
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేసిన పలు పార్కులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హరితహారం ఫలాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి 22 కి.మీ. దూరంలో నాగార్జున సాగర్ రోడ్డులో సంజీవని వనం 60 హెక్టార్లలో అభివృద్ధి చేసిందని చెప్పారు.
500 రకాల మొక్కలతో మంచిర్యాల జిల్లాలో 345 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గాంధారి వనం పార్కు తెలంగాణతోపాటు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. నగరం శివారులోని ఆరోగ్య సంజీవని పార్క్ గుర్రంగూడ, కండ్లకోయలోని పార్క్, దూలపల్లిలో 25 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రశాంతివనంలలో నగరవాసులకు ఆటవిడుపు కలిగించేలా పలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శంషాబాద్ సమీపంలోని పంచవటి పార్క్ అరుదైన పక్షులకు నిలయంగా ఉందన్నారు. వీటి ఫొటోలను కూడా కేటీఆర్ షేర్ చేశారు.