హైదరాబాద్‌లో అడ్డా కూలీల తీరని వెతలివి! | Hyderabad Labour Not Getting Work No Income For Migrant Workers | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అడ్డా కూలీల తీరని వెతలివి!

Published Wed, Apr 7 2021 8:04 AM | Last Updated on Wed, Apr 7 2021 10:40 AM

Hyderabad Labour Not Getting Work No Income For Migrant Workers - Sakshi

రామంతాపూర్‌ పబ్లిక్‌ స్కూల్‌ అడ్డా వద్ద కూలీల నిరీక్షణ

ఉదయం కాగానే తాజాగా బతుకు మొదలవుతుంది.. చకచకా అడ్డామీదకు చేరుకుంటారు.. పనికోసం ఎదురు చూస్తుంటారు.. పని దొరికినోళ్లు సంతోషంగా వెళ్తారు.. మిగిలిపోయినోళ్లకు ఎదురుచూపులు తప్పవు. ఒక్కో రోజు మధ్యాహ్నం దాటిపోతుంది.. ఆకలి చంపేస్తుంది.. పనిపై ఆశ మాత్రం చావదు. ఇక ఆ రోజు పనిలేక గడపాల్సిందేననుకుంటూ ఆకలి తీర్చుకునేందుకు స్థానికంగా ఉండే రూ.5 భోజన కేంద్రం వద్ద కడుపు నింపుకొని, కేంద్రం లేనిచోట కడుపు మాడ్చుకొని సాయంత్రం ఇంటిబాట పడతారు. ఇదీ నగరవ్యాప్తంగా ఉన్న అడ్డా కూలీల దుస్థితి. కరోనా మహమ్మారి కారణంగా పనులు లేక ఎన్నో కష్టాలు పడుతున్న వలస కూలీల పరిస్థితులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి కథనం..  
– సాక్షి, సిటీబ్యూరో 

‘ఉప్పల్‌ గాంధీ బొమ్మ వలస కూలీల అడ్డా.. ఏడాది క్రితం వరకు వందలాది మంది కూలీలతో సందడిగా ఉండేది. ఉదయం 10 గంటల వరకు అంతా పనుల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు కూడా సందడిగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటల దాటినా పనుల కోసం పడిగాపులు కాసే కూలీలు కనిపిస్తారు. ఒకప్పుడు అక్కడ కనీసం350 మందికి పైగా వలస కూలీలు పనికోసం ఎదురు చూసేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 250కి పడిపోయింది. సగం మందికి పని దొరికితే.. మరో సగం మంది ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు.  

యూసుఫ్‌గూడ లేబర్‌ అడ్డాలో గతేడాది ప్రతిరోజూ సుమారు 500 మంది కూలీలు పనికి వచ్చేవారు. ప్రస్తుతం 300 మంది వరకు వస్తున్నారు. అందరికీ పనులు దొరకడం లేదు. ఉప్పల్, యూసుఫ్‌గూడ వంటి అడ్డాలే కాదు. గ్రేటర్‌లోని వందలాది వలస కూలీల అడ్డాలు ప్రస్తుతం పనుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కోవిడ్‌కు ముందు నెలలో కనీసం 25 రోజులు పని లభించగా.. ప్రస్తుతం 15 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగతా 15 రోజులు పనుల్లేక కష్టంగా ఉంటోంది. కొన్నిచోట్ల ఐదు రూపాయల భోజనం ఆదుకుంటోంది. కానీ అడ్డా కూలీలు ఉన్న అన్నిచోట్లా భోజన కేంద్రాలు లేవు.  

ఎదురు చూపులే... 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మేడ్చల్, మేడిపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. కోవిడ్‌కు ముందు గ్రేటర్‌లో సుమారు 10 లక్షల మంది వలస కూలీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలకు తగ్గింది. లాక్‌డౌన్‌ రోజుల్లో సొంతూళ్లకు వెళ్లిన వారిలో మూడొంతుల మంది తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సుమారు 3 లక్షల మంది మాత్రం ఊళ్లలోనే ఉంటున్నారు.  

నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, యూసుఫ్‌గూడ, మల్కాజిగిరి, రామంతాపూర్, ఉప్పల్, గౌలిగూడ, అంబర్‌పేట్, బాలానగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్‌ తదితర సుమారు 2,500 కూడళ్లు వలస కూలీల అడ్డాలు. 

