
కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా అన్ని పరిశ్రమలూ మూతపడిన నేపథ్యంలో జర్మనీ భారీ స్థాయి లేఆఫ్‌లను నిరోధించడానికి ఒక సుపరిచిత ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. దీంతో కార్మికులు పనిచేయనప్పటికీ వారికి వచ్చే వేతనంలో మూడింట రెండొంతులకంటే ఎక్కువ వేతనాన్నే పొందగలరు. అదేసమయంలో కంపెనీలకు కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి సమయాల్లో ఉద్యోగులపై పెడుతున్న ఖర్చుల భారం కాస్త తగ్గుతుంది. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి కాలంలో సుశిక్షితులైన తమ సిబ్బందిని తమతో అట్టిపెట్టుకునేందుకు లుఫ్తాన్సా, బీఎమ్‌డబ్ల్యూ, వోక్స్‌వేగన్, డైమ్లర్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ప్రత్యేకమైన లేబర్ మార్కెట్ సాధనాన్ని ఉపయోగించుకున్నాయి. విషయానికి వస్తే, జర్మనీలో దాదాపు 5 లక్షల కంపెనీలు తమ సిబ్బందిని తాత్కాలిక పని పథకాలకు పంపించివేశాయి. జర్మనీలో ఈ పథకాలను కుర్జార్‌బియట్ అని పిలుస్తారు. ఉద్యోగుల వేతనాల భారాన్ని తగ్గించుకోవడానికి జర్మనీ కంపెనీలు తక్షణమే ఈ పథకాన్ని అమలులో పెట్టేశాయి. జర్మనీ ఇటీవలి చరిత్రలో చివరకు 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇంత అధిక స్థాయిలో తాత్కాలిక పని పథకాలకు అప్లికేషన్లు రాలేదు.
ఈ తాత్కాలిక పని పథకం చాలా బాగా పనిచేసింది. గత సంక్షోభ కాలంలో భారీ స్థాయిలో లేఆఫ్‌లను నిరోధించే సాధనంగా ఇది తన పాత్ర నిర్వహించింది. ఈ పథకం ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసింది లేక వారి పని గంటల్ని తగ్గించింది. అదే సమయంలో ఉద్యోగుల వేతనాల్లో మూడింట రెండొంతుల దాకా ప్రభుత్వమే చెల్లించడంతో ఉద్యోగులు అధికారికంగా కంపెనీ ఉద్యోగులుగా ఉంటూ వచ్చారు. ఈ సందర్భంగా కుర్జార్‌బియట్ అటు ఉద్యోగులకు, ఇటు యజమానులకూ ఉపయోగపడే గొప్ప సాధనమైంది. అది ఏకకాలంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించింది. ఇటు యజమానులకు రాబోయే నెలల్లో ఆర్థిక వ్యవస్థ డిమాండుకు తగినట్లుగా ప్లాన్ చేసుకునే విషయంలో వారికి మరింత భద్రతను కల్పించింది అని డాయిష్ బ్యాంకుకు చెందిన చీఫ్ జర్మన్ ఆర్థికవేత్త స్టీఫెన్ షెనిడర్ చెప్పారు. 2008 ఆర్థిక సంక్షోభంలో ఈ తాత్కాలిక పని విధానం నిరూపిత సాధనంగా నిలిచింది. 2009లో జర్మనీ ఆర్థిక ఫలితం 5 శాతం మేరకు కుదించుకుపోయినప్పుడు సంవత్సర కాలంలోనే సగటున 11 లక్షలమంది కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు.
దీంతో బెర్లిన్ పది బిలియన్ యూరోల (10.9 బిలియన్ డాలర్లు)ను నష్టపోయింది. కానీ సంవత్సరాంతానికి, ఉపాధి రేటు 7.6 శాతం వద్ద నిలిచింది. ఇది 2008 కంటే తక్కువ. కరోనా నేపథ్యంలో ఈసారి దాదాపు 23.5 లక్షలమంది ఉద్యోగులు ఈ ‘కుర్జార్‌బియటెర్‌గెల్డ్’ (తాత్కాలిక అలవెన్స్)లో చేరనున్నారని అంచనా. దీనివల్ల ఫెడరల్ లేబర్ ఆఫీసుకు 10 బిలియన్ యూరోల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ జర్మనీ సాంప్రదాయికంగా తక్కువ ఖర్చు చేసి పొదుపుకు ప్రాధాన్యం ఇచ్చే దేశం కనుక, అలా ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిన కాలంలో పొదుపు చేసిన నిధులను ప్రస్తుత సంక్షోభ సమయంలో వెచ్చించింది. చివరకు లేబర్ ఆఫీసు కూడా 26 బిలియన్ యూరోల నిల్వలను సిద్ధం చేసి ఉంచుకుంది. ఈ భారీ మొత్తం ఇప్పుడు కంపెనీలకు, ఉద్యోగులకు దన్నుగా నిలిచేందుకు ఉపయోగపడింది. గత సంక్షోభంలో వలే కాకుండా, ఇప్పుడు రెస్టారెంట్లు, కన్సల్టెంట్లు వంటి చిన్నచిన్న సర్వీస్ సంస్థలు ఈ తాత్కాలిక పని పథకాన్ని చక్కగా ఉపయోగించుకున్నాయి.
జర్మన్ కార్పొరేట్ ప్రపంచం మొత్తంగా తమ సిబ్బందిని తాత్కాలిక పని పథకాలకు పంపిం చారు. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి విజృంభిస్తున్న కాలంలో అత్యుత్తమ శిక్షణ పొందిన తమ కార్మికులను పోగొట్టుకోకుండా ఉండటానికి లుఫ్తాన్సా, బీఎమ్‌డబ్ల్యూ, వోక్స్‌వేగన్, డైమ్లర్ వంటి దిగ్గజ సంస్థలు కుర్జార్‌బియట్ అని పిలుస్తున్న ఈ లేబర్ మార్కెట్ సాధనాన్ని ఈసారి చక్కగా వినియోగించుకున్నాయి. ఆహ్వానించాయి కూడా. అయితే ఈ వినూత్న పథకాన్ని ఇతర దేశాలు కూడా ఉపయోగించుకోబోతున్నాయి. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లియెన్ ఇతర దేశాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనను పంచుకున్నారు. దీని కోసం ఈయూ 100 బిలియన్ల యూరోలను సేకరించాల్సి ఉంటుంది. అయితే ఇంత భారీ మొత్తాలను పెంచాలంటే ఈయూ సభ్య దేశాలన్నీ హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నిధిలో 25 శాతంకంటే ఎక్కువ మొత్తాన్ని జర్మనీయే భరించాల్సి ఉంటుంది కూడా. యూరో జోన్ పొడవునా కరోనా బాండ్స్ పేరిట సంయుక్త రుణ సాధనం ప్రాధాన్యాన్ని తగ్గించడానికి బదులుగా, ఇప్పటికే వైరస్ బారిన పడి భారీగా నష్టపోతున్న స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగాల కోతను నిరోధించడానికి తాత్కాలిక ఉపాధి పథకం పట్ల సంఘీభావం ప్రకటించాల్సి ఉంది.
భారత వలస కార్మికుల దుస్థితి!
కరోనా వైరస్ విజృంభణతో మనం బెంబేలెత్తిపోతున్నాం కానీ, ఆపత్కాలంలో ఎదురీడానికి జర్మనీ రిజర్వ్ నిధులను ముందే సిద్ధం చేసుకుంది. దీని దన్నుతో ఉద్యోగుల వేతనాలకు చిల్లుపడకుండా జర్మనీలో అమలు చేస్తున్న తాత్కాలిక ఉపాధి పథకం యూరప్ ఖండానికి ఆదర్శప్రాయంగా మారబోతోంది. భారత అసంఘటిత కార్మికుల్లో 18 శాతంమందికి మాత్రమే కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అందుతున్నాయని తాజా సర్వే ప్రకటించింది. రేషన్ కార్డు కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్డులు కానీ మన దేశంలో కోట్లాది మంది వలస కార్మికులకు లేని కారణంగా లాక్‌డౌన్ పొడిగింపు దశలో వీరు తీవ్రంగా దెబ్బతిననున్నారు. జర్మనీ కార్మికుల సంక్షేమానికి 26 బిలియన్ యూరోలను నిల్వచేసి వాడుతుంటే.. భారత కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో అతిస్వల్ప మొత్తాన్ని మాత్రమే వేసి ఊరుకుంది. కానీ, కోట్లాది వలస కార్మికులకు నెలవారీ ఆదాయం లభించే ఏర్పాటు చేయకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయన్నది వాస్తవం.
అన్నెట్టీ వెయిష్‌బాహ్
వ్యాసకర్త సీనియర్ రిపోర్టర్, సీఎన్‌బీసీ
Comments
Please login to add a commentAdd a comment