సభాపతుల నిష్క్రియపై కొరడా | Anti defection Law pition explantion by Madabhushi sreedhar | Sakshi
Sakshi News home page

సభాపతుల నిష్క్రియపై కొరడా

Published Fri, Dec 8 2017 12:41 AM | Last Updated on Fri, Dec 8 2017 4:31 AM

Anti defection Law pition explantion by Madabhushi sreedhar - Sakshi

విశ్లేషణ
పదో షెడ్యూలు కింద దాఖలైన అనర్హతా పిటిషన్‌ పైన విచారణ జరిపి మూడునెలల వ్యవధిలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మూడు నెలల్లో తీర్పు ఇచ్చారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు బతికి ఉంటే ఫిరాయింపులదార్లను నెత్తిన పెట్టుకునే రాజకీయాలపైన వ్యంగ్య కొరడా ఝళిపించేవారు. ఆ కాలంలో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు విసిరితే పాలకులు సిగ్గు పడేవారు. ఇప్పుడు వాతలు తేలితే మలాములు పెట్టుకుంటారు, లేదా ప్టాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటారు. అంతేకాని సిగ్గుపడరు. ఈనాటి పార్టీ ఫిరాయింపుల గురించి చిలకమర్తి ఎన్ని వాతలు పెట్టేవారో!

అనర్హత పిటిషన్ల విషయంలో కావాలని జాప్యం చేసి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఒక జోక్‌గా మార్చేస్తున్నారని విమర్శిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇద్దరు సభ్యులను రాజ్యసభలో అనర్హులుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజ్యాంగాన్నీ, చట్టాలనూ మనవాళ్లు ప్రహసనాల స్థాయికి దిగజారుస్తున్న మాట నిజం. రాజ్యాంగ అధికరణాలంటే కళాశాలల్లో పంతుళ్లు బోధించే పనికిరాని పాఠాలని ఆ నేతల ఉద్దేశం. విలువలు– ఎథిక్స్‌ అనేవి పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నవారు చేసే నీతిబోధలు. ప్రవచనకారులకే పరిమితమైన ప్రభోదాలన్నమాట.

అటువంటి ప్రహసనాలలో ఒకటిగా రాజ్యాంగ పదవ షెడ్యూలు ఫిరాయింపు నిరోధక చట్టం చేరిపోయింది. ఆంగ్లంలో మాకరీ అంటారు. ఫిరాయించిన వారు రాజ్యాంగ పదోన్నతులు పొందుతూ పదో షెడ్యూల్‌ అంటే ఫక్కున నవ్వుతున్నారు. ఎందుకంటే అది కోరలు లేని పులి వలె కాదు కదా, కనీసం కాగితం పులిలా కూడా లేదు. రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ పెట్టాలన్నా మనసు రావడం లేదు. అలాంటి పదో షెడ్యూల్‌ మాకరీ కారాదని ఉపరాష్ట్రపతి చెప్పారు.

వేరే పార్టీ గుర్తు మీద ఎన్నికైన ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ప్రలోభపెట్టి రారమ్మని ఆహ్వానిస్తూ మంత్రిత్వంతో సహా అనేక పదవులు ఇవ్వడం ఇవాళ్టి రాజకీయాలలో మామూలైపోయింది. 1980లలోనే కాదు, ఆయారాం గయారాంలు 2017లో కూడా రాజ్యాలు ఏలుతున్నారు. గెలిపించిన పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరి పదవులు తీసుకుంటూ ఉంటే, ఇస్తూ ఉంటే ఈ ధోరణికి ఏం పేరు పెట్టాలో తెలియదు. ‘మీరిప్పుడు ఏ పార్టీలో ఉన్నారు!’అని ఎంపీలనూ, ఎమ్మెల్యేలను అడిగే హీనస్థితి. వీరి గురించి పదేపదే అడగడానికి మీడియా సిగ్గు పడుతూ ఉంటే, ఫిరాయింపు పదవీధరులు మాత్రం నిస్సిగ్గుగా ‘మేం రాజీనామా చేసినామండీ, మాపని మేం చేశాం. ఆమోదించకపోతే మేమేంచేస్తాం. పదవిలో కొనసాగుతాం!’అంటున్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు వారిని గెలిపించిన పార్టీ వదిలి అధికార పక్షం ప్రలోభాలకు లొంగిపోతుంటే పార్టీవ్రత్యం మంటగలసి పోయిందనీ, రాజకీయ వ్యభిచారమనీ కొన్ని పార్టీలు పత్రికల వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఆ పార్టీలు కూడా అధికారంలోకి వస్తే ఆ పనే చేస్తున్నాయి. జనం ఏం చేయలేకపోతున్నారు. అలాంటి వారిపై అనర్హత వేటు వేయండి అని బాధిత పార్టీ నాయకులు పెట్టిన పిటిషన్లు విచారించవలసిన అధికారం సభాధ్యక్షులకు (రాష్ట్ర శాసనసభల్లో స్పీకర్లు, విధాన మండలులలో సభాధ్యక్షుడు, లోక్‌సభలో సభాపతి, రాజ్యసభలో భారత ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ అధ్యక్షుడు) ఉందని భారత సంవిధానంలో ఆర్టికల్స్‌ 102(2), 191(2) కింద చేర్చిన పదో షెడ్యూలు వివరిస్తున్నది. ఫిరాయించిన చట్టసభ సభ్యులను అనర్హులను చేసి, ఆయారాం గయారాం సంస్కృతికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టంతో ఈ షెడ్యూలును చేర్చారు. అనేక సవరణలు తెచ్చినా అనర్హత వేటు వేసే అధికారాన్ని సభాపతులకే ఇచ్చారు. కనుక చట్టం ఇంకా బతికే ఉంది. వేటు విషయంలో నిర్ణయాధికారం సభాధ్యక్షులు, సభాపతులమీద ఉందని సెక్షన్‌ 6 వివరిస్తున్నది. అంతేకాదు ఈ విషయమై సభాపతులు చెప్పిన తీర్పే తుది తీర్పని కూడా స్పష్టం చేసింది. సెక్షన్‌ 7 ప్రకారం అనర్హతల నిర్ణయానికి సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సభాపతి లేదా సభాధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న తరువాత అది రాజ్యాంగ సమ్మతంగా ఉందో లేదో సమీక్షించే అధికారం హైకోర్టు, సుప్రీంకోర్టులకు రాజ్యాంగమే ఇచ్చింది.

కాబట్టి వెంకయ్యనాయుడు ఇచ్చిన తీర్పుపైన న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించాలని బాధిత ఎంపీలు హైకోర్టులను, సుప్రీంకోర్టును కోరవచ్చు. సభాపతులు, సభాధ్యక్షులు రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండి వారి అధినాయకుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు కాని రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. నిజానికి సభాపతి ఎన్నికయ్యే వరకు పార్టీకి చెందినవాడే. ఆ తరువాత పార్టీలకు అతీతంగా గౌరవప్రదంగా వ్యవహరించాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. గవర్నర్లు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతికి కూడా ఇదే వర్తిస్తుంది.

పార్టీ ఫిరాయించిన ఒక ఎంపీ (లేదా ఎమ్మెల్యే) పైన అనర్హత పిటిషన్‌ వేస్తే, నాలుగేళ్లదాకా తేల్చకుండా కాలహరణం చేయడం పదో షెడ్యూలు ఊహించని రాజ్యాంగ వ్యతిరేక రాజకీయ వ్యూహం. ఎన్నికలు రావడానికి కొద్దిరోజుల ముందు అనర్హుడంటూ ‘న్యాయ’నిర్ణయం చేస్తారు. ఈ నిష్క్రియాత్వం తగదనీ, రాజ్యాంగ బాధ్యతను సభాపతులు న్యాయమూర్తుల వలె నిర్వహించాలనీ న్యాయస్థానాలు చెప్పాయి. రాజకీయ నాయకులు హోదాలో పార్టీ పక్షపాతంతో వ్యవహరించరాదని సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు చాలాసార్లు తమ తీర్పుల్లో ఆక్రోశించారు కూడా. నిజానికి ఇలాంటి పిటిషన్ల గురించి సత్వరం వినకపోతే ఫిరాయింపు వ్యతిరేక చట్టం లక్ష్యాలు నీరుగారతాయనీ, ప్రజాస్వామ్యంలో జనం తీర్పు చెల్లకుండా పోతుందనీ చట్టసభల నిర్వాహకులను సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. ఒక్కొక్కసారి పంతుళ్ల పాఠాల వలెనే కొన్ని కోర్టు తీర్పులు కూడా అమలు కాని ఆదేశాల వలెనే మిగిలిపోతాయి. కోర్టు ధిక్కార నేరానికి శిక్ష వేసే అధికారం ఉంది కనుక కొన్ని విషయలాలలో భయపడతారు. ఆదేశాల రూపంలో కాక, నీతిబోధలు, సలహాలు సిఫార్సులు చేస్తే వాటిని పాటించాలన్న ఒత్తిడి ఉండదు.

రాజ్యాంగం పదో షెడ్యూలు కింద దాఖలైన అనర్హతా పిటిషన్‌ పైన విచారణ జరిపి మూడునెలల వ్యవధిలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మూడు నెలల్లో తీర్పు ఇచ్చారు. దీని నుంచి దేశంలోని సభాపతులంతా నేర్చుకోవాలి. శరద్‌ యాదవ్, అలీ అన్వర్‌లను ఆయన అనర్హులుగా ప్రకటించారు. సెప్టెంబర్‌ 2న జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌ పిటిషన్‌ వేశారు. సింగ్‌ పిటిషన్‌కు జవాబు ఇవ్వాలని శరద్‌ యాదవ్‌ను 11న ఉపరాష్ట్రపతి ఆదేశించారు. జవాబు ఇవ్వడానికి ఒక నెల గడువు కావాలని 15, 18 తేదీలలో యాదవ్‌ కోరారు. వారంరోజుల గడువు (25 వరకు) ఇచ్చారు, 22వ తేదీన యాదవ్‌ జవాబు అందింది. అక్టోబర్‌ 7– యాదవ్‌ జవాబును ఆర్‌సీపీ సింగ్‌కు పంపారు, 11న యాదవ్‌ తను హాజరై వివరిస్తానని అడిగారు. 13న సింగ్‌ జవాబు అందింది. అనర్హుడిగా ప్రకటించాలని ఆయన వాదించారు. 18న యాదవ్‌ కోరినట్టు అక్టోబర్‌ 30న వ్యక్తగతంగా హాజరు కావాలని లేఖ రాశారు. 23న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి కనుక 8 వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు నిరాకరిస్తూ నవంబర్‌ 8న హాజరు కావాలని యాదవ్‌కు ఉపరాష్ట్రపతి 24న లేఖ రాశారు. తనతో పాటు న్యాయవాదులు కపిల్‌ సిబల్, దేవదత్త కామత్‌లను కూడా అనుమతించాలని నవంబర్‌ 4న యాదవ్‌ కోరారు. 7న మరో నలుగురు అడ్వకేట్లు తమ తరఫున వాదించేందుకు అనుమతించాలని మరో పిటిషన్‌ వేశారు. రెండు పిటిషన్లను ఉపరాష్ట్రపతి తిరస్కరించారు. 8న శరద్‌ యాదవ్‌ వ్యక్తిగతంగా హాజరైనారు. డిసెంబర్‌ 4న శరద్‌ యాదవ్‌ అనర్హుడిగా తీర్పు ప్రకటించారు. మరొక ఎంపీని కూడా ఈ విధంగానే అనర్హుడిగా ప్రకటించారు. అధికార పార్టీకీ, ప్రభుత్వానికీ అనుకూలం కనుకనే ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకున్నారని, మూడేనెలల్లో నిర్ణయించడం తమ దారి తొక్కని పార్టీలను తొక్కేయడానికేనని విమర్శలు చేస్తున్నారు. వారు న్యాయస్థానాల్లో ఆ తీర్పును సవాలు చేయవచ్చు.

 ఇంకో రెండేళ్లు కాలయాపన చేయడానికి ఫిరాయింపు ఎంపీలు, ఎమ్మెల్యేలు కోర్టులను స్వార్థానికి వాడుకోకుండా చూసుకోకపోతే ప్రయోజనం ఉండదు. ఫిరాయింపు తప్పుకు పాల్పడిన వారు స్పీకర్‌ తప్పుతో పదవిలో కొనసాగి, కోర్టు ఆలస్యాలతో పదవీకాలాన్ని ముగించుకుంటే రాజ్యాంగంతో పాటు సభాపతి స్థానం, ఉన్నత న్యాయస్థానం కూడా ప్రహసనాలుగా మిగిలిపోతాయి. మూడునాలుగేళ్లపాటు అనర్హత పిటిషన్లపై తేల్చకపోతే క్షమించడానికి వీల్లేదు. ఫిరాయించిన ఆర్నెల్లలో పిటిషన్‌ రావడం, సభాపతి విచారించడం, కోర్టు సమీక్షించడం అన్నీ ముగిసిపోయే విధంగా మార్పులు చేయాలి. స్వపక్షానికి లాభం చేకూర్చడానికో, పరపక్షానికి హాని చేయడానికో కాకుండా నిష్పాక్షికంగా ఫిరాయింపుల నిరోధచట్టాన్ని అమలు చేసి చిత్తశుధ్దితో న్యాయం చేయగల వాడే రాజ్యాంగ విలువలను కాపాడినవాడవుతాడు. ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగాన్ని అమలుచేయని ప్రతి నాయకుడు రాజ్యాంగ పీఠాన్ని అధివసించినందుకు సంతోషించినా, సంవిధానం ప్రకారం వ్యవహరిస్తానని చేసిన ప్రతిజ్ఞను కాలరాసినట్టే. వందరూపాయల మోసం చేస్తే జైల్లో వేస్తారు.  రాజ్యాంగాన్నీ, న్యాయాన్నీ సభాపతి స్థానం ద్వారా, కోర్టుల ద్వారా మోసం చేస్తే ఆ నేరాలకు చర్యలు ఉండవా?

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌ professorsridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement