చెట్టును ఢీకొట్టిన ట్రాలీ
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ
Published Mon, Nov 28 2016 10:49 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్
పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసినా స్పందన నిల్
అరగంట తరువాత వచ్చిన 108
ఈ లోగా రక్షణ చర్యల్లోకి దిగిన ‘సాక్షి’ సిబ్బంది
సెక్యూరిటీలోనే ప్రాథమిక చికిత్సలు
అనంతరం ఆసుపత్రికి తరలింపు
రాజానగరం : విధులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విధులు ముగించుకొని బయటకు వస్తున్న ‘సాక్షి’ సిబ్బందికి ఏడీబీ రోడ్డుపై పెద్ద శబ్ధం వినిపించింది. ముద్రణా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఏదో ప్రమాదం జరిగిందని భావించిన సిబ్బంది వెంటనే స్పందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కటిక చీకట్లో సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో లారీ ప్రమాదానికి గురైందని గుర్తించారు. తునాతునకలైనా లారీ క్యాబిన్‌లో ఇరుక్కున క్లీనర్ ఆర్తనాదాలు విని సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులోనే అక్కడకు చేరుకుని క్లీనర్‌ని బయటకు తీశారు. కాకినాడ పోర్టు నుంచి వస్తున్న గ్రానైట్‌ను రవాణా చేసే ట్రాలీ ఏడీబీ రోడ్డుపై మలుపుతిరుగుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ట్రాలీ క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఇదే సమయంలో విధులు ముగించుకుని ‘సాక్షి’ ముద్రణాకార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఎడిటోరియల్ స్టాఫ్, మరికొందరు ఇతర విభాగాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో కరెంటు తీగలు కూడా తెగిపడి వేళాడుతుండటాన్ని గమనించి ముందుగా విద్యుత్ శాఖ ఇంజనీర్‌కి సమాచారం ఇచ్చారు. దానితో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఆ శాఖ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రమాదానికి గురైన ట్రాలీ వద్దకు వెళ్లి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్ రాజును, డ్రైవర్ కొమరయ్యను బయటకు తీశారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడినా క్లీనర్‌కి మాత్రం తలకు బలమైన గాయాలై రక్తం కారుతుండటంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్పందించని పోలీసులు
సంఘటనా స్థలంలో చెట్టును ఢీ కొన్న ట్రాలీ నుంచి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్, డ్రైవర్లను బయటకు తీసేందుకు ‘సాక్షి’ సిబ్బంది తీవ్రంగా కష్టపడవలసి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేసేందుకు పోలీసు స్టేషనుకు ఎన్నిమార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి రెస్పాండ్ లేదు. చివరకు ప్రాణాపాయస్థితిలో ఉన్న క్లీనర్, డైవర్‌లను బయటకు తీసి, వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఈ ప్రమాదం గురించి సోమవారం ఉదయం తెలుసుకున్న సీఐ శంకర్‌నాయక్ దృష్టికి ఫోన్ విషయాన్ని తీసుకువెళ్లగా కొన్ని రోజులుగా పోలీసు స్టేషనులో ఫోన్ పనిచేయడం లేదన్నారు. తాను బందోబస్తు డ్యూటీలో ఉన్నానన్నారు.
ప్రమాదాల నెలవు ఈ మలుపు
ఏడీబీ రోడ్డు పై ‘సాక్షి’ ముద్రణా కార్యాలయానికి సమీపంలో ఉన్న మలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును కాకినాడ వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఢీ కొన్న సంఘటన మాదిరిగానే ఈ ప్రాంతంలో రెండేళ్లలో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఎక్కువగా మలుపులో వేగాన్ని నియంత్రించలేక ప్రమాదానికి గురైన వాహానాలే ఉన్నాయి. ఈ మలుపునకు అటునిటు సాఫీగా ఉంటే రహదారి ఒక్కసారిగా మలుపు తిరగడంతోపాటు ఆ మలుపును దగ్గరకు వచ్చే వరకు గమనించే వీలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ కారణంగా నాలుగు లేన్ల రహదారిగా ఈ రోడ్డును విస్తరించే అవకాశాలున్నందున కనీసం ఆ సమయంలోనైనా ఇక్కడ ఉన్న మలుపును ప్రమాదాలకు తావులేకుండా సరిచేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Advertisement
Advertisement