ప్రస్తుతం ఈ అడ్డాల్లో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది పనికోసం ఎదురు చూస్తున్నారు. కానీ 3.5 లక్షల మందికే పనులు లభిస్తున్నట్లు కారి్మక సంఘాల సర్వేలో వెల్లడైంది. సగం మంది పనికోసం ఎదురు చూడాల్సి వస్తోందని సీఐటీయూ నాయకులు ఈశ్వర్‌ ఆందోళన వ్యక్తంచేశారు.  

పిల్లల చదువులు ఆగినై..  
ఒకరోజు పని ఉంటే మరో రోజు ఉంట లేదు. ఇంతకు ముందు లెక్క లేదు. బతుకు కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా కష్టమైతుంది. పిల్లలకు స్కూల్‌ ఫీజులు కట్టలేదు. చదువులు బంద్‌ అయినై. మా కష్టాలు ఎవరు తీరుస్తరు సార్‌? 
– సుజాత, విజయపురి కాలనీ, ఉప్పల్‌ 

పెరిగిన ధరలు–పెరగని కూలీ రేట్లు.. 
లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ఇంధనం ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి. రవాణా చార్జీలు రెట్టింపయ్యాయి. అందుకు అనుగుణంగా లేబర్‌ రేట్లు మాత్రం పెరగలేదు. పురుషులకు రోజుకు రూ.700, మహిళలకు రూ.600, మేస్త్రీలకు రూ.800 చొప్పున కూలీ లభిస్తోంది. నెలలో కేవలం 15 రోజులే పని దొరుకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది నెలల తరబడి పచ్చడి మెతుకులతోనే గడుపుతున్నారు. కొన్ని చోట్ల రూ.5 భోజనంఆదుకుంటోంది.

ఏ పనైనా మంచిదే..  
పెయింటింగ్‌ పని చేస్తాను. కానీ ఇప్పుడు పనుల్లేక ఏది దొరికితే దానికి వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు ఆర్డర్లు తీసుకొని ఇళ్లకు రంగులు వేశాను. ఇప్పుడు అడ్డామీదకు వచ్చి పనికోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు దొరుకుతోంది.. మరోరోజు నిరాశతో వెళ్లిపోతున్నాను. తప్పడం లేదు. 
– లక్ష్మణ్, సూరారం  

రూ.5 భోజనం ఆదుకుంటోంది  
పొద్దున్నే తిన్నా తినకపోయినా.. అడ్డా మీదకు వస్తున్నాను. ఏమాత్రం ఆలస్యమైనా పని దొరకడం లేదు. పని దొరకని రోజు రూ.5 భోజనంతో కడుపు నింపుకుంటున్నాను. దొరకని రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూసి వెళ్లిపోతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది.     
– కృష్ణ, చింతల్‌ 

పని దొరికితేనే తిండి  
రోజూ అడ్డా మీదకు వస్తున్నా.. పని దొరికిన రోజు సంతోషం. ఆ రోజు ఇంటిళ్లిపాదికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. పనిలేని రోజు పచ్చడితో బువ్వ తినాల్సిందే.. ఇంటి కిరాయిలు బాగా పెంచిండ్రు. గతంలో  నెలకు రూ.5 వేలు ఉండె. ఇప్పుడు రూ.6,500 అయ్యింది. చాలా కష్టంగా ఉంది.  
– సత్తయ్య, ఉప్పల్‌  

పోటీ పెరిగింది  
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల వల్ల బాగా పోటీ పెరిగింది. రోజుకు రూ.450 నుంచి రూ.500లకే ఒప్పుకుంటున్నారు. వాళ్లకు అపార్టుమెంట్లలోనే ఆశ్రయం ఇచ్చి పనులు అప్పగిస్తున్నారు. అడ్డా కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో కుటుంబమంతా తిప్పలు పడుతున్నారు.   
– చందు, ఉప్పల్‌ 

బిహార్‌ నుంచి మళ్లీ వచ్చా..  
పనికోసం బిహార్‌ నుంచి ఇక్కడికి వచ్చాను. లాక్‌డౌన్‌ రోజుల్లో కష్టంగా ఉండడంతో తిరిగి వెళ్లిపోయాం. తర్వాత మళ్లీ  హైదరాబాద్‌కు వచ్చాం. పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. రోజుకు రూ.600 మాత్రమే కూలీ లభిస్తోంది. ఇప్పుడేమో సెకెండ్‌ వేవ్‌ 
అంటున్నారు. లాక్‌డౌన్‌ పెడితే ఏం చేయాలో అర్ధం కాట్లే.      
– రౌతమ్, మల్లాపూర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement