సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా కోర్సుల్లో 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫైనలియర్ పరీక్షలను సెప్టెంబర్ చివరికల్లా పూర్తిచేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2019–20 విద్యాసంవత్సరం డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తదితర కోర్సుల పరీక్షల నిర్వహణ షెడ్యూళ్లను రూపొందించుకునే బాధ్యతను ఆయా వర్సిటీలకే అప్పగించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సెప్టెంబర్‌లోగా తమ పరిధిలోని ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలను పూర్తిచేసేలా స్థానిక పరిస్థితులను అనుసరించి షెడ్యూళ్లను ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే రూపొందించుకోవాలని సూచించింది.
ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం..
కాగా, 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫైనలియర్ విద్యార్థులు కాకుండా ఇతర తరగతుల విద్యార్థుల టెర్మ్, సెమిస్టర్ పరీక్షలు, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌లో ఇచ్చిన సవరణ క్యాలెండర్‌లోని అంశాలు యథాతథంగా అమల్లో ఉంటాయని యూజీసీ పేర్కొనడం తెలిసిందే. ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలతోసహా ఇతర విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఇంతకుముందు యూజీసీ ఇదివరకటి మార్గదర్శకాలను అనుసరించి ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. దానిప్రకారం జూలై 1 నుంచి 15 లోపల ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నా ఇప్పుడు అవి సెప్టెంబర్‌లోగా పూర్తి చేయనున్నారు. ఇతర తరగతుల పరీక్షలు, కొత్త విద్యాసంవత్సరపు ప్రవేశాలు, తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళికలో మార్పులు చేసి అమల్లోకి తేనున్నారు.
► ఫైనలియర్ విద్యార్థులు మినహా ఇతర సెమిస్టర్ల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను 2020–21 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ప్రకటించేలా ఇంతకుముందు ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. అందుకు వీలుగా ఫైనలియర్ కాకుండా ఇతర సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులను వారి అటెండెన్సును అనుసరించి పై తరగతులకు ప్రమోట్ చేస్తారు.
► పీహెచ్‌డీ స్కాలర్ల సెమిస్టర్, వైవా వాయిస్‌ల పరీక్షలను యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్లో పూర్తిచేయాలి. వైవా వాయిస్‌ను రికార్డుచేసి వర్సిటీలో భద్రపర్చాలి.
ఇప్పటికి సెట్ల షెడ్యూల్‌లో మార్పు లేదు..
ఎంసెట్ సహా ఇతర సెట్లకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. కోవిడ్–19 పరిస్థితిలో మార్పు వచ్చి పరీక్షలకు అనుకూల వాతావరణమే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా సెట్లకు సంబంధించి అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో కరెక్షన్లకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ప్రతికూల వాతావరణం ఉంటే కనుక సెట్లపై అప్పటి పరిస్థితిని అనుసరించి నిర్ణయం తీసుకుంటారు.
ప్రొఫెషనల్ కోర్సుల షెడ్యూల్ ఇలా..
2019–20 చివరి సంవత్సరం పరీక్షలను జూలై 1 నుంచి ప్రారంభించాలని భావించినా యూజీసీ సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగింపు ఇచ్చినందున ఆ మేరకు వర్సిటీలు షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి.
► 2019–20 విద్యాసంవత్సరం ఇతర సెమిస్టర్ పరీక్షలకు కూడా తాజాగా యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి కొత్త షెడ్యూళ్లను ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment