నా ఆలోచనలు, శరీరం రెండూ రెండు విరుద్ధమైన దారుల్లో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అన్నీ వాడు చెప్పినట్లే జరుగుతున్నాయి. ఇంతకీ ఎవడు వాడు? నా ఈ జీవితంలోకి వచ్చి.. బతకడానికి సమయం లేదంటున్నాడు. వాడు చెప్పింది ఎందుకో నిజమనిపిస్తోంది. నేను నిజంగానే ఎక్కువసేపు బతకనా? ఆకలిగా ఉంది. వాడు రోడ్డుకి అవతలి వైపు నిలబడి పిలుస్తున్నాడు. రోడ్డు దాటాలి. పక్కన్నుంచి లారీ దూసుకొస్తోంది.
పొద్దున్నే ఆఫీస్‌కి బయల్దేరాను. నన్నెందుకో, ఎవరో ఫాలో అవుతున్నారని అనిపిస్తోంది ఈమధ్య. చుట్టుపక్కలంతా గమనించినా ఎవరో తెలీడం లేదు. ఇదంతా నా భ్రమ కావొచ్చు అనుకున్నా. కానీ తప్పకుండా నన్నెవరో ఫాలో అయితే అవుతున్నారు.ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళుతుంటే కూడా ఇలాగే ఉంది. దయ్యమా? అలా అనుకునేంత పిరికివాడినైతే కాదు. తర్వాతి రోజూ ఆఫీస్‌కు వెళుతుంటే ఎవరైనా నిన్నటిలాగే ఫాలో అవుతున్నారా అని చూసుకున్నా. ఇవ్వాళెందుకో ఎవ్వరూ లేరు. బాగనిపించింది. అకస్మాత్తుగా ఎవరో పిలిచారు వెనకనుంచి – ‘‘హలో!’’. ‘‘ఎవరు?’’ అడిగాను. ‘‘నేనెవరో, నీ దగ్గరికి ఎందుకొచ్చానో చెప్తా కానీ, నిన్ను ఈమధ్య ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోందా? అదెవరో తెలుసా?’’ అడిగాడు వాడు.‘‘ఈ విషయం నీకెలా తెలుసు? చెప్పు వాడెవడో!!’’ ఆవేశంగా అడిగా. ‘‘తెలుసుకొని ఏం చేస్తావ్ బ్రదర్?’’ నవ్వుతూ అడిగాడు వాడు. ‘‘ఏం చేస్తానా? వాడి అంతు చూస్తా.’’ కోపంగా సమాధానమిచ్చా. ‘‘నేనే!’’ అని గట్టిగా నవ్వుతూ చెప్పాడు. నాకు వాడి మీద పిచ్చి కోపమొచ్చింది. ఇష్టమొచ్చినట్టు అరిచా వాడిమీద. ‘‘కూల్ కూల్! ముందు నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా విను. నీకో రహస్యం చెప్తాను. దానికి నువ్వు భయపడకుండా నిలబడగలగాలి. ఇంకో విషయం.. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉంటారూ.. ఎవరు ఏం ఆలోచిస్తారూ.. ఎవరు ఎప్పుడు పుడుతారూ.. ఎవరు ఎప్పుడు చస్తారూ.. ఇవన్నీ నాకు తెలుసు.’’ అన్నాడు వాడు. ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు.
‘‘నువ్వు చెప్పే ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. ఎక్కడో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ టీ తాగి వెళ్లి రెస్ట్ తీసుకో. మళ్లీ ఎప్పుడూ కనిపించకు.’’ అన్నాను. ‘‘చూడు మిత్రమా.. ఈ అదృష్టం ఎవ్వరికీ రాదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను.’’‘‘రేయ్ నీకు పిచ్చా?’’ ‘‘విను. సరిగ్గా ఇంకో ఇరవై ఆరు గంటల్లో నువ్వు చనిపోతావు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చా.’’ నాకు పిచ్చి కోపమొచ్చింది. మళ్లీ అరిచా. ‘‘నీ మంచి కోరే చెబుతున్నా. ఈ ఇరవై ఆరు గంటల్లో ఏం చేస్తావో తేల్చుకో! సరిగ్గా గంట తర్వాత ఇక్కడికొచ్చి నిన్ను కలుస్తా.’’ అన్నాడు వాడు. పిచ్చోడని వదిలేశా. చెప్పినట్టే గంట తర్వాత నా దగ్గరకు వచ్చాడు. వీడు చెప్తుంది నిజమా.. అబద్ధమా అని కంగారు మొదలైంది. ఒకవేళ వాడు చెప్పేది నిజమే అయితే? నాకు మిగిలి ఉంది మరో ఇరవై ఐదు గంటలు మాత్రమే! ‘‘కంగారుగా ఉందా.. భయంగా ఉందా..?’’ అని నవ్వుతూ అడిగాడు.‘‘నువ్వు చెప్పేది నిజమని నేనెలా నమ్మాలి?’’‘‘సరిగ్గా ఇప్పుడు పాయింట్‌కు వచ్చావు. సరే! నీకు నమ్మకం కలిగేలా ఓ పని చేస్తాను. కానీ ఇక్కడ కాదు. నాతో పాటు రా!’’ అని నన్ను పెద్ద రోడ్డు మీదకు తీసుకెళ్లాడు. ‘చూస్తుంటే ఇక్కడే వీడు నన్నుచంపేసేలా ఉన్నాడు’ అని భయంతో వాడినే చూస్తూ నిలబడ్డా. ‘‘ఇప్పుడు నీ వెనకాల నుంచి ఓ వ్యక్తి బైక్ మీద వస్తున్నాడు కదా! వాడు ఇప్పుడు చనిపోబోతున్నాడు. సరిగ్గా చూడు. ఇది కల కాదు.’’
