శుభారంభం! | Rajya Sabha passes Real Estate Regulator Bill | Sakshi
Sakshi News home page

శుభారంభం!

Published Fri, Mar 11 2016 11:46 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Rajya Sabha passes Real Estate Regulator Bill

దేశంలో ఆర్ధిక సంస్కరణల అనంతరం పట్టణీకరణ వేగం పుంజుకుంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి  మధ్య తరగతి, ఆ పై తరగతి జనం తహత హలాడారు. ఫలితంగా స్థిరాస్తి రంగం ఊహాతీతంగా విస్తరించింది. పట్టణాలు, నగరాల్లో నివేశన స్థలాల ధరలు చుక్కలనంటడంతో అపార్ట్‌మెంట్‌లకు గిరాకీ పెరిగింది. దాదాపు పాతికేళ్లుగా ఈ ధోరణి కొనసాగుతున్నా...ఆ క్రమంలో సగటు జీవి ఎన్నెన్నో సమస్యల్లో చిక్కుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2015ను ప్రతి ఒక్కరూ హర్షిస్తారు.

వినియోగదారుల ప్రయోజనాలకు ఇందులో పెద్ద పీట వేశామని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. అందులో వాస్తవం ఉంది. ఈ బిల్లు చట్టమైతే స్థిరాస్తి రంగాన్ని నియంత్రించేందుకు పటిష్టమైన వ్యవస్థ అమల్లోకి వస్తుంది. కొనుగోలుదారులను మోసపుచ్చే పనులకు అడ్డుకట్ట పడుతుంది. కనీసం 500 చదరపు మీటర్లు, 8 ఫ్లాట్లు ఉండే ఏ ప్రాజెక్ట యినా ఇకపై రాష్ట్ర స్థాయిలో ఉండే నియంత్రణా ప్రాధికార సంస్థల్లో రిజిస్టర్ చేయకతప్పదు.  

 అస్పష్టమైన పదబంధాలతో, ఆకర్షణీయమైన పదజాలంతో, అందమైన కంప్యూటర్ చిత్రాలతో ఊదరగొట్టడం ఈ రంగంలో సర్వసామాన్యం. కొనుగోలు దారులను బోల్తాకొట్టించడమే వీటి పరమార్ధం. స్వల్ప వ్యవధిలో లక్షల పెట్టుబడి నుంచి కోట్ల రూపాయలు ఆర్జించడమే ధ్యేయం. పారదర్శకత, జవాబుదారీతనం వంటివి ఇక్కడ చాలా అరుదు. అయితే ఇలాంటి స్థితిని మార్చాలని, ఈ చెడ్డ పేరును మాపుకోవాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని ఆ రంగంనుంచే కొన్ని ప్రయత్నాలు జరగకపోలేదు. కానీ వాటి ప్రభావం పరిమితం. గోడల మందాన్ని, గదుల వైశాల్యాన్ని, బాల్కనీ చోటునూ, కారిడార్‌నూ, క్లబ్‌హౌస్‌నూ, లిఫ్ట్‌కు కేటాయించిన స్థలాన్నీ... అన్నిటినీ గుదిగుచ్చి ‘సూపర్ బిల్టప్ ఏరియా’ అంటూ అట్టహాసమైన అంకెను చదరపు అడుగుల్లో చూపి కొనుగోలుదారులను మభ్య పెట్టడం అలవాటుగా మారింది. అపార్ట్‌మెంటు పూర్తిగా రూపురేఖలు సంతరించుకున్నాకగానీ మోసపోయామని కొనుగోలుదారులకు అర్ధంకాదు.

గృహ ప్రవేశానంతరం అసలు కష్టాలు మొదలవుతాయి. ఇచ్చిన హామీలకూ, పూర్తిచేసిన పనులకూ పొంతన ఉండదు. నాసిరకం నిర్మాణాలు, ఉపకరణాలు వెక్కిరిస్తుంటే సొంతింటి స్వప్నం కాస్తా బతుకీడ్చక తప్పని నరకంగా మిగిలిపోతుంది. సగటు మధ్యతరగతి జీవి నెలానెలా ఈఎంఐలు కట్టుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు. ప్రాజెక్టు పేరు చెప్పి అడ్వాన్సులు వసూలు చేసి అడ్రస్ లేకుండా పోయేవారికీ ఈ రంగంలో కొదవలేదు. ఒక ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరొకటి చేపట్టి, వసూలు చేసిన మొత్తాన్ని వేరే చోటకు మళ్లించి ఏళ్ల తరబడి పూర్తి చేయకుండా ఇబ్బందులు పెట్టేవారూ ఇందులో ఉన్నారు. ప్రాజెక్టులకూ, కొనుగోలుదారులకూ అప్పులిచ్చిన బ్యాంకులు సైతం డబ్బు రాబట్టుకునే మార్గం తోచక ఉస్సూరంటాయి. ఇంత అరాచకం రాజ్యమేలుతున్నా ఈ రంగానికంటూ ఒక నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చాన్నాళ్లపాటు ప్రభుత్వాలు అనుకోలేదు. అనుకున్నాకైనా దాన్ని వెనువెంటనే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించలేదు. బిల్లు తీసుకొస్తామని ఎన్నడో 2009లో హామీ ఇస్తే అది రాజ్యసభలో ఆమోదం పొందడానికి ఇన్నేళ్లు పట్టింది.  

 మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నది స్థిరాస్తి రంగమే. జీడీపీలో ఈ రంగం వాటా 11 శాతం. ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టేవారికి డబ్బే ముఖ్య అర్హత. ఆ వచ్చినవారెవరో, వారి నేపథ్యమేమిటో, వారికున్న పూర్వానుభవమేమిటో ఎవరికీ పట్టదు. స్థిరాస్తులతో ముడిపడి ఉండే రంగం గనుక ఇందులో గూండాలు, మాఫియాల పాత్ర అధికం. సవాలక్ష అను మతులు అవసరమవుతాయి గనుక అడుగడుగునా అవినీతి, నిబంధనల ఉల్లంఘ నలు సర్వసాధారణం. దేశ ఆర్ధిక వ్యవస్థను పీల్చి పిప్పి చేస్తున్న నల్లడబ్బు విస్తారంగా వేళ్లూనుకోవడంలో స్థిరాస్తి రంగానిదే ప్రధాన పాత్ర. మొత్తం నల్ల డబ్బులో స్థిరాస్తి రంగం వాటా మూడో వంతు ఉంటుందని ఒక అంచనా. పారదర్శకత లేకపోవడం, ఎవరికీ జవాబుదారీ కాకపోవడం ఈ సమస్యలన్నిటికీ మూలం. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ప్రకారం బిల్డర్లు, రియల్‌ఎస్టేట్ ఏజెంట్లు నియంత్రణ ప్రాధికార సంస్థల ముందు తమ పేర్లు నమోదు చేసుకోవడం తప్పని సరి. ఏ ప్రాజెక్టుకు సంబంధించి అయినా దాని ప్రమోటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కి టెక్టులు, ఇంజనీర్లు, ఏజెంట్లు తదితరుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

వాటితో పాటు భూ వివరాలు, ప్రాజెక్టు లేఔట్, ఇతర అనుమతులు వగైరాలను దాఖలు చేయాలి. ‘సూపర్ బిల్టప్ ఏరియా’లాంటి మాటల్ని కట్టిపెట్టి నివాసానికి ఉపయో గపడే కార్పెట్ ఏరియా ఎంతో కొనుగోలుదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. కొనుగోలుదారులనుంచి వసూలు చేసే మొత్తంలో 70 శాతాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయడం తప్పనిసరి. ప్రాజెక్టులో చోటు చేసుకునే మోసాలపై ఫిర్యాదు చేయడానికి అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఉంటాయి. ఎలాంటి ఫిర్యాదునైనా ఇవి 60 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులను మోసగించినట్టు రుజువైతే హెచ్చరికలు, జరిమానాలు ఉంటాయి. తరచుగా తప్పు చేసేవారికి జైలు శిక్ష కూడా తప్పదు. కులం, మతం, ప్రాంతం, జాతి, లింగ వివక్షల్ని ప్రదర్శిస్తే చర్య తీసుకుంటారు. ఈ నిబంధనలు అటు నివాస గృహ సముదాయాలకూ, ఇటు వాణిజ్య సముదాయాలకూ వర్తిస్తాయి.

 ఒక ప్రాజెక్టుకు అవసరమయ్యే పలు రకాల అనుమతుల కోసం సింగిల్‌విండో వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పడం బాగానే ఉన్నా వీటిల్లో అసంగతమైనవాటిని తొలగించాలి. ఇప్పుడున్న విధానంలో పాత భవనం కూల్చి కొత్తది కడుతున్నా పర్యావరణ అనుమతులు తప్పనిసరవుతున్నాయి. నివేశనా స్థలాల లావాదేవీలను కూడా బిల్లులో చేరిస్తే మరింత బాగుండేది. మన దేశంలో ఏ నియంత్రణ అయినా ఆచరణలో పెను అవరోధంగా, అవినీతికి ఆస్కారమిచ్చేదిగా, ఖర్చును పెంచేదిగా ఉండటం రివాజైంది. ఇలాంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. వాటి నివారణకు కృషి చేయాలి. అప్పుడు మాత్రమే స్థిరాస్తి రంగం వెలుగులీనుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement