రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తున్న సమయంలో నవ్వుతున్న రేణుకా చౌదరి
సందర్భం
ఆడపిల్ల గట్టిగా నవ్వితే ఆక్షేపించే పితృస్వామ్య సమాజం మనది. ఈ వివక్ష పుట్టక ముందే భ్రూణహత్యల రూపంలో మొదలవుతుంది. అప్పటినుంచీ ప్రతిచోటా లక్ష్మణరేఖలు గీస్తారు.
‘నేను శూర్పణఖను’.. అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సామాజిక మాధ్య మాల్లో ప్రతిధ్వని స్తోంది. ప్రధాని మోది పార్లమెంట్లో ఒక మహిళా ఎంపీ నవ్వును రామాయణం సీరియల్లోని శూర్పణఖ వికటాట్టహాసంతో పోల్చడంతో ఈ అంశం పెద్ద చర్చకు తెరలేపింది. ఆడపిల్ల గట్టిగా నవ్వితే ఆక్షేపించే పితృస్వామ్య సమాజం మనది. ఈ వివక్ష పుట్టకముందే భ్రూణహత్యల రూపంలో మొదలవుతుంది. పుట్టాక–చదువు, ఆరోగ్యం, ఆహారం, ఉద్యోగం, పదోన్నతి, నైతికత వంటి విషయాల్లో అడుగడుగునా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రతిచోటా లక్ష్మణరేఖలు గీస్తారు. ఆంక్షలు విధిస్తారు. వాటిని ధిక్కరిస్తే ప్రతీకార అత్యాచారాలు, పరువు పేరిట హత్యల వంటివి జరుగుతాయి.
దక్షిణాసియాలో వందలాది రామాయణాలున్నప్పటికీ శూర్పణఖను దుష్టురాలిగా చిత్రించే కావ్యగాథ మాత్రమే దూరదర్శన్లో ప్రసారమైంది. రోమిలా థాపర్ వంటి ప్రముఖ చరిత్రకారులు దీనిపై అభ్యంతరపెట్టారు. భిన్న ప్రాంతాలు, సమాజాలు, భాషలు, సంస్కృతులకు దర్పణం పట్టేలా మనకు బౌద్ధ, జైన, వాల్మీక, కంబ, తులసీ రామాయణాలున్నాయి. ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోనూ వైవిధ్య గాథలున్నాయి. ఈ భిన్నత్వాన్ని చిదిమి, ఏకరూప ఆధిపత్య సంస్కృతిని దూరదర్శన్ ద్వారా ప్రజలపై రుద్దడం సరికాదని రోమిలా థాపర్ విమర్శించారు. అనేక రామాయణగాథల అద్భుత వైవిధ్యాన్ని ఈ చర్య దెబ్బ తీసిందని తప్పుపట్టారు.
వాలివధ, సీత అగ్నిపరీక్ష, శంభూకుని హత్య, శూర్పణఖ పరాభవం వంటి అనేక అంశాలు ప్రస్తావిస్తూ రాముడు మర్యాదా పురుషోత్తముడెలా అవుతాడని రామాయణంపై విస్తృత పరిశోధనలు జరిపిన అంబేడ్కర్, పెరియార్ రామస్వామి ప్రశ్నించారు. ద్రవిడులకు రావణుడు నాయకుడు. రాముడు ప్రతినాయకుడు. బౌద్ధ రామాయణం ప్రకా రం రాముడికి సీత సోదరి. అలాగే శూర్పణఖపై కూడా అనేక గాథలున్నాయి.
తన భర్తను చంపిన సోదరుడిపై ప్రతీకారంతోనే శూర్పణఖ ఒక వ్యూహం ప్రకారం రాముణ్ణి రావణుడిపై గురిపెట్టిందని భారతీయ దేవతలపై పరిశోధనలు జరిపిన ప్రొఫెసర్ కేథలీన్ ‘మెనీ రామాయణాస్’ గ్రంథంలో వివరిస్తారు. ఇలా పురాణగాథలకు సంబంధించి భిన్న కథనాలు మన చరిత్రలో అంతర్భాగమయ్యాయి. మహిషాసురుణ్ణి కొలిచే సముదాయాలు నేటికీ ఉత్తర భారతదేశంలో ఉండటం ఇందుకొక ఉదాహరణ.
మొత్తం మీద, ఆధిపత్య గాథల్ని మాత్రమే ప్రచారంలో పెట్టడం, వాటిలోని పాత్రల్ని నమూనాలుగా చూపడం, ధిక్కరించిన వారిపై రకరకాలుగా విరుచుకుపడటం వంటి ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని అత్యధిక పార్టీలు చెబుతాయి. అయినా ఇప్పటికీ ఇది చట్టరూపం తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయావతిపై ప్రతిపక్ష మహిళా నాయకురాలే స్వయంగా ‘రేప్’ పదం ప్రయోగించారు. ద్రౌపది నవ్వే మహాభారత యుద్ధానికి కారణమని నిందిస్తారు. సానియా మీర్జా వస్త్రధారణను మత పెద్దలు ప్రశ్నిస్తారు.
ప్రధాని పక్కన కాలు మీద కాలేసుకుని పొట్టి దుస్తులు ధరించి అలా కూర్చోవడమేమిటని ప్రియాంకా చోప్రాను మందలిస్తారు. ఆధిపత్య సంస్కృతిని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను నానా విధాలుగా నిందిస్తారు. నేలపై కూర్చొని ఆవకాయ పెట్టిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శ గృహిణీత్వాన్ని ప్రశంసిస్తారు. అన్ని రంగాల్లో దూసుకెళుతూ, అవకాశాల కోసం పోరుతూ ఉన్న మహిళలకు పగ్గాలేసేందుకు ఆధునిక మనువులు చేస్తున్న నిరంతర యత్నాలకు ఇవి కొన్ని ఉదాహరణలు. నేటి మహిళలు ఇలాంటి ధోరణులపై తిరుగుబాటు చేస్తున్నారు.
అమెరికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లైంగిక వేధింపుల వ్యతిరేక ఉద్యమం (మీటూ) దగ్గర నుంచీ ‘ఐ యామ్ శూర్పణఖ’ ప్రచారం వరకూ ఇందులో భాగాలే. ఇది ఇంతటితో ఆగకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పితృస్వామ్య వివక్షా రూపాలన్నింటినీ మూలం నుంచి ప్రశ్నించాలి. సమానత్వ సాధన దిశగా ఒక నిరంతర యుద్ధం కొనసాగించాలి.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
బి. భాస్కర్
మొబైల్ : 99896 92001
Comments
Please login to add a commentAdd a comment