చెప్పినట్టే జరిగింది. బైక్ మీది వ్యక్తి యాక్సిడెంట్ అయి అక్కడికక్కడే చనిపోయాడు. ఒళ్లంతా ఒకటే వణుకు. భయంతో మాట కూడా బయటకు సరిగ్గా రావడం లేదు. వీడు ఎక్కడ నుంచో వచ్చి చావు కబురు చల్లగా చెబుతూంటే బతికుండగానే చచ్చినట్లు అనిపిస్తోంది. వీడికి ఇన్ని శక్తులు ఉన్నాయని నేనూహించలేదు. వాడు చెప్పినదాన్ని బట్టి నాకిప్పుడు ఇరవై నాలుగు గంటలే సమయముంది. వీడు మంచోడో చెడ్డోడో తర్వాత విషయం.. ఇరవై నాలుగ్గంటలు.. అంతే. అంతే మిగిలి ఉన్నాయి. ‘‘ఏంటి బాధపడుతున్నావా? బాధపడుతూ కూర్చుంటే ఈ ఇరవై నాలుగు గంటలు కూడా నువ్వు వృథా చేసినవాడివే అవుతావు. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. ఈ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో చెయ్యి’’ అని చాలా ఉత్సాహంగా చెప్పాడు.ఇది అదృష్టమో, దురదృష్టమో తెలియట్లేదు. ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి.‘‘చూడూ.. నీకున్నది 24 గంటలే! నువ్వు దాన్నే సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒకవేళ నువ్వు చేయాల్సిన పనులు మధ్యలో అయిపోతే.. కచ్చితంగా మధ్యలోనే చనిపోతావు. ఇక నీ అర్హతకు మించిన పనులు చేయాలని ఆశపడకు. ఇది బాగా గుర్తుపెట్టుకో! నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నాకవన్నీ తెలుస్తాయి.’’వాడిచ్చిన సమయం ఇరవై నాలుగు గంటలు. ఈ ప్రపంచంలో నేనిష్టంగా ప్రేమించేది.. అమ్మ, ప్రియ, సుబ్బయ్య, ఒక అనాథాశ్రమంలో ఉన్న కొందరు పిల్లలు. వీళ్లతో నేను ఈ ఇరవై నాలుగు గంటలు గడపాలి.
ముందు అమ్మ దగ్గరకు వెళ్లాలి. అమ్మ ఇప్పుడు ఊర్లో ఉంది. ఇక్కణ్నుంచి ఎలా వెళ్లినా మూడు గంటలు పడుతుంది. మూడు గంటలయిపోయాయి. అమ్మను చూశా. పెద్దగా ఏడ్వాలనిపించింది. నేనింకో ఇరవై ఒక్క గంటలే బతుకుతానంటే అమ్మ చచ్చిపోతుంది. చెప్పొద్దు. కానీ మావయ్య బిజినెస్ పనిమీద ఊరెళ్తున్న అమ్మను ఆపడం ఎలా? అమ్మ వెళ్లిపోయింది. ఇక్కడ ఇంక ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు. ప్రియాను కలవాలి. మళ్లీ మూడు గంటలు వెనక్కి ప్రయాణించి ప్రియాను కలవాలి. పదిహేడు గంటలే ఉన్నాయింకా. ప్రియాతో ఎనిమిది గంటలుండి, మిగతా సమయం సుబ్బయ్య, పిల్లలతో గడపొచ్చనుకున్నా. తనొచ్చింది. ఇద్దరం పార్క్‌లో కూర్చొని ఉన్నాం. తన ఒళ్లో పడుకొని ఆలోచిస్తున్నాను. ప్రియకు ఏమనిపించిందో.. ‘‘ఏంటి అలా ఉన్నావు. ఏదైనా ప్రాబ్లమా..?’’ అని ప్రేమగా అడిగింది. వెంటనే ఇదంతా చెప్పేయాలి అనిపించింది. కానీ తను తట్టుకుంటుందా?మళ్లీ తనే – ‘‘నాకు తెలుసు. మన పెళ్లి గురించే కదా. కొంచెం ఆగు బాబూ.. మా నాన్న ఫ్రీగా ఉన్నప్పుడు నేనే చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను’’. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. సరిగ్గా గంటా ముప్పై నిమిషాల తర్వాత తనకు ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వెంటనే, ‘‘అర్జంట్‌గా ఇంటికి వెళ్లాలిరా! మా నాన్న మనల్ని చూశాడు. నేను ఇంటికెళ్లి ఫైట్ చేసైనా నిన్ను తప్ప ఎవ్వరినీ చేసుకోనని చెబుతా. రేపు కలుద్దాం.’’ అని పరుగున వెళ్లిపోయింది. అనుకున్నది అనుకున్నట్లు ఒక్కటీ జరగడం లేదు. సుబ్బయ్య దగ్గరికి వెళ్లాను. నన్ను చిన్నప్పట్నుంచీ పెంచింది సుబ్బయ్యే! ‘‘నీకు జీవితాంతం ఋణపడి ఉంటాను’’ అని సుబ్బయ్యకు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇప్పుడు సుబ్బయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు. అతనితో కేవలం పది నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగాను. తలరాత నిజంగా ఇలా కూడా ఉంటుందా? అనుకొని పిల్లల దగ్గరకు వెళ్లాను. వాళ్లు అనాథలు. అందులో ఒక బాబుకి కళ్లు లేవు. మరో పాపకు గుండె సమస్య. వాళ్లతో సరదాగా గడుపుదాం అని వెళ్లాను. కలిసాను. కాస్త టైమ్ వాళ్లతో స్పెండ్ చేశాను. నా దగ్గరున్న డబ్బులన్నీ వాళ్లకు ఇచ్చేశాను. సరిగ్గా ఒక రెండు గంటలు గడవగానే వాచ్‌మేన్ వచ్చి, ‘‘పిల్లలతో గేమ్స్ ఆడిస్తారట సార్! వీళ్లను కూడా పంపిస్తే..’’ అన్నాడు.
అమ్మ, ప్రియ, సుబ్బయ్య, పిల్లలు.. వీళ్లకు మాత్రమే ఈ ఇరవై నాలుగ్గంటలని వాడికి మాటిచ్చా. నా పనులన్నీ అయిపోయాయి. వాడు కచ్చితంగా వచ్చేస్తాడు. ఇంకా పదిగంటలు ఉన్నాయి. నేను ఈ పిల్లలను ఈ పదిగంటలు వదలను గాక వదలను అనుకున్నా. కానీ పిల్లలు మాత్రం ‘‘అన్నయ్యా! మాకు ఆడుకోవాలని ఉంది.’’ అన్నారు. వాళ్ల సంతోషాన్ని కాదని ఎలా చెప్పను? ఆలోచిస్తున్నా. వాడొచ్చే సమయం దగ్గరపడింది. ప్రియ దగ్గర్నుంచి మెసేజ్.. ‘‘నాన్నతో మాట్లాడా.. అంతా ఓకే.. లవ్యూ..’’. నాకు ఆ మెసేజ్ చూడగానే చెప్పలేనంత సంతోషం కలిగింది. వెంటనే దాచుకోలేనంత ఏడుపొచ్చింది. ఆ ఏడుపుతో పాటే వాడొచ్చేశాడు, ‘‘ఏంటీ.. ఇక చావుకి సిద్ధమేనా?’’ అంటూ. ‘‘పొద్దున్నుంచీ తిరిగి తిరిగి అలిసిపోయా. నాకు బాగా ఆకలిగా ఉంది.’’ అన్నా. ‘‘సరే! నీకు ఇష్టమొచ్చినంత తిను..’’ అన్నాడు వాడు. ఆ వెంటనే – ‘‘పోనీ బతుకుతావా?’’ అనడిగాడు. నేను వాడ్ని పైకీ, కిందికీ చూశా ఒకసారి. ‘‘టైమ్ వృథా చెయ్యకు. చెప్పు బతకాలని ఉందా?’’ అనడిగాడు. నేనేం మాట్లాడకుండా వాడినే చూస్తూ కూర్చున్నా. ‘‘సరే! ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు..’’ అనుకుంటూ రోడ్డు దాటే పిల్లలకు సాయం చెయ్యాలని వెళ్లాడు. వాడు రోడ్డుకి అవతలి వైపు నిలబడి నాకోసం చూస్తున్నాడు. నాకు ఆకలిగా ఉంది. రోడ్డు దాటాలి. పక్కన్నుంచి లారీ దూసుకొస్తోంది. ‘‘ఏంటి చూస్తున్నావు? వచ్చెయ్!’’ వాడు గట్టిగా అరుస్తున్నాడు. నేను రెండడుగులు ముందుకేశా. అంతే. వాడు నాకు కనిపించలేదు. నాకు ఇంకెప్పటికీ ఆకలి వెయ్యదు.
- రమేశ్ రాపోలు
ఎండ్ క్రెడిట్స్
Published Sun, Apr 22 2018 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment