
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ విలీనం రాజ్యాంగ విరుద్ధమైతే, దాన్ని రద్దు చేస్తామని, ఆ అధికారం తమకుందని తేల్చి చెప్పింది. ఇలాంటి కేసులను అత్యవసరంగా విచారించనంత మాత్రాన మిన్ను విరిగి మీద పడదని పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్పీకర్‌కు ఆ అధికారం లేదు..
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే శాసనసభమండలిలో విలీనం పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు శానససభలో కూడా అలాగే విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. పార్టీలను విలీనం చేసే పరిధి ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని, 10 షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్‌కు ఎలాంటి అధికారం లేదని వాదించారు.
విలీనాన్ని తోసిపుచ్చని అదనపు ఏజీ..
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాలేమీ రద్దు కావట్లేదన్నారు. విలీనం చేయడం లేదని మాత్రం చెప్పలేదు. అంత అత్యవసరంగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అవసరమేమీ లేదన్నారు.
మేమేమీ రోబోలం కాదు..
ప్రతి కేసును అత్యవసరంగా విచారించడమంటే న్యాయమూర్తులకు సాధ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులేమీ రోబోలు కాదని, వారూ మనుషులేనని, వారికీ విశ్రాంతి అవసరమన్న సంగతి గుర్తించాలని పేర్కొంది. న్యాయపరమైన బాధ్యతలతో పాటు పాలనాపరమైన బాధ్యతలు కూడా న్యాయమూర్తులకు ఉంటాయంది. మరుసటి రోజు విచారణకు వచ్చే కేసులను రాత్రి పొద్దుపోయే వరకు చదువుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జూన్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉందని, కొత్త జడ్జీలు వచ్చేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. టీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న కారణంతో అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ మే 8కి వాయిదా పడింది.