సందర్భం
ఎయిడ్స్ రోగి అంటేనే భయంతో పారిపోయే పరిస్థితి నుంచి, సరైన అవగాహన ఉంటే రోజుకు కేవలం రూ. 30ల మందులతో ఎయిడ్స్ రోగులు 75 ఏళ్లు బతికే స్థితి వచ్చింది. కానీ అవగాహనా లోపమే అసలు సమస్యగా ఉంటోంది.
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశీలన జరుపుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో ఇంటర్వ్యూ...
ఎయిడ్స్ వస్తే ఇక చావే గతి అనే అపోహ ఉంది కదా?
ప్రజలలో అవగాహనా రాహిత్యం వల్లనే ఇలా జరుగుతోంది. అమెరికాలో మొట్టమొదటిసారిగా 35 ఏళ్ల క్రితం స్వలింగ సంపర్కం వల్ల ఈ వ్యాధి వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు రాక్ హడ్సన్ హెచ్‌ఐవీ బారిన పడ్డాక అమెరికన్ విమానంలో వెళుతుంటే చాలామంది విమానం దిగిపోయారు. అప్పట్లో ఈ వ్యాధి అంటే విపరీతంగా భయపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. హెచ్‌ఐవీ కూడా అన్ని వ్యాధుల లాంటిదేనని జనం నమ్మే పరిస్థితి వచ్చింది. సేఫ్ సెక్స్, సేఫ్ పేరెంట్, సేఫ్ నీడిల్, సేఫ్ బెడ్ లాంటి నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే నూటికి నూరుశాతం ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు.
1987లో మొదటి మందును కనుగొన్నారు. ఆ తరువాత 40 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. మందులొచ్చినా ఈ వ్యాధిపై అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో వ్యాధి ఉన్నవారు పెళ్లి చేసుకునే వారు కాదు, కానీ నేడు పాజి టివ్ పేరెంట్స్ కూడా సరైన మందులు వాడి, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే నూటికి నూరుశాతం ఇప్పుడు నెగెటివ్ బిడ్డను కనవచ్చు. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) వారి సర్వే ప్రకారం 49 శాతం మంది గర్భిణీలకు తాము హెచ్‌ఐవీ పాజిటివ్ అని కూడా తెలవదు.
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం ఏమిటి?
ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు సంబంధించి అవగాహన కలిగించడానికి.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా కొన్నికొన్ని దినాలను గుర్తించాయి. ప్రజల్లో ఆయా వ్యాధులకు సం బంధించిన అవగాహన బలపడాలన్నదే వీటి ముఖ్య ఉద్దేశం. 1988లో మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ‘జవాబుదారీతనాన్ని, భాగస్వామ్యాన్ని పెంచండి’ అనేది నినాదం. ముప్పైఏళ్లుగా ఎయిడ్స్‌పై పోరాటం జరుగుతున్నా దానిని మనం నివారించలేకపోయాం కాబట్టి ‘రెయిజ్ ఇంపాక్ట్’ అనే ఈ అవగాహనను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రకటించారు. దీనిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొనాల్సి ఉంది. హెచ్‌ఐవీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది కానీ అసలు హెచ్‌ఐవీ అనేదే లేకుండా పోవాలి. ఎయిడ్స్ వైరస్ ఒక్కటి మిగిలినా అది మళ్లీ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో హెచ్‌ఐవీ గత రెండు మూడేళ్లలో ఐదుశాతం నుంచి 1.5 శాతానికి పడి పోయింది. దీన్ని జీరో శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు ఎయిడ్స్‌పై అవగాహన చేపడుతున్నాయా?
గత మూడేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్‌ఐవీపై ప్రచారం విషయంలో మొద్దునిద్ర పోతున్నాయి. దీని ఫలితంగానే భారతదేశంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో ఏపీ ప్రథమ స్థానం సాధిం చింది. పైగా అంతర్జాతీయ ఎన్జీవోల నుంచి డబ్బులు రాకుండా పోవడంతో ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారం తగ్గిపోయింది. ఆరోగ్యంపై ఒక్కశాతం కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు. పేదరికమే అనా రోగ్యానికి మూలకారణం. పేదరికం పోవాలంటే, ఆరోగ్యంపట్ల జాగరూకత ఉండాలి. కానీ ఆరోగ్యంపై మన ప్రభుత్వాలు మారుతల్లి ప్రేమ చూపిస్తున్నాయి. మన దేశంలో వ్యాధులు రాకుండా నిరోధించకపోవడంతో ప్రజలు తమ డబ్బును పూర్తిగా ఆరోగ్యంకోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రజలు తమ సంపాదనలో 75 శాతం వెచ్చించి మందులు కొనాల్సిన పరిస్థితి ఉంటే ఎలా?
హెచ్‌ఐవీపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా?
గతంలో మశూచికం వస్తే అరటి ఆకుమీదపెట్టి అడవిలో పడేసేవారు. అలాంటిది వ్యాక్సిన్ వల్ల అంత పెద్దవ్యాధిని నామరూపాలు లేకుండాచేశారు. 1978 తరువాత మశూచికంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శాస్త్ర అద్భుతంగానే చెప్పాలి. ఎయిడ్స్ వ్యాధి వచ్చినవారు స్వయంనియంత్రణ పాటించాలి. కలుషిత సిరంజీల వాడకంపై జాగరూకతతో ఉండాలి. సమర్థవంతంగా వ్యాధి వ్యాపించకుండా చేసుకునే మార్గాలున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఎయిడ్స్ రాకుండా చూసుకోవచ్చు. సమర్థవంతమైన వ్యవస్థ, మందులు వచ్చాయి. చాలామంది సిగ్గుతో, భయంతో ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం లేదు.
భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వ్యాధి వస్తే భార్య సపోర్ట్ చేసే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఏపీలో ట్రాన్స్‌జెండర్లలో 7.5 శాతం మందికి పాజిటివ్ ఉండటం మంచిది కాదు. రోజుకు 30 రూపాయల మందులతో 75 ఏండ్లు బతకవచ్చు. 20 ఏళ్లక్రితమే మందులువచ్చినా కూడా ఇంకా అవగాహన రాలేదు. దీనిపై డిసెంబర్ ఒకటిన మాత్రమే కాదు నిరంతరం చర్చ జరగాలి. ఈ భూమిమీద ఎయిడ్స్ ఉన్నంత కాలం ఇది జరగాలి, అప్పుడే ఎయిడ్స్ దూరం అవుతుంది. రిపోర్ట్ వ చ్చిన తర్వాత కూడా మందులు వాడటానికి ఆలస్యం చేయడంవల్లే ఎక్కువమంది చనిపోతున్నారు.
(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా)
డాక్టర్ కూటికుప్పల సూర్యారావు
వ్యాసకర్త నేషనల్ ప్రొఫెసర్, ఐఎమ్‌ఐ కాలేజి
మొబైల్: 97031 00938
Comments
Please login to add a commentAdd a comment