేసుకోలేదు.అష్టవంకర్లు తిప్పి జడలు వేసుకునేవారు. కానీ నాకవి నచ్చవు. అందుకే సాదాసీదాగా ఉంటాను.

అందువల్ల చుట్టూ ఎంతోమంది ఉండి కూడా నేను ఒంటరితనానికి గురయ్యాను.అందరితో నవ్వుతూ కలిసిపోయినా ఎందుకో నన్ను వేరుగా చూసేవారు.ఆఫీసులో అయితే అందరినీ నవ్వుతూ పలకరిస్తాను. కానీ ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా వైపు చూడరు. ఆఫీసుకు బయలుదేరేటప్పుడు వీధిలో వాళ్లంతా నన్ను వింతగా చూసేవాళ్లు. ఎంత వాళ్లని పట్టించుకోకూడదు అనుకున్నా వాళ్ల చూపులు నన్ను ముల్లులా గుచ్చేవి.వీధిచివర అబ్బాయిలు అయితే ‘ఆంటీ’ అని కామెంట్‌ చేసేవారు.ఏం! జీన్స్‌ప్యాంట్‌ వేసుకుంటేనే అమ్మాయా!జుట్టు విరబోసుకుంటేనే అమ్మాయా!వాళ్లను దాటుకొని బస్‌స్టాప్‌కు వస్తే ఇక్కడ అమ్మాయిలు కూడా నా పట్ల హేళనగా ఉండేవారు. చుడీదార్‌ వేసుకుంటే లోలోపల నవ్వుకునేవారు. ఇక చీరకట్టుకుంటే బయటికి నవ్వేవారు.ఏడుపొచ్చేది.పట్టరాని కోపమొచ్చేది.ఒకరకంగా  వీళ్ల మాటలు కూడా నాలోని న్యూనతాభావానికి కారణం.

అందమనే పదమంటేనే నాకు వెగటు పుట్టేది. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. నా ఆత్మవిశ్వాసాన్ని నేనే తక్కువ చేసుకునేదాన్ని.‘నాలో ఏదో లేదు’ అనే భావన నన్నెప్పుడూ బాధపెట్టేది. అందరిలో కలవడానికి మనసు ఒప్పేది కాదు. తలెత్తి సూటిగా చూడడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదు.నన్ను నేను పూర్తిగా కోల్పోయాను.అందరికీ ఫ్రెండ్స్‌ ఉన్నారు.నాకు కనీసం పలకరించే మనిషి కూడా లేడు.మసుసులో నిరాశ,నిస్పృహ ముఖంలో కనిపించేవి.కానీ ఈరోజు నేను అలా లేను.నాకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అసలు అతను ఎవరో తెలియదు. కలుస్తానో లేదో కూడా తెలియదు. అతను నాకో అద్భుతం. కానీ అతనికి నేనొక అద్భుతాన్ని. ఒక పలకరింపు, పది నిమిషాల ప్రయాణం, ఒక చిన్నమాట!∙∙ రెండువారాల నుండి ప్రయత్నించాడు అతను నాతో మాట్లాడడానికి. రోజూ మా  ఆఫీసుకి వెళ్లేదారిలో సాయంత్రం ఎదురుచూసేవాడు.

అతన్ని నేను గమనించకపోలేదు. కానీ అతను ప్రయత్నిస్తుంది నాతో మాట్లాడడానికే అని నేను అస్సలు అనుకోలేదు!నిన్న సాయంత్రం నేను ఆఫీసు నుండి బయటకురాగానే నా ఎదురుగా నిలబడ్డాడు. నాకు భయమేసింది.అప్పటికే నేను నమ్మలేకపోయాను, అతను ఎదురుచూస్తుంది నాకోసమేనని...పట్టించుకోకుండా గబగబా అక్కడి నుండి వచ్చేశాను.‘‘ఎక్స్‌క్యూజ్‌మీ!’’ అరిచినట్టే పిలిచాడు అతను.ఆగి వెనక్కి తిరిగాను. అతను పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.ఆరడుగుల ఎత్తు, అందంగా ఉన్నాడు.నాకు ఆశ్చర్యమేసింది. ఇలాంటి వాళ్లు కూడా నాతో మాట్లాడడానికి అంతలా ఎదురుచూస్తారా!హాయ్‌ అంటూ చెయ్యి చాపాడు. క్షణం పాటు ప్రపంచమంతా స్తంభించినట్లు అనిపించింది నాకు.ఆనందం, ఆశ్చర్యం కలిసిన గొంతుతో నేను కూడా హాయ్‌ అన్నాను.నా చేయిపట్టుకొని ‘‘థ్యాంక్యూ సోమచ్‌ అండీ’’ అన్నాడతను.ఉలిక్కిపడ్డాను నేను.‘‘ఎందుకు?’’ అడిగాను నెమ్మదిగా.‘‘చెప్తాను! నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్‌’’ అన్నాడు.అయోమయంగానే అతని వెనుక వెళ్లాను.

అతను మధ్యమధ్యలో వెనక్కి తిరిగి నన్ను చూస్తూ నడుస్తున్నాడు.అతని చేతిలో ఏదో చిన్న కవర్‌ ఉంది.ఎదురుగా వస్తున్న బస్‌ ఆపి తను ఎక్కి నన్ను ఎక్కమన్నాడు. ‘‘ప్లీజ్‌ కూర్చోండి’’ అని నాకు సీటు చూపించి అతను నిలబడ్డాడు. టికెట్‌ కూడా అతనే తీశాడు.అతనికేదో ఫోన్‌ వచ్చింది.‘‘యా షీజ్‌ విత్‌ మీ..’’అతను మాట్లాడుతున్నాడు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు.ఎవరితో? వాళ్లకి నేను తెలుసా? ఒకవేళ వాళ్లు కూడా నాకు తెలుసా? ఏమో! భయంగా ఉంది.ఇంతలో బస్‌ ఆగింది. అతను దిగాడు. నేను కూడా దిగాను.అతను నన్ను బీచ్‌లో కొద్దిదూరం తీసుకెళ్లి తన చేతిలోని కవర్‌ నాకు ఇచ్చాడు. దాన్ని తెరిచి చూసాను.అందులో ఒక అమ్మాయి ఫొటో ఉంది. చాలా అందంగా ఉంది ఆ ఫొటో. ఆమె కళ్లు దేన్నో ఆస్వాదిస్తున్నాయి. ఆమె ముందు అలలు. ఒక పక్క నుండి తీసారు ఆ ఫొటో!‘అరే! ఈ ఫొటో ఇక్కడ తీసిందే అనుకున్నాను మనసులో.‘‘ఎవరో గుర్తుపట్టారా!’’అతను అడిగేవరకు నాకు తెలియదు...అది నేనేనని!ఒక అద్భుతాన్ని చూసినంత ఆశ్చర్యపోయాను నేను.

‘‘ఈ ఫొటో తీసింది నేనే. ఇక్కడే! నెలరోజుల క్రితం. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు నెలరోజుల క్రితం నేనీ బీచ్‌కు వచ్చింది.‘నేను ఇంత బాగుంటానా!’ నమ్మలేకపోయాను.అతను మాట్లాడుతున్నాడు...‘‘నేను ఒక ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ని. ఎన్నో ఫోటోలు తీశాను ఇప్పటి వరకు. కానీ ఎప్పటి నుంచో  ఎదురుచూస్తున్న బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ అవార్డ్‌ మాత్రం అనుకోకుండా తీసిన మీ ఫొటోకే వచ్చింది. నా కల నెరవేరింది మీ వల్లే. అందుకే ఈ థ్యాంక్స్‌. మీకు ఈ మాట చెప్పాలని ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నానో, ఈరోజుకి కుదిరింది. నేను ఈరోజు బెంగళూరు వెళ్లిపోవాలి. మళ్లీ ఇక్కడికి రాకపోవచ్చు. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. నాకు ఫ్లయిట్‌ టైమ్‌ అవుతోంది. బయ్‌!’’ అన్నాడు.వెళుతూ వెళుతూ అతనో మాట అన్నాడు...‘‘యూ ఆర్‌ సో బ్యూటీఫుల్‌...మీరొక అద్భుతం’’ఆ క్షణం అలలు సముద్రంలో కాదు నా మనసులో ఎగిసాయి.

ఆ ఫొటోని పదేపదే చూశాయి.వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లనిపించింది. ఉత్సాహంగా అక్కడి నుండి కదిలాను. చాలారోజుల తరువాత నన్ను నేను అద్దంలో చూసుకోవాలనిపించింది. అంత ఉత్సాహం నాలో ఎప్పుడూ లేదు. ఆరోజు హాయిగా నిద్రపోయాను.∙∙ నిజానికి అతని ప్రతిభకి అవార్డ్‌ వచ్చింది. నా ముఖానికి కాదు. అతను నన్ను నాకు కొత్తగా పరిచయం చేశాడు. రోజులాగే ఈరోజు కూడా చుడీదారే వేసుకున్నాను. జుట్టు అల్లుకునే దువ్వుకున్నాను. కానీ ఈరోజు నా కళ్లలో నిరాశ, నిస్పృహ లేవు. ఒక మెరుపు ఉంది. అదేంటి? ఏమో తెలియడం లేదు. కానీ చాలా బాగుంది!
ఏ.మేఘన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement