చట్టాలు, సంప్రదాయాలు కాగితాలకు పరిమితమైనప్పుడు, ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నప్పుడు విజ్ఞులైనవారు ఆగ్రహించటంలో వింతేమీ లేదు. రాజ్యసభ చైర్మన్‌గా తన ఏడాది కాలం అనుభవాలను క్రోడీకరించి రచించిన పుస్తకావిష్కరణ సభలో ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చట్టసభల తీరుతెన్నుల గురించి చాలా అంశాలు ప్రస్తావించారు. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా సమగ్ర నియమావళి రూపొందించుకోవాలని సూచించారు. ఆయన రాజ్యసభ చైర్మన్ కాకముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు గనుక సభలో సభ్యుల ప్రవర్తన, సభాపతులు వ్యవహరించాల్సిన తీరు వగైరా అంశాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. అయితే బీజేపీ పాలకపక్షంగా ఉన్న రాష్ట్రాలు మొదలుకొని అనేకచోట్ల చట్టసభల్లో విలువలు చట్టుబండలవుతున్నాయి. అధికారాన్ని నిలుపు కోవడానికి కావొచ్చు... ప్రతిపక్షాన్ని బలహీనపర్చడానికి కావొచ్చు–పాలకపక్షాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ దిగజారుడుతనాన్ని మరింత అధోగతికి తీసుకెళ్లినవారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అగ్రగణ్యుడు.
అంతకు కొన్ని నెలల ముందు పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో తమ టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా తీసుకున్నప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఆవేశపడిపోయిన చంద్రబాబే ఆ తర్వాత అదే పనిని మరింత నిస్సిగ్గుగా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో అమల్లోకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం నిరర్ధకమవుతున్నదన్న అభి ప్రాయం కలిగాక 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి సవరణలు తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు వంటి ఘనుల పుణ్యమా అని ఆ సవరణ కూడా నిరుపయోగంగా మారింది.
ఇదే సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ క్రమశిక్షణ గురించి ప్రస్తావించారు. వెంక య్యనాయుడి క్రమశిక్షణను మెచ్చుకుంటూ, దాన్ని పాటించమని కోరేవారిని ఇప్పుడు నియంత అని ముద్రేస్తున్నారని వాపోయారు. మోదీ క్రమశిక్షణ పాటించమని ఎవరిని కోరుతున్నారో తెలియదుగానీ... తమ మిత్రపక్షంగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుదార్లకు టీడీపీ మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి ఆయన గుర్తుంచుకోవాలి. కలిసి ఎన్నికల్లో పోటీచేసి గెలిచి కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే తమకు సంబంధమేమిటన్నట్టు ప్రవర్తించటం క్రమశిక్షణ ఎలా అవుతుంది? ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీలు కూడా పార్టీ ఫిరా యించారు. 2014లో లోక్‌సభ ప్రారంభ సమావేశాల సమయంలోనే వారిలో ఇద్దరు తెలుగుదేశం వైపు మొగ్గుచూపగా, అనంతరకాలంలో మరో ఇద్దరు అదే బాటపట్టారు. నాలుగున్నరేళ్లు గడిచి, సభ గడువు దాదాపు పూర్తికావస్తున్నా అతీగతీ లేదు.
ఒక పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా గెలిచి మరో పార్టీకి ఫిరాయించి మంత్రులు కావడమేమిటని వెంకయ్యనాయుడు వేసిన ప్రశ్న అర్ధవంతమైనది. ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్లకు అధికారం ఇచ్చినట్టే... అటువంటివారితో మంత్రులుగా ప్రమాణం చేయించకూడదన్న నియమం గవర్నర్లకు కూడా ఉంటే ఈ దురాచారానికి కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ మొదట తెలంగాణలో తలసానితో మంత్రిగా ప్రమాణం చేయించినప్పుడు ఆయన ఏ పార్టీ తరఫున గెలిచారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని బాబు గవర్నర్‌ను ప్రశ్నించారు. కనీసం ఆయన అలా అన్నందుకైనా ఆ తర్వాత కాలంలో ఏపీలో ఫిరాయింపుదార్లకు బాబు పదవులు పంచినప్పుడు నరసింహన్ అడిగి ఉండా ల్సింది.
కానీ ఆయన అప్పుడు కూడా మౌనమే పాటించారు. ఇలా కీలక పదవుల్లో ఉన్నవారు తమ కనీస బాధ్యతను మరుస్తున్నారు గనుకే నిర్దిష్టమైన చట్ట నిబంధన ఉండటం అత్యవసరం. పార్టీలు మారినవారిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలన్న వెంకయ్యనాయుడు ప్రతిపాదన కూడా హర్షించదగ్గది. అయితే అది నిబంధన రూపంలో ఉంటే తప్ప మన స్పీకర్లు ఎవరూ తమకు తాముగా ముందుకు రారు. ఫిరాయింపుల చట్టంలోని ప్రధాన లోపమిదే. నిబంధన ఉంటే ఫిరా యింపుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అది లేకపోవటం వల్ల స్పీకర్‌గా ఉంటున్నవారు పాలకపక్షం ప్రయోజనాలను నెరవేరుస్తూ, అందుకు ప్రతిఫలం పొందుతూ కాల క్షేపం చేస్తున్నారు. స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని గుర్తించి, ఆ పదవి ద్వారా పరిపూర్తి చేయాల్సిన కర్త వ్యాలపైనా, బాధ్యతలపైనా సంపూర్ణ అవగాహన కలిగినవారు ఆ పదవిలో ఉంటే వేరు. అలాంటివారు కరువు కావటమే ప్రస్తుత సమస్యకు మూలం.
ఒక్క ఫిరాయింపుల విషయంలో మాత్రమే కాదు... సభా నిర్వహణలో సైతం స్పీకర్ల వ్యవహార శైలి పాలకపక్షానికి అనుకూలంగా ఉంటున్నది. సభాధ్యక్ష స్థానంలో ఉండేవారే సక్రమంగా లేన ప్పుడు సభ్యుల ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండదు. మొత్తంగా చట్టసభలు భ్రష్టుపడుతున్నాయి. ప్రజల్లో వాటిపట్ల విశ్వసనీయత తగ్గడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళి రూపొందించుకుంటే ఈ విశ్వసనీయత పెంచవచ్చునన్నది వెంకయ్యనాయుడి అభిప్రాయం. కానీ పాలక పార్టీలే ఈ స్థితికి కారణమై, దాని వల్ల లబ్ధి పొందుతున్న దశలో ఏకాభిప్రాయం ఎండమావే అవుతుంది. కనుకనే ఫిరాయింపు చట్టానికి సమగ్రమైన సవరణలు అవసరం. నిర్దిష్టమైన నిబంధనలుంటే దాన్నుంచి తప్పించు తిర గటం అసాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రయత్నించినప్పుడే చట్టసభలపైనా, ఎన్నికలపైనా, ప్రభు త్వాలపైనా ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment