
నేటి నవచైనా నిర్మాణం వెనుక కమ్యూనిస్టు ప్రణాళికతో కూడిన పాలన సంస్కరణలు అనేకం ఉన్నాయి. 70 ఏండ్ల క్రితం 1949 అక్టోబర్ 1న ఏర్పడిన చైనా పీపుల్స్ రిపబ్లిక్ గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా పలు సంస్కరణలు అమలు జరిపింది. అక్కడి ప్రజల, పాలకుల అవి రళకృషి ఫలితమే నేటి చైనా అభివృద్ధికి కారణంగా కనిపిస్తోంది. చైనా సుదూర లక్ష్యాలను, ప్రజల కలలను సాకారం చేయడంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ప్రక్రియ కూడా అత్యంత ముఖ్య భూమిక పోషిస్తోంది.
చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ 13 మంది ప్రతినిధుల బృందం వారం రోజుల పాటు ఆ దేశంలో పర్యటించింది. సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు అరవింద్ శ్రీవాత్సవ నాయకత్వంలో దేశం నలుమూలల నుంచి కొంతమందిమి చైనాలో పర్యటించాం. వారం రోజుల పాటు చైనా దేశం లోని గుయ్‌జూ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్ నగరం, హంగౌస్, పింగ్‌బా జిల్లాలోని అన్షు నగరం, జియోవాన్ గ్రామం, జునై నగరం, బైజియాబా గ్రామం, బోజ్ జిల్లాలోని ఉజ్జియాగ్ టౌన్‌షిప్‌తో పాటు జిబైపోనగరం, ఆ దేశ రాజధాని బీజింగ్ నగరాల్లో పర్యటించి అక్కడి ప్రజలను, రైతులను, కార్మికులను, పార్టీ శ్రేణులను కలవడమైనది. మా పర్యటనా కాలంలోనే అత్యంత ప్రధానమైన ప్రపంచ రాజకీయ పార్టీల ఉన్నతస్థాయి సదస్సు బీజింగ్ నగరంలో మూడు రోజుల పాటు జరిగింది. 120 దేశాల నుంచి 200 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ, 600 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సును చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు.
చైనా అభివృద్ధిలో భాగమైన వ్యవసాయం సహకార పద్ధతిలో కొనసాగడం గమనార్హం. సహకార సంఘాలుగా రైతులు ఏర్పడి ప్రభుత్వం నుంచి భూమిని ఉచితంగా లీజ్‌కు తీసుకుని పంటలు పండిస్తూ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకుంటారు. ప్రైవేటు భూమి అనేది లేకుండా ప్రభుత్వం చేతిలోనే భూమి నిక్షిప్తమై ఉన్నది. రైతులకు, వ్యవసాయ కూలీలకు పూర్తిగా వందశాతం ప్రభుత్వమే ఆరోగ్యబీమా అమలు జరుపుతున్నది. అక్కడ ప్రతిగ్రామంలో ఆరోగ్య కేంద్రాలు కూడా ఉండి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తారు. దేశంలో 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా నిర్బంధ విద్య అమలులో ఉన్నది.
ప్రతి ఏటా జీడీపీలో 5 శాతం నిధులు విద్యపై ఖర్చు చేస్తున్నారు. నిరుద్యోగం ఉన్నప్పటికీ దానిని అధిగమించి అందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధ కృషి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారు. అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో నూటికి నూరుశాతం చైనా విజయం సాధించింది. ప్రపంచీకరణ అమలులో ఉన్నప్పటికీ ఆ దేశ ప్రయోజనాలకు అనుకూలంగా బహుళ జాతి సంస్థలను అనేక షరతులతో అనుమతిస్తున్నారు.
సమసమాజ నిర్మాణానికి తమదైన పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నామని, తాము విప్లవాన్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోలేదని... ఎగుమతి కూడా చేయబోమని చైనా నిపుణులు చెప్పడం గమనార్హం.
(గత నెలలో సీపీఐ ప్రతినిధుల బృందం చైనా పర్యటన సందర్భంగా)
– తక్కళ్లపల్లి శ్రీనివాసరావు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment