ఉన్నత విద్యలో సమూల మార్పులు | BJP MLC N Ramachandra Rao Article On Changes In Higher Education | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 13 2018 1:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

BJP MLC N Ramachandra Rao Article On Changes In Higher Education - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

స్వాతంత్య్రానంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధ్య క్షతన ఏర్పడిన తొలి విద్యా కమిషన్, విద్య లక్ష్యం నూతన ఆవిష్కరణలకు, నవకల్పనలకు, నవభారత దేశ స్వావలంబనకు దోహ దపడే విజ్ఞాన సముపార్జ నగా ఉండాలని అభిప్రాయ పడింది.విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా, ఉన్నత విద్య నిరంతర పరిశోధనా స్థానంగా, నవ కల్పనలకు నిలయంగా ఉండాలని ఈ కమిషన్‌ భావించింది. బాధాకరమైన విషయ మేమంటే, 2009లో వచ్చిన నాలెడ్జ్‌ కమిషన్‌ నివేదిక కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాల్సి వచ్చింది. 

ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాల నిర్ధారణ, సమన్వయానికి 1956లో విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యూజీసీ) ఏర్పడింది. ఆనాటికి దేశంలో 20 విశ్వవిద్యాలయాలు, 500 కళాశాలలు ఉన్నాయి. సుమారు 2.10 లక్షలమంది విద్యార్థులు అప్పట్లో ఉన్నత విద్యారంగంలో చదువుతున్నారు. యూజీసీ ఏర్పడిన 62 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యా రంగంలో విద్యార్థుల స్థూల నమోదు 25.5 శాతానికి, విద్యార్థుల నమోదు 3 కోట్ల 66 లక్షలకు చేరింది. కానీ ఉన్నత విద్యారంగంలో మారుతూ వచ్చిన పరి ణామాలకు అనుగుణంగా లేదా ప్రపంచ మార్పు లకు అనుగుణంగా యూజీసీని సంస్కరించాలని గత ప్రభుత్వాలు భావించలేదు.

ప్రపంచీకరణ అనం తరం దేశంలో పెద్ద ఎత్తున అన్ని రకాల విద్యా సంస్థలు వెలిశాయి. కానీ ప్రమాణాల విషయంలో చెప్పుకోదగిన సంస్థ ఒక్కటీ లేదు. రాన్రానూ పని భారంతో యూజీసీ పాలనాపరమైన వ్యవహారాలకే పరిమితమవుతూ వచ్చింది. యూజీసీ తన 62 ఏళ్ల చరిత్రలో అంతర్జాతీయంగా ప్రభావంగల కనీసం ఒక్క ఆవిష్కరణకైనా దోహదపడినట్టు ప్రకటించు కోలేకపోయింది. గతంలో ఎన్నో కమిషన్లు యూజీ సీని పునర్‌ వ్యవస్థీకరించాలని సూచించాయి. ఇతర కమిటీలు కూడా మార్పు ప్రాధాన్యతను తెలియజే యడంతో యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో భారత ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతిపాదిత హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ), నీతి ఆయోగ్, జీఎస్టీ కౌన్సిల్‌ తర హాలో జాతీయ సంస్థగా ఏర్పడుతుంది. ఇందులో రాష్ట్రాల విద్యామంత్రులు, రాష్ట్రాల హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌లు సభ్యు లుగా ఉంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. ఉన్నత విద్యా రంగానికి చెందిన అన్ని అంశాలపై తగిన చర్చ అనంతరం ఈ మండలి నిర్ణ యాలు తీసుకుంటుంది. ఈ బిల్లు మరింత సమర ్థవంతమైన క్రెడిట్‌ల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. విద్యార్థి ఫెయిల్‌ అయితే ఒక ఏడాది కోల్పోయేలా కాకుండా డిగ్రీ పట్టాకు అర్హత సాధించడానికి నిర్ణీత క్రెడిట్‌లు పొందే వీలు కల్పిస్తుంది.

అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే స్థానిక అవసరాలకు అనుగుణంగా తమ పాఠ్య ప్రణాళికను రూపొందించుకునేందుకు ఈ బిల్లు మరింత స్వేచ్ఛ కల్పిస్తుంది. ఉదాహరణకు ఆదిలాబాద్‌లో ఏర్పడబోయే గిరిజన విశ్వవిద్యాల యానికి యూజీసీ, పాఠ్య ప్రణాళిక రూపొందించ డంలో అర్థం ఉండదు. ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన ప్రతి సంస్థా తు.చ. తప్పకుండా పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించడం జరుగుతోంది. అలా పాటించని, తగిన పనితీరు కనబరచని సంస్థలను చట్టప్రకారం మూసి వేయడం జరుగుతుంది. అయితే, గ్రాంట్లు కేటాయించే అధి కారాన్ని ఈ బిల్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు కూడా కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి అవకాశం ఇస్తుం దన్న అంశాలపై ఈ బిల్లు విమర్శలకు గురౌతోంది. నిధుల కేటాయింపు అధికారాన్ని నేరుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తనకు తానుగా తీసుకోవడం కాకుండా ఆ మంత్రిత్వ శాఖ కింద విద్యారంగ నిపుణులు, అడ్మినిస్ట్రేటర్లతో కూడిన స్వతంత్ర ఏజెన్సీకి అప్పగించాలని పలువురు అభి ప్రాయపడుతున్నారు.

ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణల విషయంలో చొరవ తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌లు అభినందనీయులు. ప్రపంచం లోని అత్యున్నత స్థాయి పది విశ్వ విద్యాలయాలలో కనీసం ఒక భారతీయ విశ్వవిద్యాలయం ఉండే విధంగా చూసేలా భారతీయ ఉన్నత విద్యామండలి ఏ విధంగా ముందుకు పోతుందన్న దానికి కాలమే సాక్ష్యం. రాగల కాలంలో ఈ ప్రతిష్టాత్మక స్థాయిని సాధించడమే మనం, తత్వవేత్త, పాలనాదక్షుడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అర్పించే ఘన నివాళి అవుతుంది.

వ్యాసకర్త: ఎన్‌.రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ

మెయిల్‌ : n_ramchanderrao@yahoo.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement