చిన్నవాడి పెద్ద మనసు | Young boy big Mind! | Sakshi
Sakshi News home page

చిన్నవాడి పెద్ద మనసు

Published Sun, Dec 6 2015 3:37 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

చిన్నవాడి పెద్ద మనసు - Sakshi

చిన్నవాడి పెద్ద మనసు

ఆదర్శం
బడి అయిపోయిన తరువాత ఆరో క్లాసు పిల్లాడు ఏం చేస్తాడు? కాసేపు హోమ్‌వర్క్ చేస్తాడు. కాసేపు స్నేహితులతో ఆడుకుంటాడు. కాసేపు వీడియోగేమ్స్ ఆడుకుంటాడు. అంతేగా! కానీ లక్నోకు చెందిన పదకొండేళ్ల ఆనంద్ కృష్ణ మిశ్రా అలా కాదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మురికి వాడల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తాడు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే రోజంతా గడుపుతాడు.

అందుకే ఆనంద్‌ని అందరూ ‘చోటా మాస్టర్‌జీ’ అని పిలుస్తారు. సుమారు 125 గ్రామాల్లో ఈ చోటా మాస్టర్‌జీ పాఠాలు బోధిస్తున్నాడు. స్కూల్లో తాను నేర్చుకున్న పాఠాలను మురికివాడల్లోని పిల్లలకు బోధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తన స్కూల్‌కు ‘బాల్ చౌపాల్’ (పిల్లల వరండా) అని పేరు కూడా పెట్టాడు.
 
‘‘లెక్కలు అంటే చాలా భయంగా ఉండేది. ఆనంద్ భయ్యా ఆ భయాన్ని పోగొట్టాడు. ఇప్పుడు నాకు మ్యాథ్‌‌స సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం’’ అని చెబుతున్నాడు లక్నోలోని ఒక మురికివాడకు చెందిన వికాస్ అనే నాలుగవ తరగతి విద్యార్థి. ‘‘స్కూల్లో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు ఏదైనా డౌట్ వస్తే... టీచర్ ఎక్కడ తిడతాడో అని అడగడానికి భయం. భయ్యా దగ్గర అలా కాదు.

డౌటు వచ్చిన వాళ్లను మెచ్చు కొని, డౌటు తీరే వరకు ఎంతసేపైనా ఓపిగ్గా చెబుతూనే ఉంటాడు’’ అంటుంది సునీత అనే విద్యార్థిని. ఇలాంటి కామెంట్లు ఓ అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడి విషయంలోనే వింటాం. అలాంటిది ఓ పదకొండేళ్ల పిల్లాడి విషయంలో వినడం ఆశ్చర్యంగా లేదూ! ఆనంద్ చేసే పని అలాంటిది మరి.

స్కూలుకు వెళ్లని వాళ్లే కాదు... వెళ్లే వాళ్లు కూడా ఈ చోటా మాస్టారి దగ్గర పాఠాలు వినడానికి ఉత్సాహం చూపడానికి కారణం... గణితం, కంప్యూటర్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లను అరటి పండు ఒలిచి పెట్టినట్టు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే. చదువు చెప్పడమే కాదు... చదువు మానేసిన విద్యార్థులను ప్రోత్సహించి, తిరిగి బడిలో కూడా చేర్పిస్తున్నాడు ఆనంద్.

అలా ఇప్పటి వరకు 700 మంది పిల్లలను బడిలో చేర్పించాడు. ‘‘తన చదువు మీద శ్రద్ధ పెట్టకుండా... మీవాడు ఇలా చేస్తున్నాడేమిటి!’’ అని కొంతమంది ఆనంద్ తల్లిదండ్రుల దగ్గర అంటుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసే ఆనంద్ తల్లిదండ్రులు అనూప్, రీనా మిశ్రాలు మాత్రం ఆ మాటలకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కొడుకును అభినందిస్తారు.

మంచి పని చేస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తారు. తనను తలచుకుని గర్వపడుతుంటారు. నిజానికి బయట ఎంత సమయం వెచ్చించినా తన చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఆనంద్. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చు కుంటాడు. అయినా అసలు ఇంత చిన్న వయసులో తనకు ఇంత సేవ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చినట్టు!
 
ఓసారి సెలవుల్లో ఆనంద్ కుటుంబం మహారాష్ట్రకు వెళ్లింది. ఓ రాత్రి పూట ఒక చోట డిమ్ లైట్ కింద ఒక పిల్లాడు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతని దుస్తులు చిరిగి ఉన్నాయి. ఆ అబ్బాయిని చూస్తే బాధగా అనిపించింది ఆనంద్ తండ్రికి. దాంతో అతనికి కొత్త బట్టలు కొనిస్తాను అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు.

‘బట్టలు వద్దు, పుస్తకాలు లేవు, అవి ఇప్పించండి’ అన్నాడు. దాంతో ఆనందంగా ఆ పుస్తకాలు కొనిచ్చారు మిశ్రా. పుస్తకాలు  చేతుల్లో ఉన్నప్పుడు ఆ పిల్లాడి కన్నుల్లో కనిపించిన వెలుగు ఇంతా అంతా కాదు. ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తరువాత కుటుంబమంతా కలిసి లక్నో చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు వెళ్లారు.

ఆ గ్రామాల్లో ఎందరో విద్యార్థులు చదువుకు దూరమై బాల కార్మికులయ్యారు. వాళ్లకీ ఏదో చేతనైనంత సాయం చేశారు. ఈ రెండు  సంఘటనలూ ఆనంద్‌పై తీవ్ర  ప్రభావం చూపించాయి. తనకు చదువు మీద మునపటి కంటే శ్రద్ధ పెరగడమే కాక బీద పిల్లలకు చదువు చెప్పాలనే కోరిక ెకలిగింది. నాటి నుంచీ అదే పని చేస్తున్నాడు ఈ బుల్లి మాస్టారు.
 
ఆనంద్ సేవ అప్పుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘సత్యపథ్ బాల్ రతన్’, ‘సేవా రతన్’ అవార్డ్‌లతో పాటు ఎన్నో అవార్డ్‌లు అతణ్ని వరించాయి. అయితే వాటిని పట్టించుకోడు ఆనంద్. తెలిసిన వాళ్లందరి దగ్గరా డబ్బులు సేకరించి మురికి వాడల్లో గ్రంథాలయాలను  స్థాపించడానికి నడుం కట్టాడు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మొదలుపెట్టాడు.

తల్లి దండ్రులతో కలిసి ‘చలో పడో అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ప్రతి విద్యావంతుడు తన బాధ్యతగా కనీసం ఒక్కరినైనా చదివించాలని, అండగా నిలవాలనేది దీని లక్ష్యం. దీనికి మంచి స్పందన వస్తోంది. అది చూసి ఆనంద్ పెదాల మీద చిరునవ్వు మెరుస్తోంది. అది చిరునవ్వు మాత్రమే కాదు... అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement