ప్రధాని నరేంద్ర మోదీ
బీజేపీ చేస్తున్న ఆరోపణ–రాజకీయ ప్రత్యర్థులను కాంగ్రెస్ తుదముట్టించాలని చూస్తోం దనే. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే–బాధితులంతా హిందువులేనని చెప్పడం. అలాంటి ఆరోపణతో కాంగ్రెస్ పరివారాన్ని ముస్లిం శిబిరం నెట్టివేయడం కూడా. ఇక్కడ కూడా మరుగున పడిన విషయం ఒకటి ఉంది. కర్ణాటక తీర ప్రాంతం వరకు చూసుకున్నా నైతిక పోలీసు బాధ్యతను నిర్వర్తిస్తున్న ఘనత పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), బజ్రంగ్‌దళ్, శ్రీరామసేన రెండింటికీ సమంగానే దక్కుతుంది.
కేరళను కమలం పరిధిలోకి తీసుకోవాలని గడచిన సంవత్సరమే బీజేపీ నిర్ణయించుకుంది. అందుకు నాందిగా అక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాజకీయ హింసను అరికట్టడం లేదంటూ తన దాడికి లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ సొంత జిల్లా కన్నూర్‌లో అలాంటి హంసను నివారించడానికి ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని బీజేపీ ఆరోపిస్తున్నది. ఒక పద్ధతి ప్రకారం సీపీఎం కార్యకర్తలు బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలను లక్ష్యం చేసుకుంటున్నందుకే బీజేపీ ఇంత ఆగ్రహం ప్రకటిస్తున్నది. కానీ ఈ క్రమంలో బీజేపీ చాలా సౌకర్యంగా మరచిపోతున్న ఒక వాస్తవం మాత్రం ఉంది. స్కోర్ బోర్డు తరహాలో ఒక హత్య తరువాత మరొక హత్య జరుగుతున్న తీరులో గడచిన ఐదు దశాబ్దాల మరణాలు కనిపిస్తున్నాయి. సీపీఎం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడంలో ఆరెస్సెస్ కూడా, వామపక్షంతో సమానమైన దోషిగానే ఉంది.
దీనితో ఏమైనా సాధించారా? అలాంటిదేమీ లేదు. ‘కేరళ మరుభూములు’ చూపించడానికి ఎంతో ఔదార్యంతో ఢిల్లీ నుంచి కన్నూర్, అక్కడ నుంచి తిరువనంతపురం వరకు వెళ్లిన పత్రికా రచయితల వల్ల కూడా ఏమీ కాలేదు. కానీ ఇందుకు విరుద్ధంగా యోగి ఆదిత్యనాథ్ వంటి ‘బయటి వ్యక్తులు’ మాత్రం కేరళ శాంతిభద్రతల గురించి, ఆరోగ్య రక్షణలో ఆ రాష్ట్ర స్థానం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈ ధోరణి మలయాళీలను, నిజానికి వారు సీపీఎం కార్యకర్తలు కాకపోయినప్పటికీ కూడా– చిరాకు పరుస్తున్నది.
కన్నడ నేలమీద కేరళ ప్రయోగం
జిహాద్–ఎరుపు (వామపక్ష) భీతావహం గురించి ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ‘జన రక్షాయాత్ర’ కేరళలో ఎలాంటి విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆ కేరళ మూసనే తీసుకువెళ్లి కర్ణాటకలో ప్రయోగించాలని అనుకోవడం విచిత్రం. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల హత్యల సూచీలో ఉన్నత స్థానం సాధించిందని గడచిన ఆదివారం బెంగళూరులో ఒక సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2013లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన 23 హత్యల గురించి గట్టిగా చెప్పడమే మోదీ ఉద్దేశం. వారంతా సంఘ్ పరివార్, అనుబంధ సంస్థల సభ్యులేననీ, అధికారంలో ఉన్నవారి కనుసన్నలలోనే ఆ హత్యలు జరిగాయనీ బీజేపీ ఆరోపణ. ‘ఇది కేవలం రాజకీయ హింస కాదు. రాజకీయ ఉగ్రవాదం. ఇలాంటి ఉగ్రవాదాన్ని మనం పాకిస్తాన్‌లో చూస్తున్నాం’ అంటూ బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ ట్వీట్ చేసింది.
కేవలం గొంతు నిండా ఉద్వేగాన్ని నింపుకోవడం ద్వారా, నిందారోపణ తీరును ధ్వనింప చేస్తూ గణాంకాలను ఏకరువు పెడుతూ ఒక అంశాన్ని ఖండించాలని అనుకుంటే అది పెద్దగా ప్రభావం చూపదు. బీజేపీ చెబుతున్న 23 మరణాలలో తొమ్మిది మాత్రమే మత ఘర్షణలకు సంబంధించినవని కాంగ్రెస్ చెబుతోంది. ఈ హత్యలతో సంబంధం ఉన్నవారిని ఇప్పటికే అరెస్టు చేయడం కూడా జరిగిందని వెల్లడించింది. మిగిలిన మృతులంతా ఆత్మహత్యలు చేసుకున్నవారు, వ్యక్తిగత కక్షలకు బలైనవారు, రోడ్డు ప్రమాదాలలో మరణించినవారేనని కూడా కాంగ్రెస్ వివరిస్తున్నది. కర్ణాటక కాంగ్రెస్ చేతికి నెత్తురు ఉందంటూ మోదీ గుప్పిస్తున్న ఆరోపణలను ఇలాంటి వివరణ మాత్రమే నివారించడం సాధ్యం కాదు.
అసలు కర్ణాటకలో బీజేపీ వ్యూహం ఏమిటి? కేరళలో మాదిరిగానే తమను బాధిత వర్గంగా చూపడమే. బీజేపీ చేస్తున్న ఆరోపణ– రాజకీయ ప్రత్యర్థులను కాంగ్రెస్ తుదముట్టించాలని చూస్తోందనే. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే– బాధితులంతా హిందువులేనని చెప్పడం. అలాంటి ఆరోపణతో కాంగ్రెస్ పరివారాన్ని ముస్లిం శిబిరం ౖÐð పు నెట్టివేయడం కూడా. ఇక్కడ కూడా మరుగున పడిన విషయం ఒకటి ఉంది. కర్ణాటక తీర ప్రాంతం వరకు చూసుకున్నా నైతిక పోలీసు బాధ్యతను నిర్వర్తిస్తున్న ఘనత పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), మితవాద వర్గ సంస్థలు బజ్రంగ్‌దళ్, శ్రీరామసేన రెండింటికీ సమంగానే దక్కుతుంది. మత విద్వేషాల ద్వారా దూరాన్ని పెంచడంలో ఇద్దరి పాత్ర సమానమే. నిజం చెప్పాలంటే శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని అణచివేయడం కూడా. కానీ ముల్లుకు ముల్లు అన్న తీరులో కర్ణాటక తీర ప్రాంతం కన్నూరు బాటనే అనుసరిస్తున్నది.
ప్రధాని మౌనం గురించి ప్రశ్న తప్పదు!
ఉగ్రవాద సంస్థలతో చెట్టపట్టాలేసుకు తిరిగే పీఎఫ్‌ఐని నిషేధించాలని కేరళలో మాదిరిగానే కర్ణాటకలో కూడా బీజేపీ కోరుతున్నది. పీఎఫ్‌ఐ రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)తో కలసి ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నదని బీజేపీ ఆరోపిస్తున్నది. కీలక నియోజకవర్గాలలో ముస్లిం ఓట్లు చీలిపోకుండా ఉండేం దుకు ఎస్‌డీపీఐతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా చెబుతున్నారు. దీని ఫలితం ఏమిటంటే, అసలే మత ఉద్రిక్తతలతో ఉండే కర్ణాటక తీర ప్రాంతం మందుపాతరలా తయారయింది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. మోదీ వ్యవహార సరళికి రెండువైపులా పదును ఉంటుంది.
ఒకటి బెంగళూరు వాణిజ్యవేత్తలను ద్రి మకు గురి చేయడం, నగరంలోని మేధావులకు సందేశం పంపడం. రెండు– కాంగ్రెస్ శిబిరంలోని వారు నేరగాళ్లని ముందుగానే ముద్ర వేయడం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాలన హత్యా రాజకీయాల సూచీలో ఎంతో సాధించిందని చెప్పడం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అంటూ జీఎస్‌టీపై రాహుల్ గాంధీ చేసిన విమర్శకు ప్రతి విమర్శలాంటిదే. మోదీ తన ఎన్నికల ప్రచార శైలిలో రాజకీయ హత్యల గురించి చెప్పే హక్కును వినియోగించుకుంటే, గడచిన సెప్టెంబర్‌లో జరిగిన గౌరీ లంకేశ్ హత్యపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాత్రం ఆయనను ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రధాని ట్వీటర్‌ను అనుసరించే మితవాద వర్గీయులు జర్నలిస్ట్ గౌరి హత్యకు హర్షామోదాలు వ్యక్తం చేస్తుంటే, ఒక రాజకీయ అభిప్రాయం కలిగినవారే హంతకులన్న అనుమానం కలగక మానదు. 2015లో జరిగిన హేతువాద ఉద్యమకారుడు ఎం ఎం కలుబుర్గి హత్య ఉదంతంలో, గౌరీ లంకేశ్ హత్య కేసులోను ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించకుండా రాష్ట్ర పోలీ సులు తమ ఘనతను చాటుకున్నారు. కానీ ప్రతి నేరపూరిత చర్యకు తాను బాధపడుతున్నానని చెప్పడానికి మోదీ ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవలసి ఉంటుంది. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ సరిగ్గా ఈ విషయం గురించే ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘గౌరీ లంకేశ్ హత్య మీద నా ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అనే ఆయన అడుగుతున్నారు. గౌరీ లంకేశ్ హత్య జరిగి ఐదు మాసాలు గడిచినప్పటికీ కర్ణాటక పోలీసు యంత్రాంగం ఒక ఆధారం కూడా ఎందుకు సంపాదించలేకపోయిందని సిద్ధరామయ్యను ప్రశ్నించే అవకాశం బెంగళూరు మోదీకి అవకాశం ఇచ్చింది. కానీ ఆయన మాత్రం మితవాద వర్గ శిబిరంలోని కార్యకర్తల హత్యల గురించి మాట్లాడడానికి పరిమితమయ్యారు.
ఆదివారం జరిగిన సభలోనే మోదీ సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతి గురించి చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ఇంకో అడుగు ముందుకు వేసి, కర్ణాటక దేశంలోనే ‘అవినీతిలో తొలిస్థానం సాధిం చిన రాష్ట్రం’ అన్నారు. యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడమేకాదు, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. యడ్యూరప్పది కేవలం కస్టడీ అని, శిక్ష ఖరారు కాలేదని బీజేపీ వాదిస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టగల సామర్థ్యం ఉన్నప్పటికీ బీజేపీ అవినీతి అంశం మీద, మత వైషమ్యాల మీద ఎందుకు దృష్టి కేంద్రీకరించింది? రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఉంది. అలాగే పట్టణ ప్రాంత సమస్యలు అనేకం ఉన్నాయి. నిజానికి అవినీతి వ్యవహారాలకు సంబంధించి బీజేపీ చరిత్ర కూడా రాష్ట్రంలో అంత గొప్పగా ఏమీ లేదు.
కేంద్రం రైతు పక్షమేనా?
కర్ణాటక వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో గోమాంసం, గో రక్షణలను కౌబెల్ట్ (హరియాణా, యూపీ, ఎంపీ, బిహార్) పట్టకం నుంచి చూడడం సాధ్యం కాదు. అవే హిందువును నిర్వచించడానికి కొలబద్దలంటే సాధ్యం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో సామాన్యుడు మరింత నాణ్యమైన జీవితం కోసం చూస్తున్నాడు. గోతులతో నిండిన రోడ్లు లేని, రసాయనాలతో మండే జలాశయాలు లేని, రాకపోకలకు ప్రతికూల పరిస్థితులు లేని బెంగళూరును ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కర్ణాటక, గోవాల మధ్య ఉన్న మహాదాయి నదీజలాల వివాదం గురించి ప్రస్తావించరాదన్న మోదీ నిర్ణయం రాష్ట్ర ప్రజలను నిరాశకు గురి చేసినప్పటికీ, రాష్ట్ర రైతాంగం దుస్థితి పట్ల తన స్పందనను వెల్లడించాలని మాత్రం ఆయన నిశ్చయించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో చెబుతున్న లెక్కలు నమ్మదగినవిగా లేవు. ఎందుకంటే 2015 సంవత్సరంలో మొత్తం 1569 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2014లో 768 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది కర్ణాటక రైతాంగంలో ఉన్న తీవ్ర అసంతృప్తికి ప్రబల నిదర్శనం. వరస కరువు కాటకాలు, కావేరిలో తగినంత నీరు లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు సంభవించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి చేసిన దాని వల్ల గ్రామీణ ప్రాంతంలో కొంత మేలు జరగవచ్చు. అలాగే సేద్యపు ఖర్చులకు 1,5 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయిస్తామంటూ ఇచ్చిన హామీ క్షేత్రస్థాయిలో అమలు కాదన్న సంగతి మోదీకి కూడా తెలుసు. ఇంకొక విషయం ఏమిటంటే రైతుల బలవన్మరణాలలో బీజేపీ పాలిత మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అందుకే తమది కర్షక పక్షపాత ప్రభుత్వమన్న మోదీ మాట మీద అనుమానం కలుగుతుంది. ఒక కర్షకుడు అర్థంతరంగా తనువు చాలించుకోవాలన్న తీవ్ర నిర్ణయానికి వచ్చాడంటే అర్థం ఏమిటి? జీవితం పట్ల ఏర్పడిన దారుణమైన నిరాశకు నిదర్శనం. తన చుట్టూ ఉన్న సమాజం పట్ల అతడికి కలిగిన నిరాశ కూడా. కష్టకాలంలో నేను మీ వెంట ఉంటాను అంటూ మోదీ ఇచ్చే మాట కోసం కర్ణాటక రైతాంగం ఎదురుచూస్తోంది. మొత్తంగా చూస్తే కర్ణాటకలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో కొన్ని సర్దుబాట్లు తప్పదని అనిపిస్తుంది.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
టీఎస్ సుధీర్
Comments
Please login to add a commentAdd a comment