జగనన్న హామీ పథకాలు | Ys Jagan mohan redd y gives assurance schemes to people | Sakshi
Sakshi News home page

జగనన్న హామీ పథకాలు

Published Sun, May 4 2014 1:47 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Ys Jagan mohan redd y gives assurance schemes to people

అమ్మ ఒడి
 బిడ్డ భవిష్యత్తు కోసం ఏ తల్లీ భయపడాల్సిన పనిలేదు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు తల్లికి ఊరట! బిడ్డను బడికి పంపితే అమ్మ ఖాతాలోకి డబ్బు. 1 నుండి 10వ తరగతి వరకు ప్రతి బిడ్డకు నెలకు రూ.500, ఇంటర్ చదివిస్తే రూ.700, డిగ్రీలో రూ.1000. మీ పిల్లల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తాను.
 
 పింఛన్లు
 అన్నం కోసం వృద్ధులు కూలి పని చేయకూడదు. ప్రతి అవ్వకు, తాతకు నెలకు రూ.700 పింఛను, వితంతువులకు నెలకు రూ.700, వికలాంగులకు నెలకు రూ.1000. ప్రతి నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు ఆశ్రమాలు స్థాపిస్తాం. వాటిని మండలస్థాయికి విస్తరిస్తాం. అవ్వాతాతలకు ఇది ఒక మనవడి మాట.
 
 వ్యవసాయం
 గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రభుత్వం బాధ్యత. రైతుల కోసం రూ.3000 కోట్ల స్థిరీకరణ నిధి. ఇక కరువులకు, వరదలకు భయపడాల్సిన పనిలేదు. రూ.2000 కోట్లతో ప్రతి ఏడాది ప్రత్యేక సహాయనిధి. భూసార పరీక్షలు, రైతులకు సలహాలు, సూచనలకోసం 102 సర్వీసు. ప్రతి రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల. విత్తనాలు, ఎరువులు, మందుల క్వాలిటీ నియంత్రణ బాధ్యతను 102 అనుసంధానంతో కళాశాలలకే అప్పగిస్తాం.
 
 108 లాగే పశుసంపద రక్షణకు 104 అంబులెన్స్. ప్రతి జిల్లాలో శీతల గిడ్డంగులు, నిల్వ సామర్థ్యం పెంపు. గ్రేడింగ్ వసతి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ యూనిట్లు. ఈ వ్యవస్థను రెవిన్యూ డివిజన్ స్థాయికి విస్తరిస్తాం. వీటివల్ల రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర రావడమే కాక గ్రామీణ ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ శాఖకు ఇద్దరు మంత్రుల నియామకం. వ్యవసాయాన్ని మళ్లీ పండగ చేస్తాం.
 
 పల్లెల్లోకే పాలన
 కార్డులకోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పక్కా ఇంటి కార్డు ఇలా... అన్ని కార్డులు, పత్రాలు 24 గంటల్లో జారీ. అందుకోసం ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాఫీసు. ప్రభుత్వాన్ని మీ ఇంటి ముందుకే తెస్తాను.
 
 పక్కా ఇళ్లు
 2019 నాటికి గుడిసే లేని రాష్ట్రం... ఏటా 10 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు. ప్రస్తుతం ఇల్లు ఇచ్చినా యాజమాన్య హక్కు లేదు. ఇల్లు ఇచ్చినప్పుడే ఆడపడుచు పేరున పట్టా ఇస్తాను. ఇంటిని రుణంలో కాదు.. ఇంటిమీదే రుణం తెచ్చుకునేలా చేస్తా. ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు తీసుకునే అవకాశం. ఉండడానికి నీడనిస్తా... ఇంటి పత్రాలను చేతికిస్తా... ఆపదలో అవసరమైతే పావలావడ్డీకి రుణం తెచ్చుకునే వెసులుబాటు ఇస్తా... ఆదుకుంటా.
 
మహిళా సంఘాల రుణాలు మాఫీ

 రూ.20 వేల కోట్ల మహిళా సంఘాల రుణాలు మాఫీ. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు.
 అక్కచెల్లెళ్లకు ఇది నా భరోసా.
 
 ఆరోగ్యశ్రీ
 ప్రతి పెద్దాసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించిన అన్ని వ్యాధులనూ మళ్లీ చేరుస్తాం. డాక్టర్ల కొరత లేకుండా జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. కొత్త రాజధానిలో కార్డియాలజీ, క్యాన్సర్, కిడ్నీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ వంటి 20 ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన హెల్త్ సిటీ. ఈ హెల్త్ సిటీని జిల్లాలకు అనుసంధానం చేసి, రొటేషన్ పద్ధతిలో ఎక్కడా, ఏ జిల్లాలోనూ డాక్టర్ల కొరత లేకుండా రొటేషన్ పద్ధతిలో డాక్టర్లు ఉండేలా చేస్తాం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను మరింత బలపరుస్తాం. 108, 104 సేవలను ఇంకా మెరుగుపరుస్తాం. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారు కోలుకునే సమయంలో పనిచేయలేరు కాబట్టి, వారికి నష్టం జరగకుండా ఉపాధి, మందుల కోసం నెలకు రూ.3000 సహాయం. నా కుటుంబం ఏ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుందో అదే హాస్పిటల్‌లో మీకూ వైద్యం, ఓ హక్కుగా చేస్తా.
 
 ఉచిత విద్యుత్
 వ్యవసాయానికి రోజుకు 7 గంటలు పగటిపూటే నిరంతర ఉచిత విద్యుత్.2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.రైతు కుటుంబాల్లో మళ్లీ కాంతులు పండిస్తాను.
 
 150 యూనిట్ల కరెంటు రూ.100కే...
 తప్పుడు బిల్లులు, ఛార్జీల భారంతో ఇన్నాళ్లూ ఇక్కట్లు. పెద్ద బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేశారు. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ నిరుపేద కుటుంబాలు కరెంటు కోసం పక్కమార్గాలు వెతుక్కుంటున్నాయి. ఇకపై ఈ చీకట్లు ఉండవు. 150 యూనిట్ల వరకు నెలకు రూ.100కే కరెంటు ఇస్తాం. దీనితో 3 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితి లేకుండా చేస్తా.
 
 బెల్టు షాపుల నిర్మూలన
 ప్రతి పల్లెలో అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళా పోలీసులు. గ్రామాల్లో బెల్టు షాపులు పూర్తిగా లేకుండా చేస్తాం. నిరుపేద కుటుంబాల్లో సరికొత్త వెలుగులు. మద్యం మహమ్మారి నా అక్కచెల్లెళ్ల జీవితాలను ఛిద్రం చేయకుండా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యమిస్తా.
 
 యువతకు భవిత
 ఒక అన్నలా నా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఉద్యోగాల కోసం శ్రమిస్తాను. చదువుకునే ప్రతి ఒక్కరికీ అండ... ఉద్యోగం వచ్చేదాకా తోడు. అంతర్జాతీయ స్థాయి చదువు ప్రతి ఒక్కరి హక్కుగా మారుస్తాను. చదువుకున్న ఏ ఒక్కరికీ భవిష్యత్తుపై భయం లేకుండా చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement