అంతరిక్ష చట్టం అత్యవసరం | Balakrishna Reddy Article On International Space act In India | Sakshi
Sakshi News home page

అంతరిక్ష చట్టం అత్యవసరం

Published Thu, Jul 25 2019 1:07 AM | Last Updated on Thu, Jul 25 2019 1:08 AM

Balakrishna Reddy Article On International Space act In India - Sakshi

మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిధులు తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న అనేక దేశాలు ఇతర అంతరిక్ష కార్యకలాపాలపై దృష్టిసారించాయి. దీంతో ప్రభుత్వాలు, ప్రైవేట్‌ పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా ఉపగ్రహ సమాచారం, చోదన, భౌగోళిక పరిస్థితి, సుదూర గ్రాహకత, సమాచార విశ్లేషణ, మౌలికవసతులు, సంబంధిత సేవలు సుగమం అయ్యాయి. ఇటువంటి కార్యకలాపాలకు నిధుల సమకూర్చడం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తలకుమించిన భారం. దాంతో అంతరిక్ష కార్యకలాపాలను ప్రైవేటీకరించడంపై దృష్టి సారించారు. దేశాభివృద్ధిలో అంతరిక్ష పరిశోధనలు కీలకపాత్ర పోషిస్తున్నందున రెండు దశాబ్దాలుగా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో భారత అంతరిక్ష కార్యక్రమం, పరిశ్రమ నిర్మాణం సాగింది. దీనికి ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి తగిన మద్దతు కూడా లభించింది.  

ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అంతరిక్ష ప్రయోగ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేబుల్, శాటిలైట్‌ టెలివిజన్‌ రంగాల్లో భారత్‌లో విస్తృతమైన మార్కెట్‌ ఉంది. దూరదర్శన్‌ తన డీటీహెచ్‌ ప్రసారాలను ప్రారంభించింది. డీటీహెచ్, డీటీటీ, బ్రాడ్‌బాండ్‌ వంటి సాంకేతికతలు దేశాన్ని ముంచెత్తాయి. అంతరిక్ష కార్యకలాపాలు ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ పొందిన నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ జాతీయ అంతరిక్ష చట్టాలను రూపొందించాయి. ప్రైవేట్‌ అంతరిక్ష కార్యకలాపాలకు లైసెన్స్‌ లు ఇవ్వడం, క్లిష్టమైన అంతరిక్ష కార్యకలాపాలపై ఈ చట్టాలు రూపొందాయి. అయితే, సరైన చట్టాలు లేని కారణంగా అంతరిక్ష సాంకేతికతకు పెట్టుబడులను రాబట్టే అనేక అవకాశాలను భారత్‌ కోల్పోవడం విచారకరం. 

చంద్రయాన్‌–2తోపాటు గతంలో విజయవంతమైన అనేక అంతరిక్ష కార్యకలాపాలతో భారత సాంకేతిక సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. ఉపగ్రహాలను ప్రయోగించడం, వాటిని స్వతంత్రంగా నిర్వహించగల దేశాల బృందంలో భారత్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం భారత్‌ అంతరిక్ష సాంకేతికతలో స్వావలంబనను సాధించడమే కాదు, వ్యాపారాత్మకత వినియోగికతను కూడా పెంచుకుంది. సంవత్సరాల తరబడి సాధించిన నైపుణ్యంతో అంతరిక్ష పరిశ్రమలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఎదగనుంది. ఒప్పందాలను పూర్తిచేయడం, వివాదాల పరిష్కారం వంటి చట్టపరమైన అంశాలను భారత్‌ అత్యవసరంగా అధిగమించాల్సి ఉంది.  

ఒకవైపు అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్‌ సెక్టార్‌కు విస్తృతంగా అవకాశాలు కల్పిస్తున్న దేశాలన్నీ, మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష చట్టం పరిధుల్లో దేశంలోని ప్రైవేట్‌ సంస్థల అతరిక్ష కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాయి. భారత్‌ కూడా ప్రైవేట్‌ సెక్టార్‌ భాగస్వామ్యంతోనే అంతరిక్ష కార్యకలాపాల్లో దూసుకెళ్తోంది. చంద్రయాన్‌–1, 2 ప్రయోగాల్లో సుమారు 500మంది పారిశ్రామిక ప్రతినిధులు భాగస్వామ్యం వహించారు. వారి భాగస్వామ్యం లేనట్లయితే మానవ వనరులను సమకూర్చుకోవడం ఇస్రోకు సాధ్యమయ్యేది కాదు.

అంతరిక్ష కార్యకలాపాలపై సరైన చట్టం లేనట్లయితే ప్రైవేట్‌ పెట్టుబడిదారులెవరూ ముందుకు రారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తున్నఅనేక దేశాలు ప్రైవేట్‌ సెక్టార్‌ చేపట్టే క్లిష్టమైన అంతరిక్ష కార్యకలాపాలపై వివరణాత్మకమైన, ప్రత్యేకమైన జాతీయ అంతరిక్ష చట్టాలను రూపొందించుకున్నాయి. వీటిల్లో అమెరికా, ఇంగ్లండ్, రష్యా, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి. అన్ని అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భారత్‌కు భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష చట్టం రూపకల్పనలో భారత్‌ పాత్ర కీలకమైనది. అయితే, భారత దేశంలో మాత్రం ఎటువంటి స్పష్టమైన, సమగ్రమైన అంతరిక్ష చట్టం లేదు.  

అంతరిక్ష చట్టం రూపకల్పనలో అంతరిక్ష విభాగపు పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. అలాగే, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పాత్ర, అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టడం, అమలు చేసే విధానం, అంతరిక్ష పరిశ్రమలో మానవ వనరుల వినియోగం, వారి ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, ప్రయోగ దశలో రక్షణ కల్పించడం, అంతరిక్ష వివాదాలు, వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడం, దేశీయ గగనతలంలో విదేశీ అంతరిక్ష వాహకాలు ప్రయాణించడం, జవాబుదారీతనం, బీమా, మేధోపరమైన హక్కుల రక్షణ వీటన్నిటితోపాటు వివిధ ఒప్పందాల కింద అంతర్జాతీయ బాధ్యతలను అమలుచేయడం వంటి అంశాలను చేర్చాల్సి ఉంది.


డా. వి. బాలకిష్టారెడ్డి
వ్యాసకర్త రిజిస్ట్రార్, నల్సార్‌ యూనివర్సిటీ 
ఈ–మెయిల్‌ : balakista@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement