గత యాభై సంవత్సరాలలో గిరిజనులు, అడవిపై ఆధారపడి బతికే ఇత రులు కూడా బ్రతుకుతెరువుకై పెద్ద ఎత్తున అడవులు నరికి వాటిని వ్యవసాయం కిందకు తీసుకువచ్చారు. దీనితో అటవీశాఖ, గిరిజనుల మధ్య ఉద్రిక్తతలు మొదలైనాయి. పరిస్థితులను గమనించి కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంగా 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. దీనితో చాలా వరకు పేదలకు లాభం కలిగినా, సమస్య ఇంకా తీరిపోలేదు. తరిగిపోతున్న అడవులను రక్షించడానికి, అలాగే క్షీణస్తున్న అడవులను అభివృద్ధి చేయడానికి 1980వ దశకంలో ప్రజల భాగస్వామ్యంతో అడవులు అభివృద్ధి చేయాలని ఉమ్మడి అటవీ యాజమాన్యం అనే పథకం అమలులోకి వచ్చింది. దీనిలో భాగంగా అడవుల అంచున ఉన్న గ్రామాలలో వన సంరక్షణ సమితుల ఏర్పాటు జరిగింది. ఈ సమితులు అడవులను కాపాడటమేకాక అడవులలో మొక్కల పెంపకం కూడా చేపట్టాయి. మొదట్లో ఈ కార్యక్రమం బాగానే ఉన్నా, రానురాను అటవీశాఖ సిబ్బంది సహకారం లోపించి వన సంరక్షణ సమితులు నామమాత్రంగానే మిగిలిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం అడవులను, అలాగే వన్యప్రాణులను రక్షించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కెమెరాలు పెట్టడం, అడవిలో విద్యుత్తు లైన్లపై ఆంక్షలు, కలపదొంగలపై కఠినచర్యలు, కలప కోత మిషన్లపై చర్యలు, వడ్రంగి వృత్తి పనివారిపై చర్యలు మొదలుపెట్టినారు. ఇదిగాక అటవీ చట్టాన్ని ఇంకా కఠినతరం చేస్తూ శిక్షను పెంచడం కూడా∙తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
అటవీ ఉత్పత్తులను రిజర్వు అడవుల నుండి కాక ఇతరత్రా అందుబాటులోనికి తీసుకురావాలి. అటవీ సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ఏ గ్రామ శివారులో ఉన్న అడవులను ఆ గ్రామస్తులు కాపాడాలని ప్రణాళిక చేయవలసిన అవసరముంది. గ్రామంలో ప్రజల పౌరసేవలకై గ్రామ పంచాయతీ ఉన్నట్లుగా, అడవుల రక్షణకు, అడవి అభివృద్ధి కోసం వనపంచాయతీ అవసరం ఎంతైనా ఉంది. వన పంచాయతీల వల్ల ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ సహకారంతో అడవులను కాపాడటమే కాక తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం కూడా అమలు చేయించవచ్చు. ఆ గ్రామంలో కానీ, సమీప అడవిలో కానీ నాటవలసిన మొక్కల అవసరాలను నిర్ధారించి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వనపంచాయతీలు చేపడతాయి. ఇందుకు పొదుపు సంఘాలు, ఇతర మహిళా గ్రూపులు తమ ఇళ్ల వద్ద స్థల లభ్యత అనుసరించి రెండు నుంచి ఐదు వేల మొక్కలు పాలిథీన్ సంచులలో పెంచుతారు. ఇలా పెంచిన మొక్క ఒక్కంటికి ఐదు నుంచి ఆరు రూపాయిలు ఇస్తారు. అదీకాక రైతులు తమ భూములలో, గట్ల వెంబడి తొందరగా పెరిగి ఆదాయాన్ని ఇచ్చే సుబాబుల్, వెదురు, సీతాఫలం వంటి మొక్కలు వాణిజ్యపరంగా పెంచుకోవడానికి ఈ గ్రామవారీ నర్సరీలు సహాయపడతాయి. ప్రస్తుతం అరకొరగా నడుస్తున్న వన సంరక్షణ సమితులను అటవీశాఖ అధీనం నుంచి తప్పించి వనపంచాయితీలకు అప్పగిస్తే∙బాగుంటుంది.
అడవుల పెంపకానికి ఇక భూమి లభ్యత లేదు. కాకపోతే మొక్కలు పెంచడానికి అడవి బయట భూమి దొరకవచ్చు. ప్రజలు మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలంటే మొక్కల పెంపకం ఒక వ్యవసాయ అనుబంధవృత్తిగా అభివృద్ధి చెందాలి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సుబాబుల్, వెదురు వంటి మొక్కలను వాణిజ్యపరంగా పెంచి కాగితం, ఇతర కలప ఆధారిత పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని ముందుగా వారికి నాణ్యమైన నర్సరీ మొక్కలు, ఎరువులు సరఫరా చేస్తున్నాయి. అటవీ చట్టానికి సవరణలు చేసి టేకు వంటి వృక్షజాతులు తప్ప ఇతర జాతుల కలప, బొగ్గు, పొయిలకర్ర, తునికి ఆకు వంటి వాటిని అటవీ ఉత్పత్తుల జాబితాలో నుంచి తొలగించిన రైతులు వీటి రవాణా కొరకు అటవీశాఖ కార్యాలయాలS చుట్టూ రహదారి పర్మిట్ల కోసం తిరగవలసిన అవసరం ఉండదు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఒక మొక్క అడవి బయట నాటితే, అడవిలోని ఒక మొక్కను కాపాడినట్లే. అడవులను కాపాడాలంటే అటవీ చట్టం సులభతరం కావాలి. రైతులు పెంచిన వృక్షజాతులపై రవాణా పర్మిట్ వంటి నిబంధనలు సడలించాలి. అప్పుడే ప్రజలు చెట్ల పెంపకాన్ని ఒక వాణజ్యపరమైన వృత్తిగా తీసుకొని లాభపడతారు. అలాగే వృక్ష సంవద పెరిగి పర్యావరణ సమతుల్యానికి దోహదపడుతుంది.
యం. పద్మనాభరెడ్డి
కార్యదర్శి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Please login to add a commentAdd a comment